NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్ (ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపై తాము వెనకడుగు వేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఏఏ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లిమేతర మైనారిటీ సమాజాల వారికి పౌరసత్వం అందించడానికే అని, దానివల్ల భారత్‌లోని మైనారిటీలపై ఎలాంటి ప్రభావం పడదని మోదీ ప్రభుత్వం చెబుతోంది.
ఎన్ఆర్సీ గురించి క్యాబినెట్‌లో ఇంకా ఎలాంటి చర్చా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అన్నారు.
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, చర్చల మధ్య బీజేపీ, దాని మిత్రదళాల కూటమి ఎన్డీయేలో కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది.
ఎన్డీయేలో రెండో అతిపెద్ద మిత్రపక్షమైన జేడీయూ, తాము ఎన్ఆర్సీకి అనుకూలంగా లేమని చెప్పింది. అటు ఎన్డీయేలో ఉన్న ఎల్జేపీ కూడా ఎన్ఆర్సీ డ్రాఫ్ట్ పూర్తిగా చదివేవరకూ మేం దానికి మద్దతు ఇవ్వమని చెప్పింది.
జేడీయూ జాతీయ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమ రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయనివ్వం అని స్పష్టం చేశారని ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి బీబీసీకి చెప్పారు.
"సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం ఎన్ఆర్సీని కేవలం అస్సాం కోసమే రూపొందించారు. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ, ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ దీన్ని అమలు చేయడం తమవల్ల కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్ఆర్సీని అస్సాంలోనే అమలు చేయలేనప్పుడు, దానిని బిహార్ లేదా దేశంలో ఎలా అమలుచేస్తాం?" అని త్యాగి ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, AFP
ఇప్పుడు వ్యతిరేకత ఎందుకొస్తోంది?
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఎన్డీయే పక్షాలన్నీ అది పాస్ అయ్యేలా చేసి, దానికి ఒక చట్టరూపాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ఈ ప్రశ్నకు కేసీ త్యాగి సమాధానమిచ్చారు. "సీఏఏను ఎన్ఆర్సీతో జోడిస్తే, అది ప్రమాదకరం. మా పార్టీ అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులు ఎదుర్కొన్న ఐదు సమాజాల ప్రజలతోపాటు ముస్లిం సమాజాన్ని కూడా అందులో చేర్చాలి" అని అన్నారు.
ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం గురించి ఎన్డీయేలో ఏదైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నిస్తే... దీనిపై "అలా చెప్పడానికి ఎన్డీయేకు ఎలాంటి నిర్మాణం లేదు. కానీ నితీశ్ కుమార్.. తమ పార్టీ దానికి అనుకూలంగా లేదని పట్నాలో చెప్పారు" అని త్యాగి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్డీయేలో చీలికలు వస్తున్నాయా?
జేడీయూ-ఎల్జేపీ కాకుండా బీజేపీ పాత మిత్రుల్లో ఒకరైన అకాలీదళ్ కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తన గళం వినిపించింది.
దేశంలోని ముస్లింలకు అభద్రతాభావం ఉండకూడదనే తాము దానిని వద్దని అనుకుంటున్నట్లు స్వయంగా మైనారిటీలకు (సిక్కులకు) ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదళ్ నేత, రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ చెప్పారు.
ఎన్డీయే లోపల అంత వ్యతిరేకతను చూస్తే ఆ కూటమిలో చీలికలు వచ్చాయనే భావించాలా? అని అడిగితే కేపీ త్యాగి, "ఎలాంటి చీలికలూ రాలేదు. కానీ భారత్‌లో ఎప్పటినుంచో ఉంటున్న వాళ్లను బయటకు పంపించడం తప్పు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అటు, సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ మాత్రం ఎన్డీయేలో ఎలాంటి చీలికలు లేవు, ఇవన్నీ ఊహాగానాలని అన్నారు.
"పార్లమెంటులో జేడీయూ, ఎల్జేపీ, అకాలీదళ్ సీఏఏకు మద్దతిచ్చాయి. ఈ పార్టీలకు సీఏఏ గురించి ఎలాంటి వ్యతిరేకత లేదు. వాళ్లు ఎన్ఆర్సీని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. దానిపై కూడా నితీశ్ కుమార్ నేరుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై ప్రశాంత్ కిశోర్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్ఆర్సీని ఎప్పుడు తీసుకొస్తోందో కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టంగా చెప్పలేదు" అని అన్నారు.
బీజేపీ పరిస్థితి మెరుగుపడడం చూసి జేడీయూ కంగారు పడుతోందనే దృష్టితో చూస్తున్నారు అని ప్రదీప్ సింగ్ అన్నారు.
