పాకిస్తాన్: సింధు నదిలో టన్నుల కొద్ది బంగారం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇస్మాయిల్ షేక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇదేమీ తొలిసారి కాదు. గతంలోని పాకిస్తాన్‌లోని అనేక ప్రభుత్వాలు తాము విలువైన లోహాలను గుర్తించినట్లు ప్రకటించుకున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్‌లోని చినియోట్ నగరంలో తాము భారీ పరిమాణంలో ఇనుము, వెండి, బంగారు నిల్వలను గుర్తించినట్లు 2015లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ నిల్వలతో పాకిస్తాన్ సుసంపన్నం అవుతుందని చెప్పారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ మంత్రి నుంచి కూడా తాజాగా ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. అటోక్ ప్రాంతంలో 700 బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన బంగారం నిల్వలు ఉన్నాయని మైనింగ్ శాఖ మంత్రి షేర్ అలీ గొర్చానీ చెప్పారు.
అటోక్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో 28 లక్షల తులాల బంగారు నిల్వలు ఉన్నట్లు మంత్రి చెప్పారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ 600 నుంచి 700 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు ఉండవచ్చని అంచనా.
అటోక్ సమీపంలో సింధు, కాబుల్ నదులు కలిసే ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నట్లు గత వారం పంజాబ్ ప్రావిన్స్ మాజీ మంత్రి ఇబ్రహీం హస్సన్ మురాద్ చెప్పారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో అటోక్ వద్ద కొంతమంది మెషీన్లతో బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఆయన ఒక ప్రైవేట్ చానల్‌తో మాట్లాడినప్పుడు చెప్పారు.
అటోక్ వద్ద బంగారం కోసం కొంతమంది వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించామని, అక్కడ బంగారం కోసం అన్వేషణపై నిషేధం విధించినట్లు హస్సన్ మురాద్ చెప్పారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ (జీఎస్‌పీ) 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో 500 నమూనాలు సేకరించిందని, ఆ ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
ఈ ప్రకటనల తర్వాత పాకిస్తాన్‌లో నిజంగానే బంగారం నిల్వలు ఉన్నాయా? వాటన్నింటినీ తవ్వి వెలికి తీస్తే ఎంత బంగారం వస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి.


ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో బంగారం నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
సౌదీ అరేబియాలోని ఫ్యూచర్ మినరల్స్ ఫోరం సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో 1.6 బిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
పాకిస్తాన్‌లో ఏటా ఒకటిన్నర, రెండు టన్నుల బంగారం వెలికి తీస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. వచ్చే పదేళ్లలో అది పది టన్నులకు చేరుతుందని చెప్పారు. బలూచిస్తాన్‌లోనే వెండి నిల్వలు కూడా ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపారు.
పాకిస్తాన్‌లో వెండి తవ్వకాలు రాగి, బంగారంతో ముడి పడి ఉన్నాయని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఉన్న వెండి అంతా ఇతర లోహాల ఉత్పత్తిలో భాగంగా అదనంగా ఉత్పత్తి అవుతున్నదే.
ఇంధన శాఖ కింద పని చేస్తున్న ఓ సంస్థ దేశంలోని అనేక ప్రాంతాల్లో విలువైన లోహాలు, ఖనిజాలను వెలికి తీస్తోందని జీఎస్‌పీ 2022-23 నివేదిక చెబుతోంది.
పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని బరిత్ హన్కోయి ప్రాంతంలో బంగారం, రాగిని వెలికి తీసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ అధ్యయనం చేస్తోందని ఆ నివేదిక తెలిపింది.
దీంతో పాటు పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జిల్లా, ఖైబర్ పఖ్తుంక్వా జిల్లాలోని మన్షహరా జిల్లాల్లో జియో కెమికల్ సాంకేతికతను ఉపయోగించి ప్లేసర్ గోల్డ్‌తో పాటు ఇతర లోహాలు ఉన్నాయేమోనని గుర్తించేందుకు జీఎస్‌పీ ప్రయత్నాలు చేసింది.
