ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2022:దళితులు మాయావతి బీఎస్పీకి దూరమయ్యారా? దళితుల ఓట్లు కోరుకుంటున్న పార్టీలు వారికోసం ఏం చేస్తున్నాయి?

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జాతీయ నేర రికార్డు బ్యూరో 2018-20 గణాంకాల ప్రకారం షెడ్యూల్డ్ కులాలవారిపై జరిగే అత్యధిక నేరాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కంటే అగ్ర స్థానంలో కొనసాగుతున్నట్లు వెల్లడైంది.

యూపీలో 2018లో దళితులపై జరిగే నేరాలకు సంబంధించి 11,924 కేసులు నమోదు కాగా 2019లో వాటి సంఖ్య 11,829కి తగ్గింది. ఇక 2020లో ఆ కేసులు 12,714కు పెరిగింది.

ఈ గణాంకాల్లో బిహార్ రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. కానీ ఇక్కడ దళితుల పట్ల జరిగిన నేరాల సంఖ్య యూపీతోపోలిస్తే సగానికంటే తక్కువే ఉన్నాయి.

అయితే, దళితుల పట్ల పెరుగుతున్న నేరాలు, దళితులపై జరుగుతున్న దారుణాలు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశంగా మారలేదు.

రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియాలో ఈ నేరాలను ఖండిస్తూనే ఉంటాయి. కొందరు నేతలు బాధిత కుటుంబాలను కూడా కలుస్తుంటారు. దళితుల పార్టీగా భావించే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మాత్రం కేవలం ట్వీట్ల ద్వారానే తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు.

బీఎస్పీ రాష్ట్రంలోని 21.6 శాతం జనాభా ఉన్న దళితుల పార్టీ అని, వారికి ప్రాతినిధ్యం వహిస్తుందని భావిస్తారు. కానీ, రాష్ట్రంలో దళితుల పట్ల జరిగే దారుణాలపై మాయావతి కూడా అంత గట్టిగా నిరసన వ్యక్తం చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళిత ఓటుబ్యాంకుపై బీఎస్పీ, మాయావతి పట్టు బలహీనమవుతూ వస్తోందని కూడా చెప్పుకుంటున్నారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటివరకూ జరిగిన మీడియా కవరేజీని పరిశీలిస్తే రాష్ట్రంలో దళితుల ఓట్లు చీలి, బీఎస్పీ రాజకీయ పునాదులు బలహీనపడవచ్చని తెలుస్తోంది.

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన ఓటర్లను ఉద్దేశించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఓట్లు అడగడానికి వెళ్లే నేతగా నిలుస్తారని కొందరు విశ్లేషకులు జోకులు కూడా వేసుకుంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో దళిత ఓట్లు బీఎస్పీ మద్దతుకు పునాదిగా నిలిచింది. దళిత ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. 2007 ఎన్నికల్లో బీఎస్పీ అధికారం చేజిక్కించుకోడానికి ఇవి కీలకంగా నిలిచాయి. దళితుల్లో 66 ఉప జాతులు ఉన్నాయి. కానీ దాదాపు 55 శాతం దళిత ఓట్లు జాఠవ్‌లవే. వీరందరూ ఏళ్ల తరబడి బీఎస్పీకి, మాయావతికి అండగా నిలుస్తూ వచ్చారు. పార్టీ సుప్రీమో మాయావతి స్వయంగా అదే జాతికి చెందినవారు.

రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓట్లు చీలిపోతాయని, బీఎస్పీ తమ దళిత ఓటుబ్యాంకును సమాజ్ వాదీ, బీజేపీతో పంచుకునే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీకి కూడా దళిత ఓట్లు లభించవచ్చని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు..