"బీజేపీ ఇప్పుడు అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఒక పెద్ద పార్టీ ముందు ప్రాంతీయ పార్టీల స్పేస్ అంతమైపోయే సమస్య ఉంటుంది. మనం మహారాష్ట్రలో శివసేనకు అలా జరగడం చూశాం. మహారాష్ట్రలో ఒకప్పుడు బీజేపీ నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు అది అక్కడ అతిపెద్ద పార్టీ" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసెంబ్లీ ఎన్నికల వల్ల ఒత్తిడి తీసుకొస్తున్నారా?
"బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ రెండూ సమాన స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ ఇప్పుడు లోక్‌సభ ఫార్ములా ప్రకారమే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని భావిస్తే, బిహార్‌లో ఆ రెండు పార్టీల మధ్య తేడాలు రావచ్చు" అని ప్రదీప్ సింగ్ అన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు జేడీయూ, ఎల్జేపీకి ఎలాంటి సంబంధం లేదు కానీ, సీట్ల పంపకం కోసం ఇలాంటివి ఒత్తిడి తెచ్చే రాజకీయాలు అని చెప్పారు.
"రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమి తర్వాత ఈ రెండు పార్టీలూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడం మనం చూశాం. అప్పుడు, అది ఈ సీట్ల పంపకం గురించే జరిగింది. కానీ, బీజేపీ మళ్లీ రెండింటినీ కూటమిలో కొనసాగేలా చేయగలిగింది. ఇప్పుడు వస్తున్న వ్యతిరేకత కూడా సీట్ల పంపకం గురించే" అన్నారు ప్రదీప్ సింగ్.
ఆయనలాగే సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ సన్నిహితులుగా భావించే రాధికా రామశేషన్ కూడా జేడీయూ పరిస్థితులను చూసే వ్యతిరేకిస్తోంది అంటున్నారు.
"జేడీయూకు 12-13 శాతం మైనారిటీ ఓట్లే లభించేవి. అది ఇప్పుడు పూర్తిగా చేజారిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. అలాంటప్పుడు వారు ఎక్కువ కాలం దీన్ని వ్యతిరేకిస్తారని నాకు అనిపించడం లేదు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అకాలీదళ్ ఎందుకు వ్యతిరేకిస్తోంది
ఎన్డీయేలో ఎలాంటి చీలికలు లేవని రాధిక చెప్పారు. "ఎందుకంటే ఈ పార్టీలన్నీ పార్లమెంటులో సీఏఏకు మద్దతుగా ఓటు వేశాయి. దానివల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్లు, బిల్లును అక్కడే వ్యతిరేకించేవారు" అన్నారు.
ఆమె బీజేపీ మిత్రపక్షాల వైఖరిని ఎన్నికలకు జోడించి కూడా చూస్తున్నారు. "ఈ వ్యతిరేకత తర్వాత, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు సగం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపిని ఒప్పించేలా చేయవచ్చు" అని ఆమె చెప్పారు.
అటు, అకాలీదళ్ వ్యతిరేకతను పెద్ద విషయంగా రాధిక భావించడం లేదు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అకాలీదళ్ వ్యతిరేకతకు ఎలాంటి అర్థం లేదని అన్నారు.
కానీ ప్రదీప్ సింగ్ మాత్రం దీనిని భిన్నంగా చూస్తున్నారు. అకాలీదళ్ విషయం పూర్తిగా వేరే అంటున్నారు.
"పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను కూడా చేర్చాలని అకాలీదళ్ అంటుంటే... అది పెద్ద విషయం కాదు. కానీ, అదే అకాలీదళ్ నరేష్ గుజ్రాల్ మీద కోపంగా కూడా ఉంది. ఆయన తనను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా చేయాలని కోరుకుంటున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ సజీవంగా ఉన్నంతవరకూ అకాలీదళ్-బీజేపీ కూటమి నడుస్తుంది. ఎందుకంటే అది భావోద్వేగ కూటమి. ఎన్ఆర్సీ వల్ల ఎన్డీయేలో ఎలాంటి చీలికలూ రావడం జరగదు" అంటారు ప్రదీప్ సింగ్.
ఇవి కూడా చదవండి:
- జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల రద్దు వంటి ఆంక్షలను ప్రభుత్వం వారంలోగా సమీక్షించాలి :సుప్రీం కోర్టు
- జగన్ సీఎం అయిన తరువాత తొలిసారి కోర్టులో హాజరు... విచారణ 17కు వాయిదా
- ఇరాన్: సులేమానీ హత్య... బిన్ లాడెన్ మృతి కన్నా ఎందుకు ముఖ్యమైనది
- 2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









