యోగి ఆదిత్యనాథ్ 'యూపీ మోడల్' వచ్చే ఎన్నికల్లో బీజేపీని నడిపిస్తుందా... ఆయనే మోదీ వారసుడా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వాత్సల్య రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లో 2017 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీతో విజయం సాధించింది. దాదాపు 15 ఏళ్ల తరువాత అక్కడ అధికారంలోకి వచ్చింది.
ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై చర్చ జరిగినప్పుడు పలు పేర్లు ముందుకొచ్చాయి.
చివరికి, యోగి ఆదిత్యనాథ్ పేరును ఖరారు చేశారు. చాలామందికి ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.
ముఖ్యమంత్రి రేసులో యోగి ఆదిత్యనాథ్ ఎలా గెలుపొందారన్నది ఇప్పటికీ చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది.
అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కొన్నాళ్ల క్రితం ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
"యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు, ఆ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. యోగి ఎన్నడూ మునిసిపాలిటీని కూడా నడపలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎలా నిర్వర్తించగలరని సందేహాలు వ్యక్తం చేశారు. యోగి ఒక సన్యాసి. ఆయన ఒక పీఠాధీశుడు. మీరు ఆయన్ను ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తున్నారా అంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్లు చెప్పింది నిజమే, ఆయన ఎప్పుడూ ఏ పదవిలోనూ లేరు" అని అమిత షా అన్నారు.
కానీ, ఆరేళ్ల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ కాగలరు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయి పార్టీలో సమకాలీన నాయకుల కంటే ఎత్తుకి పెరిగిందని బీజేపీ కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
"దిల్లీలో మోదీ, యోగి ఇద్దరి పోస్టర్లూ కనిపిస్తుంటాయి. పార్టీలో యోగి హోదా రెండవ స్థానానికి ఎగబాకింది. అందరినీ వెనక్కి నెట్టి ఆయన ముందుకు వెళ్లిపోయారు" అని సీనియర్ జర్నలిస్ట్ రాధికా రామశేషన్ అన్నారు. ఆమె చాలాకాలంగా బీజేపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని ఎన్నికల్లోనూ ముందుకు దూసుకెళుతూ..
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే అప్పుడు ఆయన ప్రభావం పరిమితంగా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.
యోగి ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో చాలా మార్పులు వచ్చాయని, 'యూపీ మోడల్'ను తీసుకొచ్చారని చెబుతున్నారు.
2014కు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్యకర్తలు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుకునేవారు. అదేవిధంగా, యోగి సీఎం అయ్యాక యూపీ మోడల్ గురించి మాట్లాడుతున్నారు.
"యోగి ప్రభావం చాలా ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక (బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు) కూడా యూపీ మోడల్ గురించి మాట్లాడుతున్నాయి" అన్నారు రాధిక రామశేషన్.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి విజయం తరువాత విజయం లభిస్తుండడంతో 'యూపీ మోడల్'పై సర్వత్రా చర్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"ఫలితాల బట్టి వ్యక్తుల సామార్థ్యాన్ని అంచనా వేస్తారు. యోగి విషయంలో కూడా అదే జరుగుతోంది. 2017లో అధికారంలోకి వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి వ్యతిరేకంగా 64 సీట్లు గెలవడం చిన్న విషయం కాదు. బీజీపీ తుడిచిపెట్టుకుపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. రెండోసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కచ్చితంగా పెద్ద విషయం. ఈమధ్యే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. అన్ని పెద్ద నగరాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదీ యోగి రిపోర్ట్ కార్డు" అని సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర సింగ్ చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ 'యోగి ఆదిత్యనాథ్ రిలిజియన్, పాలిటిక్స్ అండ్ పవర్, ది అన్‌టోల్డ్ స్టోరీ' అనే పుస్తకం రాశారు. ఆయన అనేక దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలను కవర్ చేస్తున్నారు.
