చంద్రుడు మీద మనం కట్టుకోబోయే ఇల్లు ఇలాగే ఉంటుందా?

ఫొటో సోర్స్, AAKA Space Studio
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ వ్యోమగాములు భవిష్యత్తులో అంతరిక్షంలో ఉండబోయే ఇల్లు ఈ గుడ్డు ఆకారపు నిర్మాణంలానే ఉంటుందా?
‘‘అనలాగ్ మిషన్’’ దీనినే హాబిటాట్-1గా పిలుస్తారు. దీనిని సంక్షిప్తంగా హాబ్- 1 అంటారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడి పరిస్థితులకు ముందుగానే అలవాటు పడటానికి వీలుగా భూమిపైనే అలాంటి పరిస్థితులను సృష్టించడమే అనలాగ్ మిషన్ లక్ష్యం. ఈమేరకు ఒక సిమ్యులేటర్‌లో అంతరిక్షంలాంటి పరిస్థితులను సృష్టించి వ్యోమగాములను అందులో ఉంచి పరీక్షిస్తారు.
ఇస్రో మిషన్‌లో భాగంగా హాబ్-1ను ఇటీవల హిమాలయాలలోని లద్దాఖ్‌లో మూడు వారాల పాటు పరీక్షించారు.
ఈ సిమ్యులేటర్ వల్ల అంతరిక్ష పరిశోధనలకు ముందు వ్యోమగాములకు ఎదురయ్యే పరిస్థితులను గుర్తించడం పాటు సమస్యలకు పరిష్కారం కనుక్కునే మార్గాలు తెలుసుకోవచ్చని గుజరాత్‌లోని ఆకాలో పని చేస్తున్న స్పేస్ ఆర్కిటెక్ట్ ఆస్తా కచ్చా జాలా బీబీసీకి చెప్పారు.

ఈ హాబ్ 1ను అంతరిక్షంలో ఉపయోగించే టెఫ్లాన్ షీట్‌తో తయారు చేశారు. ఇందులో పరిశ్రమల్లో వాడే ఫోమ్ ఉపయోగించారు. హాబ్ 1లో ఒక పరుపు, వస్తువులను నిల్వ చేసుకునే స్టోవేవేట్రే ఉన్నాయి. ఈ ట్రేను బయటకు తీసి వర్క్‌స్టేషన్‌గా ఉపయోగించుకోవచ్చు. హాబ్ 1లో ఆహారం, దుస్తులతో పాటు ఎమర్జెన్సీ కిట్లను భద్రపరిచే అరలు ఉన్నాయి. ఆహారాన్ని వేడి చేసుకునేందుకు కిచెన్, టాయిలెట్ ఉన్నాయి. ఒక వ్యోమగామి ఇందులో మూడు వారాలు గడిపి బయటకు వచ్చారు.
చంద్రుడు, అంగారకుడు, ఏదైనా కావచ్చు అంతరిక్షంలో వనరులు చాలా పరిమితంగా ఉంటాయనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని హాబ్ 1ను డిజైన్ చేశారు అని కచ్చా జాలా చెప్పారు. "అంతరిక్షంలో వ్యోమగాముల వద్ద నీరు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డ్రై టాయిలెట్ డిజైన్ చేశాం చెత్తను పడేసేందుకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇందులో ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాం" అని ఆమె తెలిపారు.
లద్దాఖ్‌లో శాశ్వతంగా భారత దేశపు తొలి సిమ్యులేషన్ సెంటర్ ఏర్పాటు చేసే విషయమై ఆమె ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, AAKA Space Studio
లద్దాఖే ఎందుకు?
ఇస్రో తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ మిషన్ అందుబాటులోకి వచ్చింది.
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ముగ్గురు వ్యోమగాములను 400 (248మైళ్లు) కిలోమీటర్ల దూరంలోని భూ కక్ష్యలో మూడు రోజుల పాటు ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మిషన్‌ను వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నారు. భారత్ తన మొదటి అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి ఏర్పాటు చేసి, 2040 నాటికి చంద్రునిపైకి మనిషిని పంపాలని భావిస్తోంది.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా, చైనా, ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలు అనేక సిమ్యులేషన్ మిషన్‌లను నడుపుతున్నాయి. గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వ్యోమగాములలో ఇద్దరు ప్రస్తుతం నాసాలో శిక్షణ పొందుతున్నారు.
"మనకు సొంత సిమ్యులేషన్ మిషన్ ఉంటే మన వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ అంతరిక్ష సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేదు" అని ప్రాజెక్ట్‌కు సహకరించిన లద్దాఖ్ విశ్వవిద్యాలయ రీసర్చ్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ సుబ్రత్ శర్మ చెప్పారు.
లద్దాఖ్‌నే ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నకు" భౌగోళికంగా చూసినప్పుడు, ఈ ప్రాంతం రాళ్లతో నిండిపోయి ఉంటుంది. నిస్సారమైన నేల, ఇక్కడి నేల, రాళ్లు , మార్స్ , చంద్రుడి మీద కొన్ని భాగాల్లో కనిపించేలా ఉంటాయి. అందుకే ఇది అంతరిక్ష పరిశోధనలకు సరైన ప్రాంతం అనిపింది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
అంతరిక్షంలో స్థానికంగా లభించే పదార్ధాలతో వ్యోమగాములు ఇళ్లను నిర్మించగలరా లేదా అనేది తెలుసుకోవడానికి, మిషన్ సమయంలో సేకరించిన మట్టి నమూనాలను యూనివర్సిటీ పరీక్షిస్తోంది.