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్: 'నా బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు'

సమాజ్ వాదీ నకిలీ పవనాలు...బీఎస్పీ వ్యతిరేక వ్యూహమా

"దళితులు, ముస్లింలు చాలావరకూ సమాజ్ వాదీ పార్టీ వైపు వెళ్తున్నారు. ఆ పార్టీ అధికార బీజేపీని ఓడించగలిగేలా మెరుగైన స్థితిలో ఉంది" అని బీఎస్పీ మాజీ నేత ఇస్రార్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కానీ, మీడియాలో వస్తున్న ఇలాంటి ప్రకటనలు, విశ్లేషణలను బీఎస్పీ నేతలు, మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాదనలను పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా వర్ణిస్తున్నారు.

"నాకు తెలిసి.. ఇది ఒక కుట్ర. కాస్త ఆలోచించండి. మీడియాలో ఒక పెద్ద భాగం 2012 నుంచి ప్రత్యేకంగా ఒక పార్టీ కోసమే ప్రచారం చేస్తోంది. హఠాత్తుగా, యూపీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అఖిలేష్ యాదవ్‌ను ఎక్కువగా చూపిస్తోంది. అంటే ముస్లిం సమాజాలవారిని అది నేరుగా, సమాజ్‌వాదీ పార్టీ వైపు పంపించాలని కోరుకుంటోందని అర్థం" అని పార్టీ బిజ్నౌర్ జిల్లా ఉపాధ్యక్షులు నాజీమ్ అల్వీ చెప్పారు.

"ముస్లింలు, దళితులతో ఎక్కడ కలుస్తారో అని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు, బీఎస్పీతో కలిసివస్తే ఎన్నికల ఫలితాల్లో ఒక పెద్ద మార్పు జరగవచ్చు. ఎలాగోలా బీజేపీ అధికారం పోగొట్టుకోవడం ఖాయం. అందుకే, దాన్ని చూపిస్తూ సమాజ్‌వాదీ పార్టీ తమ నకిలీ పాపులారిటీని చూపించుకుంటోంది" అన్నారు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

రాయ్‌బరేలీకి చెందిన దళిత వ్యవహారాల నిపుణులు ఆర్బీ వర్మ కూడా దళితుల ఓట్లు చీలుతాయంటూ మీడియాలో వస్తున్న వార్తలను వివక్షతోకూడిన రిపోర్టులుగా వర్ణిస్తున్నారు.

"భారత మీడియా, ముఖ్యంగా హిందీ మీడియా పూర్తిగా అమ్ముడుపోయింది. 90 శాతం జర్నలిస్టులు అగ్రవర్ణాలవారే. వారికి ఒక కుల దృక్పథం కూడా ఉంది. వారి రిపోర్టింగ్‌లో కూడా ఆ వివక్ష కనిపిస్తుంది" అన్నారు.

దళిత సమాజంలో సగానికి పైగా(55 శాతం) జాఠవ్‌ల జనాభానే ఉంటుందని ఆర్బీ వర్మ చెబుతున్నారు.

"జాఠవ్‌లు దళితుల్లో ఒక పునాది లాంటివారు. ఎక్కువ మంది దళితులు ఇప్పటికీ బీఎస్పీతోపాటే ఉన్నారు. కానీ వారిలోని ఒక వర్గం సమాజ్‌వాదీ, బీజేపీలోకి వెళ్లవచ్చు. వారు ఇంతకు ముందు కూడా బీజేపీలోకి వెళ్లారు. కానీ దళిత ఓటర్లలో మెజారిటీ వర్గం మాత్రం, ఇప్పటికీ బీఎస్పీతోనే ఉంది" అన్నారు.

"అలా ఎందుకంటే, బీఎస్పీకి చెందిన కొందరు నేతలు ఇప్పటికే పార్టీ వదిలి వెళ్లిపోయినా, పార్టీ కేడర్ మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. వారు పార్టీ కోసం దృఢంగా నిలబడి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చురుగ్గా ఉన్నారు" అని చెప్పారు.

ఈసారీ దళితుల ఓట్లు చీలడం అనేది జరగదని నగీనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రజ్‌పాల్ సింగ్ చెబుతున్నారు.