అటోక్ జిల్లాలో బంగారం ఉందా లేదా అనే విషయమై జియో ఫిజికల్ సర్వేలు నిర్వహించి, నమూనాలు వెలికి తీసి వాటిపై అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినట్లు జీఎస్‌పీ తెలిపింది.
ఖైబర్ పఖ్తూంక్వాలో ప్లేసర్ గోల్డ్ ఎక్కడెక్కడ ఉందనే దాని గురించి తెలుసుకునేందుకు కృషి జరిగిందని ఈ నివేదిక తెలిపింది. చిత్రాల్, స్వాత్, బునిర్ ప్రాంతాల్లోని ఆరు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జియోలాజికల్ మ్యాపింగ్ చేశారు.
ఈ ప్రాంతాలే కాకుండా, సింధ్‌లోని తెహసిల్ నగర్ పార్కర్‌లోనూ బంగారం నిల్వలను గుర్తించినట్లు జీఎస్‌పీకి చెందిన అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు. ఆయన తన పేరును రహస్యంగా ఉంచాలని కోరారు. తెహసిల్ నగర్‌లో ఉన్న బంగారం నిల్వల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, saindak.com.pk
సెండక్ ప్రాజెక్టు
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని చాగి జిల్లాలో 1990లో ప్రారంభమైన సెండక్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చైనాకు చెందిన సంస్థకు ఇక్కడ తవ్వకాల బాధ్యతను అప్పగించారు. చైనా సంస్థ ఇక్కడ ఖనిజ వనరుల శుద్ధి కర్మాగారంతో స్థానికుల కోసం ఒక కాలనీ ఏర్పాటు చేసి కాలనీకి విద్యుత్, తాగునీటి సరఫరా సౌకర్యాన్ని అందిస్తోంది.
సెండక్ ప్రాజెక్టు నిర్మాణం 1995లో మొదలైంది. 1500 టన్నుల రాగి, బంగారం ఉత్పత్తి చేసిన తర్వాత సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. 2003లో ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి.
2003లో ఈ ప్రాజెక్టును చైనా మెటలర్జికల్ కనస్ట్రక్షన్ కార్పోరేషన్‌కు అప్పగించారు. 2003 ఆగస్టు నుంచి ఈ సంస్థ వాణిజ్యపరమైన తవ్వకాలు చేపట్టంది. అప్పటి నుంచీ ఈ సంస్థ తవ్వకాలు కొనసాగిస్తోంది.
ప్రాజెక్టు దక్షిణం వైపు ఉన్న గనిలో 75.8 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయని ఇందులో టన్నుకు 0.47 గ్రాముల బంగారం ఉందని సెండక్ ప్రాజెక్టు వెబ్‌సైట్ చెబుతోంది.
సెండక్ ప్రాజెక్టులోని ఈ గని నుంచి ఏటా 1,150 కిలోల బంగారం, 15 వేల టన్నుల రాగి రజను, 1,000 కిలోల వెండి వెలికితీయవచ్చు.
మొదట అంచనా వేసిన దాని ప్రకారం ఉత్తరం వైపు ఉన్న గనిలో 46.4 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇందులో ఒక టన్ను రాగి రజను వెలికి తీస్తే అందులో 0.37 శాతం రాగి లభిస్తుంది. బంగారం విషయానికొస్తే ఒక టన్నులో బంగారం 0.14 శాతం చొప్పున మొత్తం రాగి బంగారం కలిపి 6,346 కేజీలు లభిస్తుంది.
2021లో 16 వేల మెట్రిక్ టన్నుల రాగిని వెలికి తీసినట్లు చైనాకు చెందిన సంస్థ ఒక నివేదికలో తెలిపింది. అయితే అందులో బంగారం ఎంత ఉందో మాత్రం వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Reuters
'రికోడిక్ ప్రాజెక్టు'పై వివాదం
ప్రపంచంలోనే విశాలమైన బంగారం, రాగి గనులు బలూచిస్తాన్‌లోని చాగీలో ఉన్నాయని చెబుతారు.
