కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తీహార్ జైలు జైలర్ సునీల్ గుప్తా దృష్టిలో మక్బూల్ భట్ కశ్మీర్‌కు చెందిన ఒక వేర్పాటువాద నాయకుడు కాదు. ఆయన ఒక ఉన్నతస్థాయి మేధావి. తన ఇంగ్లిష్ భాషను మెరుగు పరుచుకోవడానికి ఆయన ప్రాక్టీస్ చేసేవారు.
'బ్లాక్ వారెంట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తీహార్ జైలర్' పుస్తక రచయిత సునీల్ గుప్తా మక్బూల్ ఆ జైలులో ఉన్నప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు.
నేను మక్బూల్ భట్‌ను మొదటిసారి చూసేటప్పటికి ఆయనంటే తీహార్ ఖైదీలకు చాలా ఆదరణ ఉండేది. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా, జైలు సూపరింటెండెంట్ నుంచి ఏదైనా మెమో వచ్చినా దానికి సమాధానం ఇవ్వడానికి వాళ్లు చార్లెస్ శోభరాజ్ దగ్గరకో, మక్బూల్ భట్ దగ్గరికో వచ్చేవారు.

ఫొటో సోర్స్, ROLI BOOKS
జైలులో ఏకాంతం దొరకదు
‘‘ఆయన వ్యక్తిత్వంలో ఒక రకమైన ప్రశాంతత కనిపించేది. ఆయన ఎర్రగా ఉండేవారు. ఎప్పుడూ తెల్లటి ఖద్దరు కుర్తా, పైజామాలో ధరించేవారు. వయసులో నాకంటే పెద్దవారైనా, నేను ఆయన సెల్లోకి ఎప్పుడు వెళ్లినా, లేచి నిలబడేవారు. జైల్లోకి ఎవరైనా ఖైదీ వస్తే, వారు ఎంత దారుణమైన నేరం చేసినా, కొన్ని రోజులకు వాళ్లు కూడా మా కుటుంబంలో భాగం అనిపిస్తుంటుంది" అని సునీల్ గుప్తా చెప్పారు.
"ఎక్కువగా ఖైదీలతో మాకు స్నేహ పూర్వక సంబంధాలే ఉంటాయి. మక్బూల్‌తో మాత్రం మాకు ప్రత్యేక బంధం ఏర్పడింది. మేం ఆయన దగ్గరకు వెళ్లినపుడు, మాతో చాలా బాగా మాట్లాడేవారు. నేను మొత్తం చదివింది ఇంగ్లీష్ మీడియమే అయినా, ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికి కాస్త తడబడేవాడిని. ఆ లోపాన్ని ఎలా అధిగమించాలో నాకు చెప్పింది మక్బూలే" అన్నారు.
"ఆయన నాతో మీకు హిందీ వచ్చు, దానితో పోలిస్తే ఇంగ్లీష్ చాలా సరళమైన భాష అని చెప్పేవారు. మరణ శిక్ష విధించినప్పటికీ ఆయన మెరుగైన ప్రవర్తన వల్ల మక్బూల్ భట్‌ను ఏకాంతవాసంలో ఉంచలేదు".

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
సీఐడీ ఇన్‌స్పెక్టర్ హత్య ఆరోపణలతో ఉరిశిక్ష
1966లో సీఐడీ ఇన్‌స్పెక్టర్ అమర్ చంద్ హత్య కేసులో మక్బూల్ భట్‌కు ఉరిశిక్ష విధించారు.
ఉరిశిక్ష విధించినప్పుడు, ఆయన కోర్టులో అందరి ముందూ మేజిస్ట్రేట్‌తో "జడ్జి గారూ మక్బూల్‌ను ఉరి తీసే తాడు ఇప్పటివరకూ తయారవలేదు" అన్నారు.
ఆ తీర్పు వచ్చిన 4 నెలలకే, జైల్లో 38 అడుగుల సొరంగం తవ్విన భట్.. రెండు వారాల వరకూ ఆగకుండా నడుస్తూ పాక్ పాలిత కశ్మీర్‌లో అడుగుపెట్టారు.
అక్కడ 8 ఏళ్లు గడిపిన తర్వాత మళ్లీ భారత పాలిత కశ్మీర్‌లోకి వచ్చిన మక్బూల్ తన అనుచరులతో హింద్వారా, బారాముల్లాలో ఒక బ్యాంక్ దోపిడీ చేశారు. ఆ బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేశారు.

