ముంబయిలో 51 మందిపై రాజద్రోహం కేసు.. షర్జీల్ ఇమామ్‌ను సమర్థిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఆరోపణ

షర్జీల్ ఇమామ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షర్జీల్ ఇమామ్
    • రచయిత, మయూరేశ్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షర్జీల్ ఇమామ్‌ను సమర్థిస్తూ, రెచ్చగొట్టే నినాదాలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో 51 మంది వ్యక్తులపై ముంబయి పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు.

ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ఫిబ్రవరి 1న ఎల్జీబీటీక్యూ ప్రైడ్ మార్చ్ సందర్భంగా నిందితులు ఈ నినాదాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

'అసోంను దేశం నుంచి వేరు చేయాలంటూ' అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారన్న ఆరోపణపై షర్జీల్ ఇమామ్‌పై ఇదివరకే రాజద్రోహం కేసు నమోదైంది. షర్జీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Presentational grey line
News image
Presentational grey line

తాజాగా ముంబయిలో ఎల్జీబీటీక్యూ ప్రైడ్ మార్చ్‌లో షర్జీల్ భావజాలాన్ని సమర్థిస్తూ నినాదాలు చేశారన్న ఆరోపణలతో 51 మందిపై ఐపీసీ 124ఏ, 153బీ, 505, 34 సెక్షన్ల కింద ఆజాద్ మైదాన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసు అధికార ప్రతినిధి డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు.

ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.

బీజేపీ నేత ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది.

51 మంది నిందితుల జాబితాలో విద్యార్థి ఉద్యమకారిణి ఊర్వశి చుడావాలా పేరు కూడా ఉంది.

ఎల్జీబీటీక్యూ

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు ఈ నినాదాలు చేసినవారితో తమకు సంబంధం లేదని క్వీర్ ఆజాదీ ముంబయి (ఎల్జీబీటీక్యూ ప్రైడ్ మార్చ్ నిర్వాహకులు) ప్రకటించింది. ఆ నినాదాలను ఖండిస్తున్నట్లు తెలిపింది.

''షర్జీల్‌కు మద్దతుగా గానీ, మరే విధంగా గానీ భారత సమగ్రతకు వ్యతిరేకంగా కొందరు చేసిన నినాదాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వారితో మాకు ఎలాంటి సంబంధమూ లేదు'' అంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆగస్టు క్రాంతి మైదాన్‌లో ప్రతి సంవత్సరం ప్రైడ్ మార్చ్ జరుగుతుంది.

సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో తొలుత పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని షరతులతో కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరు చేశారు.

ఊర్వశి, ఇంకొంతమంది ఈ కార్యక్రమంలోకి ప్రవేశించి, షర్జీల్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వాళ్లు నినాదాలు చేస్తున్న వీడియోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సహా కొందరు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

నినాదాలు చేసిన వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ మాజీ ఎంపీ కిరిట్ సొమయ్య ట్వీట్ చేశారు. ''నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పోలీసులకు సూచించింది. వారిపై చర్యలు తీసుకోకపోతే ధర్నాకు దిగుతా'' అని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల అనంతరం పోలీసులు ఊర్వశి సహా 51 మందిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు.

''ఆమె తప్పు చేసింది. ఎవరో ఆమెను రెచ్చగొట్టారు. పోలీసులు నా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు'' అని ఊర్వశి తల్లి వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

''వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నా, హింసాత్మక సంఘటనలకు దారితీసినా సెక్షన్ 124ఏ (రాజద్రోహం) సెక్షన్ వర్తిస్తుందని సుప్రీం కోర్టు 1962లో తీర్పునిచ్చింది. దేశ వ్యతిరేక చర్య లేదా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి నేరుగా ముప్పు కలిగించేదైతే కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ ఉదంతంలో ఆ సెక్షన్ నిలబడుతుందని అనుకోవడం లేదు. నిందితులు భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నారంతే'' అని సుప్రీం కోర్టు న్యాయవాది చిత్రాంశుల్ సిన్హా బీబీసీతో అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)