పాకిస్తాన్‌లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఉరూజ్ జాఫ్రీ
- హోదా, ఇస్లామాబాద్ నుంచి బీబీసీ హిందీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో కేబుల్ టీవీకి ఆదరణ పెరుగుతున్నకొద్దీ భారతీయ టీవీ ప్రసారాలు, సినిమాల గురించి పెద్దఎత్తున చర్చ జరిగేది.
స్టార్ ప్లస్, జీ సినిమా, జీ టీవీ, కలర్స్ టీవీల్లో వచ్చే సీరియళ్లు, షోలు ఎక్కువగా చూసేవారు.
దీంతో, పాకిస్తాన్ సొంత చానళ్లకు డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు.
దానికి పరిష్కారంగా పాకిస్తాన్‌లోనూ 'కహానీ ఘర్ ఘర్ కీ', 'క్యూం కీ సాస్ భీ కబీ బహు థీ' వంటి టీవీ సీరియల్స్ వంటి ఫార్ములా సిద్ధమైంది, అవి కూడా బాగానే ఆదరణ పొందాయి.
పాకిస్తాన్ కేబుల్ టీవీల్లో భారతీయ చానళ్లను నిషేధించినప్పుడు ప్రేక్షకుల నుంచి ఆ నిర్ణయంపై అయిష్టత వ్యక్తమైంది.
అయితే, పాకిస్తాన్‌లో ప్రసారమవుతున్న సొంత సీరియళ్లలోనూ నేటికీ ఈ ఫార్ములానే అనుసరిస్తున్నారు.
ఏ సీరియల్స్ ఆదరణ పొందాయి?
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సినీ, టీవీ రచయిత సాజి గుల్ ప్రస్తుతం గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌కు కంటెంట్ హెడ్‌గా ఉన్నారు.
''స్టార్ ప్లస్ మన పురుష ప్రేక్షకులను, మన నుంచి దూరం చేసింది. ఎందుకంటే, అత్త-కోడళ్ల ఫార్ములాకు కేవలం మహిళల నుంచి మాత్రమే ఆదరణ ఉండేది. స్టార్ ప్లస్ యుగం పాకిస్తాన్ సీరియళ్లకు గడ్డుకాలం'' అని ఆయన అన్నారు.
''యాడ్స్‌లో పనిచేసే వ్యక్తులు కెమెరా టెక్నాలజీ, కంటెంట్ వైపు వచ్చిన తర్వాత పాకిస్తాన్ సీరియల్స్ మరో మలుపు తిరిగాయి.''
''భారతీయ చానళ్లు మనల్ని కంటెంట్ రాయమని అడిగినప్పుడు, పాకిస్తానీయులను ఆకట్టుకునేలా ఉండాలని అడిగేవారు. అలాగే, మన ఉర్దూను కూడా చాలా ఇష్టపడేవారు'' అని సాజి గుల్ చెప్పారు.
పాకిస్తానీ ప్రజలు ఇప్పటికీ భారతీయ చానళ్లను మిస్ అవుతున్నారా? అని ఎవరినైనా అడిగినప్పుడు, వారు 'కహానీ ఘర్ ఘర్ కీ', 'క్యూం కీ సాస్ భీ కబీ బహూ థీ'ని కచ్చితంగా గుర్తు చేసుకుంటారు.
పాకిస్తాన్‌లో కేబుల్ టీవీ కళ్లు తెరిచినప్పుడు స్టార్ ప్లస్, జీ టీవీ, కలర్స్ టీవీ, బాలివుడ్ సినిమాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఫొటో సోర్స్, COLORS
స్టార్ ప్లస్, జీ టీవీలో వచ్చే సీరియళ్లు మన ఇళ్లలో తిష్టవేయడం మొదలైంది. సాయంత్రం 6.30 గంటలైతే చాలు, అమ్మ, అమ్మమ్మ, అత్త, కోడలు, ఇలా అందరూ టీవీ రిమోట్ పట్టుకుని కూర్చుంటారు. ఒకవేళ ఆ సమయంలో కేబుల్ సమస్య వస్తే, కేబుల్ ఆపరేటర్‌కి ఫోన్ చేసేవాళ్లు కూడా.
