గోదావరి వరద బాధితుల కష్టాలు: 'గత ఏడాది సాయమే ఇంకా చేతికందలేదు'

గోదావరి వరదలు
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

గోదావరి వరదలతో తీవ్ర నష్ట సంభవిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 28 మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. మూడు లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. సుమారు 20 వేల మంది నిరాశ్రయులయ్యారు.

ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలు, కోనసీమ లంకల్లో ఈసారి గోదావరి వరద ఎక్కువగా ప్రభావం చూపింది. వారం రోజులుగా కొన్ని గ్రామాలు నీటిలో నానుతున్నాయి. ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయిన బాధితులు... కొండలపై తలదాచుకుంటున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల వరద బాధితులు అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందించడంలో జాప్యం వద్దంటూ సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు.

జగన్
ఫొటో క్యాప్షన్, హెలికాప్టర్ నుంచి వరద ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్

'కొండ మీద టెంట్లు వేసుకున్నాం'

గోదావరి వరదల కారణంగా వరుసగా రెండో ఏడాది అపార నష్టం తప్పడం లేదు. గత ఏడాది సుదీర్ఘకాలం పాటు వరదలు వచ్చాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వరకూ వరదలు కొనసాగాయి. దానివల్ల అప్పట్లో వరదనీరు చేరిన మన్యం గ్రామాల ప్రజలు ఇక్కట్లు పాలయ్యారు.

అప్పట్లో ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి బాధితులకు సహాయం అందించారు. మంచినీరు, కిరోసిన్‌తో పాటు ఆహార పొట్లాల పంపిణీ కూడా జరిగింది. స్వయంగా మంత్రులు వరద బాధిత గ్రామాల్లో పర్యటించి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఈ ఏడాది కాస్త ఆలస్యంగా వరదలు వచ్చాయి. అక్టోబర్ 12వ తేదీ వరకూ గోదావరి ప్రశాంతంగా కనిపించింది. ఈ సారి గట్టెక్కినట్టేనని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎన్నడూలేనంతా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో గోదావరి ఉప్పొంగింది. ఫలితంగా పోలవరం ముంపు మండలాలు నీట మునిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కుకునూరు, పోలవరం, చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో సుమారు 120 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వారం రోజులుగా వరద నీటిలో ఉన్నా, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయమూ అందలేదని దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామానికి చెందిన పి.రమణమ్మ బీబీసీ ముందు వాపోయారు.

ఈనెల 13న ఆమె ఇల్లు ఖాళీ చేశారు. గోదావరి నీరు వాకిట్లోకి రావడంతో వరద పెరిగే ప్రమాదం ఉందని భావించి వెంటనే అప్రమత్తమయ్యామని, వీలైనన్ని వస్తువులు చేతబట్టుకుని సమీపంలోని కొండపైకి వెళ్లామని ఆమె చెప్పారు.

అక్కడే టెంట్లు వేసుకుని ఆరు రోజులుగా ఉంటున్నామని పి.రమణమ్మ తెలిపారు.

''మా కుటుంబంలో మొత్తం నలుగురం. మాకు చిన్నపిల్లలున్నారు. వరదలొచ్చి కొండెక్కాల్సి వచ్చింది. కానీ మమ్మల్ని ఇన్నిరోజులుగా పట్టించుకున్న వాళ్లు ఎవరూ లేరు. కనీసం పలకరించలేదు. కరెంటు కూడా లేక చీకట్లో మగ్గుతున్నాం. కిరోసిన్ కూడా లేక దీపపు బుడ్లు వెలిగించలేకపోతున్నాం. తిండి లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇవాళ ఓ బోటు వస్తే ఎక్కి వచ్చాను. సీతానగరం వెళ్లి, అత్యవసర సరుకులు కొని తీసుకెళుతున్నా'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

గోదావరి వరదలు

'ఇంతటి వరద ఎప్పుడూ చూడలేదు'

''నాకు నలభై ఆరేళ్లు. చాలా వరదలు చూశాను. కానీ ఇంత ప్రభావం ఎప్పుడూ లేదు. 1986లో వచ్చిన వరదల్లాగా అనిపిస్తోంది. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత రెండేళ్లుగా చిన్న చిన్న వరదలకే మా ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి. పైగా వారం రోజులు దాటినా, నీరు వెనక్కి పోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి ఎలాంటి సహాయమూ అందించలేదు'' అని తొయ్యేరు గ్రామవాసి పొడియం రామన్న బీబీసీతో అన్నారు.

