ఉత్తరప్రదేశ్‌: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి ఆదిత్యనాథ్

16 ఆగస్ట్ 2020: యూపీలోని లఖింపూర్ ఖీరీలో 13 యేళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె శవం చెరకు తోటల్లో దొరికింది.

10 ఆగస్ట్ 2020: సుదీక్ష భాటీ ఔరంగాబాద్ ప్రాంతంలో ఉదయం తన తమ్ముడితో కలిసి మోటర్‌సైకిల్ మీద ప్రయాణిస్తుండగా మరణించారు. ఆమె అమెరికాలోని బాబ్సన్ కాలేజ్లో చదువుతున్నారు. ఈ నెల 20 న ఆమె తిరిగి యూఎస్ వెళ్లిపోవల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు మోటర్‌సైకిల్ మీద వారిని వెంబడించి వేధించారని, వారివల్లే ప్రమాదానికి గురై సుదీక్ష భాటీ మరణించారని ఆమె కుటుంబం ఆరోపించింది.

6 ఆగస్ట్ 2020: యూపీలోని హాపూర్‌లో 6 ఏళ్ల బాలికను ఇంటిముందే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేసి, పొదల్లోకి విసిరేసారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె శరీరంలో ప్రైవేటు భాగాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

5 ఆగస్ట్ 2020: బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించినపుడు ఆమె గట్టిగా అరిచి కేకలు వెయ్యడంతో గొంతు నులిపి చంపి చెరకు తోటల్లోకి విసిరేశారు.

అదే రోజు ముఖ్యమంత్రి యోగీ వాదన: యూపీలో నేరాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత మూడేళ్లల్లో నేరాలు బాగా తగ్గాయి. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతాయి.

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, SAURABH SHARMA

ఫొటో క్యాప్షన్, సుదీక్ష భాటీ

దేశవ్యాప్తంగా మీడియా అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన భూమిపుజ వేడుకను కవర్ చెయ్యడంలో బిజీగా ఉన్నప్పుడు అక్కడి నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఓ పాప తల్లిదండ్రులు తప్పిపోయిన తమ కుమార్తె కోసం వెదుకుతున్నారు. వారికి ఆ పాప శవమై పొలంలో దొరికింది.

దీనికి నాలుగు రోజుల ముందు జూలై 31న, ముజఫర్‌నగర్‌లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేసి చెరకు పొలాల్లో పడేసారు.

ఇవన్నీ గత 17-18 రోజుల్లో మీడియాలో వచ్చిన ఘోరాలు. మీడియా దృష్టికి అందనివి ఇంకా ఎన్ని జరుగుతున్నాయో లెక్కలేదు.

యూపీలో కనిష్ట స్థాయిలో నేరాలు అన్న సీఎం మాటలకు, జరుగుతున్న నేరాలకు సారూప్యం కుదరట్లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శాశనసభలో మాట్లాడుతూ "ఈ దేశానికి రామరాజ్యమే కావాలి. సోషలిజం కాదు. మా ప్రభుత్వం ఈ నేలపై రామరాజ్యన్ని పునఃస్థాపన చేస్తామన్న మాటకు కట్టుబడి ఉంది" అని యోగీ ఉద్ఘాటించారు.

మరి ఈ రామరాజ్యంలో మహిళలకు రక్షణ ఉందా? అంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు. గణాంకాలు చూస్తే అవి యోగీ చెప్తున్న మాటలకు విరుద్ధంగా ఉన్నాయి.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

సీఎం మాటలు తప్పని చెప్తున్న గణాంకాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన వార్షిక నివేదికలో మహిళలపై జరిగే నేరాలలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది.

ఈ రిపోర్ట్ ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3,78,277 కాగా అందులో 59,445 కేసులు యూపీలోనే నమోదయ్యాయి. అంటే మొత్తం నేరాల్లో 15.8% యూపీలో జరిగాయి.

అంతేకాదు.. ఆ ఏడాది యూపీలో మొత్తం 43,22 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకి 11 నుంచీ 12 రేప్‌లు జరిగినట్టు లెక్క. ఇవన్నీ పొలీసు స్టేషన్లలో నమోదు అయిన కేసులు. ఫిర్యాదు కాని కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో లెక్కలేదు.

ఎన్‌సీఆర్‌బీ కేంద్ర హోంమత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.

ఒకపక్క మహిళలకు రక్షణే ప్రధాన లక్ష్యమంటూ యోగీ న్యూస్ చానళ్లకి ఇంటర్వూలిస్తున్నారు. మరోపక్క ఆయన పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇందుకు విరుద్ధమైన గణాంకాలు చూపిస్తున్నది.

సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే నాహిద్ హసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2016తో పోల్చితే 2017లో మహిళలపై నేరాలు పెరిగాయని యోగి ప్రభుత్వం చెప్పింది.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, @MYOGIADITYANATH

యాంటీ రోమియో స్క్వాడ్, విమెన్ హెల్ప్ లైన్ నంబర్ల పరిస్థితి ఏంటి?

