స్కోపోలమైన్: డెవిల్స్ బ్రీత్‌గా పిలుచుకునే ఈ డ్రగ్ వాసన చూస్తే ఎదుటివాళ్లు ఏం చెబితే అది చేస్తారు....ఏమిటిది?

ఉమ్మెత్త పువ్వుతో తయారు చేసే డ్రగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తఫ్సీర్ బాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తహ్మినా బేగం( భద్రత దృష్ట్యా పేరు మార్చాం) ఢాకా వాసి. కొన్ని రోజుల కిందట ఓ విచిత్రమైన మోసానికి బాధితురాలిగా మారారు.

మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమె ఎదురుగా రోడ్డు దాటేందుకు ఓ అపరిచిత యువతి ఎదురుగా నిల్చుని ఉన్నారు. ఆమె ఏదో సమాచారం అడిగేందుకు తహ్మినాకు పక్కకు వచ్చారు.

తర్వాత ఓ యువకుడు ముందుకొచ్చాడు. ఆ తర్వాత రెండు మూడు నిముషాల పాటు తనకు ఏం జరుగుతుందో తెహ్మినాకు అర్థం కాలేదు.

“ఈ సంఘటన చాలా వింతగా, భయంకరంగా ఉంది. ఆ యువకుడు ఈ ప్రాంతంలో మీకు తెలిసిన పేదలు లేదా అనాథలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మా ఇంటి దగ్గరలో ఓ పేద కుటుంబం ఉంటోందని నేను ఆ కుటుంబం గురించి చెప్పాను. అతడితో కొన్ని నిముషాలు మాత్రమే మాట్లాడాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు” అని తెహ్మీనా చెప్పారు.

ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ, యువకుడు అడగడంతో తెహ్మీనా తన చెవి కమ్మలు, నెక్లెస్, తన వద్ద ఉన్న కొన్ని వేల రూపాయల నగదు వారికి ఇచ్చేశారు.

“ఆంటీ, మీరు మీ నగలు, డబ్బులు బ్యాగులో పెట్టుకోండి, లేకుంటే ఎవరైనా కొట్టేస్తారు అని చెప్పారు. నేను అలాగే చేశాను. అసలు నేను నా నగలను బ్యాగులో ఎందుకు పెట్టాలి, అవి ఎందుకు పోతాయి అనే ఆలోచనే నా మదిలోకి రాలేదు. ఆ తర్వాత ఆ యువకుడు నన్ను తన వెంట రమ్మని అడిగాడు. నేను అతడి వెనుకే వెళ్లాను” అని తెహ్మీనా తెలిపారు.

మత్తు పదార్థాలు

ఫొటో సోర్స్, Getty Images

స్పృహలోకి వచ్చాక చూస్తే...

ఆమె కొంత దూరం నడిచిన తర్వాత తాను ఏం చేసిందో తెలుసుకున్నారు. అయితే అప్పటికే ఆ యువకుడు ఎక్కడా కనిపించలేదు. తాను వాళ్లను కలిసిన ప్రాంతానికి వెళ్లి చూస్తే ఆ యువతి కూడా కనిపించలేదు. ఆ రోజు ఆమె తన నెక్లెస్, చెవి కమ్మలు, వేల రూపాయల నగదు, ఫోన్ కూడా పోగొట్టుకుని ఇంటికి చేరుకున్నారు.

“ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాళ్లు నాకు ఏమీ హాని చెయ్యలేదు. వాళ్లిద్దరూ నాకు దగ్గరగా నిల్చున్నారు. ఆ యువతి నా మొహం ఎదురుగా తన చేతిని ఊపింది. కాగితం మీద ఒక అడ్రస్ రాసింది. ఆ అడ్రస్ గురించి అడిగింది” అని ఆమె చెప్పారు.

కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌లో అనేకమందికి తెహ్మీనా బేగంకు ఎదురైన అనుభవం లాంటిదే ఎదురైంది. ఇలాంటి సంఘటనల వెనుక సైతాన్ శ్వాస (డెవిల్స్ బ్రీత్)గా పిలిచే స్కోపోలమైన్ అనే డ్రగ్ ఉన్నట్లు భావిస్తున్నారు.

ఔషధాల తయారీలో ఉపయోగించే ఈ డ్రగ్ పౌడర్, ద్రవ రూపంలో లభిస్తుంది. ఈ డ్రగ్‌ను పేపర్ మీద లేదా గుడ్డమీద, చేతిమీద, మొబైల్ స్క్రీన్ మీద ఉంచి ఉపయోగించవచ్చు. దీని వాసన ఎవరి మెదడునైనా అదుపు చేస్తుంది.

అలాంటి డ్రగ్ అసలు ఉందా, బంగ్లాదేశ్‌లో ఉపయోగించినట్లు నిర్థరించడం ఎలా?

2023 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని నారాయణ్ గంజ్‌లో ఓ ప్రైవేటు స్కూలు టీచర్ హత్య జరిగింది. ఈ హత్యతో సంబంధముందని భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరో వ్యక్తిని ఢాకాలో అరెస్ట్ చేశారు.

