ఆర్టికల్ 370 రద్దు: ఆరు నెలలైంది.. కశ్మీర్‌లో రాజకీయ శూన్యత అలానే ఉంది

జమ్ముకశ్మీర్ లెఫ్లినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము సలహాదారు ఫరూఖ్ ఖాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/gettyimages

ఫొటో క్యాప్షన్, జమ్ముకశ్మీర్ లెఫ్లినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము సలహాదారు ఫరూఖ్ ఖాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ న్యూస్, శ్రీనగర్

గత ఏడాది ఆగస్టు 5న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. అనంతరం తలెత్తిన రాజకీయ వాస్తవికతను జీర్ణించుకోలేకపోతున్న కశ్మీరంలో కొత్తగా పుట్టిన భయం అక్కడ ఒక రకమైన శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నప్పుడు మునుపెన్నడూ లేనట్లుగా కశ్మీర్‌లోని అగ్ర నాయకులు, ఉద్యమకారులను అరెస్ట్ చేశారు.

గత ఆరు నెలలుగా ఇక్కడ విధించిన ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ప్రజలు ప్రయత్నిస్తున్నారు.. కానీ, ఇక్కడ రాజకీయాలు మాత్రం ఇంకా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

Presentational grey line
News image
Presentational grey line

తాము తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్‌ ప్రాంతంలోని అత్యధికులు స్వాగతిస్తున్నారని.. శాంతి నెలకొల్పే క్రమంలో ముందస్తుగా కొందరిని నిర్బంధంలోకి తీసుకోవడం, ఆంక్షలు విధించడం వంటివి ఉన్నప్పటికీ ఒక్క తూటా కూడా కాల్చలేదని భారత ప్రభుత్వం చెబుతోంది.

కానీ, ఇక్కడ చోటు చేసుకున్న నిరసనల సందర్భంగా అర డజను మందికి పైగా చనిపోయారని హక్కుల సంస్థలు.. సుదీర్ఘ కాలం ఆంక్షలు, కార్యకలాపాలు స్తంభించిపోవడం వల్ల రూ. 18 వేల కోట్ల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని వర్తక సంఘాలు చెబుతున్నాయి.

కశ్మీర్‌లో బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

అధికారిక లెక్కల ప్రకారం 2,50,000 మంది విద్యావంతులైన కశ్మీర్ యువత నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఫోన్లు, ఇంటర్నెట్‌పై ఆంక్షలు కాస్త సడలించినప్పటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే సోషల్ మీడియా వాడకంపైనా నిషేధం కొనసాగుతోంది.

గత ఆర్నెళ్లుగా ఇక్కడి పరిస్థితుల వల్ల వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు చవిచూసినప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలు మాత్రం ఈ నిర్బంధ పరిస్థితుల నుంచి కొంత బయటపడ్డాయి.

ఇంటర్నెట్‌పై ఆంక్షల వల్ల తొలుత కొన్ని నెలల పాటు ఆరోగ్య సేవల రంగానికి ఇబ్బందులు కలిగాయి. ''ఇప్పుడు కూడా ఏదోరకంగా నడిపిస్తున్నామే కానీ పూర్తిస్థాయిలో కాదు'' అని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఒమర్ అన్నారు.

అనేక ఆంక్షలు, ఇంటర్నెట్ ఏమాత్రం అందుబాటులో లేని పరిస్థితుల మధ్యే పదో తరగతి, ఇంటర్మీడియట్‌కు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు దరఖాస్తులు చేయడానికి లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్వహణలోని ఇంటర్నెట్ కేంద్రాల ముందు బారులు తీరేవారు.

పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన ముగ్గురు సలహాదారుల పాలనలోనే ఉంది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మరో సుమారు పాతిక మంది రాజకీయ నాయకులు ఇంకా గృహనిర్బంధంలో కానీ, జైళ్లలో కానీ ఉన్నారు.

ఈ పరిస్థితి జమ్ముకశ్మీర్‌లోని ప్రస్తుత శూన్య రాజకీయ యవనికపై బీజేపీ ఏకపాత్రాభినయానికి అవకాశం కల్పించింది.

