ఆఫ్రికాలో గృహ హింసపై వినూత్న పోరాటం: 'వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు'

ఆఫ్రికాలోని అతిచిన్న దేశాల్లో ఒకటైన రువాండాలో గృహహింసను అడ్డుకొనేందుకు వినూత్నమైన ప్రయత్నం జరుగుతోంది. వండటం, శుభ్రం చేయడం లాంటి ఇంటి పనుల్లో పురుషులకు శిక్షణ అందిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తోందని ఇటీవలి అధ్యయనం ఒకటి చెబుతోంది.
ముహోజా జీన్ పీరే భార్య పట్ల దౌర్జన్యంగా, దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరించేవారు.
పిల్లలను కనేందుకు, వారి బాగోగులు చూసుకొనేందుకే ఆమెను పెళ్లాడాను అన్నట్లుగా ఆయన ఆమెతో వ్యవహరించేవారు. ''నేను మా నాన్నలాగే ఉండేవాడిని. మా నాన్న ఇంట్లో ఏ పనీ చేసేవారు కాదు. నేను వచ్చేసరికి ఇంట్లో జరగాల్సిన పని జరగకపోతే నా భార్యను కొట్టేవాడిని. 'నువ్వు సోమరివి, ఎందుకూ పనికిరావు, పుట్టింటికి పో' అని నా భార్యపై అరిచేవాడిని'' అంటూ ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

జీన్ పీరేకు ఇప్పుడు వంట ఎలా చేయాలో, ఇళ్లు ఎలా శుభ్రం చేయాలో తెలుసు. గృహహింసను లేకుండా చేసేందుకు చేపట్టిన పరివర్తన కార్యక్రమంలో భాగంగా రువాండాలో ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని మ్యులీరే గ్రామంలో ఆయన వీటిని నేర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటి పనులే కాదు, పిల్లల సంరక్షణ గురించి కూడా పురుషులకు నేర్పించారు.
ఈ కార్యక్రమం పేరు 'బాందెబెరెహో'. రువాండా అధికార భాష కిన్యార్వాండాలో ఈ మాటకు ఆదర్శప్రాయుడు.
తన తీరును మార్చుకోవడంలో ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడిందని జీన్ పీరే చెప్పారు.
మగవాళ్లు ఇల్లు ఊడ్చగలరా అని శిక్షణ కార్యక్రమంలో తమను అడిగారని, ఊడ్చగలమని తాము సమాధానమిచ్చామని ఆయన తెలిపారు. ''మీలో ఎవరైనా ఇల్లు ఊడ్చుతారా అని అడిగితే, ఒక్కరం కూడా ఔనని చెప్పలేకపోయాం. ఎందుకంటే మేం ఎవ్వరం అలాంటి పనులు చేయం'' అని వివరించారు.
మహిళలు మాత్రమే చేస్తున్న పనులు ఎలా చేయాలో చెబుతూ పురుషులకు బాందెబెరెహో ప్రాజెక్టు నిర్వాహకులు శిక్షణ ఇచ్చారు.
శిక్షణ తర్వాత తాము ఇంటి పనులు చేయడం మొదలుపెట్టామని జీన్ పీరే తెలిపారు. తాము తిరిగి శిక్షణకు వెళ్లినప్పుడు కొందరు ప్రత్యక్షసాక్షులను వెంట తీసుకెళ్లేవాళ్లమని, తమలో కొంత మార్పు వచ్చిందని వారు ప్రాజెక్టు నిర్వాహకులకు చెప్పేవారని వెల్లడించారు.
''నాకు ఇప్పుడు వండటం తెలుసు. పిల్లల దుస్తులు ఉతుకుతాను. అరటికాయల తొక్క తీయడం, పెండలాన్ని దంచడం లాంటి పనులన్నీ తెలుసు'' అని జీన్ పీరే వివరించారు.
ఆయనలో ఈ మార్పు తేలికగా ఏమీ రాలేదు. ఇంటి పనులు చేయొద్దని ఆయన్ను స్నేహితులు వారించేవారు. ''సిసలైన మగాళ్లెవ్వరూ వంట వండరు'' అని అనేవారు.
తాను ఇంటిపనులు చేయడం కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో అర్థమయ్యాక జీన్ పీరే తన స్నేహితుల మాటలు పట్టించుకోవడం మానేశారు.
ఇప్పుడు తన పిల్లలు తనతో ఎక్కువ ప్రేమగా ఉంటున్నారని, భార్య అరటికాయల వ్యాపారం చేస్తున్నారని, ఈ వ్యాపారం వల్ల కుటుంబ ఆదాయం మెరుగుపడిందని ఆయన సంతోషంగా చెప్పారు.
''నా పట్ల నా భార్య గతంలో వ్యవహరించిన తీరుకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు మధ్య చాలా తేడా ఉంది. నేను ఆమెతో మంచిగా ఉండట్లేదని, ఆమె కూడా నాతో మంచిగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అన్ని విషయాలపై మేం ఇద్దరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకొంటున్నాం. ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాను. ఇప్పుడు ఆమె పనిచేస్తోంది, నేను పనిచేస్తున్నాను. ఇంతకుముందు ఆమె ఇంట్లోనే ఉండాలని, నాకు అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండాలని అనుకొనేవాణ్ని'' అని జీన్ పీరే తెలిపారు.

