ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్ళి... ఆరేళ్ళ తరువాత భారత్‌లోకి అడుగిడిన హమిద్ అన్సారీ

గూఢచర్యానికి పాల్పడ్డారని, సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించారనే అభియోగాలతో పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముంబయి యువకుడు హమిద్ అన్సారీని పాక్ ప్రభుత్వం విడుదల చేసింది.
డిసెంబర్ 16 నాటికి హమిద్ మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. కాసేపటి క్రితం ఆయన వాఘా సరిహద్దు వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి బయల్దేరారు.
భారత్, పాక్‌ల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా వారి దేశాలకు అప్పగించాలి.
2012లో ఓ ఫేస్‌బుక్ చాట్ కారణంగా హమిద్ భారత్ నుంచి అఫ్గానిస్థాన్ వెళ్లి అక్కడి నుంచి సరైన పత్రాలు లేక పాక్‌లో చిక్కుకున్నారు. ఆరేళ్ల కిందట మొదలైన ఈ కథ ఇప్పుడు ముగింపునకు వచ్చింది.
పాక్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా జిల్లాలోని కొహట్‌లో సరైన పత్రాలు చూపని కారణంగా హమిద్‌ను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. మర్దాన్‌లోని జైల్లో మూడేళ్లు హమిద్ శిక్ష అనుభవించారు.

హమిద్ అన్సారీ ఎవరు?
ముంబైకి చెందిన హమిద్ అన్సారీ (33) మేనేజ్‌మెంట్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. అక్కడే ఓ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరాలనుకున్నారు.
ఆయన తల్లి ఫౌజియా అన్సారీ హిందీ ప్రొఫెసర్, తండ్రి బ్యాంకులో ఉద్యోగి, సోదరుడు దంత వైద్యుడు.
హమిద్ విడుదల కోసం ప్రయత్నిస్తున్న జతిన్ దేశాయి బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ, 'పాకిస్తాన్‌ను సందర్శించాలని హమిద్ చాలా సార్లు అనుకున్నారు. కానీ, ఆయనకు వీసా లభించలేదు' అని తెలిపారు.
హమిద్ పాక్‌కు రావడానికే ముందే ఆయనను కొన్నిసార్లు కలసినట్లు జతిన్ దేశాయి బీబీసీకి చెప్పారు. పాక్‌కు వెళ్లడానికి హమిద్ చాలా ఆతృతగా ఉండేవారని అన్నారు.
జతిన్ చెబుతున్నదాని ప్రకారం, పాక్‌లోని కొహట్‌కు చెందిన యువతి హమిద్‌కు సోషల్ మీడియా ఫ్రెండ్. ఆమెను కలవడానికి హమిద్ పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ దేశ విసా కోసం ప్రయత్నించి విఫలమ్యారు. దీంతో కొహట్‌లోని కొందరిని ఫేస్‌బుక్ ద్వారా కలిశారు.

ఫొటో సోర్స్, FACEBOOK
కాబుల్ మీదుగా ముంబై నుంచి కొహట్‌కు
హమిద్ 2012 నవంబర్ 4న ముంబై నుంచి విమానంలో కాబుల్ చేరుకున్నారు. అక్కడ ఓ విమానయాన సంస్థలో ఇంటర్వ్యూ కోసం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పారు. కానీ, కాబుల్ వెళ్లాక అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హమిద్ కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.
మరోవైపు కాబుల్ నుంచి సరైన పత్రాలు లేకుండానే హమిద్ జలాలాబాద్ చేరుకొని అక్కడ సరిహద్దు దాటి టొర్కమ్ మీదుగా పాక్‌లోని కరాక్ చేరుకున్నారు. అక్కడే రెండు రోజులుండి హమాజ్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డు సృష్టించి కొహట్ చేరుకున్నారు. అక్కడ దర్యాప్తు అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
హమిద్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యలు అతడి ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. ఈ- మెయిల్, ఫేస్‌బుక్ సంభాషణల ఆధారంగా అతను ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నారు. కొహట్‌లోని ఒక యువతి కోసం తమ కుమారుడు పాక్ వెళ్లారని గ్రహించారు.
పాక్ యువతి సూచన మేరకే తన కొడుకు అక్కడికి వెళ్లాడని హమిద్ తల్లి చెబుతుండగా, అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడం వల్లే హమిద్‌ను అరెస్టు చేశామని పాక్ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హమిద్‌ను ఫేస్‌బుక్‌లో కలిసింది ఎవరు?
'హమిద్ పాక్‌కు వెళ్లడానికి ఆ దేశంలోని కొందరితో ఫేస్‌బుక్‌లో సహాయం కోసం అడిగారు' అని ఈ కేసుపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
హమిద్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్లను పరిశీలించే అవకాశం లేదు. కానీ, 2012 మార్చి నుంచి నవంబర్ 2012 వరకు పాకిస్తాన్‌లోని కరాక్‌కు చెందిన రెహమాన్‌తో హమిద్ చాలాసార్లు ఫేస్‌బుక్ చాట్ కొనసాగించినట్లు అతని కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
సబాఖాన్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుంచి హమిద్ అకౌంట్‌కు మధ్య ఎక్కువ సంభాషణలు కొనసాగాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమాచారాన్ని కోర్టుకు కూడా తెలిపారు.
హమిద్ ఆచూకీ కోసం 2012లో ఫౌజా అన్సారీ పెషావర్ కోర్టులో హెబిస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై పాక్ రక్షణ శాఖ సమాధానమిస్తూ హమిద్ అన్సారీ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధీనంలో ఉన్నారని, ఆయనపై మిలటరీ కోర్టులో విచారణ కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది.
గూఢచర్య అభియోగంతో 2016లో హమిద్ అన్సారీకి మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గూఢచర్యం చేయడానికే తాను పాక్ వచ్చినట్లు విచారణలో హమిద్ చెప్పారని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, facebook
జర్నలిస్టు అదృశ్యం
ఈ కేసులో మరో కీలకమైన విషయం పాక్ జర్నలిస్టు జీనత్ షెహజాది అదృశ్యం కావడం. లాహోర్‌లోని స్థానిక చానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న జీనత్, హమిద్ కేసుపై పనిచేశారు.
తన మీద దయ చూపాలని 2015లో హమీద్ రాసిన లేఖను పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి, మిలటరీ ఇంటెలిజెన్స్ జనరల్ రిజ్వాన్ సత్తార్‌కు ఆమెనే పంపించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే జీనత్ అదృశ్యం అయ్యారు.
పాక్ మానవ హక్కుల న్యాయావాది హీనా జిలానీ వాదన ప్రకారం 19 ఆగస్టు 2015న జీనత్ తన కార్యాలయానికి వెళుతున్న క్రమంలో అదృశ్యం అయ్యారు. టొయోటా వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు.
ఆమె అదృశ్యం తర్వాత వారి ఇంట్లో మరో విషాదకర సంఘటన జరిగింది. జీనత్ సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోదరి అదృశ్యంపై కలత చెంది తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని జీనత్ తల్లి బీబీసీకి చెప్పారు.
అదృశ్యం అయిన 27 నెలల తర్వాత అఫ్గానిస్తాన్, పాక్ సరిహద్దుల మధ్య జీనత్ కనిపించారు. ఆమె బయటకు వచ్చాక వారి కుటుంబం మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








