రూపాయిల్లోనే విదేశీ చెల్లింపులకు ఎక్కడ బ్రేక్ పడుతోంది.. చైనాకు సాధ్యమైనది భారత్‌కు ఎందుకు కావడంలేదు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఆదర్శ్ రాథోడ్
- హోదా, బీబీసీ కోసం
ఇప్పటిదాకా ముడి చమురును అమెరికా డాలర్లలో కొనుగోలుచేస్తున్న భారత్ మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు రూపాయిలలో చెల్లించింది.
రూపాయిని అంతర్జాతీయీకరణ చేయాలనే భారత్ ప్రయత్నాలలో దీనినొక మైలురాయిగా పరిగణిస్తున్నారు.
ఈ ఏడాది జులైలో ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించినప్పుడు ఇకపై ఈ రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను తమ తమ కరెన్సీలలోనే కొనసాగించాలనే ఒప్పందానికి వచ్చాయి.
దీని తరువాత అబుదాబి జాతీయ చమురు కంపెనీ అడ్నాక్ నుంచి భారత చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ పది లక్షల బారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసి భారతీయ రూపాయిలలో చెల్లించింది.
మిగతా చమురు సరఫరాదారుల కు కూడా రూపాయిలలో చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారవర్గాలు తెలిపినట్టుగా పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
అయితే ఈ ప్రయత్నాలేవీ అంతగా విజయవంతం అయినట్టు కనిపించడం లేదు.
ఇంధనాన్ని గరిష్ఠంగా వినియోగించే దేశాలలో ప్రపంచంలో భారత్ మూడోస్థానంలో ఉంది. కానీ తన అవసరాలలో 15శాతం మాత్రమే అది ఉత్పత్తి చేయగలుగుతోంది.
ఇలాంటి పరిస్థితులలో భారత్ ముడిచమురుపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ ముడిచమురును కొనుగోలు చేసిన తర్వాత భారత్‌లో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాలలో వీటిని పెట్రోల్‌గానూ, డీజిల్‌గానూ మార్చుతారు.
ప్రస్తుతానికైతే భారత్ తాను ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా డాలర్లలోనే చెల్లింపులు జరుపుతోంది.
అయితే, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత రూపాయిని ప్రోత్సహించేందుకు ఎగుమతులు, దిగుమతుల చెల్లింపులన్నీ రూపాయిలలోనే జరిగేందుకు 2022 జులై 11న ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
కానీ, ఇలాంటి ప్రయత్నాల నుంచి చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించడం లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆయిల్ కంపెనీలు దిగుమతుల కోసం చేసిన చెల్లింపులన్నీ రూపాయిలలో చేయలేదని, ఇటీవల భారత ఇంధన మంత్రిత్వశాఖ పెట్రోలియం, సహజవాయువులపై వేసిన పార్లమెంటరీ కమిటీకి తెలిపింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) సహా ముడి చమురు సరఫరా చేసే సంస్థలన్నీ ఆయిల్’కు బదులుగా తాము అందుకున్న భారత కరెన్సీని తమకు నచ్చిన కరెన్సీలోకి మార్చుకోవడానికి,ఈ ప్రక్రియలోని ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాయని పేర్కొంది.
కిందటి వారం పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఇంధన మంత్రిత్వ శాఖ చెప్పిన విషయాలను పేర్కొంది.
భారతీయ కరెన్సీలో ముడి చమురును కొనుగోలు చేయాలని ఇప్పటిదాకా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ప్రభుత్వ చమురు సంస్థలు కానీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెప్పింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రూపాయి గ్లోబల్ కరెన్సీ ఎందుకు కాలేకపోతోంది?
భారత్ ఎప్పటి నుంచో రూపాయి అంతర్జాతీయీకరణ కోసం ప్రయత్నిస్తోంది. దీనిపై బ్రిక్స్ దేశాలు కూడా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఏడాది జూన్‌లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలు, వాణిజ్య భాగస్వాములతో అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన కరెన్సీలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ దేశాల మంత్రులు నొక్కి చెప్పారని ప్రకటన విడుదల చేసింది.
దీని తరువాత జులై 5, 2023న భారత రూపాయి అంతర్జాతీయీకరణ చెందేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అంతర్గత విభాగ బృందం ఓ రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.
కానీ, ఇలాంటి పథకాలు ఆశించిన విజయాన్ని అందుకున్నట్టుగా కనిపించడం లేదు.
ప్రసిద్ధ ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా మాట్లాడుతూ ‘‘ రూపాయి పూర్తిస్థాయి మారకం’’ కాకపోవడమే దీనికి కారణమని చెప్పారు.
వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తమ డబ్బును ఏదైనా అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ వద్ద స్థిరమైన లేదా అనువైన ధరలకు మార్చగలిగినప్పుడు మాత్రమే దానిని ‘పూర్తి మారక కరెన్సీ’ అని పిలవగలుగుతామని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది.
రిజర్వ్ కరెన్సీని కన్వర్టబుల్ (మారక కరెన్సీ) కరెన్సీ అని అంటారు. దీనిని అంతర్జాతీయ వాణిజ్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వీటిని దేశాల ఫెడరల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలుగానూ ఉంచుకోవచ్చు.
