ఎల్ మెంచో: ఈ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కార్టెల్ లీడర్ హత్య తర్వాత మెక్సికో రగిలిపోతోంది ఇలా...

ఫొటో సోర్స్, GettyImages/MoreLifeDiaries via Reuters
- రచయిత, సోఫియా ఫెర్రీరా శాంటోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
మెక్సికోలో పరిస్థితి హృదయవిదారకంగా ఉందని స్థానికులు, పర్యటకులు చెబుతున్నారు.
దేశంలో అత్యంత శక్తివంతమైన, భయంకరమైన డ్రగ్ కార్టెల్స్ అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసకు పాల్పడడంతో అక్కడ అశాంతి నెలకొంది.
'ఎల్ మెంచో’ గా అందరికీ తెలిసిన మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, జలిస్కో న్యూ జనరేషన్ (సీజేఎన్‌జీ) డ్రగ్ కార్టెల్ నాయకుడు నెమెసియో ఒసెరగ్యురా కెర్వాంటెస్‌ను ఆదివారం (ఫిబ్రవరి 22)నాడు భద్రతాదళాలు హతమార్చాయి.
అరెస్టు చేసేందుకు నిర్వహించిన ఆపరేషన్‌లో ఎల్ మెంచో చనిపోయారు.
ఆ తర్వాత మెక్సికోలో మొదలైన హింసకు సంబంధించి స్థానికులు, పర్యటకులు తీసిన వీడియోల్లో కాలిపోయిన వాహనాలు, అనేక పట్టణాలు, నగరాలపై పొగ కమ్ముకుని కనిపించింది. ప్యూర్టో వల్లార్టా బీచ్ రిసార్ట్ కూడా ఇందులో ఉంది.

‘నగరంపై దట్టంగా ఆవరించిన పొగ’
‘‘ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. మా ప్రాంతంకన్నా ఇది చాలా సురక్షితం అనుకునేవాణ్ని’’ అని ఎల్జీబీటీ, లైఫ్‌స్టైల్ మేగజీన్ 'అవుట్ అండ్ ఎబౌట్ ప్యూర్టో వల్లార్టా' యజమాని జెర్రీ జోన్స్ అన్నారు. అమెరికాలోని నాష్ విల్లేకు చెందిన ఆయన, రిటైరయ్యాక మెక్సికోలోని ప్యూర్టో వల్లార్టాలో స్థిరపడ్డారు.
ఆదివారం ఉదయం ఎల్ మెంచో ను బంధించారని, తర్వాత హింస చెలరేగిందని తెలిసి స్థానికులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారని జోన్స్ చెప్పారు.
''మా పాఠకుల్లో ఒకరు బస్సు తగలబడుతున్న వీడియో పంపించినప్పుడు ఏదో జరుగుతోందని మాకు అర్థమైంది’’ అని ఆయన అన్నారు.
అంతలోనే నగరమంతా పొగవ్యాపించడం చూశానని జోన్స్ చెప్పారు. పార్కింగ్‌లో 30కిపైగా వాహనాలు ఉన్న స్థానిక స్టోర్ ఒకటి పూర్తిగా కాలిపోయిందని జోన్స్ తెలిపారు.
ఆదివారం ఉదయం పరిస్థితులు వేగంగా దిగజారినప్పటికీ, స్థానికులెవరికీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, మధ్యాహ్నం వరకు చుట్టుపక్కల ఎక్కడా మిలిటరీ అధికారులు కనిపించలేదని జోన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కలిసికట్టుగా ముందుకు సాగుతాం’
ఇళ్లు, హోటల్ గదుల్లోనే ఉండాలని మెక్సికోలోని అనేక రాష్ట్రాల్లోని స్థానికులు, పర్యటకులకు ఆదేశాలొచ్చాయి. స్కూళ్లు, యూనివర్శిటీలు, షాపులు మూతపడ్డాయి.
హింస చెలరేగిన తర్వాత కొందరు షాపుల్లోనే చిక్కుకుపోయారని, అక్కడి నుంచి రాలేకపోయారని అక్కడి పరిస్థితిని వివరించారు జోన్స్.
''వీధులు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. సమాచారం అందరికీ క్రమంగా తెలిసేకొద్దీ ఒకరికొకరు సాయం చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు'' అని ఆయన చెప్పారు.
అగ్నిమాపకసిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో స్థానికులు మంటలు ఆర్పడంలో వారికి సాయపడ్డారని, ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న పర్యటకులకు సాయమందించారని జోన్స్ తెలిపారు.
ఆదివారం సాయంత్రానికి ఒక నిత్యావసర సరుకుల షాపు తెరుచుకుందని, అయితే అక్కడ భారీ స్థాయిలో క్యూ ఉందని చెప్పారు.
''ఇవాళేం జరుగుతుందో నాకు తెలియదు. శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని నేనుకోరుకుంటున్నా''అని జోన్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘యుద్ధం జరుగుతున్న ప్రాంతంలా అనిపించింది’
రిసార్టులకు నిలయమైన ఈ పట్టణం ఇప్పుడు యుద్ధభూమిలా కనిపిస్తోందని ప్యూర్టో వల్లార్టాలో నివసిస్తున్న కెనడియన్ కంటెంట్ రైటర్ మార్క్ ఆండ్రీ చెప్పారు.
