అమెరికా Vs ఇరాన్: ప్రపంచ దేశాలలో ఎవరు ఎవరివైపు?

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 7 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది.

అనేక దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌లకు మద్దతు ఇవ్వగా, కొన్ని దేశాలు ఇరాన్‌కు సంఘీభావం ప్రకటించాయి.

అదే సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి చర్యలు తీసుకుంటున్న, తటస్థ ప్రకటనలు ఇస్తున్న అనేక దేశాలు కూడా ఉన్నాయి. వారు ఏ పక్షానికి మద్దతనేదానిగురించి కాకుండా శాంతి గురించి మాట్లాడుతున్నాయి.

ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో సహా అనేకమంది అగ్రనాయకులు, అధికారులు మరణించారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్.

ఈ ఘటనలపై ప్రపంచ దేశాలు స్పందించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధానితో భారత ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు.

భారత్ ఏమంటోంది?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 1) రాత్రి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై ఇద్దరు నాయకులు చర్చించారు.

ఇటీవలి పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిందని, పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ 'ఎక్స్' లోరాశారు .

వీలైనంత త్వరగా సంఘర్షణను ఆపడం ముఖ్యమని కూడా ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు మోదీ ఆదివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు .

యూఏఈపై జరిగిన దాడులను ప్రధాని మోదీ ఖండించారు. యూఏఈలో నివసిస్తున్న భారతీయులను జాగ్రత్తగా చూసుకున్నందుకు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

"ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఉద్రిక్తతలను పెంచకుండా, సంయమనం పాటించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది .

"ఉద్రిక్తతలను తగ్గించడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యవిధానాలను అనుసరించాలి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి'' అని ఆ ప్రకటనలో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, X / Keir Starmer

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై దాడుల్లో పాల్గొనడం లేదని బ్రిటన్ తెలిపింది.

‘ఇరాక్‌ అనుభవాల దృష్ట్యా ఇరాన్‌పై దాడుల్లో పాల్గొనడం లేదు’

ఇరాన్ క్షిపణి స్థావరాలపై "రక్షణాత్మక" దాడులకు బ్రిటిష్ సైనిక స్థావరాలను ఉపయోగించుకుంటామన్న అమెరికా అభ్యర్థనను బ్రిటన్ అంగీకరించింది.

బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ‘ఇరాక్ తప్పుల’ నుంచి కొన్ని పాాఠాలు నేర్చుకున్నామని, ఇరాన్‌పై దాడిలో బ్రిటన్ ప్రమేయం లేదని, "ఇకపై కూడా ఎలాంటి దాడుల్లో పాల్గొనబోద"ని కూడా ఆయన చెప్పారు.

మిత్రదేశాల "సమిష్టి ఆత్మరక్షణ"కు, బ్రిటిష్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి అమెరికా విజ్ఞప్తిని అంగీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు స్టార్మర్ అన్నారు.

అంతకుముందు పశ్చిమాసియాలో ఇరాన్ నిరంతర దాడులను విమర్శిస్తూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

పశ్చిమాసియాలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్జ్ అన్నారు.

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్

యూరోపియన్ దేశాలు ఎవరివైపున్నాయి?

ఇరాన్‌లో ‘హత్యాకాండ సాగిస్తున్న ప్రభుత్వం'పై యూరోపియన్ యూనియన్ ఇప్పటికే విస్తృత ఆంక్షలు అమలుచేసిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అన్నారు.

''ప్రజల ప్రాణ రక్షణకు అన్ని పక్షాలు సహనంతో వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి'' అని ఆమె కోరారు.

ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కార్యాలయం తెలిపింది. ప్రజల, రాజకీయ హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకునే ప్రయత్నాలకు మద్దతుగా నిలిచేందుకు మిత్రపక్షాలతో మాట్లాడతామని తెలిపింది.

''అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అండగా ఉన్నాం'' అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. అణ్వాయుధాలు పొందకుండా ఇరాన్‌ను నిరోధించే అమెరికా ప్రయత్నాలకు మద్దతిస్తున్నామని తెలిపారు.

