పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆయేషా ఇంతియాజ్
- హోదా, బీబీసీ ట్రావెల్
కరాచీలోని ఒక సంపన్న ప్రాంతంలో నేను కారు పార్కు చేసేందుకు స్థలం వెదుకుతున్నప్పుడు అద్భుతమైన భవనం కనిపించి నోరెళ్లబెట్టాను.
రోడ్డుకు అవతలివైపు కూడా బిల్కిస్ సులేమాన్ దివాన్‌కు ఇలాంటి పెద్ద భవనం ఉందని, మా వదిన చెప్పారు. ఆమె మెమన్(సున్నీ ముస్లింల్లో ఉపజాతి). మా వదినతో కలిసి పనిచేస్తారు. మేం ఆమెను కలవడానికే వచ్చాం.
భవనం లోపల విశాలమైన లాన్, పద్ధతిగా కత్తిరించిన చెట్లు, ఆంగ్లేయుల కాలం నాటి ఆర్కిటెక్చర్ సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, లోపల అంత వైభవం కనిపించలేదు.
ప్రధాన ద్వారం నుంచి నేరుగా లోపలికెళ్లాం. అక్కడ మామూలుగా ఉన్న గదిలోకి చేరాం. కుట్టుమిషన్, సోఫా, పాత రిఫ్రిజిరేటర్, ఇంకొన్ని అవసరమైన వస్తువులతో ఆ చిన్న గది నిండిపోయి ఉంది.
దివాన్‌కు, ఆమె సోదరికి బోలెడన్ని ఆస్తులు ఉన్నాయి. సీసాలు తయారు చేసే ఒక ప్లాంటుకు వాళ్లు యజమానులు. తండ్రి (చనిపోయారు) వారికి పండ్ల ఎగుమతుల కంపెనీ వారసత్వాన్ని వదిలివెళ్లారు. కానీ, భవనంలో విశాలంగా ఉన్న హాలులో ఈ కుటుంబం గడపదు. ఒక చిన్న గదిలోనే ఇరుక్కుని ఉంటారు.
భవనంలోని విశాలమైన భాగాన్ని ఒక ప్రైవేట్ స్కూలుకు అద్దెకిచ్చారు. అక్కడ దివాన్, మా వదిన రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు.
ఇంత సంపద ఉన్నప్పటికీ వీళ్లకు ఇంత పిసినారితనం ఎందుకని నాకు అనిపించింది.
దివాన్, ఆమె కుటుంబమే కాదు. కరాచీలోని మొత్తం మెమన్ సమాజంలో అందరూ చాలా తక్కువ ఖర్చుతోనే రోజులు నెట్టుకొచ్చేస్తారు.

ఫొటో సోర్స్, Aysha Imtiaz
డబ్బుతో గుర్తింపు
మెమన్ సమాజంలో వారికి డబ్బు అనేది బలం, పలుకుబడికి ఒక మూలం లాంటిది. వాళ్లు చాలా కష్టపడి దానిని పొదుపు చేస్తుంటారు. సంపద వారి గుర్తింపుకు సంబంధించిన వస్తువు.
కరాచీలోని మెమన్లు భారత్‌లో నివసించే మెమన్ల నుంచి 1947లో దేశ విభజన సమయంలో విడిపోయారు. భారత్‌లో ఉంటున్న మెమన్లు తమ పూర్వీకుల వ్యాపారాలు నడుపుతున్నారు.
కానీ, తమ మూలాల నుంచి దూరంగా వెళ్లి కరాచీలో స్థిరపడ్డ వీళ్లు మాత్రం జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు. విభజనతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి ఎన్నో ఏళ్ల వెనక్కు వెళ్లిపోయింది.
"మా తాతయ్య వట్టి కాళ్లతో పాకిస్తాన్ చేరారు. మొదట కూలీపనులు చేశారు. తర్వాత మెల్లమెల్లగా తన సామ్రాజ్యం ఏర్పరుచుకుని, దాన్ని విస్తరించారు. చిన్నప్పటి నుంచి మాకు కష్టపడి పనిచేస్తే వచ్చే సంపాదన విలువేంటో తెలిసేలా చేశారు" అని మర్హూమ్ మెమన్ పారిశ్రామికవేత్త, సమాజసేవకుడు అహ్మద్ దావూద్ మనవరాలు అనిలా పారేఖ్ చెప్పారు.
"ఇది మా జీవనంలో భాగం. మేం అలాగే ఉన్నాం. మాకు (సమాజానికి)తిరిగి ఇవ్వడం కూడా తెలుసు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆధిపత్య వర్గం
కరాచీలో మెమన్లకు తాము సంపాదించిన ప్రతి పైసా విలువైనదే. పాకిస్తాన్‌లోని చాలా పరిశ్రమలను వారే నియంత్రిస్తుంటారు. బట్టల పరిశ్రమ, విద్యారంగం, గనులు, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అన్నిటింలో వారిదే ఆధిపత్యం.
