మోదీ పాలనలో భారతదేశం అప్పు రూ. 100 లక్షల కోట్లు పెరిగిందా... కాంగ్రెస్ ఆరోపణలో నిజం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్షుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మోదీ ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్లలో భారతదేశ అప్పును మూడు రెట్లు పెంచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ‘‘మహాసంపర్క్ అభియాన్’’ కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ కార్యకర్తలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను చాటి చెబుతున్నారు.
గత శనివారం ఈ విషయంపైనే కాంగ్రెస్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది.
విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితికి మోదీ ప్రభుత్వం చేసిన ఆర్థిక దుర్వినియోగమే కారణమని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ ఆరోపణలు ఏంటి?
సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ, ‘‘మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటోంది కాబట్టి వారికి ఇప్పుడు అసలు నిజాలు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. మోదీ కంటే ముందు దేశాన్ని పాలించిన 14 మంది ప్రధానులు చేయలేని రికార్డును నరేంద్ర మోదీ జీ నెలకొల్పారు.
గడిచిన 67 ఏళ్లలో 14 మంది ప్రధానమంత్రులు కలిసి మొత్తం రూ. 55 లక్షల కోట్ల అప్పు చేశారు.
అయితే, ప్రతీ రేసులో ముందు ఉండాలని తాపత్రయపడే నరేంద్రమోదీ గత తొమ్మిదేళ్లలో భారతదేశ అప్పును మూడింతలు పెంచారు. కేవలం తొమ్మిదేళ్లలో 100 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు’’ అని అన్నారు.
2014 వరకు దేశ అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, అది ఇప్పుడు 155 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని సుప్రియా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ జవాబు
కాంగ్రెస్ ఆరోపణలకు బదులిస్తూ బీజేపీ, అప్పును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కోణంలోనే చూడాలని చెబుతోంది.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ దీని గురించి ఒక ట్వీట్ చేశారు. “ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేదాన్ని ద్రవ్య లోటును ప్రమాణంగా తీసుకుంటూ కొలుస్తారు.
2013-14 నుంచి 2022-23 వరకు దేశ జీడీపీ రూ. 113.45 లక్షల కోట్ల నుంచి రూ. 272 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 139 శాతం వృద్ధి సాధించింది. అప్పులు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు ద్రవ్యలోటును తగ్గించింది.
అయితే, 2020-21లో కొద్దికాలం పాటు ఇది పెరిగింది. కరోనా కారణంగా ఆ సమయంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలే ఇందుకు కారణం. ఇప్పుడు అది మళ్లీ తగ్గింది’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
2014 వరకు కేంద్ర ప్రభుత్వ అప్పు
కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్పు పరిస్థితి గురించి భారత ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది.
అధికారిక వెబ్‌సైట్‌లో 2014 వరకు 'భారత ప్రభుత్వ అప్పు'కు సంబంధించిన బడ్జెట్ పత్రాలు ఉన్నాయి.
ఈ పత్రాల ప్రకారం, 2014 మార్చి 31నాటికి, భారత ప్రభుత్వ అప్పు రూ. 55.87 లక్షల కోట్లుగా ఉంది.
ఇందులో రూ.54.04 లక్షల కోట్లు అంతర్గత రుణాలు కాగా రూ.1.82 లక్షల కోట్లు విదేశీ రుణాలు.
అంతర్గత రుణాల్లో బహిరంగ మార్కెట్‌లో సేకరించిన రుణాలు, రిజర్వ్ బ్యాంక్‌కు జారీ అయిన ప్రత్యేక షేర్లు, ఇతర బాండ్లు ఉంటాయి.
వాణిజ్య బ్యాంకులు, ఇతర దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సహా విదేశీ రుణదాతల నుంచి తీసుకున్న రుణాలను విదేశీ రుణాలుగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, INDIABUDGET.GOV.IN
2023 వరకు కేంద్ర ప్రభుత్వ అప్పు
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో, 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అప్పు రూ.152.61 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
ఇందులో, అంతర్గత రుణం దాదాపు 148 లక్షల కోట్ల రూపాయలు కాగా, విదేశీ రుణం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు.