అది 2004 అనుకుంటా. బీబీసీ ఉర్దూ లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో అలాంటి వాతావరణం కనిపించింది.
నేను ఒకవేళ పని ముగించుకుని ముందుగా ఇంటికొస్తే, అప్పటికి స్టార్ ప్లస్ ఆన్‌లో ఉండేది. సీరియల్స్ చూస్తూ ఉండేవారు.
ప్రొడక్షన్ పరంగా చూస్తే, పది భాగాలు అయిపోయినా కథ పెద్దగా ముందుకు సాగేది కాదు. సన్నివేశాలు సుదీర్ఘంగా ఉండి, రెండు విరామాలతోనే సీరియల్ ముగిసిపోయేది.
స్టార్ ప్లస్, జీ చానళ్ల ఈ ట్రిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
తాహిర్ జమన్, పర్వతప్రాంతమైన హుంజాకు చెందినవారు. ఈ ప్రాంతంలో మహిళలు చాలా తక్కువగా ఇంటి నుంచి బయటికి వెళ్తుంటారు.
''గోపి, ససురల్ జెండా ఫూల్ వంటి సీరియళ్లు మా అత్తగారు బాగా చూసేవారు. ఆ సీరియళ్లు చూసేప్పుడు అందులో వచ్చే పాత్రలను తిట్టడమే పని. ఆ తర్వాత అది కేవలం సీరియల్ అని గుర్తొచ్చేది. అయినా, రోజూ చూసేవాళ్లం.'' అని ఆయన గుర్తుచేసుకున్నారు.
''ఆ సీరియళ్లును కేవలం చూడడమే కాదు, వాటిని తమ జీవితాలకు అన్వయించుకునేవారు'' అని తాహిర్ అన్నారు.
''అవన్నీ ఎడిట్ చేసిన ప్రోగ్రామ్స్ అని మర్చిపోయిన అమాయక ప్రేక్షకులు, వాటి ప్రభావంలో పడిపోయేవారు.''

భారత్, పాకిస్తాన్ టీవీ సీరియళ్లు
''మన దగ్గర తమదైన శైలిలో రాసే రచయితలు, దర్శకులు ఉన్నారు. భారతీయ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ, ప్రతి చానల్ అలాంటి పని చేస్తోంది'' అని ప్రముఖ రచయిత సాజి గుల్ అన్నారు.
ఇప్పటికీ పాకిస్తాన్ వినోద రంగంపై భారతీయ టీవీ చానళ్ల ప్రభావం ఉన్నప్పటికీ, అత్తాకోడళ్ల డ్రామానే ఎక్కువ ప్రజాదరణ పొందిన సూత్రం. ఎందుకంటే, భారతీయ చానళ్లు మన కేబుల్ ప్రసారాలపై కూడా అదే మసాలా చల్లాయి. అయితే, అది కేవలం మహిళలకే పరిమితమైంది.
అయితే, ఇప్పుడెలా ఉందని భారతీయ సీరియళ్ల గురించి అడిగినప్పుడు, ఇకపై చూడలేం, ఇప్పటికే చాలా కాలం గడిచిపోయిందని కొందరు చెప్పారు.
''మన సంస్కృతి వేరు. కానీ, ఆ సీరియళ్లలో చూపించే దుస్తులను బాగా ఇష్టపడతాం. అది చీర కావొచ్చు, లేదా లెహంగా కావొచ్చు. ఆ ఫ్యాషన్‌ను అనుసరించకుండా మాత్రం మమ్మల్ని ఎవరూ ఆపలేరు. చీరలు, వాటికి మ్యాచింగ్‌గా ఉండే ఆభరణాలు, వాటి డిజైన్, రంగులు.. అలాంటి వాటి కోసం దుబాయ్‌లో కూడా షాపింగ్ చేస్తుంటాం'' అని ఎక్కువగా లండన్‌లో ఉండే లాహోర్‌కి చెందిన పాకిస్తానీ గృహిణి చెప్పారు.
జీ, స్టార్ ప్లస్‌లో వచ్చే సీరియళ్లలో భారతీయ సంస్కృతిని బలంగా చూపించారని, ఆ ప్రభావం పాకిస్తానీ ప్రజలపై పడిందని కొందరు చెప్పారు. అది ఇప్పటికీ కొనసాగుతుందని అన్నారు.
ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకునేందుకు ఏ హిమాలయాలనూ దాటాల్సిన అవసరం లేదని కొందరు మహిళలు అన్నారు. ఒక ఇంటిలో రెండు భాగాలు మాత్రమే, మతం పేరుతో వేరయ్యాయి. పాకిస్తానీ యువత గురించి ఒకసారి మాట్లాడుకుంటే, వారి మాటల్లో హిందీ సీరియళ్లు, సినిమాల గురించిన ప్రస్తావన సర్వసాధారణం.
భారతీయ సీరియళ్లు, సినిమాల్లో ఉపయోగించే పదాలు పాకిస్తానీలు మాట్లాడే భాషలో కూడా కలిసిపోవడమే అందుకు ఉదాహరణ.

భారత్‌లో పాకిస్తానీ టీవీ సీరియళ్లు
అదే సమయంలో, పాకిస్తానీ రచయితలు రాసిన సీరియళ్లకు భారత్‌లోనూ మంచి ఆదరణ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.
సర్హాద్ పార్ నటించిన నూర్ ఉల్ హుదా షా, బి గుల్, ఫర్వాహ ఇష్తియాక్, ఉమేరా అహ్మద్ సీరియల్స్‌కు ఆదరణ దక్కింది.
ఫర్హాత్ ఇష్తియాక్ సీరియల్ హమ్‌సఫర్, పూర్తిగా పాకిస్తానీ సమాజం ఇతివృత్తంగా రూపొందింది. ఇరుదేశాల్లోనూ ఇది చర్చనీయాంశంగా నిలిచింది.
మన సమాజంలో జాగీర్దార్ల సమస్య చాలా పెద్దది. దీనిపై చాలా సీరియల్స్ వచ్చాయి. అయితే, రచయిత సల్మాన్ ఆసిఫ్ రచనల్లో పాకిస్తానీ జీవన స్థితిగతులకు, హిందూ మతంతో ఎలాంటి సంబంధం కనిపించదు.
భారత్‌లో చాలా పండుగలు ఉన్నాయని, వాటిని జరుపుకొంటున్నట్లు కొన్ని నాటకీయ ఎపిసోడ్‌లను చూపించొచ్చని, అవి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయని ఆసిఫ్ అన్నారు.
వివాహాల నుంచి వినోదం వరకూ పలుచోట్ల భారతీయ ఛాయలు కనిపించడానికి ఇదే కారణం.
నేటి టీవీ సీరియల్స్ మంచి ఆదరణ పొందుతున్నాయని, అలాంటి సీరియళ్లు రెండు దేశాల్లోనూ రూపొందుతున్నాయని ఆసిఫ్ చెప్పారు.
భారతీయ టీవీ సీరియల్స్, సినిమాలు నిజమైన భారతదేశాన్ని చూపించడం లేదని, అందులో చాలా తేడా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
భారత్ చాలా పెద్ద దేశం. కాబట్టి అక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయి. దిల్లీ క్రైమ్ అయినా, బాంబే బేగం అయినా నెట్‌ఫ్లిక్స్ బాగా ప్రమోట్ చేయడానికి కారణం కూడా అదే. అయితే, టీవీ సీరియళ్లు చూసే ప్రేక్షకులు, నెట్‌ఫ్లిక్స్ చూసే ప్రేక్షకులు వేర్వేరనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'ది రైల్వే మ్యాన్' సీరియల్ ప్రేక్షకులను కుదిపేసింది.
సమాజంలోని ప్రతి కథను రాసి తెరపై చూపించాలంటే చాలా ధైర్యం కావాలి. పాకిస్తానీ రచయితలకు అది అంత సులభం కాదు.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- భారతీయ అభిమానులకు తెగ నచ్చేసిన పాకిస్తానీ క్రికెట్ షో.. అంతలా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏం చేశారు?
- ముంబయి పేలుళ్ళ సూత్రధారి, లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కోరిన భారత్... ఇదీ పాకిస్తాన్ రియాక్షన్
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
- పాకిస్తాన్: ‘భారత్‌లో ఉన్న మా ఆయన్ను కలుసుకోవాలని ఉంది’ అంటున్న పాకిస్తానీ యువతి, అసలు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