"ఉత్తరప్రదేశ్‌లో మోదీ కంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభావమే ఎక్కువ. నరేంద్ర మోదీ 2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆయనకు యూపీ అవసరం ఉంది. యోగి అవసరం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. యోగి ఆదిత్యనాథ్ ఎదిగిన తీరు ప్రశంసనీయం" అని శరత్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
యోగి యూపీ మోడల్ ఏమిటి?
యోగి ఆదిత్యనాథ్, యూపీ మోడల్.. ఈ రెండు పర్యాయపదాలుగా మారాయి.
ఇంతకీ ఏమిటీ యూపీ మోడల్?
"యూపీ మోడల్ అంటే లా అండ్ ఆర్డర్, డెవలప్‌మెంట్. దానితోపాటు హిందుత్వ ప్రచారం. హిందుత్వ ఛాయలో అభివృద్ధి, చట్ట పాలనపై దృష్టి పెట్టడం" అని రాజేంద్ర సింగ్ వివరించారు.
నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ లాగ యోగి ఆదిత్యనాథ్ యూపీ మోడల్‌లో కూడా హిందుత్వ సిద్ధాంతాలు ప్రధానమని రాధికా రామశేషన్ కూడా అన్నారు.
"గుజరాత్ మోడల్‌లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. యూపీ మోడల్‌లో లా అండ్ ఆర్డర్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. తరువాతే అభివృద్ధి. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, ఉల్లంఘించినా ఒకటే పరిష్కారం.. బుల్డోజర్ ఎక్కించడమే. బుల్డోజర్ యోగి ప్రభుత్వానికి చిహ్నంగా మారింది" అని రాధికా రామశేషన్ వివరించారు.
అయితే, యూపీ మోడల్‌పై చాలా విమర్శలూ ఉన్నాయి.
"ఎవరైనా తప్పు చేశారంటే బుల్డోజర్ నడిపించండి.. కేసు రుజువు కాకపోయినా సరే బుల్డోజర్ ఎక్కించమే.. ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. ఇవి చట్టప్రకారం తీసుకుంటున్న చర్యలు కావు. దేశంలోని చట్టాన్ని అదుపులో ఉంచుకుని సొంత చట్టాన్ని నడిపితే కొన్ని రోజులు బాగుంటుంది. ఆ భారం సామాన్యుడిపై పడటం మొదలుపెట్టినప్పుడే ప్రజలకు తెలివి వస్తుంది" అని శరత్ ప్రధాన్ అన్నారు.
"యోగి ఆదిత్యనాథ్ తనకంటూ ఒక ప్రొఫైల్ తయారుచేసుకున్నారు. ఆయన దృఢమైన వ్యక్తి, త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు అన్న పేరొచ్చింది. కానీ, ఎవరికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది ముఖ్యం. అతీక్ అహ్మద్ వంటివాళ్లు నేరం చేస్తే వాళ్ల దూరపు బంధువుల ఆస్తులను కూడా జప్తు చేస్తారు. కానీ నేరస్థుడు బీజేపీకి చెందినవాడైతే, తప్పులన్నీ మాఫీ అయిపోతాయి. మోదీని అనుసరిస్తూ యోగి ప్రచారంలోనే అభివృద్ధి అంతా చూపించారు. గుజరాత్ మోడల్ గురించి ఎంత ప్రచారం జరిగిందో అంత అభివృద్ధి అక్కడ జరగలేదని అందరికీ తెలుసు. మరి యూపీలో శాంతిభద్రతలు నెలకొన్నాయా? నేరస్థులందరినీ మట్టుబెట్టారా? ఒక మతానికి చెందిన నేరస్థులందరినీ మట్టుబెట్టారు అని చెప్పొచ్చు" అని శరత్ ప్రధాన్ అన్నారు.
