కిమ్ జోంగ్ ఉన్ ఎవరు? ఉత్తర కొరియా పాలకుడు ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, Reuters
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన ఏప్రిల్ 15న తన తాత కిమ్ ఇల్ సుంగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు. ఏప్రిల్ 25న జరిగిన ఉత్తర కొరియా సైనిక స్థాపన దినోత్సవానికి కూడా హాజరు కాలేదు. దీంతో, కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇంతకీ ఎవరీ కిమ్ జోంగ్ ఉన్? ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా? ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. కిమ్ 2011లో ఉత్తర కొరియా పాలకుడు కావడం కూడా ఓ సంచలనమే. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో ఆయన పాలకుడయ్యారు.
ఉత్తర కొరియా మాజీ పాలకుడు, "ప్రియమైన నాయకుడు" కిమ్ జోంగ్ ఇల్ 2011 డిసెంబరు 17వ తేదీన మరణించారు. అప్పటికే తన చిన్నకొడుకైన కిమ్ జోంగ్ ఉన్‌ను తన వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు.
తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా నియమితులైన యువ కిమ్ తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందారు.
అప్పట్నుంచి ఆయన ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంపై ఆసక్తి ప్రదర్శించారు. ఎన్నో అణ్వాయుధాలు, క్షిపణుల పరీక్షలకు ఆదేశాలిచ్చారు. అమెరికాతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
శక్తిమంతుడైన తన మేనమామను ఉరితీయడం, తన సవతి సోదరుడి హత్య (ఈ హత్యకు ఆదేశాలిచ్చింది కిమ్ అని ప్రచారం)తో తనను తాను కరుడుగట్టిన వ్యక్తిలాగా చిత్రీకరించుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
కిమ్ జోంగ్ ఇల్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్ జోంగ్ ఉన్. ఇల్ మూడో భార్య కో యోంగ్ హుయికి కిమ్ 1983 లేదా 1984 లో జన్మించారు.
తండ్రికి వారసుడిగా కిమ్ ఎదుగుతారని మొదట్లో ఎవరూ అనుకోలేదు.
అందరూ అతడి సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్, లేదా సొంత అన్న కిమ్ జోంగ్ చోల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వారసుడు అవుతారని విశ్లేషకులు అనుకున్నారు.
అయితే, కిమ్ జోంగ్ నామ్‌ను 2001 మేలో జపాన్ దేశం నుంచి బహిష్కరించడం, కింమ్ జోంగ్ చోల్‌కు ''మగతనం లేకపోవడం'' వంటి కారణాల వల్ల కిమ్‌కు అవకాశాలు మెరుగయ్యాయి.
వరుసగా అత్యున్నత స్థాయి రాజకీయ పదవులను అందుకుంటూ వస్తున్న కిమ్ తదుపరి వారసుడవుతారని విశ్లేషకులు భావించారు.

ఫొటో సోర్స్, AFP
తన అన్నల్లాగే స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కింగ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ పాశ్చాత్య ప్రభావాలకు లొంగలేదు.
స్కూల్ లేకపోతే ఇంటికి వచ్చేసేవారు. ఉత్తర కొరియా రాయబారితో కలిసి భోజనం చేసేవారు.
అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ II సంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరారని అంటారు.
కిమ్ జోంగ్ ఉన్ తల్లి కో యోంగ్ హుయి, కిమ్ జోంగ్ ఇల్‌కి ప్రియమైన భార్య. ఆమె తన చిన్న కుమారుడిని ''మార్నింగ్ స్టార్ కింగ్'' అని పిలిచేవారు.
2010 ఆగస్టులో కిమ్ జోంగ్ ఇల్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు, ఆయన వెంట కిమ్ జోంగ్ ఉన్ కూడా ఉన్నారని ఒక నివేదిక తెలిపింది. అప్పటికే చాలామంది తండ్రికి వారసుడు ఉన్ అని భావిస్తున్నారు. కిమ్ జోంగ్ ఇల్ మరణించినప్పుడు, అవన్నీ నిజమేనని తేలింది.

