చౌక స్మార్ట్ ఫోన్‌తో ‘చేపల వేట’

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న సముద్ర మట్టాలు, అభివృద్ధి ప్రాజెక్టులు సముద్ర తీరాలను మింగేస్తుంటే, తమిళనాడు మత్స్యకారులు చవకైన టెక్నాలజీతో తమదైన పరిష్కారాలను వెదుక్కుంటున్నారు. ఈ అంశంపై మహిమా ఎ జైన్ అందిస్తున్న రిపోర్ట్.
చెన్నైకి చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాల మత్స్యకారులు ఇటీవల ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, చవకైన టెక్నాలజీతో తాము ఉండే ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు.
వీరు సేకరించిన వివరాలలో ఆటుపోట్లు, ఆపద హద్దులు మొదలైనవన్నీ ఉన్నాయి. వాటిని అధికారిక ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. వారు రూపొందించిన మ్యాప్‌లు కొన్ని ఇప్పటికే ప్రభుత్వ రికార్డులలో చోటు సంపాదించుకోగా, మరికొన్నిటికి ఆమోదం లభించాల్సి ఉంది.
''ప్రభుత్వం ఏ పనైతే చేయాలనుకుందో, ఆ పని మేమే చేస్తున్నాం. మత్స్యకారులు మనుగడ కొనసాగించడం కోసం అవసరమైన సాక్ష్యాలను శాస్త్రీయంగా సృష్టించుకుంటున్నాం'' అని 35 ఏళ్ల శరవణన్ తెలిపారు.
ఆయన చెన్నైలోని కోస్టల్ రిసోర్స్ సెంటర్‌లో కోఆర్డినేటర్. సీఆర్‌సీ ఆ ప్రాంతంలో మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.
''దేశంలోని తీర ప్రాంతంలో ఇలాంటి మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి వాళ్లం మేమే'' అని శరవణన్ తెలిపారు.
వివాదాస్పద ప్రాంతాలను మ్యాపింగ్ చేయడానికి శరవణన్ కొన్నిసార్లు ఇతరుల నుంచి అడిగి తెచ్చుకున్న మ్యాక్‌బుక్ ప్రో, స్మార్ట్‌ఫోన్‌తో తమిళనాడు ఉత్తర తీరప్రాంతమంతా బైక్‌పై పర్యటిస్తుంటారు.

ఫొటో సోర్స్, Mahima Jain
2010లో తమిళనాడు ప్రభుత్వం ఒక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించినపుడు, దానికి ప్రతిఘటనగా చెన్నై చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల మత్స్యకారులు మొదట ఈ మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ మ్యాపింగ్‌లో వారు అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రదేశాన్ని కూడా పొందుపరిచారు. ఆ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.
ఈ ప్రాంతంలోని తీర ప్రాంతాలు దశాబ్ద కాలంలో తీవ్రమైన తుపానులు, వరదలు, బీచ్‌లు కొట్టుకుపోవడం తదితర సమస్యలను ఎదుర్కొన్నాయి. ప్రాజెక్టుల కోసం చెరువులను, నదులను ఆక్రమించడం వల్లనే 2015లో చెన్నైలో తీవ్రమైన వరదలు వచ్చాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ నిర్ధారించింది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కోస్తా ప్రాంత నిర్వహణ ప్రణాళిక (సీజెడ్‌ఎంపీ)ని రూపొందించడంలో విఫలమైంది. తీరప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణకు, మత్స్యకారుల జీవనోపాధులను పరిరక్షించడానికి, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణకు అది చాలా కీలకం.
సీజెడ్‌ఎంపీ ఆలస్యం కావడంతో తమిళనాడు రక్షిత తీరప్రాంతాలలో అనేక అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.
''అందువల్ల మేము ఉపయోగించుకునే ఉమ్మడి స్థలాలను, మా గ్రామాలనన్నిటినీ మ్యాపింగ్ చేశాం. దీని వల్ల ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించలేదు, ప్రైవేట్ కంపెనీలు మా భూమిని ఆక్రమించలేవు'' అని కొరైకుప్పం గ్రామానికి చెందిన సురయ అనే మత్స్యకారుడు తెలిపారు.