రాధికా రామశేషన్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"చట్టాన్ని అమలుచేయడం అంటే సమాజంలో ఒక భాగంపై కఠినంగా అమలుచేయడం. ఇక వాళ్లు గొంతెత్తలేరు. యోగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దిశలోనే పనిచేస్తున్నారు. గోహత్య నిరోధంపై ఆర్డినెస్, ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ ఎక్కించడం.. ఇవన్నీ అందులో భాగమే. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన జరిగినప్పుడు దానిని దారుణంగా అణచివేశారు" అని రాధిక చెప్పారు.
అయితే, ఎన్ని విమర్శలున్నా, యోగీ ఆదిత్యానాథ్ మోడల్ ప్రత్యేకంగా పనిచేస్తుందని రాజేంద్ర సింగ్ అంటున్నారు.
"ఆయన నిర్దిష్ట సమూహంపై చర్యలు తీసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, అది ఆయన ఎజెండాలో భాగం" అన్నారు రాజేంద్ర సింగ్.

ఫొటో సోర్స్, ANI
అధినాయకత్వాన్ని యోగి గుడ్డిగా అంగీకరించరు..
యోగి ఆదిత్యనాథ్ యూపీ మోడల్‌లో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ కనిపించని మరో ప్రత్యేకత ఉందని రాధికా రామశేషన్ చెప్పారు.
కేంద్రం చెప్పే ప్రతి విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ గుడ్డిగా అంగీకరించరని ఆమె అంటున్నారు.
"2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి మోదీ తొలుత ఎంచుకున్న వ్యక్తి మనోజ్ సిన్హా. కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి వాళ్ల పేర్లు కూడా ముందుకొచ్చాయి. కానీ, చివరికి యోగి అందరినీ దాటికుని వెళ్లిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా దిల్లీ ఆదేశాలు, సలహాలు తీసుకోబోమని సిగ్నల్స్ పంపించారు. దిల్లీకి నచ్చినా, నచ్చకపోయినా యూపీలో తన సొంత పాలన ఉంటుందన్న సందేశం ఇచ్చారు. దిల్లీ, లఖ్‌నవూల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి" అని రాధికా రామశేషన్ వివరించారు.
"గుజరాత్‌లో మోదీజీకి ఇష్టమైన అధికారి అరవింద్ శర్మ. ఆయన రాజీనామా చేశారు. వెంటనే ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను మంత్రిని చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆయన కోసం కాళిదాస్ మార్గ్‌లో ఒక బంగ్లా కూడా చూసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, యోగి ఒప్పుకోలేదు. ఆయన్ను తన క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. ఇప్పుడు అరవింద్ శర్మ మంత్రి అయ్యారు కానీ, ఆయన గురించి పెద్ద చర్చలేమీ జరగవు. ఇదే విధంగా, కేశవ్ ప్రసాద్ మౌర్యను సమానంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ, విజయం సాధించలేకపోయారు" అని రాధిక గుర్తుచేశారు.
"యోగి ఆదిత్యనాథ్ ఎంత శక్తిమంతంగా ఎదిగారంటే, పార్టీలో చాలామందికి ఆయన ముల్లులా తయారయ్యారు" అని శరత్ ప్రధాన్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మండలాన్ని, కమండలాన్ని దాటి..
యోగి ఆదిత్యనాథ్ ఒక కులానికి కొమ్ము కాస్తారని విమర్శకులు అంటారు. కానీ, అది ఆయన రాజకీయ గ్రాఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.
"దీనికి కారణం ఆయన కాషాయ వేషం. ఆయన గోరక్షనాథ్ పీఠాధీశ్వరుడు. ఆయనది అగ్రవర్ణమే కావచ్చు కానీ, ఆ పీఠానికి వెనుకబడిన వర్గాల వారిలో ఎక్కువమంది అనుసరులు ఉన్నారు. కాషాయ వస్త్రాల కారణాంగా వెనుకబడిన కులాలకు నేతృత్వం వహిస్తున్న మాట పలచబడిపోతుంది. యూపీలో ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్ లాంటి నాయకులు లేరు. దళితుల్లో మాయావతి హవా తగ్గుతోంది" అని రాజేంద్ర సింగ్ అన్నారు.
