గోల్డ్ లోన్స్: ఇకపై బంగారం కొన్న రశీదు ఉంటేనే రుణం ఇస్తారా, ఏమిటీ ఆర్బీఐ కొత్త రూల్స్?

బంగారం, ఆభరణాలు, తనఖా, బ్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విజయానంద ఆర్ముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగారం, ఆభరణాల తనఖా రుణాలు అందించడంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరికొత్త నిబంధనల ముసాయిదాను జారీ చేసింది.

ఆభరణాలపై రుణాల విషయంలో మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెడుతున్నట్లు రిజర్వు బ్యాంకు చెప్పింది.

ఈ నిబంధనల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుందని వినియోగదారుల సంస్థలు చెబుతున్నాయి.

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ముసాయిదా ఏం చెబుతోంది? దీని ప్రభావం ఎవరిపై ఎక్కువ?

భారత్‌లోని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార సంఘాల (కోఆపరేటివ్ సొసైటీల)కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గత ఏడాది సెప్టెంబర్ 30న ఒక సర్య్కులర్ జారీ చేసింది.

ఆర్‌బీఐ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ తరుణ్ సింగ్ పంపిన ఆ సర్య్కులర్ , బంగారం, ఆభరణాల రుణాల విషయంలో అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నారని ప్రస్తావించారు.

నగలు తనఖా పెట్టి రుణాలు పొందడంలో అక్రమపద్ధతులను అనుసరిస్తున్నట్టు ఆర్‌బీఐ చేసిన అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్‌బీఐ అధ్యయనంలో తేలిన లోపాలు

  • బంగారునగలపై రుణాలు పొందడంలో, విలువకట్టడంలోనూ లోపాలు ఉన్నాయి.
  • క్లయింట్ లేకుండానే బంగారానికి విలువ కడుతున్నారు.
  • బంగారు, ఆభరణాల రుణాలపై నిరంతర పర్యవేక్షణ కొరవడింది.
  • రుణాలు చెల్లించడంలో వినియోగదారులు విఫలమైనప్పడు, ఆ బంగారాన్ని వేలం వేసే విషయంలో పారదర్శకత లోపిస్తోంది.
  • పర్యవేక్షణలోని బలహీనతలను , విలువకట్టడంలోని తప్పులను ఎత్తిచూపుతూ, '' బంగారం తనఖాపై రుణాలకు సంబంధించి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తక్షణమే తమ విధానాలను సమీక్షించాల్సి ఉంది.'' అని ఉత్తర్వులో ఆదేశించింది.

ఈ విషయంలో తీసుకునే చర్యలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సీనియర్ సూపర్‌వైజరీ మేనేజర్ (ఎస్ఎస్ఎం)కు తెలపాలని ఆదేశించింది.

బంగారం, ఆభరణాల రుణాలకు సంబంధించిన తొమ్మిది నిబంధనల ముసాయిదాను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జారీ చేసింది. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ముసాయిదా నిబంధనలు ఏంటి?

  • బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు, దాని విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం వస్తుంది. అంటే నగ విలువ రూ.100 అనుకోండి, అప్పుడు మీకు రూ.75 వరకే రుణం ఇస్తారు.
  • తాకట్టు పెట్టే బంగారు ఆభరణానికి తానే యజమాని అని రుణగ్రహీత బ్యాంకుకు రుజువును సమర్పించాలి.
  • బంగారు ఆభరణాల స్వచ్ఛత, నాణ్యతకు సంబంధించి బ్యాంకు నుంచి రుణగ్రహీత ఒక ధృవీకరణ పత్రాన్ని పొందాలి. బ్యాంకు, రుణగ్రహీత సంతకం పెట్టిన ఈ ధృవీకరణ పత్రానికి చెందిన కాపీని బ్యాంకు వద్ద ఉంచాలి.
  • బంగారు ఆభరణాలు 22 క్యారెట్లు లేదా ఆపైన ఉంటేనే రుణాలు మంజూరు అవుతాయి.
  • ఒకవేళ బంగారు ఆభరణాలు 24 క్యారెట్లు అయినప్పటికీ, 22 క్యారెట్ల బరువు ఆధారంగానే రుణాలు లెక్కిస్తారు.
  • బంగారు ఆభరణాలకే రుణాలు ఇస్తారు. నాన్ జ్యూవెల్లరీ గోల్డ్ బార్లకు (నగల రూపంలో లేని బంగారానికి ) రుణాలు ఇవ్వరు.
  • బ్యాంకులో కేజీ వరకు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకోవచ్చు.
  • బంగారంపై రుణాలు జారీ చేసేటప్పుడు, రుణానికి సంబంధించిన సమాచారమంతా అగ్రిమెంట్‌లో పొందుపరచాలి.
  • ఇది వ్యయం, ఆదాయానికి సంబంధించిన రుణాలు రెండింటికీ వర్తిస్తుంది. వ్యయ సంబంధిత రుణాలు అంటే, తక్షణ అవసరాల కోసం తీసుకునేవి. ఆదాయ సంబంధిత రుణాలు అంటే పెట్టుబడుల ప్రయోజనాల కోసం తీసుకునేవి.
  • రుణాన్ని తిరిగి చెల్లించిన 7 పని దినాల్లో ఖాతాదారులకు బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చేయాలి. లేదంటే, తిరిగి ఇచ్చేదాకా ప్రతి రోజూ రూ.5000 జరిమానాను చెల్లించాలి.
  • నగలు వేలానికి తీసుకెళ్లేటప్పుడు, కచ్చితంగా ఖాతాదారునికి తెలియజేయాలి. చెప్పకపోతే, బ్యాంకుపై దావా వేయచ్చు.
  • వెండి ఆభరణాలపై కూడా రుణం పొందవచ్చు. 999 గ్రేడ్‌ వెండి ఆభరణాలను మాత్రమే తాకట్టు పెట్టుకోవచ్చు.
  • బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన రుణాలపై పూర్తిగా చెల్లింపులు జరిగిన తర్వాతనే తిరిగి తాకట్టు పెట్టుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గత నెలలో ఆదేశాలు జారీ చేసింది.
పెళ్లి కూతురు ఆభరణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకీ ఆంక్షలు?

''ఆభరణ రుణాల నిబంధనల ముసాయిదాను రిజర్వు బ్యాంకు తన వెబ్‌సైట్‌లో తెలియజేసింది. పలు వర్గాల నుంచి అభిప్రాయాలను కోరింది.'' అని ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్ నాగప్పన్ తెలిపారు.

'' బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు వాటి అభిప్రాయాలను తెలియజేయచ్చు. భారత్‌లో బంగారం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి, ప్రజల అభిప్రాయాలను విన్న తర్వాతనే రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకోవాలి.'' అని ఆయన బీబీసీతో అన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో బంగారం విలువలో 80 శాతం వరకు రుణం వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 75 శాతానికి తగ్గించినట్లు నాగప్పన్ తెలిపారు.

దీనికి గల కారణాన్ని వివరించిన నాగప్పన్, '' తనఖా పెట్టిన ఆభరణాలపై వడ్డీ చెల్లించకపోతే, దాని రికవరీలో జాప్యం జరుగుతుంది. అంతేకాక, వడ్డీ సహా వసూలు చేసే మొత్తానికి, దాని మొత్తం ధరకు 25 శాతం వ్యత్యాసం ఉండాలన్నది రిజర్వు బ్యాంకు అభిప్రాయం కావచ్చు.'' అని తెలిపారు.

ఆర్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

రశీదు సమర్పణ సాధ్యమేనా?

''బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు యజమాన్య రశీదును తప్పనిసరి చేయడం స్వాగతించదగ్గ విషయం.'' అని నాగప్పన్ చెప్పారు.

''కానీ, దీన్ని అనుసరించే అవకాశం చాలా తక్కువ. చాలామంది ఇళ్లల్లో వారసత్వంగా వచ్చిన బంగారం ఉంటుంది. వాటికి డాక్యుమెంట్లు చూపించడం సాధ్యపడదు.'' అని అన్నారు.

ఆభరణాలను కరిగించి, అమ్మే ఘటనలు పెరుగుతున్నాయని కూడా నాగప్పన్ తెలిపారు.