ఫొటో సోర్స్, KCNA

ఫొటో సోర్స్, KCNA
మొదటి బహిరంగ ప్రసంగం
ఉత్తర కొరియా తన వ్యవస్థాపకుడు కిమ్ II సంగ్ 100వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా 15 ఏప్రిల్ 2012న కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి బహిరంగ ప్రసంగం చేశారు.
"మిలిటరీ ఫస్ట్" అనే సిద్ధాంతాన్ని పొగిడారు. తన దేశం బెదిరింపులకు గురికావడం అనేది ''ఇక ఎప్పటికీ జరగదు'' అన్న సమయాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
ఆయన నాయకత్వంలో ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలు మరింతగా ముందుకెళ్లాయి. చాలా ప్రభావవంతమైన ఫలితాలు సాధించినట్లు కనిపించాయి. మరో నాలుగు అణు పరీక్షలు జరిగాయి. వీటితో కలిపి ఉత్తర కొరియాలో జరిగిన మొత్తం అణు పరీక్షల సంఖ్య ఆరుకు చేరింది.
సూక్ష్మీకరించిన ఒక హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ బాంబును దీర్ఘశ్రేణి క్షిపణుల్లో కూడా పెట్టొచ్చని తెలిపింది. అయితే నిపుణులు మాత్రం కిమ్ జోంగ్ ఉన్ కార్యక్రమం పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఉత్తర కొరియా క్షిపణులు చేరగల దూరం కూడా పెరిగినట్లు కనిపించింది. 2017లో కిమ్ పరిపాలనలో పలు క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అమెరికాను కూడా చేరుకోగల ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో డోనల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను పెంచింది.
ట్రంప్, కిమ్ మధ్య శతృత్వం తారా స్థాయికి చేరుకుంది. ఇరువురూ ఆవేశపూరితంగా మాటల యుద్ధానికి దిగారు.
''ఆత్మాహుతి మిషన్‌పైనున్న రాకెట్ మనిషి'' అని కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. దీంతో ట్రంప్‌ను ''మతి చలించిన అమెరికా ముసలోడు'' అని కిమ్ వర్ణించారు.

ఫొటో సోర్స్, EPA
అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా, కిమ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో దక్షిణ కొరియాకు స్నేహ హస్తం అందించారు. తాను ''చర్చలు మొదలు పెట్టేందుకు'' సిద్ధంగా ఉన్నానని, దక్షిణ కొరియాలో 2018 శీతాకాల ఒలంపిక్స్‌కు తమ జట్టును పంపిస్తానని అన్నారు.
అక్కడి నుంచి రాయబార కార్యకలాపాలు వాయువేగంతో జరిగిపోయాయి.
ఉభయ కొరియాలూ ఒకే జెండాతో ఒలంపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఇరు దేశాల మధ్యా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి.
కిమ్ రైలులో చైనా రాజధాని బీజింగ్ కూడా వెళ్లారు. ఉత్తర కొరియా పాలకుడిగా ఆయన అందరికీ తెలిసేలా చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఉత్తర కొరియాకు ప్రధాన మిత్రపక్షంగా, వ్యాపార భాగస్వామిగా చైనా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కూడా సంబంధాలను మెరుగుపర్చుకోవాలని కిమ్ భావించారు. దీంతో 2018 ఏప్రిల్ నెలలో ఇరువురు నాయకుల మధ్య సింగపూర్‌లో చారిత్మాత్మక ముఖాముఖి చర్చలు జరిగాయి. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు చోటుచేసుకున్నాయి.
తాన అన్ని రకాల క్షిపణి ప్రయోగాలనూ రద్దు చేస్తున్నానని కిమ్ ప్రకటించారు. అలాగే, తన దేశం ''అణ్వాయుధాలను'' సాధించుకున్నందున అణు పరీక్షల కేంద్రాన్ని కూడా మూసేస్తానని చెప్పారు.
ఈ నిలువరింపును అంతర్జాతీయ సమాజం స్వాగతించింది. అయితే, ఉత్తర కొరియా తన వద్ద ఉన్న ఆయుధాలను వదిలేస్తానని హామీ ఇవ్వలేదన్న సంగతిని పరిశీలకులు గుర్తు చేశారు. అలాగే, అంతకు ముందు కూడా ఎన్నోసార్లు అణ్వాయుధాల అభివృద్ధిని ఆపేస్తానంటూ బూటకపు హామీలు ఇవ్వటాన్ని కూడా ఎత్తి చూపారు.
రెండేళ్ల తర్వాత ట్రంప్, కిమ్ ఇద్దరూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కలసి.. ముందస్తు ప్రణాళికలు లేని, లాంఛనప్రాయమైన ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలను వేరు చేసే నిస్సైనిక ప్రాంతం (డీఎంజెడ్)లో ఈ భేటీ జరిగింది.
అయితే, తర్వాతి కాలంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్యాంగ్యాంగ్ పూర్తిగా తన అణ్వాయుధ కార్యక్రమాలను వదులుకుంటే తప్ప ఆంక్షలను తొలగించేది లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్చలు కూడా నిలిచిపోయాయి.
అమెరికాతో చర్చల సందర్భంగా ప్రారంభమైన అణు, దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్షల నిలిపివేతను రద్దు చేస్తున్నట్లు 2020 జనవరిలో కిమ్ ప్రకటించారు. ''ప్రపంచం ఒక సరికొత్త వ్యూహాత్మక ఆయుధాన్ని చూస్తుంది'' అని బెదిరించారు.

