పాలస్తీనాలో వార్తలను ఫేస్‌బుక్ నియంత్రించిందా?

ఒమర్ ఎల్ కతా
ఫొటో క్యాప్షన్, ఒమర్ ఎల్ కతా, ఉత్తర గాజాలో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్ట్
    • రచయిత, అహ్మద్ నూర్, జో టైడీ, యారా ఫరాగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇజ్రాయెల్-గాజా యుద్ధ సమయంలో పాలస్తీనా భూభాగాల్లోని వార్తాకేంద్రాల నుంచి వచ్చే వార్తలను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరకుండా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ నిరోధించిందని బీబీసీ పరిశోధనలో తేలింది.

ఫేస్‌బుక్ డేటాను విశ్లేషిస్తే.. పాలస్తీనా భూభాగాల్లోని (గాజా, వెస్ట్ బ్యాంక్) న్యూస్‌రూమ్‌లకు 2023 అక్టోబర్ నుంచి ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ తగ్గిందని మేం గుర్తించాం.

అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్ కూడా పాలస్తీనా యూజర్ల కామెంట్‌ల‌ను నియంత్రించిందని తెలిపే కొన్ని పత్రాలను బీబీసీ చూసింది.

అయితే, ఇది పాలస్తీనాలో కంటెంట్ నియంత్రణ పాలసీలో భాగంగా జరిగిందని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా సమర్థించుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెటా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా వార్తాసంస్థల కంటెంట్‌ను ఫేస్‌బుక్ పరిమితం చేసిందని ఆరోపణలు వచ్చాయి.

'షాడో బ్యాన్'

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజాలోని పాలస్తీనా తీర ప్రాంతాల్లోకి కొంతమంది బయటి రిపోర్టర్లను మాత్రమే అనుమతించారు. రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు వారితో పాటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఉంది.

ఆ సమయంలో గాజాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియానే ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో వెస్ట్ బ్యాంక్ ప్రాంతం నుంచి పనిచేస్తున్న పాలస్తీనా టీవీ, వాఫా న్యూస్ ఏజెన్సీ, పాలస్తీనియన్ అల్-వతన్ మొత్తం గాజా వార్తలందించడానికి ప్రపంచానికి ముఖ్యమైన వార్తా వనరులుగా ఉన్నాయి.

పాలస్తీనాకు సంబంధించిన 20 ప్రధాన వార్తాసంస్థల ఫేస్‌బుక్ పేజీల నుంచి 2023 అక్టోబర్ 7 దాడికి ఏడాది ముందు, సంవత్సరం తర్వాత వరకు ఎంగేజ్‌మెంట్ డేటాను బీబీసీ న్యూస్ అరబిక్ సేకరించింది.

ఎంగేజ్‌మెంట్ అనేది సదరు సోషల్ మీడియా అకౌంట్‌లోని కంటెంట్ ఎంతమంది చూశారో తెలియజేస్తుంది. ఇందులో కంటెంట్‌కు సంబంధించిన కామెంట్లు, రియాక్షన్లు, షేర్‌లు ఉంటాయి.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఎంగేజ్‌మెంట్ పెరుగుతుందని చాలామంది భావించారు. కానీ, 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత అది 77 శాతం తగ్గిందని డేటా చూపిస్తుంది.

పాలస్తీన్ టీవీకి ఫేస్‌బుక్‌లో 58 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాని న్యూస్‌రూమ్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు మాతో పంచుకున్న డేటా ప్రకారం, వారి పోస్ట్‌లను చూసే వారి సంఖ్య 60 శాతం తగ్గింది.

"యూజర్ ఇంటరాక్షన్ నియంత్రించారు. దీని కారణంగా మా పోస్ట్‌లు ప్రజలకు చేరడం ఆగిపోయింది" అని ఆ చానల్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్ తారిఖ్ జియా అన్నారు.

పాలస్తీనాలో జర్నలిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

మెటా ఏమన్నది?

మెటా తమ ఆన్‌లైన్ కంటెంట్‌ను 'షాడో బ్యాన్ చేస్తోంది' అని పాలస్తీనా జర్నలిస్టులు గత సంవత్సరంలోనే ఆందోళన వ్యక్తంచేశారు.

షాడో బ్యాన్ అంటే ఆ కంటెంట్ ఎంతమంది చూడాలో ముందుగానే నిర్ణయించడం.

