వరంగల్: వర్షాల వరదలకు 100 కాలనీలు నీట మునక.. కబ్జాలే కారణమా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వరంగల్ నగరం హైదరాబాద్ కంటే ముందు నుంచే తెలుగువారి రాజధానిగా వెలుగొందింది. హైదరాబాద్ తరువాత అతి పెద్దది. హైదరాబాద్ కంటే పాతది. సాధారణంగా చాలా పెద్ద నగరాలు నదులు లేదా సముద్రాల పక్కన ఉంటాయి కాబట్టి వాటికి వరదల ముప్పు ఉంటుంది. కానీ వరంగల్ అలా కాదు. వరంగల్‌ను ఆనుకుని పెద్ద నది కానీ, సముద్రం కానీ లేవు. కానీ అలాంటి వరంగల్ కూడా వాన వస్తే మునిగిపోయే దశకు చేరుకుంది.
ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడలకే పరిమితమైన, ‘వాన వస్తే ఇళ్లల్లో నీరు చేరడం, కాలనీల్లో పడవలు తిరగడం’ వంటి దృశ్యలు ఈసారి వరంగల్‌లో కూడా కనిపించాయి. ఇక వరంగల్ కూడా శాశ్వతంగా, ‘చినుకు పడితే వణికిపోయే నగరాల’ జాబితాలో చేరుతోందా?
2016లో ఒకసారి వరంగల్‌లో వరదలు వచ్చాయి. కానీ తీవ్రత ఇంతగా లేదు. కానీ ఈసారి వానలకు మాత్రం వరంగల్‌లో సుమారు 100 వరకూ కాలనీలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడం, నడుంలోతు వరకూ వీధుల్లో నీరు చేరడం, రెస్క్యూ ఆపరేషన్లు, కరెంటు నిలిచిపోవడం వంటివి జరిగాయి.
సమ్మయ్య నగర్ వంటి బస్తీల వారు నాలుగు రోజులుగా పునరావాసాల్లోనే ఉన్నారు. ఆ బస్తీలోకి శుక్రవారం అర్థరాత్రి నీళ్లు వచ్చాయి. వాళ్లింకా తమ ఇళ్లకు వెళ్లలేదు. ‘’11 ఏళ్లలో మూడుసార్లు మా బస్తీలోకి నీళ్లు వచ్చాయని’’ శ్రీలత అనే మహిళ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, @Director_EVDM
’’శుక్రవారం రాత్రి నీళ్లొచ్చాయి. మావి 60 కుటుంబాలు ఉన్నాయి. రాత్రి ఒంటిగంటకు చూస్తుండగానే నీళ్లొచ్చేశాయి. సామాన్లు సద్దుకునే టైం కూడా లేదు. బియ్యం, బట్టలూ అన్నీ తడచిపోయాయి. నీళ్లు వెళ్లడానికి అక్కడ డివైడర్ అడ్డంగా ఉంటే పోలీస్ సీఐ గారు ఆ డివైడర్ పగలగొట్టి కొన్ని నీళ్లు మళ్లించారు. ఎమ్మార్వో గారు రెండు పూటలా భోజనం పంపుతున్నారు. ఇక్కడ బురద ఉన్నా అలాగే ఉండక తప్పలేదు’’ అని చెప్పారు రమేశ్ అనే స్థానికుడు.
ఈ వరదలకు ఒక ముఖ్య కారణం ఒక్క రోజులో నమోదైన వానలు అయితే, వాటిని పారనివ్వకుండా చేసిన కబ్జాలు రెండో కారణం. 1983లో ఒక్కరోజులో 18.1 సెంటీమీటర్ల వాన కురిసింది వరంగల్‌లో. ఆ తరువాత ఇప్పటి వరకూ వరంగల్ నగరంలో అంత వాన రాలేదు. ఇప్పుడు మాత్రం కొన్ని ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లు (వేర్వేరు చోట్ల 21.2 నుంచి 27 సెంటీమీటర్ల) వరకూ వానలు కురిసాయి. ఇది గత 37 ఏళ్లలో నమోదైన అత్యధిక వర్షపాతం.