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
1971లో భారత విమానం హైజాకింగ్‌లో పాత్ర
1971లో గంగ అనే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లాలనే పథకం కూడా అతడి మెదడులో పుట్టిందే.
"ఆ ఘటనలో మక్బూల్ భట్ ఎలాంటి పాత్ర పోషించారో చెబుతారా" అని ఆ హైజాకింగ్‌ను అమలు చేసి, ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉంటున్న హాషిమ్ కురేషీని బీబీసీ అడిగింది.
"అందులో ఉన్నదంతా మక్బూల్ భట్ పాత్రే. స్పెషల్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో "మేం ఎలాంటి కుట్ర చేయలేదు. మేం మా సమాజ స్వతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నాం. ప్రపంచం దృష్టి కశ్మీర్‌పై పడాలనే మేం ఇలా చేశాం అని ఆయన స్పష్టంగా చెప్పారు" అని హాషిం కురేషీ చెప్పారు.
"నేను మీకు 1970లో జరిగింది చెబుతాను. మేం డాక్టర్ ఫారూఖ్ హైదర్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాం. హఠాత్తుగా ఎరిత్రియాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు కరాచీలో ఇథియోపియా విమానంపై ఫైరింగ్ చేసి దానికి నష్టం కలిగించారని వార్తలు వచ్చాయి. మక్బూల్ అది వినగానే, తటాలున నిలబడ్డారు. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు".
"గంగా విమానాన్ని హైజాక్ చేయాలనే ప్లాన్ అక్కడినుంచే మొదలైంది. కొన్ని రోజుల తర్వాత భట్ నాతో 'మేం మీకు విమానాన్ని హైజాక్ చేసే ట్రైనింగ్ ఇప్పిస్తే, మీరు దానిని అమలు చేయగలరా' అని అడిగారు. నేను ఆయనతో 'ఏం చేయడానికైనా నేను సిద్ధం' అన్నాను" అని కురేషీ చెప్పారు.

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
అలీనోద్యమం సమయంలో బెదిరింపు
1981లో భారత్‌లో అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో దిల్లీలో బీబీసీ ప్రతినిధి మార్క్ టలీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. దిల్లీలోని విజ్ఞాన భవన్, అశోకా హోటల్‌లో బాంబులు పెట్టామని అతడు చెప్పాడు. మక్బూల్ భట్‌ను వెంటనే విడుదల చేయకపోతే ఆ భవనాలను పేల్చేస్తామన్నాడు.
దానికి ఒక రోజు ముందు సదస్సులో పాల్గొనబోతున్న క్యూబా రాయబార కార్యాలయం దౌత్యవేత్తలకు కూడా అలాంటి బెదిరింపుతో కవర్లు పంపారు.
బీబీసీ ఆ వార్తలను ప్రసారం చేయలేదు. దాని గురించి ప్రభుత్వ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చింది. దాంతో తీహార్ జైల్లో ఉన్న మక్బూల్ భట్‌కు బందోబస్తు పెంచారు. అతడిపై గట్టి నిఘా ఉంచారు.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/AFP/GETTY IMAGES
బ్రిటన్‌లో భారత దౌత్యవేత్త హత్య
1984లో బ్రిటన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రేను జేకేఎల్ఎఫ్ అపహరించింది. అతడిని వదలాలంటే మక్బూల్ భట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
భారత ప్రభుత్వం అతడిని విడుదల చేయకపోవడంతో వారు మాత్రేను హత్య చేశారు. దాంతో, రాత్రికిరాత్రే మక్బూల్ భట్‌ను ఉరితీయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
"రవీంద్ర మాత్రే హత్య జరగకపోయుంటే, మక్బూల్ భట్‌ను ఉరి తీసుండరా" అని 'బ్లాక్ వారెంట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తీహార్ జైలర్' సహ రచయిత సునేత్రా చౌధరిని నేను అడిగాను
"అస్సలు తీసుండరు. ప్రతి రూల్ బుక్‌లో ఉరిశిక్ష పడిన ఖైదీల ఆఖరి కోరిక తీర్చాలని, ఆఖరిసారి వారికి కుటుంబాన్ని చూపించాలని రాసుంటుంది. కానీ ఆయనతో సోదరుడిని కూడా కలవనీయలేదు. శ్రీనగర్ నుంచి దిల్లీ వస్తున్నప్పుడు, ఆయన్ను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు" అని సునేత్రా చెప్పారు.
"తనకు ఇలా జరగబోతోందని మక్బూల్ భట్‌కు తెలుసు. ఎందుకంటే దౌత్యపరంగా ఏదో చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చూపించాలి. ఆయనకు వేరే కేసులో మరణశిక్ష పడడంతో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు."

