మరిన్ని దేశాలపై ప్రయాణ నిషేధాజ్ఞలు విధించిన ట్రంప్ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణ నిషేధాజ్ఞలను ట్రంప్ ప్రభుత్వం పొడిగించింది. తాజాగా ఈ జాబితాలో ఉత్తర కొరియా, వెనిజులా దేశాలతో పాటు ఆఫ్రికా ఖండంలోని చాడ్ దేశాన్ని కూడా చేర్చింది.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
"అమెరికాను సురక్షిత దేశంగా మార్చడమే నా మొదటి ప్రాధాన్యత " అని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.
అయితే, వెనిజులా వాసులపై ప్రయాణ నిషేధం కేవలం ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబ సభ్యులకే పరిమితం కానుంది.
తాజా ప్రకటనతో ప్రయాణ నిషేధాజ్ఞలు విధించిన దేశాల సంఖ్య 8కి చేరింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్, లిబియా, సిరియా, యెమన్, సోమాలియాలపై నిషేధం విధించింది. కాగా, తాజా ఆదేశాల్లో సూడాన్‌ను ఈ జాబితా నుండి ట్రంప్ ప్రభుత్వం తొలగించింది.
గతంలో అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ప్రయాణ నిషేధం వివాదాస్పదమయ్యింది. ఆయన ఆరు మెజార్టీ ముస్లిం దేశాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో ఆ నిషేధాజ్ఞలు "ముస్లిములపై నిషేధమని" ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ జాబితాలో కొన్నికొత్త దేశాలను చేర్చినా నిషేధాజ్ఞలు మాత్రం ముస్లిములపైనేనని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ రైట్స్ గ్రూప్ విమర్శలు చేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా ప్రభుత్వం ఏ విధంగా కూడా అమెరికాకు సహకరించడంలేదని, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంలో అన్ని విధాలుగా ఉత్తర కొరియా విఫలమయ్యిందంటూ ఆ దేశాన్ని ఈ జాబితాలో అమెరికా చేర్చింది.
మధ్య ఆఫ్రికా దేశం చాడ్ ఉగ్రవాద నిర్మూలనకు సహకరించే.. ఉగ్రవాద సంబంధిత, ఇతర ప్రభుత్వ సమాచారం అందించడం లేదని బిజినెస్, పర్యాటక వీసాలు జారీ చేయడాన్ని అమెరికా నిలిపివేసింది.
అయితే, వెనిజులాపై జారీ చేసిన ఈ నిషేధం ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబ సభ్యులకే పరిమితమని తెలిపింది.
నిషేధాజ్ఞల్లో ఎక్కువగా బి-1, బి-2 బిజినెస్, పర్యాటక వీసాలే ఉన్నాయి.
ప్రయాణ నిషేధానికి సంబంధించి ఇరాక్ కూడా అవసరమైన ప్రమాణాలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇరాక్‌ను ఈ జాబితాలో చేర్చలేదని, ఐసిస్‌కి వ్యతిరేక పోరాటంలో అమెరికాతో ఇరాక్ సహకరిస్తుండటమే ఇందుకు కారణమని ఈ ఉత్తర్వుల్లో తెలిపారు.
ఈ నిషేధాజ్ఞలు అక్టోబర్ 18వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. ఈ నిషేధాజ్ఞలు ఇది వరకే వీసా తీసుకున్న వారికి వర్తించవని వైట్ హౌస్ తెలిపింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)