‘‘వరంగల్ పట్టణంలోని నాలాలు, డ్రైనేజీ వ్యవస్థా ఏదీ ఇంత అధిక వర్షానికి అనుగుణంగా నిర్మించింది కాదు. నిజానికి 30 సంవత్సరాల సగటు వర్షపాతం ఆధారంగా మేం ప్లానింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు అంతకంటే చాలా ఎక్కువ వచ్చింది. దీనికి మేమే కాదు. ఎవరూ సిద్ధంగా లేరు’’ అని వ్యాఖ్యానించారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే ఒక ఉన్నతాధికారి.

ఫొటో సోర్స్, @Director_EVDM
సమస్య ఇదీ
2011 లెక్కల ప్రకారం శివార్లను కూడా కలుపుకుంటే 13 లక్షల వరకూ జనాభా ఉంటుంది. ఇప్పడు 20 వరకూ పెరగవచ్చని అంచనా. పెరుగుతోన్న జనాభాతో పాటూ విస్తరిస్తోన్న నగరం తనలో జనంతో పాటూ చెరువులనూ కలిపేసుకుంది. అవును. ఒకప్పుడు వరంగల్‌లో ఉండే వందలాది చెరువులు ఇప్పుడు కాలనీలుగా మారాయి.
కాకతీయుల కాలం నుంచీ ఇక్కడ పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిలో ఒకటి నిండగానే రెండోదానికి నీరు వెళ్లే ఏర్పాటూ ఉంటుంది. ఇలా ఈ నగరం, చుట్టుపక్కలో ఎంతో పటిష్టమైన నీటి పారుదల వ్యవస్థ ఉంది. కానీ మొదటిసారి ఆ వ్యవస్థ దెబ్బతిన్న ఫలితం వరంగల్ వాసులు రుచి చూడాల్సి వచ్చింది.
వరంగల్ ప్రధాన సమస్య కబ్జాలే. ఫుల్ ట్యాంక్ లెవెల్ – అంటే చెరువు మొత్తం నీరు ఉన్నప్పుడు ఉండే హద్దు లోపలికి కూడా వచ్చి ఇళ్లు కట్టేశారు వరంగల్‌లో. గతంలో కబ్జాల వల్ల శివారు కాలనీలు మాత్రమే మునిగేవి. కానీ ఈసారి, ప్రధాన నగరంలోకి కూడా నీళ్లొచ్చాయి.
ఇది కాకుండా ఇప్పటికే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఇంత పెద్ద వర్షానికి సరిపడా నిర్మించింది కాదు. కాకపోతే కాలువల కబ్జా లేకపోయుంటే అధిక వర్షపాతం వచ్చినా, ఆ కాలువ పరీవాహక ప్రాంతాలు మాత్రమే మునిగి ఉండేవి. కానీ ఆక్రమణలు ఆ అవకాశం లేకుండా చేసేశాయి.
ఒక్క భద్రకాళీ చెరువు, దాన్ని ఆనుకుని ఉన్న భూముల్లోనే 20 వరకూ కాలనీలు ఉన్నాయి. ఇక చిన్న వడ్డేపల్లి, వడ్డేపల్లి చెరువుల భూముల్లో పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి.

ఫొటో సోర్స్, @Director_EVDM
వరంగల్ దగ్గర ఉన్న రెండు పెద్ద చెరువులు, భద్రకాళి చెరువు, వడ్డేపల్లి చెరువు - రెండూ చాలా భాగం కబ్జాకు గురయ్యాయి. దీంతో వడ్డేపల్లి చెరువును ఆనుకుని, ఆక్రమించి కట్టిన ప్రాంతం అంతా నీరు స్తంభించింది. వాగులు ప్రవహించే చోట రోడ్లు దెబ్బతినే స్థాయిలో కాకతీయ యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు దెబ్బతింది. ఇక నీట మునిగిన కాలనీల జాబితా చాలా పెద్దదే.
‘‘వరంగల్‌లో వరదలు ఇంత తీవ్రంగా రావడం ఇదే మొదటిసారి. 2016లో ఒక 20 కాలనీల వరకూ నీరు వచ్చింది. ఇప్పుడు దాదాపు వంద కాలనీలు ప్రభావితం అయ్యాయి. అప్పట్లో లోతట్టు ప్రాంతాలు ఒక 45 వరకూ ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా నగరం విస్తరించే క్రమంలో చెరువులను, వాటికి బఫర్ గా ఉండే శిఖం భూములను ఆక్రమించేయడం సమస్య అయింది. ఇక నాలాల పక్కనే, నాలాలను సన్నగా చేసి మరీ ఇళ్లు కట్టారు’’ అన్నారు ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్.