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
ఉరిశిక్షపై ఎన్నో ప్రశ్నలు
మక్బూల్ భట్ ఉరిశిక్ష అమలుపై కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
దిగువ కోర్టులో మరణశిక్ష విధించినపుడు, మీరు దీనిని ధ్రువీకరిస్తారా, లేక కొట్టివేస్తారా అని హైకోర్టులో ప్రభుత్వం అపీల్ చేస్తుంది అని మక్బూల్ భట్ వకీలుగా ఉన్న ఆర్ఎం తుఫైల్ చెప్పారు.
"మేం సుప్రీంకోర్టులో అపీల్ చేసినపుడు, మా దగ్గర ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించినట్లు ఎలాంటి ఆదేశాలూ లేవు. మక్బూల్ మరణశిక్షను అసలు హైకోర్టు ఎండార్స్ చేయలేదు అని నేను పూర్తి బాధ్యతాయుతంగా చెబుతున్నాను" అన్నారు.

'డెత్ రెఫరెన్స్'పై జడ్జి సంతకం లేదు
"మేం దాని గురించి జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రశ్నించాం. దాంతో సంతకం లేకుండానే ఆకుపచ్చగా ఉన్న రెండు మూడు పేజీలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం, హైకోర్టు ఉరిశిక్షను ధ్రువీకరించింది, జస్టిస్ ముర్తజా ఫజల్ అలీ దానిని ధ్రువీకరించారు అని చెప్పింది" అని తుఫైల్ చెప్పారు.
"జస్టిస్ ఫజల్ అలీ మొదట జమ్ము, కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉండేవారు. సుప్రీంకోర్టులో కొంతకాలం పనిచేశాక రిటైర్ అయ్యారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయన ఒక సాక్షి కూడా. అప్పట్లో జస్టిస్ చంద్రచూడ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు నన్ను ఇప్పటికీ కదిలిస్తున్నాయి" అన్నారు.
"హైకోర్టు జడ్జిగా తనెప్పుడు డెత్ రెఫరెన్స్‌పై సంతకం చేయలేదని ఆయన చెప్పారు. అంటే దాన్నిబట్టి ఆ దస్తావేజుల్లో ముర్తజా ఫసల్ అలీ సంతకం లేకుంటే, అందులో పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ అలాంటి ఆదేశాలపై ఇద్దరు జడ్జిల ఏకాభిప్రాయం అవసరం అని వారు మర్చిపోయారు. మర్డర్ రెఫరెన్స్ కోసం హైకోర్టు డివిజన్ బెంచ్ ఉంటుంది. వారు మా ఎస్ఎల్పీ స్వీకరించడానికి నిరాకరించారు" అన్నారు తుఫైల్.