మార్చి 2017 లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత యోగి ఆదిత్యనాథ్ మొట్టమొదటగా యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటును ప్రకటించారు.

ఈ బృందం పని ఏంటంటే స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న బాలికలను వేధింపుల నుంచి కాపాడడం. కానీ మొదలైన కొద్ది రోజులకే దీని పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇష్టప్రకారం కలిసి నడుస్తున్న లేదా కూర్చున్న అమ్మాయిలను, అబ్బాయిలను కూడా విడదీస్తూ వారిపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ యాంటీ రోమియో బృందం 2017 మార్చి 30న రాంపూర్‌లో ఒక అన్నాచెల్లెళ్లను వేధించి పోలీసు స్టేషన్‌కు లాక్కొచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అన్నాచెల్లెళ్లు మందులకోసం వాళ్ల గ్రామం నుంచి రాంపూర్ పట్టణానికి వచ్చారు. వారిద్దరూ తోబుట్టువులని నిరూపించిన తరువాత కూడా వదిలిపెట్టడానికి 5,000 రూపాయలు అడిగారంటూ ఆరోపణలు వచ్చాయి.

యాంటీ రోమియో స్క్వాడ్ భద్రతనివ్వలేదు సరి కదా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని అనేక విమర్శలు వచ్చాయి.

2019 జూన్‌లో రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల దృష్ట్యా యాంటీ రోమియో స్క్వాడ్‌ను రెండోసారి సమాయత్తం చెయ్యాలని యోగి ప్రభుత్వం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

బీబీసీకి అందిన సమాచారం ప్రకారం ప్రయాగరాజ్, ఆగ్రా, గోరఖ్‌పూర్, లక్నో, బరేలీ, కాన్పూర్ సహా 10 మండలాల్లో యాంటీ రోమియో స్క్వాడ్ మొత్తం 7,134 కేసులను నమోదు చేసి.. 11,222 మందిని అరెస్ట్ చేసింది.

కానీ ఈ స్క్వాడ్ ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు తగ్గించడంలో పెద్దగా ప్రభావం చూపలేదని గణాంకాలు చెబుతున్నాయి.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, @MYOGIADITYANATH

మహిళల హెల్ప్‌లైన్ 181 మూసివేసారు. కార్మికులకు ఒక సంవత్సరకాలంగా జీతాలు ఇవ్వలేదు.

2016 మార్చి 8న అఖిలేష్ యాదవ్ 'విమెన్ హెల్ప్‌లైన్ 181' అనే ప్రతిష్టాత్మక ప్రోజెక్టును ప్రారంభించారు. పైలట్ ప్రోజెక్ట్ కింద 11 జిల్లాల్లో దీనిని ఆరంభించారు.

ఈ హెల్ప్‌లైన్‌ను నడిపే బాధ్యతను ఐదేళ్లపాటు జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు.

తరువాత 2017 మార్చిలో యోగి ఆదిత్యానాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం 2017 నాటికి మహిళలపై నేరాలకు సంబంధించి 56,011 కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జూన్ 2018లో యోగి ప్రభుత్వం ఈ పథకన్ని 11 నుంచి మొత్తం 75 జిల్లాలకూ విస్తరించింది.

కానీ గత ఫిబ్రవరి నుంచి రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ఈ పథకానికి నిధులను నిలిపివేసింది. 11 నెలలుగా ఈ హెల్ప్‌లైన్ కోసం పనిచేస్తున్న 350 మందికి పైగా మహిళా ఉద్యోగులకు వేతనం ఇవ్వలేదు.

ఈ హెల్ప్‌లైన్ ద్వారా లక్నో ప్రధాన కార్యాలయంలోని టెలికౌన్సిలర్లు ఫోన్ సంభాషణ ద్వారా మహిళలకు కావలసిన సహాయం అందిస్తారు. అలాగే ప్రతి జిల్లాకూ ఒక ఫీల్డ్ కౌన్సిలర్, ఒక రెస్క్యూ వ్యాన్ ఉంచారు. అయితే ఈ హెల్ప్‌లైన్‌ను జూన్‌లో నిలిపివేశారు.

2020 జూలై 24న యోగి ప్రభుత్వం ఈ మహిళా హెల్ప్‌లైన్ నంబర్‌ను పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112తో అనుసంధానించింది.

11 నెలలుగా జీతాలు అందక మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపడతామన్నప్పుడు వీలైనంత త్వరగా బకాయిలు చెల్లిస్తామని యోగి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇంతవరకూ వారికి జీతాలు అందలేదు.

మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ మహిళలకు ప్రత్యేక హెల్ప్‌లైన్ మళ్లీ ప్రారంభించలేదు.

వీడియో క్యాప్షన్, 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)