ఒడిశా: దళిత బాలిక పువ్వులు కోసిందని.. నాలుగు నెలలుగా దళితులందరి బహిష్కరణ

ఫొటో సోర్స్, Getty Images
స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా భారతదేశంలో దళితుల పరిస్థితి పెద్దగా మారలేదనడానికి ఢెంకనాల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనే సాక్ష్యం.
ఒక మామూలు చిన్న విషయం పెద్ద వివాదంగా మారి దళితులను సాంఘిక బహిష్కరణకు గురిచేసింది.
ఈ సంఘటన జరిగిన నాలుగు నెలల తరువాత మీడియాలో దీనిపై కథనాలు ప్రసారం కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దీనికి కారణమైన ఉన్నత కులాలపై కేసు నమోదు చేసింది.
అయితే అది సాంఘిక బహిష్కరణ కాదని, తమ రక్షణ కొరకు చేసుకున్న ఏర్పాటని అగ్రకులాల వారు వాదిస్తున్నారు.
దళితులు చీటికీమాటికీ ఎస్‌టీ ఎస్‌సీ చట్టం కింద కేసు వేస్తామని బెదిరిస్తున్నారని అందుకే వాళ్లతో ఏ రకమైన సంబంధాలూ పెట్టుకోకూడదని తామంతా నిర్ణయించుకున్నామని వారు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది?
ఒక దళిత మైనర్ బాలిక ఆ గ్రామంలోని ఒక తోటలోకెళ్లి ఒక పొద్దుతిరుగుడు పువ్వు కోసుకున్నది. తను చేసిన అంత చిన్న పని తనకే కాక తన వారందరికీ కూడా నాలుగు నెలల దుర్భర జీవితాన్ని కలగజేస్తుందని ఆమె ఊహించలేదు.
ఏప్రిల్ 6న ఒడిశా రాష్ట్రంలోని ఢెంకనాల్ జిల్లాలో కటియో-కాటెనీ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక శృతిస్మితా నాయక్ అగ్రకులాల వారికి చెందిన ఒక తోటలో పువ్వు కోసుకుందన్న కారణంగా ఆ గ్రామంలోని 40 దళిత కుటుంబాలు నాలుగున్నర నెలలుగా సాంఘిక బహిష్కరణను ఎదుర్కొంటున్నాయి.
ఆ రోజు నుంచీ ఆ గ్రామంలోని 800 సవర్ణ కుటుంబాలు దళితులతో మాట్లాడట్లేదు సరికదా వారితో సంబంధాలు తెంపుకుంటూ సాంఘిక కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.
శృతిస్మిత బీబీసీతో మాట్లాడుతూ "ఆ రోజు మేము కొందరం అమ్మాయిలం చెరువుకి వెళ్లాం. తిరిగివస్తూ దారిలో ఈ పువ్వు చూసాం. నేను ఆ పువ్వు కోశాను. వెంటనే అక్కడికొక వ్యక్తి వచ్చి మమ్మల్ని నానామాటలు అన్నాడు. మేము తప్పైపోయింది, ఇంకెప్పుడూ ఇలా జరగదని ఎంత చెప్పినా అతను ఇంకా తిడుతూనే ఉన్నాడు. మేము ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఆ తరువాత మేము చెరువువైపు వెళ్లనేలేదు" అన్నారు.
ఈ సంఘటనపై బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి అధికారులు దీన్ని సద్దుమణిచే ప్రయత్నం చేసారు. దీంతో అగ్రవర్ణాలు, దళితుల మధ్య మరిన్ని అడ్దుగోడలు పెరిగాయి.
సఖీ నాయక్ అనే 52 యేళ్ల దళిత మహిళ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆమెను కూడా చెరువు దగ్గరకు రాకుడదని సవర్ణులు బెదిరించారు.

దళితులందరిదీ ఇదే కథ
కేవలం శృతి, సఖి మాత్రమే కాదు ఆ గ్రామంలో దళితులందరూ ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు.
ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు సర్వేశ్వర్ నాయక్ బీబీసీతో మాట్లాడుతూ "గత రెండు నెలలుగా మమ్మల్ని పూర్తిగా బహిష్కరించారు. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దుకాణదారులు మాకు సరుకులు అమ్మట్లేదు. మాకు రేషన్ కూడా నిలిపివేసారు" అని తెలిపారు.
"మాకు జనసేవా కేంద్రం తలుపులు కూడా మూసేసారు. నిత్యావసర వస్తువుల కోసం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. మా వ్యవసాయం కూడా ఆగిపోయింది. ట్రాక్టర్లు, ట్రాలీలు మాకు అందుబాటులో లేకుండా చేసారు. చెరువుకి వెళ్లి స్నానం చెయ్యడానికి లేదు. మాతో మాట్లాడినవారికి 1000 రూపాయల జరిమానా విధించారు" అని సర్వేశ్వర్ చెప్పారు.
శృతిస్మిత విషయం తరువాత గ్రామంలో ఉన్నత కులాలు, దళితుల మధ్య దూరం పెరిగింది. జూన్ 16 న ఉన్నత కులాలవారు ఒక పంచాయితీ ఏర్పాటు చేసారు. ఇందులో దళితులు కూడా పాల్గొన్నారు. ఆ పంచాయితీ తరువాత దళితులకు సాంఘిక బహిష్కరణ ప్రకటించారు.
గ్రామంలో 800 మంది ఉన్నత కులాల కుటుంబాలు, 40 దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దళితులు మౌనంగా శిక్షననుభవిస్తున్నారు.