ఫొటో సోర్స్, AAKA Space Studio
భూమి మీదే అంతరిక్ష అనుభవం
భారత్- చైనా సరిహద్దుల్లో హిమాలయ ప్రాంతం 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ విపరీత వాతావరణ పరిస్థితులు, పొడిగాలులు ఉంటాయి. ఒకే రోజులో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 18 డిగ్రీల సెల్సియస్‌కు మారిపోతుంటాయి.
ఇది అంగారకుడి మీద ఉష్ణోగ్రతలకు ఏ మాత్రం సరిపోదు. అంగారకుడి మీద ఉష్ణోగ్రతలు మైనస్ 153 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు వెళతాయి. చంద్రుడి మీద కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 250 సెల్సియస్ డిగ్రీల కంటే కంటే తగ్గుతాయి. లద్దాఖ్‌లో ఉష్ణోగ్రతలు చంద్రుడు, అంగారకుడి మీద ఉన్నట్లుగా లేకున్నా మైనస్ ఉష్ణోగ్రతల మధ్య ఉండటం మనిషి సహనానికి పరీక్ష.
"పరీక్షల కోసం మీరు ప్రతీసారి అంతరిక్షానికి వెళ్లలేరు. కాబట్టి మీకు అలాంటి సౌకర్యాలు అవసరం. ఇక్కడ అలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తాం" అని సుబ్రత్ శర్మ చెప్పారు.
అంతే కాకుండా ఆయన మరో విషయాన్నీ గుర్తు చేశారు. లద్దాఖ్‌లో నిస్సారమైన నేలలు మైళ్ల కొద్దీ విస్తరించి ఉన్నాయి. అవి "ఈ గ్రహం మీద మీరు ఒక్కరే ఉన్నారనే భావన కలిగిస్తాయని" అన్నారు
జూలా తయారు చేసిన హాబ్ 1లో మూడు వారాలు గడిపిన ఆస్ట్రోనాట్ కూడా ఇదే అభిప్రాయాన్ని భావనవ్యక్తం చేశారు. చల్లగా, ఏకాంతంగా ఉండే ఈ మంచు ఎడారిలో ఒక చిన్న సిమ్యులేటర్‌లో ఆయన మూడు వారాలు గడిపారు.
"నేను మానవాళి నుంచి, వారు జీవించే పరిస్థితుల నుంచి వేరు పడి ఒంటరి అయ్యాను. నేనిక్కడ ఎలా జీవించాలో ముందే నిర్ణయించారు. ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు నిద్ర పోవాలి?. ఇలా నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నా ప్రతీ కదలికను 24 గంటల పాటు కెమెరాలో పర్యవేక్షించారు. నా కార్యకలాపాలు, ఆరోగ్యం గురించిన డేటాను బ్యాక్ ఆఫీస్‌కు పంపించారు. అని పేరు చెప్పడానికి ఇష్టపడని 24 ఏళ్ల యువకుడు బీబీసీతో చెప్పారు.
"తొలి రోజుల్లో అంతా బాగానే ఉంది. అయితే అది ఒకరోజు జరిగినట్లే ప్రతీ రోజూ జరిగేది. ఆ విషయం నాకు అర్థమైంది. అది నా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసింది. అది నా నిద్ర పోయే సమయాలను కొంతప్రభావితం చేసింది. నా ఏకాగ్రత దెబ్బతింది" అని చెప్పారు.
సిమ్యులేషన్‌లో ఉన్న అస్ట్రోనాట్ తన నిద్ర తీరు, హార్ట్ బీట్, ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించేందుకు వీలుగా బయోమెట్రిక్ పరికరాలను ధరించారు. ఆ పరిస్థితులకు ఆయన శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఆయన రక్తం, లాలాజలాన్ని ప్రతి రోజూ పరీక్షించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊపందుకున్న "అనలాగ్" ప్రయోగాలు
అంతరిక్షంలో ఉండే మనుషుల మీద మానసిక అంశాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది తెలుసుకోవడం మిషన్‌లో చాలా కీలకం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో అంతరిక్ష సంస్థలు చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడంతో పాటు అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం, పరిశోధన విషయంలో సిమ్యులేటర్ మిషన్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఏప్రిల్‌లో కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందం నాసా తయారు చేసిన లస్సీ అనే రోబో కుక్కను చంద్రుడి మీద నడిపించడానికి సిద్ధం చేసేందుకు ఒరేగావ్‌లో పరీక్షలు చేసింది. టెక్సస్‌లో మార్స్ మీద పరిస్థితులతో రూపొందించిన అనలాగ్ కేంద్రంలో నలుగురు వాలంటీర్లు ఏడాది పాటు గడిపారు.
చంద్రుడి ఉపరితలం మీద నుంచి తెచ్చిన పదార్ధాలతో నాసా త్రీడీ ప్రింట్ బేస్ తయారు చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో చైనా, రష్యా తమ సొంత ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాయి అని ది ఎకనమిస్ట్ మేగజైన్ తెలిపింది.
ఈ పోటీలో వెనుక పడకూడదని భారత్ భావిస్తోంది. లద్దాఖ్‌లో చేపట్టిన మిషన్ నుంచి డేటాను విశ్లేషించిన తర్వాత "అంతరిక్షంలో వ్యోమగాములు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి అవసరమైన వైద్య సాంకేతికతను అభివృద్ధి చెయ్యడానికి ఈ మిషన్ సాయ పడుతుందని" ప్రొఫెసర్ శర్మ చెప్పారు.
"చంద్రుడి మీద పగలు, రాత్రి, భూమి మీద కంటే ఎక్కువ సమయం ఉంటాయి. పైగా అక్కడ ఆక్సిజన్ కూడా సరిపడా ఉండదు. అలాంటి ప్రాంతంలో మన శరీరాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోవాలి" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