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
జేకేఎల్ఎఫ్ దుశ్చర్యకు భట్‌కు శిక్ష
వేర్పాటువాద హింసలో మక్బూల్ భట్ హస్తం ఉన్నప్పటికీ, రవీంద్ర మాత్రే హత్యలో ఆయనకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు.
"జేకేఎల్ఎఫ్ ఎప్పుడూ అడ్వెంచరిజం చేసింది. నా దృష్టిలో మాత్రేను అన్యాయంగా చంపేశారు. ‘అతడికి బదులు మీరు మక్బూల్ భట్ లాంటి వారిని అడగకుండా ఉండాల్సింది. మీరు దానికి 13 మందిని నియమించారు.’అని వారిని ఎప్పుడూ మందలించేవాడిని. ఇది పూర్తిగా అమానుల్లా ఆపరేషన్" అని హషీం కురేషీ చెప్పారు.
మక్బూల్ భట్ కూడా "ఏ నేరంలో మీరు నాకు మరణ శిక్ష విధిస్తున్నారో, అది నా జైలు నుంచి 7 వేల మైళ్ల దూరంలో జరిగింది. అందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు" అని చెప్పారు. అవి మక్బూల్ భట్ చివరి మాటలు. మక్బూల్ భట్‌కు వేసిన ఉరిశిక్ష కచ్చితంగా భారత్ ప్రతీకారమే. సుప్రీంకోర్టు ఈ కేసును అసలు వినలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
చదవడం, రాయడం ఇష్టం
తీహార్ జైల్లో మక్బూల్ భట్ ఒక రాజకీయ ఖైదీలాగే వ్యవహరించేవారు. ఆయనకు చదవడం, రాయడం చాలా ఇష్టం.
ఆయన దాదాపు 5 అడుగులా 10 అంగుళాల పొడవుండేవారు. చాలా సున్నితంగా కోప్పడేవారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల్లో ప్రపంచంలోని అన్ని అంశాలు దొర్లుతున్నట్టు అనిపించేది అంటారు ఆయనతో కలిసి పనిచేసిన హాషిం కురేషీ.

మక్బూల్ భట్‌కు బ్లాక్ వారెంట్
ఉరి తీయబోతున్నారనే సమాచారం మక్బూల్ భట్‌కు మొదటే చెప్పలేదు. కానీ ఆయనకు ఆ విషయం అర్థమైంది.
మక్బూల్‌కు ఉరిశిక్ష వేయాలనే నిర్ణయం తీసుకోగానే, తీహార్ జైలు డీజీని బ్లాక్ వారెంట్ తీసుకురావడానికి రాత్రికిరాత్రే శ్రీనగర్ పంపించారు. ఆయన వకీలుకు కూడా, దాని గురించి ఉరిశిక్ష అమలు చేసే ముందే చెప్పారు. అప్పటికి కోర్టులో ఆయనపై ఉన్న మరో కేసులో వాదనలు నడుస్తూనే ఉన్నాయి అని సునేత్రా చౌధరి చెప్పారు.
మక్బూల్‌ను మరో కేసులో ఉరిశిక్ష విధిస్తున్నారనే విషయం ఆ కోర్టుకు కూడా తెలీదు. కోర్టు ఆయన గురించి అడిగినప్పుడు, మక్బూల్‌కు వేరే కేసులో ఉరిశిక్ష విధించారని చెప్పారు.

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం
మక్బూల్ భట్‌ను ఉరితీసే ముందు తీహార్ జైలు దిశగా వెళ్లే ప్రతి రహదారినీ మూసేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు.
"మొత్తం ఆ ప్రాంతమంతా ఒక కోటలా అనిపించింది. జైలు పైనుంచి ఏవైనా దాడులు జరుగుతాయేమో అని అనుకున్నారు. మిలిటెంట్లు హెలికాప్టర్లతో కిందికి దిగుతారని, మక్బూల్ భట్‌ను కాపాడుతారని భయపడ్డారు" అని సునేత్రా చౌధరి చెప్పారు.
"అప్పుడు ఖలిస్తాన్, కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వారి వైపు నుంచి ఎవరైనా దాడులు చేస్తారేమోనని అనుకునేవారు. ఇప్పుడు తీవ్రవాదంపై అంతర్జాతీయ సహకారం ఈ స్థాయిలో ఉన్నా, అప్పుడు అది అస్సలు ఉండేది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీహార్ జైల్లో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు".