మూడు దశాబ్ధాల క్రితం పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఖనిజాలను వెలికి తీసేందుకు రికోడిక్ ప్రాజెక్టును ప్రారంభించింది.
రికోడిక్ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న సంస్థ పనులు చేస్తూ ఉండగానే తిటియాన్ కాపర్ కంపెనీకి 2013లో గనుల తవ్వకానికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై తిటియాన్ కాపర్ కంపెనీ రెండు అంతర్జాతీయ వేదికలలో ఫిర్యాదు చేసింది. తమ పెట్టుబడులకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరింది.
ఈ సంస్థ ఫిర్యాదు చేసిన అంతర్జాతీయ సంస్థలలో ఒకటి అంతర్జాతీయ పెట్టుబడుల వివాదాల పరిష్కార కేంద్రం. ఈ సంస్థ తిటియాన్ కాపర్ కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాటు పాకిస్తాన్‌కు జరిమానా విధించింది.
తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తిటియాన్ కాపర్ కంపెనీతో పాటు, మరో సంస్థతోనూ చర్చలు జరిపింది. ఇందులో కెనడాకు చెందిన బార్రిక్ గోల్డ్ ప్రాజెక్టు కోసం పని చేసేందుకు అంగీకరించింది.
2022 మార్చ్‌లో బలూచిస్తాన్ ప్రభుత్వం, బార్రిక్ గోల్డ్ కార్పోరేషన్ ఎట్ రికోడిక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు.
2023 ఆగస్టులో ఇస్లామాబాద్‌లో ఖనిజ వనరుల సదస్సు నిర్వహించారు. రికోడిక్ ప్రాజెక్టు పురోగతి వేగంగా సాగుతోందని బార్రిక్ గోల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బ్రిస్టో చెప్పారు. 2028లో ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చినియోట్ ఖనిజ నిల్వల భాండాగారం
చినియోట్‌లో వేల టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నట్లు 2015లో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఇనుప ఖనిజం 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని నిపుణులు అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇనుప ఖనిజ నిల్వల కంటే రాగి నిల్వల మీద ఎక్కువ దృష్టిపెట్టాలని నవాజ్ షరీఫ్ వారికి చెప్పారు.
"రానున్న మూడేళ్లలో పాకిస్తాన్ తన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటుంది" అని అప్పట్లో నవాజ్ షరీఫ్ చెప్పారు.
చినియోట్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సంస్థ ఆరేళ్ల అన్వేషణలో భాగంగా 261.5 మిలియన్ టన్నుల హై గ్రేడ్ ఇనుము, 36.5 మిలియన్ టన్నుల కాపర్ నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిందని పంజాబ్ మినరల్ కార్పొరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సమర్ ముబారక్ మంద్ 2024 నవంబర్‌లో చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది.
చినియోట్‌లో లభ్యమయ్యే ఖనిజాలతో స్టీలు ప్లాంటు, రాగి శుద్ధి కర్మాగారంలో 99.6 శాతం నాణ్యమైన 4.50 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం, 15 లక్షల టన్నుల నాణ్యమైన రాగిని ఉత్పత్తి చెయ్యవచ్చని ఆయన చెప్పారు. అయితే ఎంత బంగారం వస్తుందనే దాని గురించి ఏమీ చెప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర పాకిస్తాన్‌లో భారీగా ఖనిజ నిల్వలు
గిల్గిత్, హుంజా, ఘాజర్‌లో బంగారం నిల్వలు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఎగువ దిర్‌లోని షహీద్ బెనజీర్ భుట్టో యూనివర్సిటీలో జియాలజీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్ ఎహ్తెషామ్ ఇస్లామ్ అన్నారు.
