పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్ వచ్చిన మత్స్యకారులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభూరావు ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
తొమ్మిది మంది భారత మత్స్యకారులు యెమెన్ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని స్వదేశం చేరుకున్నారు. సముద్ర మార్గంలో దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం 10 రోజుల పాటు కేవలం తమ వేట పడవలలోనే వారు ప్రయాణించారు.
2018 డిసెంబర్‌లో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సాగయమ్ జగన్, రవి కుమార్, వెనిస్టన్, ఎస్కాలిన్, అల్బర్ట్ న్యూటన్, వివేక్, సాజన్‌తో పాటు, కేరళకు చెందిన మరో ఇద్దరు మత్స్యకారులు కలిసి సముద్రం జలాల్లో చేపలు పట్టే ఉద్యోగం కోసం దుబాయికి వెళ్లారు. అయితే, వారు దుబాయి చేరుకున్న తర్వాత వారి పరిస్థితి తారుమారయ్యింది.
దుబాయిలో ఉద్యోగం చేయాలంటూ వారిని తీసుకెళ్లిన అరబ్ వ్యాపారి, తీరా అక్కడికి వెళ్లాక మాట మార్చారు. ఇక్కడ కాదు యెమెన్‌లో పని చేయాలని అక్కడికి తీసుకెళ్లారు. చాలా ఏళ్లుగా అంతర్యుద్ధంతో యెమెన్ అట్టుకుతున్న విషయం తెలిసిందే.
"మేము దుబాయి చేరుకోగానే, మీరు పని చేయాల్సింది ఇక్కడ కాదు, మనం ఇప్పుడు ఒమన్ వెళ్తున్నామని ఆ వ్యాపారి చెప్పారు. ఒమన్ అయినా పర్వాలేదని ఆయనతో పాటే వెళ్లాం. కానీ, అతడు మమ్మల్ని ఒమన్‌కు కాకుండా, యెమెన్‌కు తీసుకెళ్లాడు. ఏం జరుగుతోందో మాకేమీ అర్థం కాలేదు. ఎక్కడ అయితేనేం సరిగా డబ్బులు వస్తే చాలని అనుకున్నాం" అని వివేక్ వివరించారు.
అయితే, యెమెన్ తీరంలో పనిలో చేరాక ఆ అరబ్ వ్యాపారి ఒక షాకింగ్ విషయం చెప్పారు. మీరు చేపలు పడితే వచ్చే ఆదాయంలో మీకు సగం, నాకు సగం (50:50 ) అన్నారు.
అయినా తప్పని పరిస్థితిలో వాళ్లు చేపల వేట కొనసాగించారు. మొదట్లో ఆ వ్యాపారి డబ్బులు బాగానే ఇచ్చారు.

కానీ, ఓ నెల గడిచాక ఇక ఆ 50 శాతం డబ్బులు కూడా ఇచ్చేందుకు వ్యాపారి ఏజెంట్లు నిరాకరించారు. దాంతో, ఆందోళన చెందిన మత్స్యకారులకు ఇక స్వదేశం వెళ్లిపోవడమే మేలన్న ఆలోచన వచ్చింది. కానీ, ఎలా వెళ్లాలో వారికి తెలియదు.
యెమెన్ నుంచి కేరళలోని కోచికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
"మొదట్లో అంతా బాగానే అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత, మా వాటా డబ్బులు ఇవ్వడానికి ఏజెంట్ నిరాకరించారు. దాదాపు పది నెలల డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం అడిగితే, చాలా దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో వాళ్లు మన శ్రమను దోపిడీ చేస్తున్నారని మాకు అనుమానం వచ్చింది. డబ్బుల కోసం దాదాపు 25 రోజులు ఆందోళన చేశాం. మేము సమ్మె మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్లు మాకు అన్నం పెట్టడం మానేశారు. యెమెన్ నేవీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో, మాకు మరో మార్గం లేక మళ్లీ చేపల వేటకు వెళ్లాం" అని అల్బర్ట్ న్యూటన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా తప్పించుకున్నారు?
అక్కడి నుంచి ఎలా తప్పించుకునేందుకు ఎలా పథకం రచించారో మత్స్యకారుడు జగన్ వివరించారు.
"మేము విమానంలో తప్పించుకోలేం. మాకున్న ఏకైక మార్గం సముద్రమే. మాకు తెలిసిన మార్గం అదొక్కటే. దాంతో, ఎలా తప్పించుకుని పారిపోవాలో నాలుగు నెలలపాటు ప్రణాళికలు వేశాం. మేము చేపల వేటకు వెళ్లేందుకు వాడే బోటులో యజమాని డీజిల్ పోయించేవారు. మేము వేటకు వెళ్లిన ప్రతిసారీ కొంత డీజిల్ 'దొంగిలించి' దాచిపెట్టడం మొదలుపెట్టాం. అలా నాలుగు నెలల్లో దాదాపు 7,000 లీటర్ల డీజిల్ పొదుపు చేశాం" అని ఆయన వివరించారు.
2019 నవంబర్ 19న ఎప్పటి లాగే చేపల వేటకు వెళ్తున్నామని ఈ మత్స్యకారులు తమ ఏజెంట్‌కు చెప్పారు. రాత్రింబవళ్ళు వేట కొనసాగుతుంది కాబట్టి, వాళ్ళకు 10 రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆ ఏజెంట్ ఇచ్చారు.