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడులు ఆపాలని గల్ఫ్ దేశాలు ఇరాన్‌ను హెచ్చరించాయి.

ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక

ఇరాన్ దాడుల వల్ల కలిగిన నష్టంపై చర్చించడానికి గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి.

నివాస ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని జీసీసీ తెలిపింది.

జీసీసీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్ ఉన్నాయి.

ఈ దేశాలన్నీ ఇరాన్ దాడులను ఖండించాయి. తమ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించాయి.

దాడులను ఇరాన్ ఆపాలని, చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని జీసీసీ ఓ పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తమ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

పొరుగుదేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందన్న ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఖండించారు.

"మేం పర్షియన్ గల్ఫ్ దేశాలలో మా పొరుగువారిపై దాడి చేయడం లేదు. ఈ దేశాల్లో అమెరికా ఉనికిని లక్ష్యంగా చేసుకుంటున్నాం. పొరుగుదేశాలు ఈ యుద్ధాన్ని నిర్ణయించిన వారికి తమ మనోవేదనలను తెలియజేయాలి" అని ఆయన అల్ జజీరాతో అన్నారు.

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖమేనీ మరణంపై పాకిస్తాన్ ప్రధాని విచారం వ్యక్తంచేశారు.

ఖమేనీ మరణంపై పాకిస్తాన్ విచారం

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.

"దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజలు అండగా నిలుస్తున్నారు. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ 'బలిదానం' పై సంతాపం వ్యక్తం చేస్తున్నాను" అని ప్రధాని షాబాజ్ షరీఫ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

"అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏ దేశాధిపతినీ లక్ష్యంగా చేసుకోకూడదనేది చాలా కాలంగా ఉన్న సంప్రదాయం" అని ఆయన రాశారు.

ఇరాన్‌పై జరిగిన దాడులు "చాలా విచారకరం" అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నట్టు బీబీసీ ఉర్దూ తెలిపింది..

"ఇరాన్‌కు అన్ని విధాలుగా దౌత్యపరమైన నైతిక మద్దతును అందించింది. ఇరాన్‌పై జరిగిన దాడిని ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్ స్పష్టంగా ఖండించింది" అని ఖవాజా ఆసిఫ్ అన్నారు.

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖమేనీ హత్య ఇరాన్ సార్వభౌమాధికాారాన్ని ఉల్లంఘించడమేనని జిన్‌పింగ్ అన్నారు.

ఇరాన్‌కు మద్దతు తెలిపిన చైనా

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, సుప్రీం నాయకుడు అయతొల్లా ఖమేనీ మరణంపై చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. దాడులు "ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, నిబంధనలకు విరుద్ధం" అని పేర్కొంది.

"ఇరాన్‌పై దాడి, సుప్రీం లీడర్ హత్య, హత్య ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడమే. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఖండిస్తోంది" అని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

శాంతిని పరిరక్షించాలని చైనా విజ్ఞప్తి చేసింది.

"పశ్చిమాసియా, మొత్తం ప్రపంచంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఉద్రిక్త పరిస్థితిని మరింత పెంచకుండా, సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం" అని చైనా పేర్కొంది.

భారత్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఖమేనీ, రష్యా, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘ఖమేనీ మరణం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన హత్య’ అని పుతిన్ ఆరోపించారు.

అమెరికా దాడులపై రష్యా విమర్శలు

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేసినట్టు రష్యా రాష్ట్ర న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.

"అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల మరణం మానవ నైతికత, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన హత్య" అని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో పుతిన్ చెప్పినట్టు బీబీసీ పర్షియన్ తెలిపింది.

"రాజకీయ, దౌత్య పరిష్కార మార్గంలోకి వెంటనే తిరిగి రావాలని మేం డిమాండ్ చేస్తున్నాం" అని రష్యా విదేశాంగ శాఖ టెలిగ్రామ్ చానెల్‌లో పోస్ట్ చేసింది.

అమెరికా, ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని "మానవతావాద, ఆర్థిక, బహుశా రేడియోధార్మిక విపత్తు" వైపు నెట్టివేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)