కాన్సర్బెరో: ఈ 26 ఏళ్ళ 'ర్యాప్ స్టార్' ఆత్మహత్య చేసుకోలేదు, లేడీ మేనేజరే ఆయనను చంపేసింది...

ఫొటో సోర్స్, SOCIAL NETWORKS
- రచయిత, రెడక్క్యాన్
- హోదా, బీబీసీ
‘‘నా లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే ఈ చేదు ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నందుకు దు:ఖపడుతున్నాను’’
ఇది వెనిజ్వెలాకు చెందిన ర్యాప్ స్టార్ కాన్సర్బెరో రాసిన ’డి మీ మ్యూర్టె’ పాటలో కొంత భాగం. 2015, జనవరి 19న కాన్సర్బెరో చనిపోవడం లాటిన్ అమెరికా సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
లాటిన్ అమెరికా, వెనిజ్వెలాలో ర్యాప్ ప్రపంచ ప్రతినిధిగా టైరోన్ జోస్ గొంజలాయెజ్ (కాన్సర్బెరో) అప్పటికే ప్రసిద్ధి పొందారు. ఆయన వయసు కేవలం 26 ఏళ్ళు.
కానీ, కాన్సర్బెరో మరణం ఈ వారం ఒక కీలక మలుపు తీసుకుంది. ఆయన మృతిపై వెనిజ్వెలా ప్రభుత్వం ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో కాన్బర్బెరో మేనేజర్ నటాలియా అమెస్టికా తన సోదరుడి సహాయంతో కాన్బర్బెరోను హత్యచేసినట్టు అంగీకరించినట్టుగా ఉంది.
కారకస్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని మరాకె పట్టణంలో ఓ భవనం పదో అంతస్తు నుంచి దూకి కాన్సర్బెరో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తొలుత అధికారులు తెలిపారు.
సహచర మ్యుజిషియన్ కార్లోస్ మోల్నార్‌ను హత్యచేసిన తరువాత కాన్బర్బెరో తాను కూడా భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.
అయితే, నటాలియా సోదరుడి కథనం ప్రకారం కాన్బర్బెరోను, మోల్నార్‌ను ఇద్దరినీ ఆమె పొడిచి చంపారు. ఆ తరువాత కాన్సర్బెరో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందరూ నమ్మేలా చేసేందుకు ఆయనను అపార్ట్‌మెంట్ కిటికీ నుంచి బయటకు విసిరేశారు.
కాన్సర్బెరో మృతి చెందేనాటికి వర్థమాన ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన గాయకులలో ఆయన కూడా ఒకరుగా ఎదుగుతున్నారు. ‘దిసీజ్ ఎపిక్’, ‘గైడ్ టు యాక్షన్’ పాటలతో ప్రసిద్ధి పొందడం మొదలైంది.
నిజానికి కాన్సర్బెరో కేవలం 26 ఏళ్ళ వయసులోనే రెండే రెండు అల్బమ్‌లతో బెస్ట్ స్పానిష్ ర్యాపర్‌గా ఎదిగారని రోలింగ్ స్టోన్ మ్యగజైన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, REDES SOCIALES
వీధుల నుంచి విజయాల దాకా...
కాన్బర్బెరోను స్పానిష్ ఉత్తమ ర్యాపర్‌గా ఎంపిక చేయడానికి రోలింగ్ స్టోన్ మ్యాగజైన్‌కు స్పష్టమైన కారణం ఉంది.
‘‘ఆయన పాటలు సంక్లిష్టతను, చీకటి కథలను చెబుతాయి. అవి ఎంతో ఆలోచనాత్మకంగా, బతుకును, చావు, అన్యాయాలను ప్రతిబింబించేలా ఉంటాయి.’’
‘‘ఆయన గైడ్ టు యాక్షన్’ పాట ఇందుకో ఉదాహరణ. ‘‘నేను బోధకుడిని కానని అర్థం చేసుకున్నాను. అందమైన ప్రపంచాన్ని కోరుకోవడానికి ధైర్యం ఉన్న పిల్లాడిని నేను. లక్ష్యాన్ని, మెరుగుదలను మరిచి విలాసవంతమైన కారును, ఇల్లు పొందాలనుకునేవారిని చూసి కలత చెందుతాను. నా ఇంట్లో ఈత కొలను ఉండాలని కోరుకుంటాను. కానీ, ఆ మూలలో ఎక్కువమంది పిల్లలను చూడాలనుకోను’’
కాన్సర్బెరో ర్యాపర్‌గా ప్రసిద్ధి చెందడానికి ఆయన తన బాల్యంలోనూ, కౌమారదశలోను అనుభవించిన వేదనలను సహజసిద్ధంగా, తెలివైన మార్గంలో చెప్పడమేనంటారు నిపుణులు.
కాన్సర్బెరో మార్చి 11, 1988న కారకస్‌లో జన్మించారు.
ఆయనకు 9 ఏళ్ళు వయసున్నప్పుడు తల్లి మరణించారు. ఈ బాధను మరిచిపోయేందుకు ఆయన సంగీత ప్రపంచానికి దగ్గరయ్యారు. ముఖ్యంగా హిప్-హాప్‌లో స్వాంతన పొందారు.