అదనపు బడ్జెట్ వనరులు (ఈబీఆర్), నగదు నిల్వలను ఇందులో కలుపుకుంటే మొత్తం రుణ అంచనా రూ. 155.77 లక్షల కోట్లు అవుతుంది.

ఫొటో సోర్స్, INDIABUDGET.GOV.IN
అప్పులపై ఆర్థిక మంత్రి అధికారిక ప్రకటన
ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రభుత్వ అప్పుల గురించి ప్రశ్న అడిగారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎంపీ నామా నాగేశ్వరరావు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఈ ప్రశ్న అడిగారు.
దీని తర్వాత, 2023 మార్చి 20న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా ఎంపీ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
"2023 మార్చి 31 నాటికి, కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు దాదాపు రూ. 155.8 లక్షల కోట్లు (జీడీపీలో 57.3 శాతం)గా అంచనా వేశారు.
ఇందులో, ప్రస్తుత మారకపు రేటు ప్రకారం విదేశీ రుణం రూ. 7.03 లక్షల కోట్లు (జీడీపీలో 2.6 శాతం)గా అంచనా’’ అని ఆమె సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, SANSAD.IN
మోదీ ప్రభుత్వ హయాంలో అప్పులు వేగంగా పెరిగాయా?
కాంగ్రెస్ ప్రభుత్వ వాదన చూస్తుంటే, మోదీ ప్రభుత్వ హయాంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
గత అయిదు ప్రభుత్వాలు తమ పాలనకాలంలోని చివరి ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా వెల్లడించిన రుణాల గణాంకాలను బీబీసీ విశ్లేషించింది.
దీని ప్రకారం, ప్రతీ అయిదేళ్లకోసారి ప్రభుత్వ అప్పులు దాదాపు 70 శాతం పెరిగినట్లు కనిపించింది.
దీనికి గల కారణాన్ని ఆర్థికవేత్త అరుణ్ కుమార్ వివరించారు.
‘‘ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చు ఎంత అవుతుంది? అనే అంశాలపై ఆ ప్రభుత్వానికి చెందిన అప్పులు ఆధారపడి ఉంటాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం అప్పు చేయాల్సి ఉంటుంది. దీని ప్రభావం నేరుగా ప్రభుత్వ ఆర్థిక లోటుపై పడుతుంది.
‘‘1980 తర్వాత నుంచి మనం బడ్జెట్‌లో రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాం. రెవిన్యూ లోటు అంటే ప్రస్తుత మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం. అందుకే ఖర్చులను ఎదుర్కోవడం కోసం అప్పు చేయాల్సి వస్తోంది. బడ్జెట్‌లో ఎక్కువ భాగం రెవిన్యూ లోటుకే కేటాయిస్తారు. అలా అప్పులు పెరుగుతూనే ఉంటాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANANT PRAKASH/BBC
అప్పులు తీసుకొని ప్రభుత్వాలు ఎక్కడ ఖర్చు చేస్తాయి?
ప్రభుత్వాలు ఎందుకు రుణాలు తీసుకుంటాయి? తీసుకున్న అప్పులను ఎక్కడ ఖర్చు పెడతాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మేం ఆర్థిక విశ్లేషకుడు పరంజాయ్ గుహా ఠాకుర్తా, ఎకనమిక్ అనలిస్ట్ డా. సువ్రోక్మల్ దత్తాతో మాట్లాడాం.
పరంజాయ్ గుహా ఠాకుర్తా, ఆర్థిక విశ్లేషకుడు

ఫొటో సోర్స్, Getty Images
పరంజాయ్ మాట్లాడుతూ, “మోదీ ప్రభుత్వం వద్ద అప్పు తీసుకోవడం తప్ప మరో దారి లేదు. తాయిలాలు ఇస్తున్నారని మోదీ ప్రభుత్వం ఇతరులను నిందిస్తుంది. కానీ, మోదీ ప్రభుత్వమే స్వయంగా ఈ తాయిలాలను పంచుతుంది. ఇలా చేయాలంటే అప్పు తీసుకుంటేనే సాధ్యం అవుతుంది.
ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్న అప్పుల భారం మన మీద మాత్రమే కాదు భవిష్యత్తులో దీని భారం మన పిల్లలపై కూడా పడుతుంది.
ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరగకపోతే, ఉపాధి పెరగకపోతే, మన దేశంలో ధనవంతులు-పేదల మధ్య వ్యత్యాసం తగ్గకపోతే, మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వం అప్పుల మీదనే నడుస్తుంది’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ధనికులు మరింత ధనవంతులుగా మారారు.
జీడీపీని పెంచడం గురించి చెబుతూ, "జీడీపీని లెక్కిస్తున్న పద్ధతి సరైనది కాదు" అని పరంజాయ్ గుహా ఠాకుర్తా అభిప్రాయపడ్డారు.
“స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేటాయింపుల గురించి ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వదు. జీడీపీ గణాంకాలను చూస్తే మీకు మొత్తం కథ అర్థం కాదు.
దేశంలోని కొద్దిమంది పారిశ్రామికవేత్తల ఆస్తుల విలువ పెరిగినందున జీడీపీ పెరిగిందా? లేక దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి ఆస్తులు పెరగడం వల్ల పెరిగిందా? ఆర్థిక వ్యవస్థలో ధనిక, పేదల మధ్య అసమానతలు జీడీపీ గణాంకాల ద్వారా తెలియవు’’ అని అన్నారు.
అప్పుగా తీసుకున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి?
పరంజాయ్ గుహా ఠాకుర్తా ప్రకారం, ప్రభుత్వం అప్పుగా తీసుకున్న డబ్బును ఉచిత పథకాలు, కొత్త పార్లమెంటు వంటి అంశాలపై ఖర్చు చేస్తోంది.
“ఉచితంగా గోధుమలు, బియ్యం, సిలిండర్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కిసాన్ సమ్మాన్ నిధిని ఇస్తున్నామని అంటుంది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని ఈ పనులకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇవే కాకుండా కొత్త పార్లమెంట్ నిర్మాణానికి కూడా అప్పు డబ్బును ప్రభుత్వం వినియోగిస్తుంది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, DR. SUVROKAMAL DUTTA
'హిట్ అండ్ రన్' కాంగ్రెస్‌కు అలవాటు
ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ సువ్రోక్మల్ దత్తా బీబీసీతో మాట్లాడుతూ, ఆరోపణలు చేసి పారిపోవడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని అన్నారు.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ‘‘హిట్ అండ్ రన్’’ రాజకీయాలకు దిగిందని వ్యాఖ్యానించారు.
‘‘ అప్పు గురించి కాంగ్రెస్ కొన్ని గణాంకాలు ఇచ్చింది. కానీ, ఆ గణాంకాలకు సంబంధించిన మూలం మాత్రం చెప్పలేదు. ముందుగా ఆరోపణలు చేసి తర్వాత పారిపోవడం అనే హిట్ అండ్ రన్ రాజకీయాలను ఈ మధ్య కాంగ్రెస్ చేస్తోంది. 2014 ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది.
దేశ రుణం రెండింతలు లేదా మూడింతలు అయిందంటూ భారత ప్రభుత్వం గానీ, ఏ అంతర్జాతీయ సంస్థ గానీ అధికారికంగా ఎలాంటి డేటా విడుదల చేయలేదు.
నిర్మలా సీతారామన్ కూడా 2014 నుంచి నేటి వరకు అప్పులకు సంబంధించిన లెక్కలను ఎప్పుడూ ఇవ్వలేదు. 2023 వరకు మొత్తం అప్పు రూ. 155 లక్షల కోట్లు అని మాత్రమే ఆమె చెప్పారు. ఇందులో పాత కాంగ్రెస్ ప్రభుత్వాల అప్పు కూడా మిళితమై ఉంటుంది. దాదాపు అరవై ఏళ్లు దేశాన్ని పాలించింది కాంగ్రెస్ కాబట్టి అప్పటి అప్పు కూడా తోడవుతుంది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