“పూర్తిగా కన్వర్టబుల్ కాకపోవడానికి కారణం, మీరు విదేశాలకు ఇక్కడి డబ్బు తీసుకొని వెళ్ళి అక్కడి కరెన్సీలోకి మార్చాలనుకుంటే, అది జరగదు. అదే మీ దగ్గర డాలర్లు, పౌండ్లు, యూరోలు లేదా యెన్ లాంటి కరెన్సీ ఉంటే, విదేశీ కరెన్సీలను మార్పిడి చేసే ఏ బ్యాంకైనా దానిని మారుస్తుంది. చమురు కొనుగోలు విషయంలోనే ఇదే వర్తిస్తుంది’’ అంటారు నరేంద్ర తనేజా.
‘‘చాలామంది చమురు సరఫరా దారులు డాలర్లలోనే చెల్లింపులు జరగాలని కోరుకుంటారు. వారు కనుక రూపాయల్లో చెల్లింపులు తీసుకుంటే, వాటిని వారు భారత్‌లో మాత్రమే వినియోగించగలరు’’ అంటారు నరేంద్ర.
‘‘ వారు ఇండియా కోసం కొనుగోళ్ళు, దిగుమతులు చేసుకోవచ్చు. వాణిజ్యం చేయడానికి ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టొచ్చు. కానీ చమురు ఎగుమతి కంపెనీలు మేము కేవలం చమురు అమ్ముతాం, ఇలాంటి పనులు చేయమని చెబుతాయి. అందుకే మన రూపాయికి అంతర్జాతీయ ఆమోదం లభించడం లేదు. అలాగే, ఈ కంపెనీలు భారత రూపాయిని మరో కరెన్సీలోకి మార్చుకోవడానికి సిద్ధపడితే అందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
పార్లమెంటులో సమర్పించిన నివేదికలో ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నామని, భారత రూపాయిలను ఆమోదిస్తున్న కంపెనీలు తరువాత వాటిని మారకం చేసుకోవడానికి అయ్యే ఖర్చును కూడా వసూలు చేస్తున్నాయంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పిన మాటలను ప్రస్తావించింది.
కిందటేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీ ఓస్ట్రో ఖాతాలను తెరిచేందుకు భారత వాణిజ్య భాగస్వామి దేశాలకు అంగీకారం తెలిపింది.
ఈ ఏర్పాటు వలన భారతదేశ దిగుమతిదారులు రూపాయిలలోనే చెల్లింపులు జరుపుతారు. వీటిని సంబంధిత దేశానికి సంబంధించిన ఓస్ట్రో ఖాతాలో జమచేస్తారు.
‘‘ముడి చమురు కొనుగోలు కోసం చెల్లింపులన్నీ భారతీయ రూపాయిలలో జరుగుతాయి. ఈ రూల్స్ ను అనుసరించాలా వద్దా అనేది సరఫరాదారు ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది.’’ అని చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రూపాయి, స్థిరమైన మంచి కరెన్సీ. కానీ దీనిని పూర్తి ‘మారకం’గా మార్చకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది.

ఫొటో సోర్స్, REUTERS
చైనా యువాన్ పెరుగుదల ఎలా సాధ్యమైంది?
చైనా కరెన్సీ యువాన్ ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా అది కూడా భారత్ రూపాయిలానే పూర్తిస్థాయి మారకం కాదు. చైనా తన యువాన్‌లలో ఆయిల్ కొనుగోలుచేయడమే కాదు, చాలా దేశాలతో తన కరెన్సీలోనే వ్యాపారాలు చేస్తోంది.
కొన్నిసార్లు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి భారత దిగుమతిదారులు కూడా దుబాయ్ బ్యాంకుల ద్వారా యువాన్‌లలో చెల్లించారు.
చాలా దేశాలకు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెద్ద ఎత్తున ఉండటం వలన యువాన్‌లను తీసుకోవడానికి అవి అసలేమాత్రం ఇబ్బంది పడవు అని నరేంద్ర తనేజా ఇందుకు కారణాన్ని వివరించారు.
‘‘ చైనా ఫెద్ద ఎత్తున చౌకైన వస్తువులను ఉత్పత్తి చేసి, అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్ కూడా మొబైల్ విడిభాగాలు, ఔషధాలకు సంబంధించిన ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులాంటి ముఖ్యమైన వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది’’ అని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.
‘‘ చైనా వ్యాపారం చేయని దేశమంటూ లేదు. ఆయిల్ కొనుగోళ్ళ కోసం చైనా యువాన్‌లను చెల్లించినా, దానికి ప్రతీగా వారు ఆ దేశం నుంచి ఏదో ఒకటి కొనుగోలు చేసుకుంటారు’’ అని నరేంద్ర తనేజా చెబుతారు.
అందుకే యువాన్ పూర్తి మారకంగా మారకపోయినా చాలా దేశాలలో అంగీకరించడానికి కారణమిదే.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రష్యాకు ‘రూపాయి’ భారమెందుకు అయింది?
