ఉభయ కొరియా దేశాల చర్చలు: అణు నిరాయుధీకరణ చర్చల కోసం కిమ్‌ను కలుసుకున్న మూన్ జే ఇన్

దక్షిణ, ఉత్తర కొరియా అధ్యక్షులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణ, ఉత్తర కొరియా అధ్యక్షులు

ఎటూ తేలకుండా నిలిచిపోయిన అణు నిరాయుధీకరణ సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఉత్తర, దక్షిణ కొరియా దేశాధినేతలు సమావేశమవుతున్నారు.

మునుపెన్నడూ లేనట్లుగా ఈ ఏడాది ఉత్తర కొరియా అటు అమెరికా, ఇటు దక్షిణ కొరియా నాయకత్వంతో భేటీ అవుతోంది.

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు చర్చలు జరిపి అణు నిరాయుధీకరణ అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ దిశగా విస్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోలేదు.

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య దక్షిణకొరియా మధ్యవర్తిత్వం వహిస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, ఆయన భార్య కిమ్ జింగ్ సుక్‌లు తమ మూడు రోజుల పర్యటన కోసం ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు మంగళవారం ఉదయం చేరుకున్నారు.

విమానం దిగగానే వారికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ దంపతులు సాదర స్వాగతం పలికారు.

గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా నేత ఒకరు ఇలా ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూన్, కిమ్‌లు తొలిసారి భేటీ అయిన తరువాత వారిద్దరూ మళ్లీ కలుసుకోవడం ఇది మూడోసారి.

ఉభయ కొరియాల అధ్యక్ష దంపతుల పలకరింపులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉభయ కొరియాల అధ్యక్ష దంపతుల పలకరింపులు

అజెండాలో ఏముంది?

కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చేందుకు చేపట్టాల్సిన ఆచరణ సాధ్యమైన చర్యలపై వారిద్దరూ చర్చిస్తారు.

దక్షిణకొరియాకు ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం.. అలాగే, అణు నిరాయుధీకరణ విషయంలో వాషింగ్టన్, ప్యాంగ్యాంగ్‌ల మధ్య రాయబారం చేయడం.

ఏప్రిల్‌లో వీరిద్దరూ కలుసుకున్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు పెంపొందించుకోవడం, అణు ముప్పు నివారించడంపై సంయుక్త ప్రకటన చేశారు.

ఆ తరువాత నుంచి కొరియా విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు... రెండు దేశాల మధ్య 24/7 కమ్యూనికేషన్లకు వీలుగా సరిహద్దులో ఒక లైజన్ ఆఫీసర్‌ను కూడా నియమించారు.

ఇప్పుడు జరగనున్న సమావేశంలో మరింత ముందడుగు వేసి ఆర్థిక సంబంధాలనూ పెంచుకోవడం రెండు దేశాల ప్రధానోద్దేశంగా తెలుస్తోంది. సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ఉన్న సైనిక మోహరింపును తగ్గించడం కూడా ఈ సమావేశంలో చర్చకు రావొచ్చు.

జూన్‌లో జరిగిన భేటీ సందర్భంగా ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, kevin lim/The Straits Times/Handout

ఫొటో క్యాప్షన్, జూన్‌లో జరిగిన భేటీ సందర్భంగా ట్రంప్, కిమ్

ఈ భేటీ అమెరికా-ఉత్తరకొరియాల మధ్య చర్చలకు తోడ్పడుతుందా?

ఉత్తరకొరియా అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ కొరియా ఆ దేశంతో కొత్త ఆర్థిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది. ప్యాంగ్యాంగ్, వాషింగ్టన్ చర్చల్లో వచ్చే పురోగతిని అనుసరించి ఇది ఉండొచ్చు.

డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు జూన్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే ఒప్పందం కుదిరినా దానికి స్పష్టమైన కాల పరిమితి ఏమీ నిర్దేశించుకోలేదు.

ఆ తరువాత కిమ్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అంతర్జాతీయ పరిశీలకులూ చెబుతున్నారు.

మరోవైపు అమెరికా కూడా తొలుత నిరాయుధీకరణ చేస్తే ఆ తరువాత ఆంక్షల ఎత్తివేత ఉంటుందని చెబుతోంది.

ఉత్తరకొరియా మాత్రం ఈ ప్రక్రియ దశలవారీగా జరగాలని కోరుకుంటోంది.

కాగా... ఇటీవల మరోసారి భేటీ కోసం ఉత్తరకొరియా ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది.

డోనల్డ్ ట్రంప్ తొలి విడత పాలనాకాలంలోనే అణు నిరాయుధీకరణ పూర్తిచేయాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా రాయబారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)