ఆ డీజిల్, ఆహార పదార్థాలతోనే వీళ్లంతా భారత్‌కు ప్రయాణమయ్యారు. కానీ, ఆ ప్రయాణం అంత సులువుగా సాగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
"మేము ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రయాణమంతా చాలా కష్టంగా సాగింది. సరైన మార్గంలోనే వెళ్తున్నామా లేదా అని ఆందోళన చెందాం. ఒక సమయంలో మళ్లీ యెమెన్‌కు వెళ్లిపోదామా అన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ, తర్వాత ఏది ఏమైనా స్వదేశానికే వెళ్లాలని నిర్ణయించుకుని, ముందుకు ప్రయాణం సాగించాం" జగన్ చెప్పారు.
లక్షద్వీప్ సమీపంలోకి రాగానే వారి పడవలో ఇంధనం ఖాళీ అయిపోయింది. దాంతో, యెమెన్ నుంచి వెంట తెచ్చుకున్న శాటిలైట్ ఫోన్‌తో వాళ్లు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వాళ్లు లక్షద్వీప్‌కు 58 నాటికల్ మైళ్ల (107 కి.మీ) దూరంలో ఉన్నప్పుడు భారత తీర రక్షణ దళాలు వెళ్లి రక్షించి సురక్షితంగా కేరళలోని కోచికి తీసుకొచ్చింది.
యెమెన్‌లో అంతర్యుద్ధం జరుగుతోందన్న విషయం కూడా తమకు తెలియదని మత్స్యకారులు చెబుతున్నారు. "మేము ఎక్కువగా సముద్రం మధ్యలో ఉండేవాళ్లం. చేపలను తీరానికి చేర్చేందుకు, తరువాతి ట్రిప్‌కు అవసరమయ్యే ఇంధనం, ఆహార పదార్థాలు తీసుకెళ్లేందుకు మాత్రమే మధ్యమధ్యలో తీరం వద్దకు వస్తుండేవాళ్లం. కాబట్టి, మాకు యెమెన్‌లో యుద్ధం గురించి మాకు తెలియదు" అని జగన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ ఇదే పరిస్థితి
ఈ మత్స్యకారుల బృందంలో ఒకరైన అల్బర్ న్యూటన్ గతంలోనూ ఒకసారి దుబాయికి చేపల వేట కోసం వెళ్లినప్పుడు ఆయన్ను ఇరాన్ నేవీ అరెస్టు చేసింది.
"అప్పుడు దుబాయి నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారంటూ నన్ను ఇరాన్ నేవీ అరెస్టు చేసి నాలుగు నెలలు జైలులో పెట్టింది. ఆ జైలు నుంచి విడుదలయ్యాక, భారత్‌కు తిరిగొచ్చి కొన్నాళ్ల పాటు ఇంటి దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత 2018లో మళ్లీ వెళ్లి అరేబియా వ్యాపారి చేతుల్లో చిక్కుకుపోయాను. ఇప్పుడు మళ్లీ నా స్వదేశానికి తిరిగొచ్చాను" అని న్యూటన్ వివరించారు.
వెనిస్టన్ కూడా గతంలో ఇరాన్ నేవీకి పట్టుబడ్డారు.
భవిష్యత్తు ఏంటి?
తనకు చేపల వేట తప్పితే మరో పని తెలియదని అల్బర్ట్ న్యూటన్ అంటున్నారు.
భారత్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండగా, భారత మత్స్యకారులు విదేశాలకు ఎందుకు వెళ్ళాల్సి వస్తోంది? అని అడిగితే... "నేను ఏడేళ్లుగా మత్స్యకార వృత్తిలోనే ఉన్నాను. తమిళనాడు తీరంలో దొరికే చేపలకు మంచి ధర రావడంలేదు. ఇక్కడి తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి బాగా తగ్గిపోతోంది. కాబట్టి, బతుకుదెరువు కోసం మేము విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది'' అని వివేక్ చెప్పారు.

న్యాయం కావాలి
ఉపాధి కోసం వెళ్లి ఇలా కష్టాలు పడుతున్నవారు గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఉన్నారని ఈ మత్స్యకారుల బృందానికి, భారత కోస్ట్ గార్డ్‌కు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఫాదర్ చర్చిల్ అన్నారు.
"ఇప్పటికీ అనేక మంది గల్ఫ్‌ల చిక్కుకుపోయారు. వాళ్లు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించలేకపోతున్నారు, స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. మన మత్స్యకారుల జీవితాలకు భారత ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంబసీలు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలి" అని చర్చిల్ కోరుతున్నారు.
"మత్స్యకారులకు అరబ్ వ్యాపారులు ఉద్యోగం ఇవ్వాలంటే, అందుకు సంబంధించిన పత్రాలను భారత ఎంబసీలో సమర్పించాలి. ఆ పత్రాల కాపీని మత్స్యకారులకు ఇవ్వాలి. ఆ తర్వాత మత్స్యకారులను మోసం చేస్తే ఆ వ్యాపారుల మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చౌక స్మార్ట్ ఫోన్‌తో ‘చేపల వేట’
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- ఈ మహిళలు బతకడానికి.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెడతారు
- విశాఖలో సముద్రం అలల కింద సిరుల సాగు
- అంటార్కిటికా సముద్రం అడుగున రహస్యాలు ఇవే
- రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ
- రొమేనియా తీరంలో 14 వేల గొర్రెలతో ప్రయాణిస్తున్న భారీ నౌక మునక
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- LIVE: హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