ఇండియా తన పొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఇరాన్ తోపాటు మిత్రదేశమైన రష్యాతో రూపాయిలోనే వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుందని వాణిజ్య శాఖా సహాయమంత్రి అనుప్రియ పటేల్ ఈ ఏడాది ఆగస్టులో చెప్పారు.
దీనికి ముందు రూపాయిలలో వాణిజ్యం చేసే విషయమై రష్యా ఇండియాతో చర్చలు నిలిపి వేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశం కోసం ఈ ఏడాది మేలో గోవాకు వచ్చినప్పుడు ‘‘ రష్యాకు సంబంధించిన బిల్లియన్ల కొద్దీ ఇండియన్ కరెన్సీ భారతీయ బ్యాంకులలో మూలుగుతోందని, కానీ దానిని తాము వినియోగించడంలేదని’’ చెప్పారు.
‘‘రష్యాకు చెల్లించిన ఈ రూపాయిలన్నీ ఇండియన్ బ్యాంకులలోనే న్నాయి. దీంతో రష్యన్లకు ఈ డబ్బును ఇక్కడ ఏదైనా కంపెనీలోకానీ, బ్యాంకుల్లోకానీ పెట్టుబడిగా పెట్టాలి. కానీ రష్యా తమ దగ్గర ఏం చేసుకోవాలో తెలియనంత భారత కరెన్సీ ఉందని చెబుతోంది’’ అని చెప్పారు తనేజా.
ఇండియా రష్యా వాణిజ్యం 2022 నాటికల్లా 27 బిలియన్ డాలర్లకు చేరిందని, అందులో భారత ఎగుమతులు కేవలం 2 బిలియన్ డాలర్లేనని భారత రాయబారి పవన్ కపూర్ రష్యా, ఇండియా వాణిజ్య చర్చల ఫోరమ్‌లో చెప్పారు.
ఎగుమతులు, దిగుమతుల మధ్య సమన్వయం ఉండాలని పవన్ కపూర్ చెప్పారు.
ప్రస్తుతానికి భారత్ ఎగుమతుల కంటే రస్యా 14 రెట్లు ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది.
ఇండియా, రష్యా మధ్య వాణిజ్యం సమానస్థాయిలో ఉంటే సమస్యేమీ ఉండదు. యూఏఈ నుంచి చమురు కొనుగోలు ఇందుకో ఉదాహరణగా చెప్పొచ్చు.
‘‘ఇండియా యూఏఈ నుంచి డాలర్లలో డబ్బు పంపుతుంటుంది. యూఏఈతో భారత్‌కు మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అనేక దేశాలతో మన వాణిజ్యం, బిల్లింగ్ అంతా యూఏఈ నుంచే జరుగుతుంది’’
‘‘ఉదాహరణకు పాకిస్తాన్‌తో భారత్‌కు నేరుగా వాణిజ్య బంధాలు అంత బాగా లేవు. కానీ భారత్‌కు ఐదుబిలియన్ డాలర్ల వస్తువులు యూఏఈ ద్వారా పాకిస్తాన్ చేరుతుంటాయి. అలాంటి పరిస్థితులలో యూఏఈకు డబ్బు చెల్లించినా, దానిని మార్పడి చేసుకోవడం పెద్ద కష్టం కాదు’’

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎగుమతులను బలోపేతం చేయాలి
ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఆమోదం పొందాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఆర్థిక వేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ జవాబిస్తు భారత ఎగుమతులు బలోపేతం కాకుండా మనం రూపాయి పూర్తి మారకానికి చేరుకోలేం.
‘‘ఇప్పటిదాకా మన వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది. మన దగ్గర 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిధులు ఉన్నాయి. నిజానికి ఈ మొత్తమంతా రుణమే. ఇదంతా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్, భారతీయ కంపెనీలు చేసిన అప్పులే ఈ నిధులు. అంతేకానీ మనం సంపాదించింది కాదు’’ అని అరుణ్ కుమార్ చెప్పారు.
చైనా దగ్గర అయితే 30 ట్రిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఈ దేశం వాటిని ఎవరికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
‘‘ మనం విదేశీ కరెన్సీ రూపంలో చెల్లిస్తే మన రుణం తగ్గుతుంది. మనం ఎగుమతులు, దిగుమతులు, వస్తుసేవలలో అగ్రస్థానం సాధించినప్పుడు మన రూపాయిని అంతర్జాతీయంగా ఆమోదించడానికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ చెప్పారు.
‘‘మనం కేవలం ముడి సరుకులే ఎగుమతి చేస్తాం. పరిశోధనలు, అభివృద్ధి, సాంకేతికతపైన దృష్టిసారించి, ఈ రంగాలలో అభివృద్ధి చెందితే మన రూపాయి కూడా అంతర్జాతీయీకరణ చెందుతుంది’’ అని అరుణ్ వివరించారు.
ఇవి కూడా చదవండి :
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- ఆంధ్రప్రదేశ్: విదేశీ పందెం కోళ్లను విమానాల్లో దించుతున్నారు, ఏ దేశపు కోడికి డిమాండ్ బాగా ఉందంటే..
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














