ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు గడాఫీ గతే పడుతుందా?

కిమ్ జోంగ్ ఉన్‌, అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

అణుభూతం ఈనాటిది కాదు. దీనికి చాలా చరిత్రే ఉంది. 1945లో జపాన్‌పై అణుబాంబుల ప్రయోగం నాటి నుంచి, అణ్వాయుధాలపై చర్చ తీవ్రతరమైంది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని కాదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఈయనకూ గడాఫీ గతే పడుతుందా? అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ) క్రింద కేవలం 5 దేశాలు - అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణ్వాయుధాలను కలిగి ఉండవచ్చు.

ఈ అయిదు దేశాలు తప్ప ఇతర దేశాలు అణ్వాయుధాలు తయారు చేయకుండా చూడడం ఈ ఒప్పందం లక్ష్యం.

అంతర్జాతీయ అణు శక్తి కమిషన్ అణుపదార్థాల ఎగుమతిని నియంత్రిస్తుంది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించేలా చూస్తుంది.

కొన్ని దేశాలు ఎన్‌పీటీలో చేరడానికి నిరాకరించాయి. అందువల్ల ఏదో విధంగా అణ్వాయుధాలను తయారు చేయాలనుకునే దేశాలను ఎన్‌పీటీ నియంత్రించలేకపోయింది.

ఉత్తర కొరియా కూడా మొదట ఎన్‌పీటీలో చేరినా, తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసింది. మరోవైపు అణ్వాయుధ పోటీ కారణంగా అనేక దేశాలు ఎన్‌పీటీని నిర్లక్ష్యం చేశాయి.

అణుపరీక్ష, ఎన్‌పీటీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారతదేశ అణుపరీక్ష

భారతదేశం

ఎన్‌పీటీపై సంతకాలు చేయడానికి భారతదేశం కూడా నిరాకరించింది.

స్వాతంత్ర్యానంతరం భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ వేదికలపై అణ్వాయుధ వ్యాప్తిని వ్యతిరేకించారు.

కానీ శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తిని ఉపయోగించుకోవడాన్ని భారతదేశం సమర్థించుకుంటోంది.

1965లో పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం భారతదేశం తన భద్రత గురించి ఆందోళన చెందడం ప్రారంభించింది.

దీంతో అణుబాంబును తయారుచేసే ప్రయత్నాల్లో భాగంగా, 1974లో మొదటిసారిగా అణుపరీక్షలు నిర్వహించింది.

ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా భారత్ తన అణు కార్యక్రమాలను కొనసాగించలేదు.

2006లో భారత్ అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం, అంతర్జాతీయ అణు కమిషన్ తనిఖీలకు ఒప్పుకున్నా, ఎన్‌పీటీలో మాత్రం చేరలేదు.

పాకిస్తాన్, అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ వద్ద సుమారు 100కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా

పాకిస్తాన్

పాకిస్తాన్ తన అణు కార్యక్రమాల కోసం అమెరికా మీద ఎక్కువగా ఆధారపడుతోంది.

1950 నుంచి అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య బంధం బలోపేతం కావడం ప్రారంభమైంది.

తదనంతర కాలంలో భారత్-పాక్ యుద్ధం, అమెరికాతో సంబంధాలు బెడిసికొట్టిన కారణంగా, పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించింది.

పాకిస్తాన్ చర్యలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే 1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడంతో పాకిస్తాన్ ప్రాముఖ్యం పెరిగి, పరిస్థితిలో మార్పు వచ్చింది.

పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షించనంత వరకు అమెరికా ఆ దేశ అణు కార్యక్రమాల్లో జోక్యం చేసుకోదు. దీని వల్ల పాకిస్తాన్ అణు కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.

అణుక్షిపణి, ఎన్‌పీటీ

ఫొటో సోర్స్, Pakistan Ministry of Defense/Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ అణుక్షిపణి

ప్రచ్ఛన్నయుద్ధం ముగియడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం తదనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికా మరోసారి పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చినా, అప్పటికే అణ్వాయుధాల విషయంలో ఆ దేశం చాలా పురోగమించింది. పాకిస్తాన్ వద్ద వందకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా.