దళితులపై ఫిర్యాదు చేస్తున్న ఉన్నత కులాలు
"దళితవాడలో ఒక రచ్చబండ ఉంది. దాని చుట్టూ నిత్యం దళిత యువకులు పచార్లు చేస్తుంటారు. దాని మీదుగా నడిచి వెళ్లే ఉన్నత కులాల స్త్రీలను ఏడిపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు" అని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు.
అయితే దీనిపై ఉన్నతకులాలవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు.
దళితులు ఎస్టీ ఎస్సీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది అగ్రకులా వారి అతి పెద్ద ఫిర్యాదు.
అదే గ్రామానికి చెందిన కైలాష్ బిస్వాల్ బీబీసీతో మాట్లాడుతూ "తమకు అవసరమైనప్పుడల్లా ఎస్టీ ఎస్సీ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఇప్పటివరకూ మావాళ్లు ఎవరూ అరస్ట్ అవ్వలేదుగానీ మేము చాలా వేధింపులు ఎదుర్కొంటున్నాం. వాళ్లు మమ్మల్ని వేధించే మార్గాలకోసం వెతుకుతూనే ఉంటారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారు" అని అన్నారు.
"ఇలా చాలాసార్లు జరిగిన తరువాత గ్రామంలో పెద్దలంతా పంచాయితీకి పిలిచారు. అందులో దళితులు కూడా పాల్గొన్నారు. దళితులతో మాటలు నిలిపివేయాలని ఆ పంచాయితీలో తీర్మానించారు. మాట్లాడితేనే కదా సమస్యలు వస్తున్నాయి అందుకని దళితులతో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాం. ఇది ఒక సహాయ నిరాకరణోద్యమం లాంటిది" అని కైలాష్ పేర్కొన్నారు.

సామరస్యం నెలకొల్పే ప్రయత్నం
ఈ విషయం విన్న తరువాత శుక్రవారంనాడు ఢెంకనాల్ ఎస్పీ, సబ్ కలక్టర్, స్థానిక పోలీస్ అధికారులు కలిసి ఇరు వర్గాల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు.
కామాక్ష్యానగర్ సబ్ కలక్టర్ బిష్ణు ప్రసాద్ ఆచార్య బీబీసీతో మాట్లాడుతూ "ఆ సమావేశానికి ఇరు వర్గాలనుంచీ చాలమంది వచ్చారు. స్నేహపూరక వాతావరణంలో చర్చలు జరిగాయి" అని తెలిపారు.
ప్రతీ వార్డులో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ప్రతీ కమిటీలోనూ ఇరు వర్గాలకూ చెందిన సభ్యులు ఉంటారు. ఏ వార్డులో సమస్యలకు ఆ వార్డు కమిటీ పరిష్కారం చూపుతుంది. పరిష్కారం కుదరని పక్షాన సమస్యను గ్రామ కమిటీకి తెలియజేస్తారు అని ఆ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు బిష్ణు ప్రసాద్ తెలిపారు.
గ్రామంలో సామరస్యం కొనసాగిస్తామని ఇరు వర్గాలు వాగ్దానం చేశాయని, ఆ మేరకు ఆమోద పత్రంపై సంతకం చేశాయని స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆనంద్ డుంగ్‌డుంగ్ తెలిపారు.
అయితే, అదే రోజు ఈ కేసులో ఎఫైఆర్ కూడా నమోదు చేశారు కానీ ఎవరినీ అరెస్ట్ చెయ్యలేదు.
"స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాల తరువాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటు" అని ఒడిశా దళిత అధికార వేదిక కన్వీనర్ ప్రశాంత్ మల్లిక్ అన్నారు.
"ఒడిశాలోని ప్రతీ గ్రామంలోనూ దళితుల పట్ల వివక్ష, కులం పేరుతో హింస జరుగుతూనే ఉన్నాయి. ఇది రాజ్యాంగానికే అవమానం. ఈ కళంకాన్ని తుడిచేయడానికి కావలసిన రాజకీయ నిబద్ధత మన నాయకులలో కనిపించట్లేదు" అని ప్రశాంత్ మల్లిక్ విచారం వ్యక్తంచేశారు.
ఈ సామాజిక బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం నుంచీ ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా లేదు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి, సద్దుమణిచే ప్రయత్నాలు చూస్తుంటే ఇలాంటి తారతమ్యాలు ఇంకా కొనసాగడానికి ఎక్కడో ఒకచోట పరిపాలనా వర్గం మద్దతు కూడా ఉండడం కారణమని అనిపించకమానదు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