"ఈ ఎన్నికలతో మా పనైపోతుందని, దళితులు మమ్మల్ని వదిలి వెళ్లిపోతారని వదంతులు ప్రచారం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. దళితులు బహెన్ జీ(మాయావతి)కి పెట్టని కోటలా నిలిచి ఉన్నారు. బండను ఎలా కదిలించలేమో, అలాగే ఆమె ఓటు బ్యాంకు కూడా చెక్కు చెదరదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

కానీ, బీఎస్పీ దళిత ఓటుబ్యాంకు బలం వరుసగా తగ్గుతూ వస్తోంది. ఆ పార్టీకి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే దాదాపు 5 శాతం తగ్గాయి.

వీడియో క్యాప్షన్, రిషిగంగా నదిలో నీటి మట్టాన్ని పరిశీలించేందుకు డ్రోన్లను వాడుతున్న జవాన్లు

అలాగే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు మరో 5 శాతం తగ్గి 20 శాతానికి మిగిలాయి. పార్టీ 2007 ఎన్నికల్లో 206 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కానీ, 2012లో ఆ పార్టీకి కేవలం 80 స్థానాలే వచ్చాయి. 2017లో అది 19కి తగ్గింది, స్థానాలు ఓడినా, 20 శాతానికి పైగా ఓట్లు సాధించడంలో విజయం కాగలిగింది.

2014లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ జాఠవేతర దళిత ఓట్లలో ఒక పెద్ద భాగాన్ని బీఎస్పీ నుంచి లాగేసుకుంది అనేది కూడా వాస్తవమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రిజర్వ్ అయిన 85 స్థానాల్లో 69 బీజేపీ గెలుచుకుంది.

యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో 17 షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీటిలో 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ రెండు, అప్నా దళ్ ఒక స్థానం గెలుచుకున్నాయి.

అయితే రిజర్వుడు స్థానాలు అయినంత మాత్రాన ఆయా స్థానాల్లో దళితుల ఆధిపత్యం ఉంటుందని భావించడం సరికాదని దళిత అంశాల నిపుణులు ఆర్బీ వర్మ చెబుతున్నారు.

"రిజర్వ్ సీట్లలో ఒక దగ్గర దళిత ఓట్లు ఎక్కువగా ఉంటే, మరో చోట తక్కువగా ఉంటాయి. మిగతా ఓట్లన్నీ దళితేతరులవి ఉంటాయి. అందుకే, బీఎస్పీ దళితులకు రిజర్వ్ చేసిన స్థానాలు తక్కువగా గెలుచుకుంది అనడం, సరికాదు. రిజర్వ్ స్థానాల్లో కూడా దళితేతరులదే మెజారిటీ ఉంటుంది" అన్నారు.

అయితే, పార్టీ ఈసారీ మొత్తం 85 రిజర్వ్ స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టిందని బీఎస్పీ బిజ్నౌర్ జిల్లా ఉపాధ్యక్షులు నాజిమ్ అల్వీ చెప్పారు.

"ఈసారీ మాయావతి దళితుల సీట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. పార్టీ స్థానిక నేతలు ఆయా స్థానాల్లో అదనంగా శ్రమించడానికి ఆమె వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గత 8-9 నెలలుగా రిజర్వ్ స్థానాలపై మాయావతి నిశితంగా దృష్టిపెట్టారు. అక్కడ మేం పనులు కూడా చేశాం. రెండు నెలల క్రితం మాయావతి రిజర్వ్ స్థానాల్లో పార్టీ నేతలను లఖ్‌నవూ పిలిపించి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి పనులను అంచనా వేశారు. ఈసారీ మేం ఈ స్థానాల్లో చాలా బలంగా ఉన్నాం" అన్నారు.

