బాబ్రీ విధ్వంసం తర్వాత పాకిస్తాన్‌లో కూల్చిన మందిరాలివే!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షీరాజ్ హసన్
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి, ఇస్లామాబాద్
అయోధ్యలో అతివాద హిందూ గుంపులు బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన తరువాత దానిపై పాకిస్తాన్‌లో ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందనే విషయాన్ని చాలా తక్కువ మందే ఆలోచించి ఉంటారు.
పాకిస్తాన్ జనాభాలో హిందువులూ ఉన్నారు. అక్కడ వారు ప్రార్థనలు జరుపుకొనేందుకు కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి.
అయితే, 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్‌లోనూ వెంటనే ప్రతీకార చర్యలు మొదలయ్యాయి.
బాబ్రీ విధ్వంసం తర్వాత దాదాపు 100 మందిరాలను నేలమట్టం చేశారు లేదా వాటికి భారీ నష్టం కలిగించారు.
అయితే వీటిలో చాలా వరకు నిత్యం పూజలు, పునస్కారాలు సాగే మందిరాలు కావు.
వీటిలో కొన్ని మందిరాలలో 1947లో జరిగిన దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చిన వాళ్లు ఆశ్రయం తీసుకున్నారు.
మా ఇతర కథనాలు

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
జైన మందిరం
1992 డిసెంబర్ 8న లాహోర్‌లో ఉన్న ఒక జైన మందిరాన్ని కొందరు కూల్చివేశారు. ఇప్పుడు అక్కడ కేవలం దుమ్ము కొట్టుకుపోయిన శిథిలాలు మాత్రమే ఉన్నాయి.
నేను ఈ మందిరాల్లో ఉన్న కొంతమందితో మాట్లాడాను.
1992లో ఈ మందిరాలను గుంపులు కూల్చడానికి వచ్చినపుడు వీటిని వదిలెయ్యండని వేడుకున్నామని వారు తెలిపారు.
వారు నాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ "ఇది మా నివాసం. మాపై దాడి చేయకండి.. అని వాళ్లను వేడుకున్నాం" అని చెప్పారు.
మా ఇతర కథనాలు

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
కృష్ణ మందిరం
రావల్పిండిలో ఉన్న కృష్ణుడి మందిరంలో నేటికీ హిందువుల పూజలు జరుగుతాయి. బాబ్రీ విధ్వంసం తర్వాత ఈ మందిరం గోపురాన్ని కూల్చివేశారు.
ప్రభుత్వం తలచుకుంటే ఈ గోపురాన్ని మళ్లీ నిర్మించగలిగేది కానీ అలా జరగలేదు.

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
కల్యాణ్ దాస్ మందిరం
ఈ ఫోటో రావల్పిండిలోని కల్యాణ్ దాస్ మందిరానిది. ప్రస్తుతం ఇందులో అంధుల కోసం ఒక స్కూలు నడిపిస్తున్నారు.
1992లో ఓ గుంపు దీనిపై దాడి చేశారనీ, అయితే ఎలాగోలా దాన్ని కాపాడుకోగలిగామనీ స్కూలు అధికారులు నాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
పాకిస్తాన్ లోని ఝేలమ్ పట్టణంలో ఖాళీగా పడి ఉన్న ఓ మందిరం దృశ్యం.
ఈ మందిరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించిన వారందరికీ ఏదో ఒక నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు గాయపడడమో, చనిపోవడమో జరిగిందని వారంటారు.
1992లో ఈ మందిరాన్ని కూడా దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించారు. మందిరం పైభాగం కూలిపోయింది. ఆ తర్వాత మరెవ్వరూ దీనికి నష్టం చేయడానికి ప్రయత్నించలేదు.

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
బంశీధర్ మందిరం
లాహోర్‌లోని అనార్కలీ బజారులో ఉన్న బంశీధర్ మందిరాన్ని కూడా 1992లో పాక్షికంగా నష్టపరిచారు.

ఫొటో సోర్స్, Shiraz Hassan/BBC
శీతలా దేవి మందిరం
పై ఫొటో లాహోర్‌లోని శీతలా దేవి మందిరానిది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పాకిస్తాన్‌లో ఉన్మాదుల క్రోధానికి గురైన మందిరాల్లో ఇది కూడా ఒకటి.
వారి దాడిలో ఈ మందిరం పాక్షికంగా దెబ్బతింది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చిన వారు కొందరు ఈ మధ్య కాలంలో ఈ మందిరంలో ఆశ్రయం పొందుతున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