దేవీపట్నం మండల కేంద్రం వరకూ వరద బాధితులు సురక్షితంగా ఉండే కొండలపైకి లేదా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు.

మండల కేంద్రానికి ఎగువన ఉన్న మారుమూల గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి గందరగోళంగా ఉందని ఏపీ గిరిజన సంఘం నాయకురాలు పి.వాణి బీబీసీతో అన్నారు.

''వారం రోజులవుతోంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. వరదలు వచ్చిన తర్వాత కూడా అప్రమత్తం కాలేదు. దేవీపట్నం ఎగువన కొండమొదలు వరకూ ఉన్న గ్రామాల్లో పరిస్థితిని కనీసం పర్యవేక్షించిన వారే కనిపించడం లేదు. అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతున్నా దాని ప్రభావం ఇప్పటికీ పోలవరం ముంపు గ్రామాల్లో కనిపించడం లేదు. వరద అలానే ఉంది. మరో రెండు మూడు రోజులు తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి'' అని ఆమె కోరారు.

గోదావరి వరదలు

'పరిహారం ఇచ్చేస్తే వెళ్లిపోతాం... మమ్మల్ని ముంచడం ఎందుకు?'

పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మించిన కాఫర్ డ్యామ్ మూలంగానే వరద తాకిడి పెరిగిందన్నది అందరూ అంగీకరించే విషయం. గత ఏడాది వరదల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు.

కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి ప్రవాహం మందగించి, ఎగువన ఉన్న గ్రామాల్లోకి వరద చేరుతుందనే ఆలోచన లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే ఇంతటి నష్టమని గత వరదల సమయంలో అన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందే నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని అన్నారు. అది చేయకపోవడంతోనే వరదల్లో చిక్కుకున్న వారి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.

ఈసారి వరదలు వస్తే ముంపు మండలాలు తీవ్రంగా నష్టపోతాయని భావించిన ప్రభుత్వం జూన్ నెలలోనే పలు గ్రామాల ప్రజలకు నోటీసులు ఇచ్చింది. జూలై నెలాఖరులోగా ఖాళీ చేయాలని చెప్పింది. పునరావాస కాలనీలకు తరలివెళ్లాలని చెప్పింది. ''పోలవరం బాధితులకు ప్యాకేజీ ఇవ్వాలి. అదే ఇస్తే వెళ్లిపోతామని చెప్పాం. ఈ వరదల్లో ఉండడం మాకు కూడా కష్టమే. ఎన్నాళ్లుంటాం. అందుకే వెళ్లిపోతాం, మాకు ప్యాకేజీ ఇప్పించాలని అడిగాం. కానీ మీరు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లండి, ఆ తర్వాత మీకు ప్యాకేజీ అందిస్తామంటున్నారు. మా ఇంట్లో మేముండగా ఇవ్వని వాళ్లు, మేము ఖాళీ చేసి వెళ్లిపోతే ఇస్తారని నమ్మకం ఏంటీ. వరదలు వస్తున్నాయని తెలిసి ట్రాక్టర్ పెట్టారు. అందరూ వచ్చేయండి అన్నారు. ఎలా వెళ్లాలని అడిగాం. మాకు పరిహారం ఇచ్చేయండి వచ్చేస్తామన్నాం. అది చేయడం లేదు. ఇప్పటికైనా పునరావాస ప్యాకేజీ ప్రకారం మాకు రావాల్సింది ఇచ్చేస్తే మేము వెళ్లిపోతాం. ఇలా కాఫర్ డ్యామ్ లాంటివి కట్టేసి ముంచవద్దు'' అని వీరవరం గ్రామానికి చెందిన సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

గోదావరి వరదలు

'నిరుడు చెప్పిన సాయం, ఖాతాల్లోకి ఇప్పుడు...'