గతంలో తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని, ఎప్పుడూ భయంభయంగా ఉండేదని ఆయన భార్య ముసాబ్యిమన డెల్ఫీన్ చెప్పారు. ''నేను ఈ ఇంట్లో పనిమనిషినా అని నాకు కొన్నిసార్లు అనిపించేది. అయినా పనిమనిషికి జీతం ఇస్తారు కదా అనుకొనేదాణ్ని. ఆడవాళ్ల దగ్గర కూడా డబ్బు ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. డబ్బు సంపాదించే పని ఏదైనా చేయడం గురించి కూడా నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఇంట్లో నాకు చాలినంత స్వేచ్ఛ ఉంది. నేను కూడా మార్కెట్‌కు వెళ్లి, అరటికాయలు అమ్మి, డబ్బు సంపాదిస్తున్నా'' అని జీన్ పీరే భార్య తెలిపారు.
డెల్ఫీన్ ఉదయం ఐదు గంటలకే కూర అరటికాయలు అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిపోతారు. జీన్ పీరే ఇంట్లో ఉండి వారి నలుగురు పిల్లల బాగోగులు చూసుకుంటారు. ''నేను ఎలాంటి ఆందోళనా లేకుండా ఇంటికి చేరుకుంటాను. ఇంటికి వచ్చే సరికి మావారు భోజనం కూడా సిద్ధంగా ఉంచుతున్నారు'' అని ఆమె సంతోషంగా చెప్పారు.
ఈ కార్యక్రమం ఎలా ఉండాలనేది తొలుత లాటిన్ అమెరికాలో 'మెన్‌కేర్' సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంరక్షణ, ఇంటిపనుల్లో 50 శాతం మగవారే చేయాలని, అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని ఈ సంస్థ చెబుతుంది.
రువాండాలో పిల్లల సంరక్షణపై తరగతులకు హాజరైన మగవారిలో రెండేళ్లలో మార్పు వచ్చిందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. ఈ తరగతులకు హాజరుకాని మగవారితో పోలిస్తే వీరు తమ జీవిత భాగస్వాములపై హింసకు పాల్పడే ఆస్కారం తక్కువగా ఉందని తేలింది.
ఈ తరగతులకు హాజరైన ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరు ఇప్పటికీ తమ జీవిత భాగస్వాములపై హింసకు పాల్పడుతున్నారని కూడా ఈ అధ్యయనం చెప్పింది.
రువాండాలో బాందెబెరెహో కార్యక్రమ అమలును రువాండా రిసోర్స్ సెంటర్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అనుసరించాలని, అమలు చేయాలని సమాజంలోని వివిధ వర్గాలను, ప్రభుత్వాన్ని ఈ సెంటర్ కోరుతోంది.
రువాండాలో సామాజిక భావనల్లోని కొన్ని అపోహలు, సాంస్కృతిక అడ్డంకులే మగవారి హింసకు ప్రధాన కారణాలని ఈ సెంటర్ ఛైర్మన్ ఫిడెల్ రుటాయిసిరే వ్యాఖ్యానించారు.
''సంప్రదాయం ప్రకారం చూస్తే ఈ దేశంలో పిల్లల సంరక్షణను మగవారు పట్టించుకోరు. సెక్స్, వనరులు, నిర్ణయాలు తీసుకోవడాన్ని మగవారే నియంత్రిస్తారు. పిల్లల సంరక్షణ బాధ్యతలను మగవారు పంచుకుంటే, స్త్రీ-పురుష సమానత్వాన్ని వారు మెరుగ్గా అర్థం చేసుకోగలరు'' అని ఫిడెల్ అభిప్రాయపడ్డారు.
బాందెబెరెహో కార్యక్రమం తమ కుటుంబానికే కాదు, తమ సమూహానికే మేలు చేసిందని డెల్ఫీన్, జీన్ పీరే హర్షం వ్యక్తంచేస్తున్నారు.
''మా పెళ్ళయి పదేళ్లైంది. నిజమైన హనీమూన్ మాత్రం ఇప్పుడే'' అని జీన్ పీరే వ్యాఖ్యానించారు.
''మా వీధిలో, చుట్టుపక్కల ఏదైనా వివాదం లేదా భద్రతాపరమైన సమస్య తలెత్తితే మా అభిప్రాయం అడుగుతున్నారు. మా మాటాకు చాలా విలువ ఇస్తున్నారు. మా కుటుంబంలో ఏ గొడవలూ లేకపోవడమే దీనికి కారణం'' అని ఆయన చెప్పారు.


100-మహిళలు అంటే ఏమిటి?
బీబీసీ 100 మంది మహిళలు.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన మహిళలను గుర్తించి, వారి కథనాలను పంచుకుంటుంది.
ప్రపంచమంతటా మహిళల హక్కుల విషయంలో ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరం. 2018లో బీబీసీ 100 మంది మహిళలు, తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును రగిలించటానికి ఉద్వేగం, ఆక్రోశం, ఆగ్రహాలను ఉపయోగిస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్న వారిని ప్రతిబింబిస్తుంది.

ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లి అరెస్టైన ముంబయి యువకుడి విడుదల
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- జీ-20 సదస్సుకు ప్రాధాన్యం ఉందా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- ‘న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు’
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- శబరిమల నుంచి ట్రిపుల్ తలాక్ వరకూ... మహిళలే మహిళలకు వ్యతిరేకం ఎందుకు?
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- భవిష్యత్తుపై ఆశలు రేపుతున్న మహిళల పోరాటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