ఫొటో సోర్స్, GERHARD JOREN/LIGHTROCKET VIA GETTY IMAGES
కశ్మీరీలకు తన సందేశం రికార్డ్ చేయించారు
మక్బూల్ భట్ జీవితంలో చివరి రోజుల్లో ఒక సిక్కు మేజిస్ట్రేట్‌ను పిలిపించి మీ వీలునామా రాయాలని ఆయనకు చెప్పారు. కానీ మక్బూల్ తన వీలునామా రాయడానికి బదులు దానిని రికార్డ్ చేయించారు. 1984 ఫిబ్రవరి 11న ఉదయం ఆయన చివరిసారి నమాజు చేశారు. టీ తాగారు. ఉరికొయ్య వైపు నడిచారు.
"ఆ రోజుల్లో ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో ఖైదీలను హెలికాప్టర్ సాయంతో జైలు నుంచి తప్పిస్తారు. ఆయన్ను కూడా అలా తప్పించవచ్చని మమ్మల్ని నిఘా విభాగం అప్రమత్తం చేసింది. అందుకే మేం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశాం. ఆరోజుల్లో మక్బూల్ ఉదయం నాలుగ్గంటలకే లేచేవారు" అని సునీల్ గుప్తా చెప్పారు.
"ఆయన ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండేది. కానీ చివరి రోజుల్లో కాస్త దిగులుగా కనిపించేది. ఆయన మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన రికార్డెడ్ సందేశంలో కశ్మీరీలతో 'మీ పోరాటం ఇక ముందు కూడా కొనసాగించండి' అని చెప్పారు. కానీ భద్రతా కారణాల వల్ల మేం ఆ సందేశాన్ని బయటకు రానివ్వలేదు."
"నేను చాలా ఉరిశిక్షలు చూశాను. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి క్షణాల్లో చలించిపోతాడు. కానీ మక్బూల్ చాలా ప్రశాంతంగా చావుకు సిద్ధమయ్యారు. నల్లగుడ్డ కప్పి, సంకెళ్లు వేస్తున్నప్పుడు, ఆయన పెద్దగా స్పందించలేదు".
"కొంతమంది ఉరిశిక్షకు ముందు నినాదాల్లాంటివి చేస్తుంటారు. కానీ మక్బూల్ అలా చేయలేదు. అప్పుడు అక్కడ ఫకీరా, కాలూ అనే తలారిలు ఉన్నారు. వాళ్లే అతడిని ఉరికొయ్య దగ్గరికి తీసుకెళ్లారు".

ఫొటో సోర్స్, MAQBOOL BUTT FACEBOOK PAGE
తీహార్‌లోనే ఖననం
మక్బూల్ శవాన్ని ఆయన కుటుంబానికి ఇవ్వకుండా తీహార్ జైల్లోనే ఖననం చేయాలని ముందే నిర్ణయించారు.
"మక్బూల్ దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి. వాటన్నిటినీ ఆయన స్నేహితులకు బహుమతిగా ఇచ్చేశారు. బట్టలు కాకుండా ఆయన దగ్గర ఒక ఖురాన్ ఉండేది. దానిని రోజూ చదివేవారు. మక్బూల్ కుటుంబసభ్యులు ఆయన వస్తువులను తమకు ఇవ్వాలని కోరారు. కానీ మేం వారి అభ్యర్థనను అంగీకరించలేదు" అని సునీల్ గుప్తా చెప్పారు.
"కానీ ఆ నిర్ణయం జైలు సూపరింటెండెంట్‌ది కాదు, దానిని ఉన్నత స్థాయిలో తీసుకున్నారు. హోంమంత్రి లేదా ప్రధాన మంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకూడదు అనే నిర్ణయం కూడా అక్కడే తీసుకున్నారు. ఎందుకంటే, వేర్పాటువాదులు దానిని దుర్వినియోగం చేసేవారు".
తీహార్ జైలు చరిత్రలో ఒక వ్యక్తిని ఉరిశిక్ష వేసి, ఆ పక్కనే ఖననం చేయడం అనేది మొదటిసారి అప్పుడే జరిగింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES
మక్బూల్ పుస్తకాలు తీహార్ లైబ్రరీలో
మక్బూల్ భట్ వస్తువులు ఏమయ్యాయో సునీల్ గుప్తాకు తెలీదా?
కానీ మక్బూల్ పుస్తకాల్లో జాన్ పాల్ సత్రే, విల్ డురెంట్ రాసినవి కూడా ఉన్నాయని, అవి తీహార్ జైలు లైబ్రరీలో భాగం అయ్యాయనే విషయం ఆయనకు తెలుసు.
తర్వాత ఆ లైబ్రరీ నుంచి ఎంతమంది ఆ పుస్తకాలు తీసుకుని చదివినా, వారందరూ ఒకప్పుడు ఆ పుస్తకాల అసలు యజమాని ఎవరనేది అసలు ఊహించి ఉండరు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