గత ఏడాది వరదల సమయంలో మంత్రులు స్వయంగా రంగంలోకి దిగారు. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పలువురు మంత్రులు పోలవరం నిర్వాసిత గ్రామాలకు వెళ్లారు. అక్కడి ప్రజలను పరామర్శించారు. కానీ ఈసారి మంత్రులు ఒక్కరు కూడా పోలవరం ముంపు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలకు వెళ్లిన దాఖలాలు లేవు.

ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం నాడు వేలేరుపాడులోని కొన్ని గ్రామాలను సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో అయితే అలాంటి ప్రయత్నమే జరుగుతున్న దాఖలాలు లేవు.

గత ఏడాది వరదల సమయంలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం ఇప్పటికీ బాధితుల చేతికి రాలేదు.

నిరుడు వరదల సమయంలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5వేలు చొప్పున తక్షణ సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని దేవీపట్నం గ్రామానికి చెందిన మాణిక్యాలరావు బీబీసీతో అన్నారు.

''కొన్ని నెలల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బాధితులకు సాయం అందించారు. తూర్పు గోదావరి జిల్లా వాసులకు మాత్రం ఇవ్వలేదు. ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నాం. ఇప్పుడు మళ్లీ వరదలు వచ్చాయి. ఎప్పటికీ తగ్గుతాయో తెలియడం లేదు. తీవ్ర సమస్యల్లో ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందట్లేదు'' అని ఆయన అన్నారు.

'ప్రభుత్వం ఆదుకుంటుంది'

వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆయన కోనసీమలో పర్యటించారు. వరద పరిస్థితిపై స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. బాధితులకు తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని బీబీసీతో అన్నారు.

''వరదలు హఠాత్తుగా పెరిగాయి. కుండపోత వర్షాలతో ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టం వచ్చింది. బాధితులందరినీ ఆదుకుంటాం. ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. గత ఏడాది వరద సహాయం అందించడంలో కొంత జాప్యం జరిగింది. దానిని మంగళవారమే అందరి బ్యాంకు అకౌంట్లలో జమచేశాం. ఈ ఏడాది అలాంటిది జరగకుండా అందరికీ సహాయం అందిస్తాం. ఆహారం, మందులు, మంచినీరు వంటి నిత్యావసరాలు అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికీ సమస్య రాకుండా చూస్తాం'' అని ఆయన వివరించారు.

కిందటి ఏడాది సీఎం ప్రకటించిన సాయాన్ని ఈ నెల 18వ తేదీన బాధితుల అకౌంట్లలో జమ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లా అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న వారు బ్యాంకులకు వెళ్లి, వాటిని తీసుకుని, ఉపయోగించుకునే పరిస్థితి లేదు. వరద ప్రాంతాల్లో వివిధ బ్యాంకుల బ్రాంచీలు కూడా మూతపడ్డాయి.

'మళ్లీ పెరుగుతున్న వరదలు'

ఇప్పటికే వారం రోజులకు పైగా వరద బీభత్సం చవిచూస్తున్న పోలవరం ముంపు మండలాల ప్రజలను... ఇప్పుడు మరోసారి వరద తాకిడి పెరగడం కలవరపెడుతోంది. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక, వేలేరుపాడు, చింతూరు మండలాల్లో అటు గోదావరి, ఇటు శబరి ఉధృతి పెరుగుతుండడంతో మళ్లీ కలకలం మొదలైంది.

రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి గురువారం మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని అందుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మరికొన్ని రోజుల పాటు నీటిలో ఇళ్లన్నీ నానిపోయే ప్రమాదం ఏర్పడింది. వరద తగ్గిన తర్వాత ఆ ఇళ్లు నిలబడే అవకాశం ఉంటుందో, లేదోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

''ఆగస్టు 13 నాడు వరద వచ్చింది. మరునాడే ఇళ్లల్లోకి చేరింది. వారం గడిచిపోయింది. మరో వారం కూడా వరద నీటిలో నానాల్సి రావొచ్చు. మా ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. బయటకు వెళ్లి తెచ్చుకునే దారిలేదు. ప్రభుత్వం సాయం లేదు. నిరుడు కొందరు స్వచ్ఛందంగా సహాయం అందించారు. కానీ ఈసారి కరోనా వల్ల అలాంటి సంస్థలు, వ్యక్తులు కూడా ముందుకు రాలేకపోతున్నారు. దాంతో మండల కేంద్రాలతో పాటుగా మారుమూల గ్రామాల ప్రజలు మరిన్ని అవస్థలు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు'' అని చింతూరుకి చెందిన పి.రాజన్నదొర బీబీసీతో చెప్పారు.

అనేక చోట్ల ఇంకా ఏటిగట్లు బలహీనంగా కనిపిస్తున్నాయి
ఫొటో క్యాప్షన్, అనేక చోట్ల ఇంకా ఏటిగట్లు బలహీనంగా కనిపిస్తున్నాయి

రోడ్డెక్కిన బాధితులు... దేవీపట్నంలో 144 సెక్షన్

వరద సహాయం అందించడంలో జరుగుతున్న జాప్యంపై వరద ప్రభావిత మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చింతూరులో కొందరు రోడ్డెక్కారు. నిరసన తెలిపారు. ఐటీడీఏ పీఓని ఘెరావ్ చేశారు.

తమకు తగిన సహాయం అందించాలని, అత్యవసరమైన ఆహారం, మంచినీరు కూడా దక్కడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా అధికారులు వారితో చర్చించారు. తగిన సహాయం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. ఏపీ గిరిజన సంఘం నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో వరదల సమయంలో ప్రభుత్వ సహాయంతో పాటుగా ప్రైవేటుగా అనేక మంది ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నించేవారు. వరద బాధితులు కూడా సొంతంగా తమ గ్రామాల్లో పడవలతో కొంత వరకూ సురక్షిత ప్రాంతాలకు చేరడం, సరుకులు తెచ్చుకోవడం కూడా జరిగేదని కొండమొదలు గ్రామానికి చెందిన పల్లాల రామిరెడ్డి అన్నారు.

''గత ఏడాది పాపికొండల పర్యాటక బోటు ప్రమాదం తర్వాత పడవ ప్రయాణాలపై ఆంక్షలు పెట్టారు. ప్రైవేటు లాంచీలు కూడా తిరగడానికి అధికారులు అడ్డంకి పెడుతున్నారు. దాంతో ప్రైవేటు సాయం చేసే వాళ్లకు కూడా అవకాశం లేదు. ప్రభుత్వ సహాయం అందడం లేదు. కనీసం బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దేవీపట్నం ఎగువన ఉన్న మారుమూల ప్రజలు అర్తాకలితో అలమటించే పరిస్థితి వస్తోంది'' అని ఆయన వివరించారు.

మరోవైపు దేవీపట్నం మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. మీడియా కూడా వరద గ్రామాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజలు సురక్షితంగా ఉండేందుకే 144 సెక్షన్ విధించారని ఐటీడీఏ పీవో చెప్పారు.

తాజాగా వరద ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన వైఎస్ జగన్... రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులతో సమీక్ష కూడా జరిపారు. కానీ, ఆయన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని బాధితులు అంటున్నారు. అమలు విషయంలో ప్రభుత్వం మరింత చొరవ ప్రదర్శించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: సీఎంఓ

బీబీసీ కథనం మీద ఆంధ్రప్రదేశ్ సీఎంఓ స్పందించింది. గోదావరి వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం నాడు బీబీసీకి తెలిపింది.

గత ఏడాది సీఎం ప్రకటించిన సహాయం అందరికీ అందించినట్టు సీఎం అడిషినల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి వెల్లడించారు. వరద సహయంలో జాప్యం జరగకుండా చూస్తున్నామని బీబీసీకి వివరించారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)