కానీ, ఎంత సంపన్నులైనా డబ్బును గౌరవించడం వారు మరిచిపోలేదు. తమ వారసత్వాన్ని భద్రంగా కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నారు.
"ఖర్చు చేయండి, కానీ వృథా చేయకండి" అని కరాచీలో ప్రముఖ అకెడెమియా సివిటాస్ అండ్ నిక్సర్ కాలేజ్ డీన్ నదీమ్ గనీ చెబుతారు. గనీ కూడా మెమన్ సముదాయానికి చెందిన వ్యక్తే.
"సాదాసీదాగా ఉండడంలోనే వినయం ఉంది. దానివల్ల గౌరవం లభిస్తుంది. కానీ, మేం మా సౌకర్యం కోసం డబ్బులు ఖర్చు చేయడానికి కూడా వెనకాడం" అని ఆయన అన్నారు.
కరాచీ మెమన్లు చాలా తక్కువ ఖర్చుతో జీవిస్తారు లేదంటే అనవసర ఖర్చులకు పోకుండా జాగ్రత్తగా ఉంటారు. పొదుపును రాబోయే కష్టకాలంలో బీమాలా, గతంలో తాము ఎదుర్కొన్న కష్టాలకు శ్రద్ధాంజలిలా భావిస్తారు.
అందరూ తమ వనరులను జాగ్రత్తగా చూసుకుంటారు. తమ దగ్గర ఉన్న సందపదను చూసి గర్విస్తారు. సాధ్యమైనంత వరకూ ఆస్తులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
"మెమన్ ఇళ్లలో ఒకరు వాడిన పాత బట్టలను కుటుంబంలో వేరే వారు వేసుకునే సంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. పెద్దలు వాడిన బట్టలు వేసుకోడానికి ఎవరూ వెనకాడరు" అని కరాచీలో నివసించే మెమన్ హీరా ఖత్రీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దుబారా చేస్తే జరిమానా
ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం అందరూ చేస్తారు. కానీ మెమన్ కుటుంబాల్లో అలా చేయకపోతే జరిమానా కూడా విధిస్తారు.
పిల్లలు జవాబుదారీగా ఉండడం, ప్రతి ఖర్చుకూ లెక్క రాసి పెట్టడం నేర్పిస్తారు.
ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుంది.
టాయిలెట్ ఫ్లష్ చేయకపోయినా, లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోయినా 15 పాకిస్తానీ రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానా డబ్బును ఇంటర్‌నెట్ కనెక్షన్ కోసం ఖర్చు చేస్తారు.

ఫొటో సోర్స్, Asif Hassan
జీరో-వేస్ట్ ఉద్యమం
మెమన్ల జీవనం కొత్తగా వచ్చిన జీరో-వేస్ట్ ఉద్యమంలా ఉంటుంది. దానికి మూలం - 'తక్కువ ఖర్చు పెట్టు, మళ్లీ ఉపయోగించు, రీసైకిల్ చెయ్' నినాదం.
"ఈ ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితమే ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కానీ, మెమన్ సంప్రదాయంలో ఇది శతాబ్దాల నుంచీ ఉంది. అప్పట్లో దానికి ఏ నినాదమూ ఉండేది కాదు" అని గనీ చెప్పారు.
ఆయా కాలాల్లో స్థానికంగా దొరికే పళ్లు, కూరగాయలను వీళ్లు బాగా తింటారు. అవసరమైనంత మేరకే ఆహారం వండుకుంటారు. ఆహార పదార్థాలు వృథా చేయరు.
పరేఖ్ రాత్రి భోజనానికి ఒక కూర, ఒక మాంసం వంటకం చేస్తారు. అంతకు మించి ఆహార పదార్థాలు వృథా చేస్తే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చౌక, మన్నికైన బట్టలు
మెమన్లు ఎప్పుడూ అందం కోసం ఖర్చు పెట్టరని చెబుతారు. తమ పాదాలు నేలమీదే ఉంటాయని గనీ అన్నారు.
ఆయన వారం రోజులు విదేశాల్లో ఉన్నారు. 18 ఏళ్ల కొడుక్కి అక్కడ అమెరికా ఐవీ లీగ్ స్కూల్ చూపించేందుకు తీసుకెళ్లారు. ప్రిన్స్‌టన్‌లో కూడా వాల్-మార్ట్‌లో కొన్న బట్టలే వేసుకున్నారు. అవి మన్నికైనవి, పైసా వసూల్ బట్టలు అంటారు గనీ.