ముక్తార్ అబ్బాస్ నక్వీ

ఫొటో సోర్స్, facebook/mukhtarabbasnaqvi

''మేమెవరినీ విమర్శించాలనుకోవడం లేదు. మాపై వస్తున్న విమర్శలకు సమాధానాలిస్తూ సమయం వృథా చేసుకోం కూడా. ప్రజాభిప్రాయం వినడానికి ఇక్కడున్నాం. ప్రజలతోనే కలిసి పని చేస్తాం. ప్రధాని మోదీ ప్రారంభించిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలు త్వరలో అందుకుంటారు'' అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గత నెలలో ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో అన్నారు.

మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాలు నిర్బంధంలో ఉండగా ఆ పార్టీల క్యాడర్ కార్యకలాపాలకూ విఘాతమేర్పడింది.

మెహబూబా ముఫ్తీకి చెందిన పార్టీ పీడీపీ, ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌ల కార్యాలయాలు ఎడారులను తలపిస్తూ నిర్మానుష్యంగా మారాయి.

''మా నాయకులను కలుసుకోవడానికి మమ్మల్ని అనుమతించడం లేదు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాల్సిన మా నాయకత్వం జైళ్లలో ఉంది. మా పార్టీ దేశ విభజన ముందు నుంచి ఉంది. మా నాయకులు జైలు నుంచి విడుదలైన తరువాత తగిన కార్యాచరణతో వస్తాం'' అని నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్ 'బీబీసీ'తో అన్నారు.

2014కి ముందు కశ్మీర్ రాజకీయాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు కీలక పార్టీలు. 1951 నుంచి ఎన్నడూ లేనట్లుగా 2014 ఎన్నికల్లో మోదీ హవాలో బీజేపీ అప్పటి జమ్ముకశ్మీర్‌లోని 87 అసెంబ్లీ స్థానాల్లో 25 కైవసం చేసుకుంది. ఇప్పుడా రాజకీయ క్షేత్రమంతా శూన్యంగా మారిపోయింది. ప్రస్తుతం కశ్మీర్‌లో బీజేపీ విస్తరిస్తోంది. ''ఇతర పార్టీలిచ్చే శుష్క వాగ్దానాలను ఇకపై ప్రజలు నమ్మరు.. అందుకే వారు మా పార్టీలో చేరుతున్నార''ని బీజేపీ కశ్మీర్ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకుర్ అన్నారు.

రాం మాధవ్

ఫొటో సోర్స్, facebook/Ram Madhav

ఫొటో క్యాప్షన్, జమ్ముకశ్మీర్‌లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ఆ పార్టీ నేత రాం మాధవ్

జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ వల్ల ఏర్పడిన పరాయి భావనను ఈ రాజకీయ శూన్యత మరింత పెంచుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ''ఈ మౌనాన్ని ప్రజల అంగీకారంగా భావించరాదు. ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహం ఉంది. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలనేవి ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిలా పనిచేస్తాయి. కానీ, ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు స్తంభించిపోయాయి. దిల్లీ కనుక ఇక్కడ కొత్త నటులను ప్రోత్సహించాలని ప్రయత్నిస్తే మాత్రం అది నిజమైన శాంతి స్థాపనకు ఏమాత్రం సాయపడదు. ఎందుకంటే... రాజకీయాలనేవి ప్రజల నుంచి రావాలి కానీ ఎవరో రుద్దితే వచ్చేవి కావు'' అని రాజకీయ విశ్లేషకుడు ఇజాజ్ అయూబ్ 'బీబీసీ'తో అన్నారు.

పీడీపీ మాజీ మంత్రులు ముజఫర్ హుస్సేన్ బేగ్, అల్తాఫ్ బుఖారీలు గత కొన్ని వారాలుగా ఈ కొత్త మార్పులకు తమ అంగీకారం తెలుపుతూ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ దిల్లీకి సంకేతాలు పంపుతున్నారు. ''చాలామంది నేను కశ్మీర్‌ను అమ్మేస్తున్నానని నిందిస్తున్నారు. కానీ, అంతా కోల్పోయాక అమ్ముకోవడానికి ఏముంది? నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాను. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను నేను మళ్లీ కొంటాను. శాంతి, హుందాతనాలు సహా కశ్మీర్ కోల్పోయిన ఎన్నో అంశాలను కొనేందుకు ప్రయత్నిస్తాను'' అన్నారు అల్తాఫ్ బుఖారీ. ఆర్టికల్ 370 రద్దును అంగీకరించారన్న కారణంతో పీడీపీతో బుఖారీని పార్టీ నుంచి తొలగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)