అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నందిని వెళ్ళైసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నాటి గణాంకాల ప్రకారం, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.16,287 వద్ద, 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.14,930గా ఉంది.
దీపావళి తర్వాత, బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో, బంగారం ధరలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
"పండుగ సమయాల్లో సాధారణంగానే ధరలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిమితిని మించి పెరగలేదు" అన్నారు.
ఈ పరిస్థితుల్లో, బంగారం ధరల్లో ఇంకా పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు బంగారం ధరలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?


ఫొటో సోర్స్, Getty Images
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంగారం ధరలు ప్రధానంగా మూడు ముఖ్యమైన పరిస్థితులలో పెరుగుతాయని ప్రైవేట్ రంగంలో ఫైనాన్సియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న సుధాకర్ ‘బీబీసీ తమిళ్’తో చెప్పారు.
ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరత నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
రూపాయి లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి బంగారం ఒక ఉత్తమ సాధనంగా మారుతుంది.
భారతదేశం వంటి దేశాలలో పండుగలు, పెళ్లిళ్ల సమయంలో నగలు (ఫిజికల్ గోల్డ్) కొనుగోళ్లు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.
''యుద్ధ వాతావరణం వంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్‌పై ప్రజలకు ఆసక్తి లేదా నమ్మకం తగ్గినప్పుడు, వారు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావించే బంగారం ధరలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ విలువ క్షీణించినా బంగారం ధరలు పైకి వెళ్తాయి" అని సుధాకర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం...
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఖచ్చితంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సుధాకర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "ఇరాన్‌తో అమెరికా ఒక ఒప్పందానికి వస్తుందా లేదా సైనిక చర్య తీసుకుంటుందా అనేది బహుశా మరో 10 రోజుల్లో ప్రపంచానికి తెలుస్తుంది" అని అన్నారు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన 'శాంతి మండలి' మొదటి సమావేశంలో, ఇరాన్ అణు కార్యక్రమ చర్చల గురించి ఆయన మాట్లాడుతూ, "మనం ఒక అర్థవంతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి, లేదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి" అని హెచ్చరించారు.
అమెరికా తన సైనిక బలగాలను మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి తరలించింది. అదే సమయంలో, స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ చర్చల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని కథనాలు వస్తున్నాయి.
ఒకవేళ అమెరికా అన్నట్లుగా ఇరాన్‌పై 'సైనిక చర్య' తీసుకుంటే, బంగారం ధరలు మరింత పెరుగుతాయని సుధాకర్ చెబుతున్నారు.
''యుద్ధ వాతావరణం నెలకొంటే, ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది" అని చెప్పారు.
అయితే, ఈ అంచనాలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మారుతున్న రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ధర తగ్గుతుందా?
ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సతీష్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
''బంగారం ధరలు స్వల్ప కాలానికి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. బంగారం మార్కెట్‌పై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను తగ్గించి, బంగారు నిల్వలను పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా కొనుగోళ్లు పెంచాయి. అయినప్పటికీ, త్వరలోనే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది'' అని ఆయన చెప్పారు.
మరోవైపు, ఆర్థిక సలహాదారు సుధాకర్ మార్కెట్ ప్రస్తుతం స్థిరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
''డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉంటేనే ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయంటే, డిమాండ్ తగ్గలేదని అర్థం. అయితే కొనుగోలుదారులు వేచిచూస్తున్నారు. మళ్లీ కొనుగోళ్లు పెరిగినప్పుడు ధరలు మళ్లీ పుంజుకుంటాయి'' అని చెప్పారు.
దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
''ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇంకా పెద్దగా కనిపించలేదు. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ కూడా ధరలపై ప్రభావం చూపుతాయి'' అని సుధాకర్ తెలిపారు.
''డాలర్ విలువలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోయినా, అమెరికా తీసుకునే నిర్ణయాలు, యుద్ధం వంటి పరిస్థితుల వల్ల మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ దేశాలకు బంగారం ఒక సురక్షితమైన మార్గంగా కనిపిస్తోంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ దేశాలు ఏంచేస్తున్నాయి?
ప్రపంచ మార్కెట్‌లో చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ దేశాలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయని సుధాకర్ చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారులైన చైనా, రష్యా తమ దేశాల బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ వస్తున్నాయి.
యుక్రెయిన్‌పై దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల మధ్య రష్యా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినప్పుడల్లా చైనా కొనుగోళ్లను వేగవంతం చేస్తోంది. 2023 తర్వాత కొనుగోళ్ల వేగం కొంత తగ్గించినప్పటికీ, నిరంతరంగా బంగారాన్ని సమీకరిస్తూనే ఉంది.
''ట్రంప్ బ్రిక్స్ దేశాలకు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు నిర్ణయాలు తీసుకుంటే, ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు'' అని సుధాకర్ చెప్పారు.
''నిరుడు ట్రంప్ అమలు చేసిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. అయితే, అమెరికా చట్టాల ప్రకారం ఈ సుంకాల తగ్గింపు తాత్కాలికం మాత్రమే. దీనికి శాశ్వత చట్టపరమైన గుర్తింపు రావాల్సి ఉంది. ట్రంప్ తీసుకుంటున్న ఇటువంటి అనిశ్చిత నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణంగా మారుతున్నాయి'' అని సుధాకర్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














