కెటామైన్: ‘మూత్రం పోయకుండా 50 మీటర్లు కూడా నడవలేను’

- రచయిత, రేచల్ స్టోన్‌హౌస్
- హోదా, బీబీసీ వెస్ట్ ఇన్వెస్టిగేషన్
కెటామైన్ వాడకంతో యువతలో మూత్రాశయ (బ్లాడర్) సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డ్రగ్‌కు బానిస కావడంతో వచ్చే సమస్యలకు పరిష్కారంగా ప్రమాదకర సర్జరీలు చేయించుకుంటున్న వారిలో 21 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.
20ల వయసులోనున్న బెత్.. ఈ డ్రగ్‌కు బానిసయ్యారు. ‘‘నేను కనీసం 50 మీటర్లు కూడా నడవలేకపోతున్నాను. అయితే, కూర్చోవాలి లేదా టాయిలెట్‌కు పరిగెత్తాలి’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.
2016 నుంచి ఇంగ్లండ్, వేల్స్‌లలో కెటామైన్ వాడకం రెట్టింపు అయిందని తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
25 ఏళ్ల లోపు యువతలో అయితే, ఈ డ్రగ్ వాడకం మూడు రెట్లు పెరిగింది.

కెటామైన్‌ను ఎక్కువ రోజులు వాడితే, అది మూత్రకోశ పొరలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి మూత్రకోశ పరిమాణం కుంచించుకుపోయేందుకు ఇది కారణం అవుతుంది. ఇలా మూత్రకోశ సంబంధిత వ్యాధులతో వస్తున్న రోగుల కోసం నేడు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక క్లినిక్‌లు కూడా తెరుస్తున్నారు.
ప్రస్తుతం బ్రిస్టల్‌లోని సౌత్‌మీడ్ హాస్పిటల్‌లో ఇలాంటి సమస్యలతో 60 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 19 ఏళ్ల యువకుడు కూడా ఉన్నారు.
‘‘21 ఏళ్ల యువకుడికి ఇలాంటి పెద్ద శస్త్రచికిత్స నిర్వహిస్తే, తన జీవితంలో ఇలాంటి ఇతర సమస్యలు వచ్చే ముప్పు చాలా పెరుగుతుంది’’ అని కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ కరోలినా ఓచా చెప్పారు.
స్కూలులో ఉన్నప్పుడే కెటామైన్‌ను మొదటిసారి బెత్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్‌కు ఆమె బానిసయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
మూత్రంలోనూ కెటామైన్
గతంలో జరిగిన కొన్ని బాధాకరమైన ఘటనల నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం కెటామైన్‌ను వాడుతున్నట్లు బెత్ చెప్పారు.
‘‘ఆ ఘటనల నుంచి బయటపడేందుకు కొంతవరకూ అది తోడ్పడుతోంది. దురదృష్టవశాత్తు, నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు నన్ను ఈ దిశగా నడిపించాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను’’ అని ఆమె వివరించారు.
‘‘వీటి నుంచి కెటామైన్ కొంత ఉపశమనం కల్పిస్తోంది’’ అని ఆమె తెలిపారు.
అయితే, దీర్ఘకాలం ఈ డ్రగ్‌ను తీసుకోవడంతో వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆమె సతమతం అవుతున్నారు.
కెటామైన్ వాడకంతో ఆమె మూత్రకోశంలో పెద్ద కణితి ఏర్పడింది. ఆ భాగానికి రేడియేషన్‌తో చికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం తన మూత్రంలో ఆ డ్రగ్ అవశేషాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు.
ఏమిటీ కెటామైన్?
మత్తుమందుగా, నొప్పి నివారిణిగా కెటామైన్‌ను వైద్యులు సూచిస్తుంటారు. ఇదే డ్రగ్‌ను జంతువులకు కూడా ఇస్తుంటారు.
ఈ డ్రగ్‌తో హ్యాలూసినేషన్స్ కూడా కలుగుతుంటాయి. అందుకే దీన్ని ‘పార్టీ డ్రగ్’ అని కూడా పిలుస్తుంటారు.
తాజాగా ఫ్రెండ్స్ స్టార్ మాథ్యూ పెర్రీ మరణానికి కూడా ఇదే ప్రధాన కారణంగా వార్తలు వచ్చాయి.
మార్కెట్‌లో దీన్ని ‘స్పెషల్ కే’గా పిలుస్తుంటారు. ఇది ద్రవరూపంలో లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది.
బ్రిటన్‌లో దీన్ని క్లాస్-బీ డ్రగ్‌గా వర్గీకరించారు. అంటే దీన్ని వైద్యుల అనుమతి లేకుండా తీసుకోవడం, కలిగివుండటం, అమ్మడం, తయారుచేయడం నేరం.
ఈ డ్రగ్‌కు శరీరం త్వరగా అలవాటు పడిపోతుంది. కాబట్టి మత్తు వచ్చేందుకు దీని డోసును క్రమంగా పెంచుకుంటూ వెళ్తేనే ఇది పనిచేస్తుంది.
ఎక్కువ రోజులు దీన్ని ఉపయోగిస్తే, మూత్రకోశ పొర దెబ్బతింటుంది. కొందరిలో మూత్రాశయం కుంచించుకుపోవచ్చు కూడా.
ఫలితంగా మళ్లీమళ్లీ మూత్రం పోయాల్సి రావడం, మూత్రకోశ ఇన్ఫెక్షన్లు, బ్లీడింగ్, బ్లాకేజీలు, మూత్రంపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు రావచ్చు.