"మాకు మా ఇమేజ్ గురించి ఆందోళన ఉండదు. మనకు అది ఎంత ఉపయోగం అనేదే చూస్తాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Aysha Imtiaz
ఖరీదైన పెళ్లిళ్లు
మెమన్ సముదాయంలో పెళ్లిళ్లు భారీగా జరుగుతాయి. వాటిలో సాధారణంగా 10 కోర్స్ ఉండే మెనూ ఉంటుంది. పెళ్లికూతురు డ్రెస్ ఖరీదు 10 లక్షల పాకిస్తాన్ రూపాయలు వరకూ ఉంటుంది.
పెళ్లిళ్లకు వాళ్ల పిసినారితనానికి ఏమాత్రం పోలిక ఉండదు. ఈ పెళ్లిళ్లను వారు తమ అతిథులను దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అందుకే ఇక్కడ ఎలాంటి పిసినారితనం కనిపించదు.
మెమన్ల పెళ్లిళ్లకు అతిథుల సంఖ్య వేల్లలో ఉంటుంది.
మిగతా విషయాల్లో అంత పొదుపుగా ఉండే మీరు, వివాహాలకు అంత భారీగా ఎందుకు ఖర్చుచేస్తున్నారని అడిగితే... "పెళ్లిళ్లు సంబంధాలు కలుపుకోడానికి, బ్రాండింగ్ చేసుకునే అవకాశాలు అవుతాయి. అందుకే అప్పుడు ఖర్చుకు వెనకాడము" అని మెమన్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు మొషిన్ చెప్పారు.
డబ్బుతో డబ్బు సంపాదించడం
"మా ఇళ్లలో మగవాళ్లు తినడానికి కూచున్నప్పుడు కూడా డబ్బుల గురించే మాట్లాడుతుంటారు" అని పారేఖ్ చెప్పారు.
"పురుషులు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదిస్తారు. మహిళలు బంగారం లేదా సేవింగ్ సర్టిఫికెట్లు కొని డబ్బు మదుపు చేస్తారు. అందరం పొదుపు చేస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలీదు" అని పారేఖ్ అన్నారు.
పారేఖ్‌కు 32, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ప్రతి నెలా మొదటి తేదీన వాళ్ల ముందు నిలడతారు. వాళ్ల ఆదాయంలోని ఒక ఎక్కువ భాగం పెట్టుబడులు(వారికోసమే) పెట్టేలా చూస్తారు.

ఫొటో సోర్స్, Saqib Rafique
అలవాటులో పొదుపు ఉంది
బిల్కిస్ సులేమాన్ దీవాన్ ఇంట్లో ఆరోజు మాట వృథా.
మా వదిన హజ్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి ప్రార్థనలు చేసే చాప, ఖర్జూరం, జపమాల తీసుకొచ్చారు. దివాన్ ఆమెను చూడగానే రెండు చాపలు అవసరం లేదన్నారు.
జుట్టుకు పెట్టుకునే మెహెందీ గురించి చర్చ జరగడంతో మా వదిన రంగు చిక్కగా ఉండడానికి మూడు చెంచాల టీపొడి కలిపారు.
దాంతో దివాన్ ఉపయోగించని టీపొడి వేయడం వృథా చేసినట్టే కదా అన్నారు.
కానీ, వీడ్కోలు చెప్పే సమయం వచ్చినపుడు అతిథులను వట్టి చేతులతో పంపించలేదు.
ఆమె నాకు స్టైరోఫోమ్ కప్పు నిండా చింతపండు ఇచ్చారు. దానితో నా దగ్గు తగ్గుతుందని చెప్పారు. ఆ వేర్లు చౌకగా హోల్‌సేల్‌లో కొన్నానని చెప్పారు.
పెద్ద భవనాన్ని అద్దెకు ఇచ్చేశాక వాళ్లు తమ ఇంట్లో ఉన్న చిన్న గదిని ఉంచుకున్నారు. అక్కడ టేబుల్‌కు రుద్దుకుంటూ మేం తలుపు దగ్గరకు వెళ్లాం.
ఆమె చెప్పిన ఆఖరి మాట స్పష్టంగా వినిపించింది. గది నుంచి బయటికెళ్లడానికి ముందే బల్బు ఆఫ్ చేసెయ్ అని.
ఇవి కూడా చదవండి:
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- అజ్ఞాతంలో ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు.. గాలిస్తున్న లాహోర్ పోలీసులు
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- ‘పోలీసులకు కనిపించకుండా లైట్లన్నీ ఆపేసి దాక్కున్నాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి బతికి బయటపడ్డాం’
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- అమెజాన్‌కు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