‘నిజానికి నాకు నా స్నేహితుడు బ్లాక్ కమికాజేతో కలిసి అఫ్రోమాక్‌కు వెళ్ళేవరకు నాకు హిప్-హాప్ అంటే ఏమిటో తెలియదు. ఆ తరువాత నాకు రాప్ జ్వరం పట్టుకుంది. దీని తరువాత నేను అఫ్రోమాక్‌తో కలిసి ఓ గ్రూపును ఏర్పాటు చేశాను’’ అని కాన్సర్బెరో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈయన బారియో కోడ్స్ పేరుతో ఓ గ్రూపు ఏర్పాటు చేశారు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఆయన మూడుపాటలను రికార్డ్ చేయగలిగారు. వీటితో హిప్-హాప్ ప్రపంచంలో ఓ స్థానాన్ని పొందేందుకు ఈ పాటలు ఆయనకు ప్రేరణగా నిలిచాయి.
కానీ అదంత తేలికగా జరగలేదు. కాన్సర్బెరో పగలంతా పనిచేసేవారు. తన స్నేహితుడి ఇంట్లో కట్టిన స్టూడియోలో పాటల రికార్డింగ్ కోసం నిద్రలేని రాత్రులు గడిపేవారు. ఈ స్థలాన్ని వారు ఎల్ టెక్కో అని పిలిచేవారు.
2000 సంవత్సరంలో కాన్సర్బెరో మరో విషాదాన్ని అనుభవించాల్సి వచ్చింది.
సవతి సోదరుడి మరణం ఆయనను తీవ్రంగా బాధించింది.
అయితే 12 ఏళ్ళ తరువాత ‘మ్యూరెటె’ ఆల్బమ్ చేయడానికి ఈ సంఘటనే ప్రేరణగా నిలిచింది.
ఈ ఆల్బమ్ 2012లో విడుదలై వెనిజులాలోనే కాక ఆ ఖండమంతటా రాప్ సంగీతానికి ఓ కొండగుర్తులా నిలిచింది.
ఈ పాటలోని సాహిత్యం కారణంగా ఇతనిని ‘టెర్రిబుల్ చైల్డ్ ఆప్ వెనిజులా’ అనిపిలిచేవారు. తరువాత ఈయన పాటలు ఎంతో విస్తృతి పొందాయి.
‘‘నేనీ రోజు నేరస్తుడిలా మారుతున్నాను. నాకు ఎవరిపైనా నమ్మకం లేదు, నేనో మృతుడిని అయితే తప్ప, నేను నా తండ్రికి ప్రమాణం చేసినట్టు నా తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకుంటాను, పంటికి పన్ను, కంటికి కన్ను, నేనేమీ అథోజగత్తు నేరగాడిని కాను, కానీ నా కోపం తగ్గడం లేదు.. అది నన్నెంతో ఉక్కపోతకు గురిచేస్తోంది’’ అని ఇట్స్ ఎపిక్ అనే పాటలో రాశారు.
దీని తరువాత ఆయన ‘విడా’ అనే ఆల్బమ్ విడుదల చేశారు. ఇది యూట్యూబ్‌లో రెండుకోట్ల మంది చూశారు.

ఫొటో సోర్స్, THE NATIONAL
కాన్సర్బెరో ఎందుకు హత్యకు గురయ్యారు?
తన ఆల్బమ్‌లతో అంతర్జాతీయ గుర్తింపురావడంతో కాన్సర్బెరో వెనిజులాతోపాటు కొలంబియా, అర్జంటీనా ఇతర దేశాలలో కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టారు.
తన కెరీర్‌పై హిప్-హాప్ ప్రభావం ఉందని అంగీకరిస్తూనే ఆయన తనను తానో సాధారణ ర్యాపర్‌గా పరిగణించుకునేవారు.
ఆయన కెరీర్ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న వేళ మరణించారు.
2015, జనవరి 19న ప్రముఖ గిటారిస్ట్ కారోస్ మోల్నార్‌తో కలిసి పనిచేయాలనే ఆలోచనతో ఆయన అపార్ట్‌మెంట్ వద్ద ఉన్నారు కాన్సర్బెరో.
కానీ ఈ సమావేశం విషాదాంతమైంది. వీరు చనిపోయి పడి ఉండటాన్ని గుర్తించారు.
నటాలియా అమెస్తికా ఆ సమయంలో కాన్సర్బెరో మాజీ మేనేజర్‌గా ఉన్నారు. ఈమె మోల్నార్ భార్య. ఈమె వీరిద్దరికి కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చింది. మోల్నార్ నిద్రలోకి జారుకున్నాకా అతని మెడపై కత్తితో పొడిచింది. దాంతోపాటు కాన్సర్బెరోను కూడా చచ్చేలా గాయపరిచింది.
ఇలా రెండు నేరాలకు పాల్పడిన నటాలియా తరువాత ఇక్కడేదో గొడవ జరిగి, కాన్బర్బెరో ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించేందుకు తన సోదరుడి సాయం కోరింది.
‘‘కాన్సర్బెరో, మోల్నార్ మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో మోల్నార్‌ను కాన్సర్బెరో కత్తితో పొడిచినట్టు తరువాత అతను ఓ పైపుపై పడి మొహం పగులకొట్టుకున్నట్టు ..’’ ఓ కల్పితగాథను సృష్టించారని ప్రాసిక్యూటర్ కార్యాలయం డాక్యుమెంట్ ఒకటి తెలిసింది.
కాన్సర్బెరో, మెల్నార్ హత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని వెనిజ్వెలా ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి :
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- ‘డెవిల్’ రివ్యూ: నేతాజీతో మర్డర్ మిస్టరీని ముడిపెట్టిన ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