నాలుగు రోజులుగా నీళ్లు నిలిచిపోయిన సమ్మయ్య నగర్ అనధికారిక నిర్మాణాలకు ఒక ఉదాహరణ. ఈ సమ్మయ్య నగర్ వడ్డేపల్లి చెరువుకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వామపక్ష పార్టీలు పేదలకు పంచిన భూములు, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఆక్రమించి కట్టిన భవనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పారాల్సిన కాలువ నీరు దారి మళ్లి ఇళ్లల్లోకి వచ్చింది.

పరిష్కారం ఏంటి?
వరంగల్ పట్టణానికి ఆక్రమణలతో పాటూ, డ్రైనేజీ వ్యవస్థ సమస్య ఉంది. దాదాపు సగం వరంగల్ నగరానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. నిజానికి తెలంగాణలో వరంగల్ కంటే చిన్న నగరాలైన కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. కానీ వరంగల్‌లో ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. డ్రైనేజీ లోపం వల్లే ఈసారి ఎక్కువ కాలనీలు నీట మునిగాయి.
‘‘చెరువుల బఫర్ జోన్లను కబ్జా కాకుండా చూడాలి. చెరువుల, నాలాల ఆక్రమణలు తొలగించాలి. అన్నిటికీ మించి వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రావాలి’’ అన్నారు సుధాకర్.
ఆక్రమణలు ఉన్నాయని అంగీకరించిన వరంగల్ కమిషనర్ పమీలా సత్పతి, వాటిని తొలగించడానికి మునిసిపాలిటీ ఏం చేస్తున్నదీ వివరించారు.
‘‘వరంగల్ నగరంలో చిన్న చిన్న నాళాలు వదలి పెద్దవే పరిగణిస్తే 27.5 కిమీ పొడవులో 415 ఆక్రమణలు ఉన్నాయి. వాటిలో 182 నిర్మాణాలు కూల్చేశాం. కానీ మిగతా వాటికి ఏకంగా 30 ఏళ్ల పాతవైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. మొత్తం 233 ఆక్రమణదారులకు పత్రాలు లేదా కోర్టు స్టేలూ ఉన్నాయి. కోర్టు స్టేలు ఉన్నా ముందుకు వెళ్లి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కొన్నారు మా అధికారులు’’ అన్నారు పమీలా.

ఫొటో సోర్స్, I&PR WARANGAL
‘‘ఇక చెరువులు కబ్జా వాస్తవమే కానీ అన్నీ కాదు. వరంగల్ పరిధిలో 282 చెరువులు, కుంటలూ ఉన్నాయి. వాటిలో 45 చెరువులే 10 నుంచి 100 శాతం వరకూ కబ్జాలో ఉన్నాయి. వాటిల్లో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చూస్తున్నాం’’ అని వివరించారామె.
వరంగల్ నగరంలో సమస్యలకు నీటి వనరుల కబ్జాలే కారణం అని అందరూ అంగీకరిస్తారు. కానీ వాటిని తొలగించడమే పెద్ద సమస్య. ఇటీవల ఇక్కడ పర్యటించిన బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కబ్జాలను అరికట్టడంలో విఫలం అయిందని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వరంగల్ వరదల తరువాత మంత్రి కేటీఆర్ కూడా పర్యటించారు. అధికారులతో సమీక్షించారు. ఆయన కూడా కబ్జాల గురించి మాట్లాడారు. కబ్జాలు తొలగించే చర్యలు తీసుకుంటామనీ, శాశ్వత డ్రైనేజీ పనులు చేపడతామనీ హామీ ఇచ్చారు.
‘‘నీటి పారుదలకి అడ్డం వచ్చే ఏ నిర్మాణాన్నైనా కొత్త మునిసిపల్ చట్టం ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆ కొత్త చట్టం ఆధారంగా ముందుకు వెళ్తాం’’ అన్నారు పమీలా.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