దీని గురించి మరోవైపు నుంచి తెలుసుకోవడానికి.. యెడియోట్ అహ్రోనోట్, ఇజ్రాయెల్ హయోమ్, చానల్ 13 సహా 20 ఇజ్రాయెలీ వార్తాసంస్థల ఫేస్‌బుక్ పేజీల నుంచి అదే కాలంలో డేటాను బీబీసీ విశ్లేషించింది.

ఈ పేజీలు పెద్ద మొత్తంలో యుద్ధానికి సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేశాయి. అయితే వాటి ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ సుమారు 37 శాతం పెరిగింది.

బీబీసీ పరిశోధనకు మెటా ప్రతిస్పందించింది. తమ ఉత్పత్తులు, విధానాలకు తాత్కాలిక మార్పుల గురించి 2023 అక్టోబరులో ప్రజలకు స్పష్టంగా తెలియజేశామని చెప్పింది. ఈ మార్పులను రహస్యంగా ఉంచలేదని పేర్కొంది.

హమాస్‌పై అమెరికా ఆంక్షలున్నాయని, మెటా నిబంధనల ప్రకారం అది ప్రమాదకరమైన సంస్థ అని స్పష్టంచేసింది. అందుకే భావప్రకటనా స్వేచ్ఛ, హమాస్‌ సంస్థను బ్యాలెన్స్ చేసే విషయంలో సవాలును ఎదుర్కొన్నట్లు మెటా తెలిపింది.

యుద్ధంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించిన పేజీల ఎంగేజ్‌మెంట్‌ తగ్గే అవకాశం ఉందని మెటా వివరించింది.

"మేం మా తప్పులను అంగీకరిస్తున్నాం. అయితే మేం ఏదైనా నిర్దిష్ట స్వరాన్ని ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నట్లు ఎక్కడైనా అనిపిస్తే, అది పూర్తిగా అవాస్తవం" అని మెటా ప్రతినిధి తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

లీకైన ఇన్‌స్టాగ్రామ్ పత్రాలలో ఏముంది?

వ్యక్తిగతంగా పాలస్తీనా యూజర్లపై మెటా కంపెనీ విధానాల ప్రభావంపై ఆ సంస్థకు చెందిన ఐదుగురు మాజీ, ప్రస్తుత ఉద్యోగులతో బీబీసీ మాట్లాడింది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై పాలస్తీనియన్ల కామెంట్లను మోడరేట్ చేయడం కోసం అల్గారిథమ్‌లో చేసిన మార్పులకు సంబంధించిన అంతర్గత పత్రాలను లీక్ చేసిన వ్యక్తితో మేము మాట్లాడాం.

దాడి జరిగిన వారం రోజుల్లోనే పాలస్తీనా యూజర్ల పట్ల వ్యవస్థ కఠినంగా మారిందని ఆ వ్యక్తి వివరించారు. పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా పక్షపాతంపై ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు అంతర్గత సందేశాలు చూపిస్తున్నాయి.

అయితే పాలస్తీనా నుంచి వచ్చే ద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించడానికే ఇది తీసుకొచ్చినట్లు మెటా వివరించింది. ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభంలో ఈ పాలసీ మార్పు జరిగిందని, దానిని ఉపసంహరించుకున్నట్లూ తెలిపింది. అయితే ఎప్పుడు ఉపసంహరించుకుందో కంపెనీ వెల్లడించలేదు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 137 మంది జర్నలిస్టులు చనిపోయారు. అయినా కొందరు జర్నలిస్టులు ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ పని చేస్తున్నారు.

ఉత్తర గాజాలో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్ట్ ఒమర్ అల్-కతా మాట్లాడుతూ "కొన్ని విషయాలు చాలా ఆందోళన కలిగించాయి, వాటిని ప్రచురించలేం. ఉదాహరణకు సైన్యం (ఇజ్రాయెల్) మారణహోమం చేస్తే మేము వీడియో తీస్తాం. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవ్వదు'' అని అన్నారు.

"సవాళ్లు, కంటెంట్‌పై నిషేధాలు ఉన్నప్పటికీ మేము పాలస్తీనా కంటెంట్‌ను షేర్ చేయడం కొనసాగించాలి" అని ఒమర్ స్పష్టంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)