ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు, 90 మంది పాలస్తీనా ఖైదీలు విడుదల

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో భాగంగా 90 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ తెలిపింది.
అంతకుముందు, ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కాగానే హమాస్ ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను గాజా నగరంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది.
రెడ్ క్రాస్ వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది. ఆ ముగ్గురు స్వదేశానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
విడుదలైన ముగ్గురు మహిళల్ని టెల్ అవీవ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆ ముగ్గురిలో ఒకరు 31 ఏళ్ల డొరిన్ స్టీన్‌బ్రెచర్, 28 ఏళ్ల బ్రిటిష్- ఇజ్రాయెలీ మహిళ ఎమిలీ డమారీ, మూడో వ్యక్తి 24 ఏళ్ల రోమీ గోనెన్.
బీబీసీ ప్రతినిధి లూసి మేన్నింగ్ వీడియో కాల్ చేసినప్పుడు.. ఎమిలీ రెండు తెగిపోయిన వేళ్లకు బ్యాండేజీ వేసుకుని ఆమె తన తల్లిని హత్తుకుని కనిపించారు.


ఫొటో సోర్స్, Reuters
ఒక ఇజ్రాయెల్ బందీని హమాస్ విడుదల చేస్తే, 30 మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరిందని, ప్రస్తుతం విడుదల చేసిన ముగ్గురు మహిళా బందీలకు బదులుగా 90 మంది పాలస్తీనీయన్ ఖైదీలు విడుదలవుతారని హమాస్ చెప్పింది.
తాము 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ తాజాగా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓవైపు ఆనందం, మరోవైపు కన్నీళ్లు
చివరి నిమిషాల్లో కాస్త ఆలస్యంగానైనా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
కాల్పులు ఆగిపోయిన తర్వాత పాలస్తీనియన్లు సొంతిళ్లకు వస్తున్నారు. అయితే ఆ ఇళ్ల పరిస్థితి చూడగానే వారి ఆనందం ఆవిరైపోతోంది.
శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి వారు తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
హమాస్ 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు 251 మందిని బందీలుగా చేసుకుంది. ఇప్పటికీ హమాస్ దగ్గర 94 మంది బందీలు ఉన్నారని, వారిలో 60 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
బందీలను హమాస్ అప్పగించినందుకు బదులుగా ఏళ్లుగా జైళ్లలో ఉన్న దాదాపు 1000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనున్నట్లు అంచనా.

ఫొటో సోర్స్, Reuters
19 జనవరి 2025 : ఒప్పందం అమలు ఇలా..
13 జనవరి: తన పదవీ కాలం చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, ఒప్పందం తుది దశకు చేరుకుందని, ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
15 జనవరి: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయెల్ - హమాస్ మధ్య అంగీకారం కుదిరిందని, జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధాన మంత్రి చెప్పారు. ''ఇది గాజాలో కొనసాగుతున్న ఘర్షణలను నిలిపివేస్తుంది, పాలస్తీనా పౌరులకు అవసరమైన మానవతా సాయం అందిస్తుంది, బందీలను వారి కుటుంబాలతో తిరిగి కలుపుతుంది'' అని బైడెన్ అన్నారు.
17 జనవరి: ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ కేబినెట్ భేటీ జరిగింది. గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ఇద్దరు మంత్రులు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చేలా నిర్ణయం వెలువడింది.
19 జనవరి: షెడ్యూల్ ప్రకారం, మొదటి దశలో విడుదల చేయాల్సిన 33 మంది బందీల జాబితాను హమాస్ అప్పగించలేదని ఇజ్రాయెల్ చెప్పింది. దీంతో ఒప్పందం అమల్లోకి రావాల్సిన సమయం కొద్దిగంటలు ఆలస్యమైంది. ఆ తర్వాత, స్థానిక సమయం 11.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు) కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