అప్పర్ దిర్ నుంచి చిత్రాల్ వరకు రాగి భారీ మొత్తాలలో లభిస్తుందని, రాగితో పాటు బంగారం దొరికినా, దాని పరిమాణం చాలా కొద్దిగా ఉంటుంనది ఆయన అన్నారు.
"మీకు వంద రాగి ముద్దలు లభిస్తే, అందులో 0.1 లేదా 0.2 శాతం బంగారం మాత్రమే లభించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
నదుల్లో దొరికే బంగారం గురించి ప్రొఫెసర్ అద్నాన్ మాట్లాడుతూ "బంగారు గనులు ఉన్న పర్వత ప్రాంతాల్లో నది ప్రవహించేటప్పుడు రాళ్లలో బంగారు ముక్కల్ని కూడా అది తనతో పాటు తీసుకు వెళుతుంది" అని చెప్పారు.
"మైదానాల్లోకి రాగనే నది ప్రవాహం నెమ్మదిస్తుంది. దీంతో నదిలో కొట్టుకొచ్చిన లోహాల ముక్కలు నదీ తీరంలోకి వస్తాయి. అలా దొరికిన బంగారాన్ని ప్లేసర్ గోల్డ్ అంటారు" అని ప్రొఫెసర్ అద్నాన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ తాహిర్ షా నేతృత్వంలో ఇటీవలే ఒక రీసర్చ్ ప్రాజెక్ట్ పూర్తయిందని డాక్టర్ ఎహ్తెషామ్ ఇస్లామ్ చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా, గిల్గిత్‌లో పుట్టిన సింధునదిలో బంగారం ఎంత మేరకు ఉందనే దాన్ని కనుక్కునేందుకు ప్రయత్నం చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా నదీ తీరంలోని వివిధ ప్రాంతాల్లో ప్లేసర్ గోల్డ్ లభిస్తున్నట్లు తేలింది.
అటోక్ నుంచి సింధునది పొడవునా ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రొఫెసర్ అద్నాన్ చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నది పొడవునా స్థానికులు బంగారం కోసం వెదుకుతుంటారు. అలా దొరికిన బంగారాన్ని స్థానికంగా అమ్ముకుంటున్నారు.
అయితే ఇవేమీ భారీ పరిమాణంలో లేవని, అందుకే అక్కడ పరిశ్రమల ఏర్పాటు లాభదాయకం కాదని అద్నాన్ చెప్పారు.
ఎగువ దిర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో దొరికే బంగారంతో పోలిస్తే సెండక్ ప్రాజెక్టులో భాగంగా వెలికి తీస్తున్న రాగి ఖనిజంలో బంగారం ఎక్కువగా లభిస్తోందని ఎహ్తెషామ్ చెప్పారు.
"బలూచిస్తాన్‌లోని చాగి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో బంగారు నిల్వలు, ఉత్తర పాకిస్తాన్‌లో ఉన్న వాటి కంటే ఎక్కువ" ఆయన తెలిపారు.
"వజీరిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాగి నిల్వలు ఉన్నాయి. అందులో అక్కడక్కడా బంగారం కూడా ఉంది. అయితే అది ఎంత ఉందనేది అంచనా వెయ్యడం కరెక్టు కాదు" అని ఎహ్తెహామ్ అన్నారు.
పాకిస్తాన్‌లో కనుక్కున్న బంగారు నిల్వలు యాక్సిడెంటల్‌గా బయటపడ్డవేనని ప్రొఫెసర్ అద్నాన్ ఖాన్ చెప్పారు.
ఖనిజ నిల్వల కోసం అన్వేషించే సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయ లోపం ఉందని, దాని వల్లనే ఇలా జరుగుతోందని, దీని వల్ల అనేక ప్రాంతాల్లో ఖనిజాల గురించిన వివరాలు వెలుగులోకి రావడం లేదని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