ఆ ఇద్దరిలో ఒకరి దగ్గర నుంచి స్కోపోలమైన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తొలిసారి పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అదే వ్యక్తి నుంచి స్కోపోలమైన్ పౌడర్ నింపిన మరి కొన్ని విషపూరిత డ్రగ్స్‌ ఉన్న బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు

తర్వాత కోర్టు ఆదేశాలతో స్కోపోలమైన్‌ను గురించి నిర్థరించుకునేందుకు దాన్ని సీఐడీ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు.

స్కోపోలమైన్ గురించి అంతకు ముందు తనకు ఎలాంటి వివరాలు తెలియవని నారాయణ్ గంజ్ ఎస్పీ గులాం ముస్తఫా రస్సెల్ బీబీసీతో చెప్పారు.

“కెమికల్ విచారణలో భాగంగా మాకు అందిన నివేదిక ప్రకారం వారి వద్ద స్కోపోలమైన్, పొటాషియం సైనైడ్, క్లోరోఫామ్ ఉన్నట్లు తేలింది. వీటిలో స్కోపోలమైన్ అనేది మాకు పూర్తిగా కొత్తది. అంతకు ముందెన్నడూ ఆ పేరు వినలేదు. దీన్ని ఎవరు, ఎక్కడ, ఎందుకు వినియోగిస్తారు, ఎవరు ఉత్పత్తి చేస్తారో కూడా తెలియదు. దీన్ని అనేకమంది ‘సైతాన్ శ్వాస’ అని పిలుస్తారని తర్వాతే మాకు తెలిసింది” అని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ డ్రగ్‌ను స్మగ్లర్లు కొరియర్లు, ఇతర మార్గాల్లో బంగ్లాదేశ్‌లోకి తీసుకు వస్తున్నారని తేలినట్లు ముస్తఫా చెప్పారు.

ఉమ్మెత్త పువ్వు

ఫొటో సోర్స్, Getty Images

ఉమ్మెత్త మొక్క నుంచి స్కోపోలమైన్ ఎవరు తయారు చేస్తారు?

స్కోపోలమైన్ ఓ సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేని తనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాలలోనూ దీన్ని కలుపుతారు.

అయితే ఈ డ్రగ్ సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్‌ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది.

తయారీకి అవసరమైన ప్రాథమిక మూల వస్తువు ఉమ్మెత్త పువ్వు.

“ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్‌ సింథటిక్‌ డ్రగ్‌గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేస్తున్నాయి” అని నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వివరించారు.

స్కోపోలమైన్ ఎప్పుడు, ఎలా పని చేస్తుంది?

రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు నిఘా వర్గాల వద్ద కొంత సమాచారం ఉంది. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్‌గా ఇచ్చేవారు

“స్కోపోలమైన్‌ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నాం” అని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. రెండ ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్‌ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్‌ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు.

“ మీరు ఎవరితోనైనా నిజాలు మాట్లాడించాలంటే, ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే మీరు ఎవరితోనైనా ఈ పౌడర్‌ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుంది” అని రహమాన్ వివరించారు.

మోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్‌ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్‌ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక.

“ఈ పౌడర్‌ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళా దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది. దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం” అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు.

దీన్ని పీల్చిన పది నిముషాల తర్వాత పీల్చిన వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. సాధారణ దశకు రావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డా. దులాల్ కృష్ణ సాహా, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం చీఫ్ కెమికల్ ఎగ్జామినర్

భద్రత వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?

ఢాకాతోపాటు బంగ్లాదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో స్కోపోలమైన్ ఉపయోగించినట్లు తెలిసింది. ఇలాంటి జరిగినట్లు ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి.

ఏదైమైనప్పటికీ, ఈ సంఘటనలకు సంబంధించి పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఏదీ లేదు. భద్రతా వ్యవస్థలు, సరిహద్దుల్లో గస్తీ కళ్లుగప్పి స్మగ్లర్లు ఈ డ్రగ్‌ను దేశంలోకి ఎలా తీసుకు వస్తున్నారనేది పెద్ద ప్రశ్న.

నారాయణ్ గంజ్ సంఘటన తర్వాత ఈ డ్రగ్‌ ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నట్లు నిఘా వర్గాల విచారణలో తేలింది. ఆన్‌లైన్‌లో స్కోపోలమైన్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి ఇది బంగ్లాదేశ్‌లోకి వస్తోందని పోలీసులు గుర్తించారు.

ఈ డ్రగ్‌ను బంగ్లాదేశ్‌లోకి తీసుకు వచ్చేందుకు కొరియర్ సర్వీసుల్ని ఉపయోగిస్తున్నారు. చట్టంలో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకుని ఔషధాల తయారీ కోసమని కొంతమంది స్కోపోలమైన్‌ను దేశంలోకి తీసుకు వస్తున్నారా అనే కోణంలో పోలీసులు, భద్రత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

“నారాయణ్‌ గంజ్‌లో నేరానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు చాలా మందిని అరెస్ట్ చేశాం. దీని వెనుక ఇంకా ఎవరున్నా, వారిని కూడా అరెస్ట్ చేస్తాం” అని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏఐజీ ఎన్ముల్ హక్ సాగర్ చెప్పారు.

స్కోపోలమైన్ ద్వారా తాము మోసపోయి, సొమ్ములు పోగొట్టుకున్నట్లు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య బంగ్లాదేశ్‌లో పెరుగుతూ ఉండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)