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, Inc

దళితుల ఓట్లు కావాలి, దళితుల సాధికారత అక్కర్లేదు

తమ పార్టీ దళితుల సాధికారత కోరుకుంటోందని బీఎస్పీ అభ్యర్థి బ్రజ్‌పాల్ సింగ్ గ్రూపు చెబుతోంది. మిగతా పార్టీలకు దళితుల ఓట్లు మాత్రమే కావాలని, వారి సాధికారత అక్కర్లేదని ఆయన అంటున్నారు.

సమాజ్‌వాదీ పార్టీ దళిత ఓటర్లను ఆకట్టుకోడానికి, బాబా సాహెబ్ వాహిని ఏర్పాటు చేసింది, అంబేడ్కర్ జయంతి రోజున దళిత దీపావళి నిర్వహించింది.

బీఎస్పీ నుంచి బహిష్కృత నేతల కోసం అఖిలేష్ యాదవ్ పార్టీలో తలుపులు తెరిచారు. జాఠవేతరులు, వివిధ ఉపకులాల దళిత నేతలను ఆకట్టుకోడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీలోని దళితులు, అత్యంత వెనుకబడిన కులాలు, చిన్న కులాల ఆధారిత పార్టీలన్నింటితో ఒక కూటమి ఏర్పాటు చేసి కుల, సామాజిక సమావేశాలు నిర్వహిస్తూ ఒక సామాజిక కూటమిని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అటు, బీజేపీ కూడా దళిత్ అవుట్ రీచ్ కోసం చాలా శ్రమించింది. దళితుల మనసు గెలుచుకోడానికి బౌద్ధ సర్కూట్‌ను కూడా ఉపయోగించింది. పాసీ, కోరీ, ధోబీ లాంటి కులాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

ఇప్పటివరకూ జారీ అయిన టికెట్ల జాబితాలో దళిత అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పార్టీ టికెట్ల పంపిణీలో ఉప కులాల ప్రాతినిధ్యాన్ని కూడా నిర్ధారిస్తే, ఆయా పార్టీలు దళితుల ఓట్లలో ఒక భాగాన్ని చేజిక్కించుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు, కింద పడేశారు'

దళితులపై పార్టీల ప్రేమ..

మూడు దశాబ్దాల ప్రవాసం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా దళితులపై దృష్టి పెట్టింది.

ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తరచూ అణచివేతకు గురైన బాధిత దళిత కుటుంబాల గాయాలకు మందు రాస్తూ కనిపిస్తున్నారు.

2020 సెప్టెంబర్‌లో ఒక దళిత బాలిక అత్యాచారం, హత్య తర్వాత రాహుల్, ప్రియాంక అందరికంటే ముందు హాథ్‌రస్ చేరుకున్నారు. ప్రియాంక పోలీసుల పోలీసుల అదుపులో మరణించినట్లు చెబుతున్న అరుణ్ వల్మీక్ ఇంటికి కూడా వళ్లారు. ఆమె దళిత మహిళలను ఆలింగనం చేసుకోవడం కూడా కనిపించింది.

ఈసారీ దళితుల ఓట్లు చీలవని, బదులుగా ఈసారి ఎన్నికల్లో ముస్లిం, బ్రాహ్మణ ఓట్లు కూడా పార్టీకి వస్తాయని బీఎస్పీ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

"ఈసారీ మాకు దళితుల ఓట్లతోపాటూ దళితేతరుల ఓట్లు కూడా వస్తాయి, ముస్లింలు, బ్రాహ్మణుల ఓట్లు కూడా వస్తాయి" అంటారు బ్రజ్‌పాల్ సింగ్.

ఈ మాటను అంగీకరించడానికే ఎవరూ ఇష్టపడ్డం లేదు. ఎందుకంటే ఒకవేళ అదే జరిగితే, బీఎస్పీ విజయానికి చాలా దగ్గరగా ఉంటుంది.

కానీ, అన్ని విశ్లేషణలు, నిపుణుల అంచనాల ప్రకారం ఈసారీ యూపీ ఎన్నికలు "బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీ"గానే ఉండబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)