టీవీ స్టూడియోలో లైవ్‌ నడుస్తుండగా తుపాకులతో ప్రవేశించిన దుండగులు

టీసీ టీవీ స్డూడియో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 'టీసీ' పబ్లిక్ టెలివిజన్ చానెల్ ప్రసారాలు జరుగుతుండగా దుండగులు లోపలికి ప్రవేశించారు.
    • రచయిత, మారిటా మోలోనీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఈక్వెడార్‌లోని ఒక టెలివిజన్ స్టూడియోలో లైవ్‌ జరుగుతుండగా ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు తుపాకులతో చొరబడ్డారు, అక్కడి సిబ్బందిని బెదిరించారు.

గ్వాయాక్విల్ నగరంలోని 'టీసీ' పబ్లిక్ టెలివిజన్ చానెల్ ప్రసారాలు జరుగుతున్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి, ఉద్యోగులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అందరూ నేలపై పడుకోవాలని ఆదేశించారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అరెస్ట్ చేశారు.

ఈక్వెడార్‌లో సోమవారం చోనెరోస్ ముఠా యజమాని, గ్యాంగ్‌స్టర్ అడాల్ఫో మాకియాస్ విల్లామార్ అలియాస్ ఫిటో జైలు నుంచి అదృశ్యమవడంతో 60 రోజుల పాటు అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

గ్వాయాక్విల్‌ సంఘటనకు ఈ గ్యాంగ్‌స్టర్‌ ఫిటోకు సంబంధముందా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ రెండు ఘటనలూ ఒకే నగరంలో జరిగాయి.

ఈక్వెడార్ ప్రపంచంలోని అరటి ఎగుమతిదారులకు ప్రసిద్ధి. ఇది చమురు, కాఫీ, కోకో, రొయ్యలు, చేప ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తుంది.

ఆండియన్ రాష్ట్రాల్లోని జైళ్ల లోపల, బయట హింస పెరగడానికి అమెరికా, యూరప్‌కు కొకైన్ మార్గాల నియంత్రణపై విదేశీ, స్థానిక మాదకద్రవ్యాల కార్టెల్‌ల మధ్య పోరాటానికి సంబంధముంది.

టీవీ స్టేషన్‌లో ఒక దుండగుడు బందీలలో ఒకరి తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు.

"షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి" అని ఒక మహిళ వేడుకోవడం వినబడిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. ఒక వ్యక్తి నొప్పితో అరుస్తున్నట్లు కూడా వినిపించినట్లు కూడా తెలిపింది.

టీవీ స్డూడియో వద్ద ముష్కరులు

ఫొటో సోర్స్, EPA

సాయుధ దళాలు సమీకరించాం: ఈక్వెడార్ అధ్యక్షుడు

"వారు మమ్మల్ని చంపడానికి వచ్చారు"అని టీసీ ఉద్యోగి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వాట్సాప్ సందేశంలో తెలిపారు.

"దేవుడా ఇలా జరగనివ్వకు." అని వేడుకున్నట్లు తెలిపింది.

దేశంలో ఇప్పుడు అంతర్గత సాయుధ పోరాటం జరుగుతోందని, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, తీవ్రవాద సంస్థలు తదితర గ్రూపుల కార్యకలాపాలను నియంత్రించడానికి సాయుధ దళాలను సమీకరించినట్లు అధ్యక్షుడు డేనియల్ నోబోవా మంగళవారం చెప్పారు.

ఇటీవలి జైళ్లలో అల్లర్లు, జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం, క్రిమినల్ ముఠాలపై అధికారుల హింసాత్మక చర్యలపై ఆయన స్పందించారు.

గ్యాంగ్‌స్టర్ ఫిటో తప్పించుకున్న తర్వాత హింసను అరికట్టడానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. సోమవారం అల్లర్లు చెలరేగిన దాదాపు ఆరు జైళ్లలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

డ్రగ్ వ్యాపారాలు కంట్రోల్ చేసే ఖైదీతో సహా దాదాపు 40 మంది ఖైదీలు మంగళవారం తెల్లవారుజామున రియోబాంబా నగరంలోని జైలు నుంచి తప్పించుకున్నారు. ఘటనలో దాదాపు ఏడుగురు పోలీసులు కిడ్నాప్‌ అయ్యారు.

కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురు ప్రెసిడెంట్ నోబోవాను ఉద్దేశించి ఒక ప్రకటనను చదివినట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. ఆ సమయంలో వారిపై దుండగులు తుపాకీ ఎక్కుపెట్టి నేలపై కూర్చోపెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఆ వీడియోలో "మీరు యుద్ధం ప్రకటించారు, మీకు యుద్ధమే ఎదురవుతుంది. మీరు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మేం పోలీసులు, పౌరులు, సైనికులను యుద్ధంలో దోచుకున్న వస్తువులుగా ప్రకటిస్తాం" అని వ్యాఖ్యానించారు.

టీవీ స్డూడియోలో ముష్కరులు

ఫొటో సోర్స్, REUTERS

'ఇంతకుముందెన్నడూ చూడలేదు'

గుయాక్విల్‌లోని టీవీ స్టేషన్‌లో దాడి వార్తల తర్వాత రాజధాని క్విటోలో గందరగోళం నెలకొందని అక్కడి నివాసితులు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

"నగరంలో చాలా భయం నెలకొంది" అని మారియో యురేనా అంటున్నారు.

"ఆఫీసుల నుంచి ప్రజలు ముందుగానే ఇంటికి వెళ్లిపోతున్నారు. మీకు ప్రతిచోటా అలారం శబ్ధాలు, ట్రాఫిక్ కనిపిస్తాయి. అంతా గందరగోళంగా ఉంది" అని చెప్పారు మారియో.

దుండగులు టీవీ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవడంపై క్యూన్కా నగరవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈక్వెడార్‌లో ఒక చానెల్ హైజాక్ అయి, షూటింగ్‌, కిడ్నాప్‌లతో ప్రసారం ప్రారంభమవడం మేం ఎప్పుడూ చూడలేదు" అని ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో ఫ్రాన్సిస్కో రోసాస్ అనే వ్యక్తి చెప్పారు.

" ఇక మనకు భద్రత ఎక్కడుంది? టెలివిజన్ స్టేషన్‌లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక రెస్టారెంట్లు, దుకాణాలను ఊహించుకోండి" అని ఆందోళన వ్యక్తంచేశారు ఫ్రాన్సిస్కో.

ఈక్వెడార్ భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈక్వెడార్‌లో భద్రతా బలగాలు మోహరించాయి.

అధ్యక్ష అభ్యర్థులకు గ్యాంగ్‌స్టర్‌కు సంబంధమేంటీ?

ఇటీవలి సంవత్సరాలలో ఈక్వెడార్ జైళ్లలో ఖైదీల మధ్య వైరం కారణంగా హింసాత్మక సంఘటనలు తలెత్తుతున్నాయి, ఖైదీల ఊచకోత జరుగుతోంది.

చోనెరోస్ అనేది ఇటీవలి కాలంలో ఈక్వెడార్ జైళ్లలో చెలరేగిన అనేక ఘోరమైన అల్లర్లు, జైలు తగాదాల వెనుక ఉన్న శక్తివంతమైన ముఠా.

మరో జైలుకు బదిలీ అయ్యే కొన్ని గంటల ముందు గ్యాంగ్‌స్టర్ ఫిటో పరారీ అయినట్లు భావిస్తున్నారు. ఆయన తప్పించుకోవడానికి సాయం చేశారనే అనుమానంతో ఇద్దరు జైలు గార్డులను అదుపులోకి తీసుకున్నారు.

ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి, పాత్రికేయుడు ఫెర్నాండో విలావిసెన్సియో హత్య తర్వాత ఎన్నికలలో గెలిచి నవంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్ నోబోవా.

ఇపుడు ఫిటో తప్పించుకోవడం ఆయన ప్రభుత్వానికి కూడా ఒక ఎదురుదెబ్బ.

ఫిటో నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చినట్లు విలావిసెన్సియో గతంలోనే చెప్పారు. అనంతరం క్విటోలో ప్రచార ర్యాలీ ముగించుకొని వస్తున్న విలావిసెన్సియోను దుండగులు కాల్చి చంపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)