‘తీవ్రమైన పరిణామాలు’
కెటామైన్‌తో వచ్చే మూత్రకోశ సమస్యలను తొలి దశల్లోనే వైద్యులు గుర్తించేందుకు ఒక పరిశోధన పత్రాన్ని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ యూరాలాజికల్ సర్జన్స్ తయారుచేస్తోంది. ఈ సంస్థకు చెందిన డాక్టర్ మహమ్మద్ బిలాల్ మూత్రకోశ సమస్యలపై బీబీసీతో మాట్లాడారు.
‘‘కెటామైన్ సమస్యలతో వస్తున్న యువత సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా మంది మూత్ర సంబంధిత సమస్యలతో మా దగ్గరకు వస్తున్నారు. గంట లేదా అరగంటకు ఒకసారి మూత్రానికి వెళ్లాల్సి వస్తోందని చాలా మంది చెబుతున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘మూత్రకోశ లోపలి పొరను కెటామైన్ దెబ్బతీస్తుంది. ఫలితంగా చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి’’ అని ఆయన వివరించారు.
‘‘సాధారణంగా వయసు పైబడిన వారిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ, నేడు ఇవే సమస్యలు యువతలోనూ కనిపిస్తున్నాయి’’ అని ఆయన తెలిపారు.
12 ఏళ్లపాటు కెటామైన్‌కు బానిసైన ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన పేగన్ ప్రస్తుతం దీని నుంచి బయటపడ్డారు. తన అనుభవాలను ఇతరులకు పాఠాలుగా ఆమె నేర్పిస్తున్నారు.
ఒకప్పుడు రోజుకు పది గ్రాముల వరకూ కెటామైన్‌ను తీసుకునేదాన్నని ఆమె చెప్పారు.

‘‘చనిపోవాలని అనుకున్నాను’’
‘‘నేను ఒక దశలో చనిపోవాలని అనుకున్నాను. అప్పుడు నాకు జీవితంపై ఆశ చచ్చిపోయింది’’ అని పేగన్ తెలిపారు.
‘‘ఆ నొప్పితో ఈ ప్రపంచంలో ఉండాలని అనిపించేది కాదు. నేను మొత్తంగా కెటామైన్‌పైనే ఆధారపడిపోయేదాన్ని’’ అని ఆమె అన్నారు.
ఆ డ్రగ్‌కు బానిస కావడంతో పేగన్ కుమార్తెను అధికారులు వేరొకరికి దత్తత ఇచ్చేశారు. ఆ తర్వాత మూత్రకోశ సర్జరీని కూడా ఆమె చేయించుకున్నారు. మూడుసార్లు ఆమె రిహాబ్ సెంటర్లలో గడపాల్సి వచ్చింది.
‘‘చివరిసారి దాదాపు ఎనిమిది వారాలపాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. నేను చాలాసార్లు అదృష్టంపైనే ఆధారపడ్డాను. అందుకే మారాలని భావించాను. లేదంటే అప్పుడే చనిపోయి ఉండేదాన్ని’’ అని ఆమె తెలిపారు.
ఆ డ్రగ్ నుంచి విముక్తి కోసం ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. డ్రగ్ అండ్ ఆల్కహాల్ చారిటీ ‘టర్నింగ్ పాయింట్’ సాయంతో ఆమె దీని నుంచి బయటపడగలిగారు. ప్రస్తుతం ఈ సంస్థ కోసం ఆమె వాలంటీర్‌గా పనిచేస్తున్నారు.
‘‘ఆలస్యమేమీ కాదు’’
మాదకద్రవ్యాల అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు వీటి నుంచి బయట పడేందుకు ప్రజలకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి.
దీర్ఘకాలం కెటామైన్ వినియోగంతో వచ్చే దుష్ప్రభావాలతో బాధపడుతున్న వారి కోసం స్పెషలిస్ట్ యూరాలజిస్ట్ నర్స్‌గా జాస్మీన్ కింగ్ పనిచేస్తున్నారు.
‘‘రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళనకరం. వీటి నుంచి బయటపడేందుకు చారిటీలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల సాయం తీసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.
‘‘నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నారు. ఈ సమస్యతో మా దగ్గరకు వచ్చేవారిని మేమేమీ చిన్నచూపు చూడబోం’’ అని ఆమె అన్నారు.
‘‘మేం మీ సమస్యలను పరిష్కరించేందుకు, మీకు సాయం అందించేందుకే మేం పనిచేస్తున్నాం. మేం సాయం చేయాలని భావిస్తున్నాం.. అంతే’’ అని ఆమె వివరించారు.
‘‘ఈ డ్రగ్ దుష్ప్రభావాలపై మీరు ఎప్పుడైనా నిపుణులను సాయం కోరొచ్చు. దీనిలో చాలా ఆలస్యం అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు’’ అని పేగన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