ఉత్తర కొరియా అణు కార్యక్రమాల అభివృద్ధికీ ఒక రకంగా పాకిస్తానే కారణం. పాకిస్తాన్ అణ్వాయుధ పితామహుడిగా భావించే డాక్టర్ ఖదీర్ ఖాన్ - ఉత్తరకొరియా, ఇరాన్, లిబియాలకు యురేనియంను శుద్ధిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయించారు.

ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా

అణుశక్తిగా ఇజ్రాయెల్ పరిస్థితి చాలా విచిత్రమైనది.

అన్ని దేశాలూ ఇజ్రాయెల్‌ను అణ్వాయుధ దేశంగా చూసినా, ఆ దేశం మాత్రం తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఎన్నడూ ప్రకటించలేదు.

ఆ దేశానికి ఎన్‌పీటీలో సభ్యత్వం కూడా లేదు.

అన్ని వైపులా అరబ్ దేశాలున్న ఇజ్రాయెల్, 1950ల మధ్యభాగంలో ఫ్రాన్స్ సహకారంతో అణు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇజ్రాయిల్, అణ్వాయుధాలు, ఎన్‌పీటీ

ఫొటో సోర్స్, JACK GUEZ/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ అణు రియాక్టర్

ఇజ్రాయెల్ బలమైన అణు వ్యతిరేక దేశం కూడా. 1981లో ఆ దేశం ఇరాకీ అణు రియాక్టర్లను, 2007లో సిరియా రియాక్టర్లను ధ్వంసం చేసింది.

ఇక - మొదట అణ్వాయుధాలు తయారు చేసి, ఆ తర్వాత వాటిని ధ్వంసం చేసిన ఒకే ఒక్క దేశం దక్షిణాఫ్రికా.

వాస్తవానికి ఆ దేశంలో విస్తారమైన యురేనియం వనరులున్నాయి. ఇజ్రాయెల్ సహకారంతో ఆ దేశం చాలా వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుందని భావిస్తున్నారు.

1979లో అమెరికా ఉపగ్రహాలకు దక్షిణాఫ్రికాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌లో అణు కార్యక్రమాలకు సంబంధించినవిగా భావించే చిత్రాలు కొన్ని లభించినా, దానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు.

1993లో దక్షిణాఫ్రికా తనకై తానుగా మొత్తం అణ్వాయుధాలను నాశనం చేసింది. 1994లో అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ కూడా దానిని నిర్ధరించింది.

లిబియా

ఉత్తరకొరియా తరహాలోనే లిబియా కూడా రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి ప్రయత్నించింది.

అయితే అంతర్జాతీయ ఒత్తిడితో 2003లో ఏకమొత్తంగా వాటిని నాశనం చేయడానికి, అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ తనిఖీలకు అంగీకరించింది.

2011లో లిబియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. లిబియా నియంత కల్నల్ గడాఫీ ఆ నిరసనలను అణచివేయడంతో, అక్కడ అంతర్యుద్ధం మొదలైంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం మేరకు నాటో బలగాలు లిబియాపై దాడులు ప్రారంభించాయి.

కిమ్ జోంగ్ ఉన్‌, గడాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు ప్రజలను భయభ్రాంతులను చేసిన నియంత, ప్రాణాలు కాపాడుకోవడానికి నీళ్ల పైపుల్లో దాక్కున్నాడు. అయినా గడాఫీకి మరణశిక్ష తప్పలేదు.

ఉత్తర కొరియాకు లిబియా ఒక మంచి పాఠం కాగలదు. కూక్‌మిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆంద్రె లెంకోవ్ ఒక ఇంటర్వ్యూలో "లిబియా అణ్వాయుధాలు త్యజించినందుకు పాశ్చాత్య దేశాలు పలు బహుమానాలు ఇచ్చాయి. కానీ గడాఫీ పాలనలో అక్కడ ప్రజాస్వామ్యం పునాదులు కదిలిపోయాయి. ఉత్తర కొరియా ఈ గుణపాఠాన్ని గుర్తుంచుకోవాలి" అని సూచించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)