రాధిక రామశేషన్ మాట్లాడుతూ, "యూపీలో రామజన్మభూమి ఆందోళన జరిగినప్పటి నుండి పెద్ద సంఖ్యలో ఓబీసీలు, వెనుకబడిన వర్గాల వారు బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. బీజేపీ వాళ్లకు పదవులు కూడా ఇస్తుంది. అందుకే, కేశవ్ మౌర్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన యోగికి మద్దతిస్తారు కూడా" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
2024 ఎన్నికలు
యోగి ఆదిత్యనాథ్‌కు తదుపరి పరీక్ష 2024 లోక్‌సభ ఎన్నికలు. బీజేపీ, నరేంద్ర మోదీతో పాటు విపక్షాలకు కూడా ఈ ఎన్నికలు పరీక్షే.
మరి, 2024 ఎన్నికలకు యోగి మోడల్ బీజేపీకి దన్ను ఇస్తుందా?
"యోగి ఆదిత్యనాథ్ తన స్థావరాన్ని పటిష్టం చేసుకున్నారు. ప్రతిపక్షం పూర్తిగా బలహీనంగా ఉంది. అఖిలేష్ యాదవ్ సాఫ్ట్ హిందుత్వ ప్లే చేస్తున్నారు. ఇది కూడా యోగికి అనుకూలంగానే ఉంటుంది. మీరు అవతలి వ్యక్తి పిచ్‌లోకి వెళ్లి ఆడితే, మీరెలా గెలుస్తారు?" అని శరత్ ప్రధాన్ అన్నారు.
అయితే, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బాట మార్చకపోవచ్చని రాజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.
"యూపీలో బీజేపీకి పెద్ద సవాలు ఏమీ లేదు. 2019లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమిని కూడా దాటుకుని ముందుకెళ్లిపోయింది బీజేపీ. ఇప్పుడూ అదే బాటలో ఎన్నికలకు వెళుతుంది" అని ఆయన అన్నారు.
యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీకి పోటీ కాలేరని ఆయన భావిస్తున్నారు.
"బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే మోదీ ప్రధాని అవుతారు. యోగి ఆయన్ను కీర్తిస్తారు" అన్నారాయన.
మోదీ పదవి నుంచి తప్పుకుంటే, అప్పుడు సమస్య వస్తుంది. తదుపరి నాయకుడెవరనే ప్రశ్న తలెత్తుందని విశ్లేషకులు అంటున్నారు.
"యూపీ అసెంబ్లీలో యోగి నెంబర్ వన్ అయితే, లోక్‌సభ్‌లో మోదీనే నెంబర్ వన్. 2024లో బీజేపీకి ఇంతకుముందు కంటే ఎక్కువ సీట్లు వచ్చినా, తక్కువ సీట్లు వచ్చినా మోదీనే పీఎం అవుతారు. అయితే, యోగి తను కూడా అర్హుడని నిరూపించుకుంటే అప్పుడు మళ్లీ సవాలు ఎదురవుతుంది. కానీ, అది ఆయన ఎలా చేస్తారో చూడాలి" అని రాధికా రామశేషన్ అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ వయసు 51 ఏళ్లు మాత్రమేనని, ఇదే ఆయన అడ్వాంటేజ్ అని శరత్ ప్రధాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒడిశా రైలు ప్రమాదం: ఆత్మీయుల ఆచూకీ దొరకక తల్లడిల్లుతున్న కుటుంబాలు
- తెలంగాణ: 43 కులాలకు భవనాలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం, కులాల జనాభాను ఎందుకు రహస్యంగా పెట్టింది?
- తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?
- సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా
- ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ... ఎనిమిదేళ్ళ కింద ఏర్పాటైన ఆఫీసులో ఎవరైనా ఉన్నారా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














