‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’

ఫొటో సోర్స్, JIGAR BARASARA/BBC
- రచయిత, దీపల్ కుమార్ షా
- హోదా, బీబీసీ కోసం
గుజరాత్ అంటే అభివృద్ధికి మారు పేరని కొందరు చెబుతారు. ఉత్తర కొరియా చాలా వెనుకబడిన దేశమని చాలా మంది అభిప్రాయం. ఒకప్పుడు జిగర్ బరాసరా కూడా అలాగే అనుకున్నారు.
కానీ ఆ దేశానికి వెళ్లాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని అంటున్నారాయన. గుజరాత్‌కి చెందిన జిగర్ ఈ మధ్యే ఉత్తర కొరియా వెళ్లొచ్చారు. ఆ అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.
జిగర్‌కి పర్యటనలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన 68 దేశాలను చుట్టేశారు. అందులో ఉత్తర కొరియా కూడా ఒకటి.
నిత్యం వార్తల్లో ఉండే ఆ దేశానికి వెళ్లడం చాలా భిన్నమైన అనుభవం అంటారాయన. ఇతర దేశాలకు వెళ్లాలంటే వీసా సరిపోతుంది. కానీ ఉత్తర కొరియా వెళ్లాలంటే కాస్త ధైర్యం కూడా కావాలన్నది ఆయన మాట.
‘‘ఓసారి దక్షిణ కొరియాకు వెళ్లినప్పుడు, ‘ధైర్యముంటే ఉత్తర కొరియాకు వెళ్లు’ అని నా స్నేహితుడు అన్నాడు. నేను దాన్ని సవాలుగా తీసుకొని ఎలాగైనా వెళ్లాలని నిశ్చయించుకున్నా. ఉత్తర కొరియాకి వీసా పొందడం చాలా కష్టం. చైనాలోని ఓ ఏజెన్సీ సాయంతో అతి కష్టమ్మీద నేను దాన్ని సంపాదించా. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పుడు ఓ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది’’ అంటారు జిగర్.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడే జిగర్, ఒక్కరే ఉత్తర కొరియాకు వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్‌కి అక్కడి ప్రజలు భయపడతారనీ, బయటి వ్యక్తులతో వాళ్లు అంత త్వరగా మాట్లాడరనీ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే జిగర్‌కి అర్థమైంది. అందుకే రానున్న రోజులు ఎలా గడుస్తాయోనని మొదట్లో భయపడినట్లు ఆయన చెప్పారు.
‘‘ఉత్తర కొరియాలో అడుగుపెట్టగానే మొబైల్, ఇంటర్నెట్ వినియోగానికి దూరమవ్వాల్సిందే. అంటే ఓ రకంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రోడ్ల మీద కేవలం ప్రభుత్వ వాహనాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే ప్రయాణించాలి. కావాలంటే సైకిల్‌పైన తిరగొచ్చు’’ అంటారు జిగర్.
అక్కడ దుకాణాలు కూడా చాలా వరకూ ప్రభుత్వానికి చెందినవే. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రోడ్లపైన ఫొటోలు తీసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సీక్రెట్ కెమెరాతో ఏవైనా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే ప్రమాదంలో చిక్కుకోక తప్పదు.

ఫొటో సోర్స్, JIGAR BARASARA/BBC
రోడ్ల మీద నడిచేప్పుడు ఎక్కడైనా కిమ్ జోంగ్ విగ్రహాలు కనిపిస్తే తల వంచి నమస్కరించడం తప్పనిసరి. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా తొలి ఆశీర్వాదం దేశానికి చెందిన కొందరు ప్రముఖ నేతల విగ్రహాల నుంచే తీసుకోవాలి.
బయటి వాళ్లు అక్కడి ప్రజలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ విధానాలూ, పథకాల గురించి వాళ్లతో మాట్లాడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.
బయటి దేశాలతో అక్కడి వారికి సంబంధాలు తక్కువ. సాధారణంగా అక్కడివాళ్లు వేరే దేశాలకు వెళ్లరు. విదేశీయులు కూడా అక్కడికి రారు. చాలా కొద్దిమంది మాత్రమే రిస్కు తీసుకొని, ధైర్యం చేసి ఉ.కొరియాలో అడుగుపెడతారు.
ఉత్తర కొరియాలో కొద్దిమందికి భారత్ గురించి కూడా తెలుసంటారు జిగర్. ‘‘ఓసారి నేను షాపింగ్‌కి వెళ్తే ఓ మహిళ నన్ను పలకరించారు. నేనెక్కడనుంచి వచ్చానని అడిగారు. భారత్ నుంచి వచ్చానని చెప్పగానే ‘వావ్’ అన్నారు.
ఏటా అక్కడ జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయు సినిమాల్నీ ప్రదర్శిస్తారట. ఆవిడ కొందరు బాలీవుడ్ నటుల పేర్లు చెప్పి, వాళ్లంటే తనకు ఇష్టమని అన్నారు’’ అంటూ జిగర్ తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, JIGAR BARASARA/BBC
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో రోడ్లూ, పరిసరాలూ చాలా శుభ్రంగా ఉంటాయి. ప్రభుత్వం పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యమిస్తుంది. ప్రజలకు నీళ్లూ, విద్యుత్ సదుపాయం పూర్తిగా ఉచితం. ఇలాంటి కొన్ని అంశాల కారణంగా అది బాగా అభివృద్ధి చెందిన నగరంలా కనిపిస్తుంది.
ఉత్తర కొరియాతో పాటు మరో 67 దేశాల్లో పర్యటించిన జిగర్ గతంలో ఓసారి ఇథియోపియాలో వెళ్లినప్పుడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయమేస్తుందంటారు. ‘అక్కడ ఓరోజు యాంటీ డ్రగ్స్ స్క్వాడ్‌కి చెందిన ఓ పది మంది నా దగ్గరికొచ్చారు. ఓ గదిలోకి తీసుకెళ్లి నన్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తరవాత నన్ను మల విసర్జనకు వెళ్లమనీ, దాన్ని కూడా పరీక్షించాలనీ చెప్పారు. నాకు ఎదురైన అత్యంత జుగుప్సాకర అనుభవం అది’ అంటారు జిగర్.

ఫొటో సోర్స్, JIGAR BARASARA/BBC
ఓసారి ఇండోనేసియాకు వెళ్లాకే తనకు పర్యటనలపైన ఆసక్తి పెరిగిందనీ, తల్లిదండ్రులకు అది పెద్దగా ఇష్టం లేకపోయినా ఎలాగోలా ఒప్పించి ఇప్పటిదాకా 68 దేశాలను చుట్టేశాననీ చెబుతారు జిగర్. ఏ దేశానికి అది చాలా ప్రత్యేకమనీ, కానీ అన్నిటికంటే ఇండోనేసియా తనకు బాగా నచ్చిందనీ ఆయన అంటారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- కొరియా: ఉత్తరం, దక్షిణం దగ్గరవుతున్నాయా?
- ఉత్తర కొరియా యుద్ధానికి దిగితే ఏం జరగొచ్చు?
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











