దిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై పాతికేళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని ఈ నెల 2న అరెస్టు చేశారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఈ నెల 1న ఉదయం ఈ ఘటన జరిగిందని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది.


మధ్య దిల్లీలోని చాణక్యపురిలో అమెరికా రాయబార కార్యాలయం ఉంది. బాలిక తండ్రి కార్యాలయం శుభ్రపరిచే సిబ్బందిలో ఒకరు. ఆయన కుటుంబం కార్యాలయ ఆవరణలో నివసిస్తోంది.
నిందితుడు ఒక డ్రైవర్ అని, అతడు రాయబార కార్యాలయ ఉద్యోగి కాదని పోలీసులు చెప్పారు. అయితే రాయబార కార్యాలయ ఉద్యోగుల క్వార్టర్స్‌లో అతడు తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నాడని తెలిపారు. అతడి తండ్రి అక్కడ పనిచేస్తాడని చెప్పారు.
చాణక్యపురిలో అమెరికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బాధిత బాలిక, నిందితుడి కుటుంబాలు ఒకరికొకరు తెలుసని పోలీసులు చెప్పారని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. బాలిక బయట ఆడుకొంటుంటే ఆమెను నిందితుడు ఇంట్లోకి రప్పించుకున్నాడని, అత్యాచారం జరిగిన సమయంలో అతడి తల్లిదండ్రులు ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.
బాలిక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పిందని, వాళ్లు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారని, ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధరించారని పోలీసులు తెలిపారు.
అత్యాచార కేసుతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం కింద నిందితుడిపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.
బాలలపై అత్యాచారానికి పాల్పడేవారికి ప్రభుత్వం 2018లో మరణ దండనను శిక్షగా ప్రవేశపెట్టింది.
భారత్‌లో అత్యాచార బాధితుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మైనర్ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 94 శాతం కేసుల్లో అత్యాచారానికి పాల్పడినవారు బాధితులకు తెలిసినవారే.

ఇవి కూడా చదవండి:
- నిర్భయ కేసు: నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదు - దిల్లీ హైకోర్టు
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్‌గా గుర్తించండి’
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- అయోధ్య రామమందిర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం - పార్లమెంటులో మోదీ ప్రకటన
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- ‘కశ్మీర్ రంగస్థలంపై బీజేపీ ఏకపాత్రాభినయం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