'' కొత్త నిబంధనల కింద రశీదులు తప్పనిసరి చేస్తే, వాటిని అమ్మడం చాలా కష్టమవుతుంది.'' అని చెప్పారు.

''భారత్‌లో చాలామంది ఇళ్లల్లో ఉన్న బంగారు ఆభరణాలకు రశీదులు ఉండవు. స్టోర్లలో రశీదు లేకుండా కాస్త తక్కువ ధరలకు బంగారు ఆభరణాలు కొంటుంటారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇక అలా చేయడం కుదరదు.'' అని నాగప్పన్ తెలిపారు.

''కిలోల మేర బంగారు ఆభరణాలను ఎవరు కొనరు. ప్రజలు దీన్నొక పొదుపులాగానే చూస్తారు. ఒకవేళ రశీదు ఉంటే, తనఖా నిబంధనల కింద అది అమలయ్యే అవకాశం తక్కువ.'' అని నటరాజన్ చెప్పారు. వినియోగదారుల కేసులకు ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

''తమిళనాడులోని 90 శాతం ఆభరణాల దుకాణాల్లో ఆభరణాలను రశీదుతోనే విక్రయిస్తున్నారు.వీటిని ఆడిటర్ సర్టిఫై చేస్తే సరిపోతుంది. మీకు ఆభరణాలపై రుణాలు వస్తాయి.'' అని చెన్నై గోల్డ్, డైమండ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంతిలాల్ సలాని చెప్పారు.

బంగారు గాజులు

ఫొటో సోర్స్, Getty Images

వెండి నగలపైనా రుణాలు

వెండి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టుకోవచ్చని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన నిబంధనల్లో పేర్కొంది.

'' ఇది నిజంగా స్వాగతించదగ్గ విషయం.'' అని జయంతిలాల్ సలాని అన్నారు.

''బంగారం, వెండి రెండూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన ఖనిజాలు. ప్రస్తుతం వెండి గ్రాము ధర రూ.110 పలుకుతోంది. చిన్న మొత్తాల రుణాలు పొందేందుకు వెండి ఆభరణాలు సాయపడతాయి.'' అని తెలిపారు.

'' వెండి ఆభరణాలను కూడా బ్యాంకులో తాకట్టుకు అనుమతించడం మంచి విషయం. కానీ, బంగారు రుణాలపై మరిన్ని ఆంక్షలు తీసుకురావడం వల్ల మహిళలపై భారం పెరుగుతుంది.'' అని కోయంబత్తూరులో బంగారు ఆభరణాల తాకట్టు వ్యాపారం నిర్వహిస్తోన్న జీవన్ చెప్పారు.

బంగారమనేది ఒక ఆస్తి అని, భారతీయ కుటుంబాల్లో మహిళలకు తక్షణ అవసరంగా ఇది పనికొస్తుందన్నారు. వైద్యం, విద్య వంటి తక్షణ ఖర్చులకు దీన్నొక పరిష్కారంగా ప్రజలు చూస్తుంటారు.

''పేదవారు మాత్రమే డబ్బు అవసరమైనప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లోనే ఆభరణాలను తాకట్టు పెడుతుంటారు. ధనవంతులు బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు.'' అని చెన్నైలోని మడిపక్కంలో నివసించే శ్రీలక్ష్మి చెప్పారు.

'' ఆభరణాల తాకట్టు నిబంధనలు కఠినతరం చేయడం, సామాన్య ప్రజలు బ్యాంకులకు బదులు అనధికారిక తాకట్టు దుకాణాలను ఆశ్రయిస్తారు. ఇది వారికి ఇబ్బందులను మరింత పెంచుతుంది.'' అని తెలిపారు.

'' నిబంధనలు పెరుగుతున్న కొద్దీ ప్రజలు బ్యాంకులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల వద్దకు వెళ్తారు. దీనివల్ల, అత్యధిక వడ్డీ రేట్ల వలలో వారు చిక్కుకుపోతారు.'' అని ఆభరణాల దుకాణాన్ని నడిపే జీవన్ కూడా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)