''మడ అడవులు, బురదనేలలు, బీచులు పోతే ఎక్కువగా నష్టపోయేది మత్స్యకారులే'' అని శరవణన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Mahima Jain
2050 నాటికి సముద్రమట్టం ఒక మీటరు ఎత్తు పెరిగితే అది తమిళనాడులోని మూడు జిల్లాలకు చెందిన లక్ష మందికి పైగా జాలర్లపై ప్రభావం చూపుతుందని 2017లో 'ఇండో-జర్మన్ సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ' నివేదిక పేర్కొంది.
అలా మునిగిపోయే వాటిలో సీఆర్‌సీ మ్యాపింగ్ చేసిన అనేక గ్రామాలు ఉన్నాయి.
కొరైకుప్పం అలాంటి గ్రామాలలో ఒకటి. తమిళనాడు ప్రభుత్వం వాళ్లకు వేరేచోట పునరావాసం కల్పిస్తామని తెలిపింది. కానీ సురయ మాత్రం దాని వల్ల తాము చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లడం కష్టమవుతుందని, చాలా సమయం వృధా అయిపోతుందని అన్నారు.
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన సురయను గ్రామస్తులు మ్యాపింగ్ పని కోసం నియమించుకున్నారు. శరవణన్‌తో పాటు సురయ ఇతర గ్రామస్తులతో కలిసి ఆ మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
గ్రామ కౌన్సిల్, స్థానిక అధికారులతో సమావేశాల ఆధారంగా, ఓపెన్ సోర్స్ జియోగ్రఫిక్ డాటా సహాయంతో శరవణన్ సవివరమైన మ్యాప్‌లను తయారు చేశారు.
తమ మ్యాపులు ప్రభుత్వం, ప్రైవేట్ డెవలపర్లు రూపొందించే మ్యాపులతో సరి తూగుతాయని తమిళనాడు మత్స్యకారుల సంఘం చైర్మన్ దురైమహేందర్ తెలిపారు.
''ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మేం కూడా సముద్రం లోపలికి వెళ్లినపుడు జీపీఎస్‌ను ఉపయోగిస్తాం. అందువల్ల ఈ మ్యాపులు మా పోరాటంలో ఒక భాగంగా మారాయి'' అని తెలిపారు.
ప్రభుత్వానికి ఈ మ్యాపులు కొన్నిగీతలు మాత్రమే కానీ, అవి మా జీవితం అని దక్షిణ భారతదేశపు మత్స్యకారుల సంక్షేమ సంఘం అధినేత కె.భారతి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ఎంత పోరాటం చేస్తున్నా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ప్రైవేట్ పరిశ్రమలు తీరప్రాంతం వెంట ఉన్న మత్స్యకార గ్రామాలను, వారి ఉమ్మడి స్థలాలను ఆక్రమించేసుకుంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మ్యాపులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇటీవలే కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ అన్న ప్రభుత్వ సంస్థ బురదనేలలు, ఉప్పు నేలలను పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చూసినపుడు సీఆర్‌సీ, గ్రామస్తులు కలిసి అడ్డుకున్నారు.
ఇలాంటి మ్యాపులు నగరాల సుందరీకరణ ప్లాన్లు, రోడ్డు విస్తరణ పనులు, ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల వివాదాలలో కూడా ఉపయోగపడుతున్నాయి.
ఎవరైనా గ్రామస్తులకు తమ భూమికి అభివృద్ధి ప్రాజెక్టుల నుంచి ముప్పు ఉందని తెలిసినపుడు వెంటనే వాళ్లు ఇలాంటి మ్యాపింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని శరవణన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళలు ప్రభంజనం సృష్టిస్తారా?
- అణునిరాయుధీకరణ చర్చలకు ఉత్తరకొరియా వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు
- ఆపరేషన్ పోలో: హైదరాబాద్ 'పోలీసు చర్య'లో చీకటి కోణం
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు...’’
- మిర్యాలగూడలో 'పరువు' హత్య: ‘మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