‘‘ ఒకేసారి నగరమంతా వందలాది కార్లు తగలబడడంతో ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి’’ అని తన యూట్యూబ్ చానల్ మోర్ లైఫ్ డైరీస్‌లో ఆయన చెప్పారు.
హింసాత్మక కార్యక్రమాలు ఆగిపోయిన తర్వాత వీధుల్లో ఎక్కడలేని నిశ్శబ్దం నెలకొందని ఆయన అన్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో తానిక్కడ నివసిస్తున్నానని, ఇంతకు ముందెప్పుడూ ఇది సేఫ్ కాదు అనిపించలేదని మార్క్ ఆండ్రీ చెప్పారు.
''జరుగుతున్నది చూస్తుంటే గుండె పగిలినట్టు ఉంది'' అని ఆయన అన్నారు.
''ఇలాంటి వీడియో చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు'' అని కాలిఫోర్నియాకు చెందిన మరో యూట్యూబ్ క్రియేటర్ పాల్ డేస్మండ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
నయారిట్‌లోని బీచ్ రిసార్ట్ టౌన్ బుకెరియాస్‌లో చాలా ఏళ్లగా నివసిస్తున్న డేస్మండ్ ఇది అసాధారణంగా ఉందని అన్నారు.
''ఇది మా రోజువారీ జీవితాల్లో ఎప్పుడూ జరిగేది కాదు. కలవరానికి, నిరాశకు గురి చేస్తోంది. చూడడానికి ఏమీ బాగా లేదు'' అని ఆయన చెప్పారు.
ఆదివారం ఉదయం తీసిన డ్రోన్ ఫుటేజ్‌ను ఆయన షేర్ చేశారు. నిర్మానుష్యంగా ఉన్న హైవే, దూరం నుంచి పొగ కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చిక్కుకుపోయిన కెనడియన్లు
అమెరికా, కెనడాకు చెందిన అనేకమంది పర్యటకులు కూడా అక్కడి పరిస్థితులను వివరించారు.
కెనడాకు చెందిన జెఫ్ పాస్ 8 రోజుల నుంచి ప్యూర్టో వల్లార్టాలో ఉంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇంకొందరు కెనడావాసులతో కలిసి ఆయన అక్కడికి వచ్చారు.
ఆదివారం ఉదయం ఏర్పడిన అశాంతియుత పరిస్థితులపై హోటల్ సిబ్బంది ఎక్కువ మాట్లాడలేదని ఆయన చెప్పారు. పట్టణమంతా చెలరేగిన మంటలను ఆదివారం మధ్యాహ్నం రిసార్ట్ పైనుంచి తాను చూశానని ఆయనన్నారు.
సోమవారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం అంతటా ప్రశాంత వాతావరణం కనిపించిందని పాస్ అన్నారు. టాక్సీలు, ఉబెర్ వాహనాల రాకపోకలు నెమ్మదిగా మొదలయ్యాయని, అయినప్పటికీ తామెప్పుడు ఇంటికెళ్లగలమో తనకు, తన భాగస్వామికి తెలియడం లేదని చెప్పారు.
మెక్సికోలోని కెనడా రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వారిలాగే అనేకమంది ఇలాంటి అభ్యర్థనలే చేస్తుండడంతో అధికారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
''కెనడా ప్రభుత్వం నుంచి మాకెలాంటి సమాచారం, స్పందన రాలేదు. రిసార్ట్ మాత్రం చాలా బాగుంది'' అని ఆయన అన్నారు.
మరోవైపు అమెరికా, భారత్ సహా అనేక దేశాల రాయబార కార్యాలయాలు తమతమ దేశాల పౌరులకు ప్రత్యేక సూచనలు చేశాయి.
భారత రాయబార కార్యాలయం ఓ పోస్ట్‌లో ‘‘మెక్సికోలోని భారతీయ పౌరులందరికీ హెచ్చరిక: ప్రస్తుతం సెక్యూరిటీ ఆపరేషన్లు, దుండగుల రోడ్డు దిగ్బంధనాలు, నేర కార్యకలాపాలు జరుగుతున్నాయి. మెక్సికన్ రాష్ట్రాలైన జాలిస్కో, తమౌలిపాస్, మిచోకాన్, గెరెరో, న్యూవో లియోన్‌లలోని భారతీయ పౌరులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలి’’ అని సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ ఎల్ మెంచో?
మెక్సికన్ చరిత్రలో అత్యంత క్రూరమైన మాదక ద్రవ్యాల ముఠా నాయకులలో ఒకరుగా పేరుగాంచారు ఎల్ మెంచో.
59 ఏళ్ల వయసున్న ఈ డ్రగ్ కార్టెల్ లీడర్ ఒక మాజీ పోలీసు అధికారి. ఆయన ముఠా పెద్ద మొత్తంలో కొకైన్, మెథాంఫెటమైన్, ఫెంటానిల్‌లను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఆయన్ను పట్టించిన వారికి 15 మిలియన్ డాలర్లు (రూ. 136 కోట్లు) బహుమతిని ప్రకటించింది అమెరికా.
తన ప్రత్యర్ధులను భయంకరంగా చంపడం, వారిని వంతెనలకు వేలాడదీయించే ముఠా నాయకుడిగా ఎల్ మెంచోకు పేరుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