ఫొటో సోర్స్, AFP
కిమ్ కుటుంబం
కిమ్ తరచుగా తన రక్షణ శాఖ మంత్రులను మారుస్తుంటారు. 2011 నుంచి ఇప్పటి వరకూ కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ పదవిలో ఉన్నారు. సైన్యం విధేయత పట్ల కిమ్‌కు విశ్వాసం లేదనేందుకు ఇదే సంకేతమని విశ్లేషకులు భావిస్తుంటారు.
కిమ్ జోంగ్ ఉన్ తన మామ చాంగ్ సాంగ్ థేక్‌ను ఉరితీయాలని 2013 డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉత్తర కొరియా అత్యున్నత వర్గంలో అంతర్గత అధికార పోరాటానికి అదే పెద్ద సంకేతం. ఆయన కిమ్ అధికారాన్ని కూలదోయడానికి కుట్రపన్నారని ప్రభుత్వ మీడియా చెప్పింది.
ప్రవాసంలో ఉన్న తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్‌ను హత్య చేయాలని కిమ్ ఆదేశాలిచ్చారని అంతా అనుకుంటుంటారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2017 ఫిబ్రవరిలో నామ్ హత్యకు గురయ్యారు.
కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు.
ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు.
2012 జూలైలో ప్రభుత్వ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్లి చేసుకున్నారని ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP
ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి కూడా ఎలాంటి వివరాలు బయటపడలేదు. చివరికి ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఆధారంగా ఆమె ఎగువ తరగతి కుటుంబానికి చెందిన మహిళగా విశ్లేషకులు అంచనా వేశారు.
రి సోల్ జు ఒక గాయకురాలని, ఓ ప్రదర్శనలో కిమ్ జోంగ్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారని అంటారు.
కిమ్ జోంగ్, రి సోల్ పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు ఎవరికీ తెలియవు.
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని బట్టి, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ఉన్నతస్థాయి పదవిలో ఉన్నారు. శీతాకాల ఒలంపిక్స్ సందర్భంగా తన సోదరుడితో కలసి దక్షిణ కొరియాకు వచ్చినప్పుడు ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.
కాగా, కిమ్ జోంగ్ ఉన్న అన్న కిమ్ జోంగ్ చోల్ ఏదైనా అధికారిక పదవిలో ఉన్నారా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- కొరియా సంభాషణలు: ఎలా జరుగుతాయి? ఏం చర్చిస్తారు?
- కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఎందుకీ వదంతులు... 'బ్రెయిన్ డెడ్' వార్త నిజమేనా?
- ఉత్తర కొరియా: కిమ్ జాంగ్ ఉన్ మేనత్త బతికే ఉన్నారు... ఆరేళ్ళ ఊహాగానాలకు తెర
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- కిమ్‌కు ఇచ్చే విందులో ఈ పదార్థంపై జపాన్‌కు అభ్యంతరమెందుకు?
- ఉత్తరకొరియాకు ప్రపంచ దేశాల మద్దతు అవసరం: రష్యా అధ్యక్షుడు పుతిన్
- డీఎంజెడ్ వద్ద చరిత్రాత్మక భేటీ.. వైట్‌హౌస్‌కు రావాలని కిమ్‌ను ఆహ్వానించిన ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









