ఇండియన్ స్పేస్ స్టేషన్: ఇస్రో అంతరిక్షంలో ప్రయోగశాలను ఎందుకు నిర్మిస్తోంది?

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం తొలి భాగం అందుబాటులోకి వస్తుంది
    • రచయిత, వి. శారద
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతరిక్షంలో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ఇస్రో అడుగులు వేస్తోంది. 2035లో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది. ప్రస్తుతం దీని పనులు జరుగుతున్నాయి.

2028లో ఈ స్పేస్‌స్టేషన్ తొలి భాగాన్ని ప్రారంభిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ గత నెలలో ఆమోదం తెలిపింది. మొదటి విభాగాన్ని ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత, ఈ అంతరిక్ష కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

1984లో భారత వ్యోమగామి రాకేష్ శర్మ సోవియట్ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లలేదు.

చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను పంపే భారత ప్రణాళికకు ‘ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్’ ఒక ముఖ్యమైన అడుగు.

“భారత్ ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో దేశానికి అనేక విధాలుగా ప్రముఖ స్థానం లభిస్తుంది" అని విజ్ఞాన్ ప్రసార సంస్థ మాజీ సీనియర్ సైంటిస్ట్, మొహాలీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్ష నౌకలు అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అయ్యేందుకు వీలుగా డాకింగ్ పోర్టులు ఉంటాయి

అంతరిక్ష కేంద్రం అంటే ఏమిటి?

అంతరిక్ష కేంద్రం అనేది భూమి చుట్టూ తిరిగే ఒక పెద్ద మానవ నిర్మిత నిర్మాణం. వ్యోమగాములు అంతరిక్షంలో నివసించడానికి, అక్కడ పని చేయడానికి, అంతరిక్ష అన్వేషణకు దీనిని రూపొందించారు.

భూమి నుంచి ప్రయోగించిన అంతరిక్ష నౌకలు నిర్దుష్ట గమ్యస్థానాలకు ప్రయాణిస్తాయి. అయితే, స్పేస్ స్టేషన్లు మాత్రం భూ కక్ష్యలోనే ఉంటాయి. భూ కక్ష్యలో ఇప్పటివరకు రెండు అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి. వాటిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకటి. రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం.

గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమిపై చేయలేని కొన్ని ప్రయోగాలను వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చేస్తారు. ఈ పరీక్షలు జీవ, భౌతిక శాస్త్రం, మెటీరియల్ సైన్స్ మొదలైన విభాగాలను కవర్ చేస్తాయి. ఈ స్టేషన్‌లో వ్యోమగాములు కొన్నినెలల పాటు ఉండేందుకు ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష కేంద్రంలో లాంజ్‌లు, కిచెన్‌లు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.

సౌర ఫలకాల ద్వారా అంతరిక్ష కేంద్రాలు శక్తిని పొందుతాయి. ఈ కేంద్రాలలో గాలి, నీటి రీసైక్లింగ్ వ్యవస్థలు కూడా ఉంటాయి.

భూమి నుంచి సరుకులను తీసుకుని వచ్చే అంతరిక్ష నౌకలు అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అయ్యేందుకు వీలుగా డాకింగ్ పోర్టులు కూడా ఉంటాయి. ఈ పోర్టుల వల్ల అంతరిక్ష నౌకలు సరుకులను దించడం, అక్కడి నుంచి వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడానికి వీలవుతుంది.

భారతీయ అంతరిక్ష స్టేషన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ అంతరిక్ష స్టేషన్‌లో ఐదు భాగాలుంటాయని ఇస్రో తెలిపింది.

బీఏఎస్ ప్రత్యేకతలేమిటి?

భారతీయ అంతరిక్ష స్టేషన్‌(బీఏఎస్)గా పిలిచే ఈ అంతరిక్ష కేంద్రంలో ఐదు భాగాలుంటాయని ఇస్రో తెలిపింది.

బేస్ మాడ్యూల్: ఈ అంతరిక్ష కేంద్రం బేస్ మాడ్యూల్‌ను ఫేజ్ మాడ్యూల్ అంటారు. అంటే, చాలా తక్కువ భూ గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఎక్కువ కాలం జీవించేందుకు వీలుగా అక్కడి పరిస్థితులను తనిఖీ చేసి, నిర్వహించే భాగం. బేస్ మాడ్యూల్‌‌ను 2028 నాటికి ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఫార్మాట్‌ ఇప్పటికే ఖరారు చేశారు. ఈ భాగం మొదట మానవరహితంగా ప్రయోగిస్తారు, పరీక్షల తర్వాత వ్యోమగాములను పంపుతారు.

డాకింగ్ మాడ్యూల్: భూమి నుంచి వచ్చే అంతరిక్ష నౌకలను అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించే భాగం ఇది. ఈ మాడ్యూల్ ద్వారా వ్యోమగాములు, పరికరాలు, వారి బసకు అవసరమైన సామగ్రిని పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను తక్షణమే తరలించడానికి ఈ మాడ్యూల్ కీలకం.

అంతరిక్ష కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం భారత్‌కు ఓ కీలకమైన అడుగు

రీసెర్చ్ మాడ్యూల్: ఇది తక్కువ భూ గురుత్వాకర్షణలో అంతరిక్షం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి వివిధ విభాగాలపై పరిశోధనలు చేయడానికి ఉపయోగించే ప్రదేశం.

ల్యాబ్ మాడ్యూల్: వ్యోమగాములు ప్రయోగాలు చేసేందుకు అదనపు స్థలాన్ని అందించే మాడ్యూల్ ఇది.

కామన్ వర్కింగ్ మాడ్యూల్: వ్యోమగాములు సొంత పనులు, బృందంతో కలిసి పనిచేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలు ఇందులో ఉంటాయి.

ఈ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు లేదా నలుగురు వ్యోమగాములు ఉండొచ్చు. స్వల్ప కాలానికి ఆరుగురు వ్యోమగాములు కూడా బస చేసే అవకాశం ఉంది.

భారత అంతరిక్ష కేంద్రం గురించి టీవీ వెంకటేశ్వరన్ బీబీసీతో మాట్లాడుతూ "ప్రస్తుతం పనిచేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గడువు 2031 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత, దాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తారు. అందులో ఏయే దేశాలు భాగమవుతాయో ఇంకా తెలియదు. ఇప్పుడు భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం ఒక ముఖ్యమైన అడుగు”అని చెప్పారు.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 2000 నవంబర్‌లో ఏర్పాటు చేశారు.

24 ఏళ్లుగా ఐఎస్ఎస్ సేవలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 2000 నవంబర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అంతరిక్షంలో పనిచేస్తోంది. దీనిని నాసా (అమెరికన్ స్పేస్ ఏజెన్సీ), రాస్కోస్మోస్ (రష్యన్ స్టేట్ కార్పొరేషన్ ఫర్ స్పేస్ యాక్టివిటీస్), యూరోపియన్, జపాన్, కెనడా స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇప్పటివరకు 20 దేశాల నుంచి 250 మందికి పైగా ఈ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. అంతరిక్షం గురించి, మనుషులు అక్కడ ఎలా జీవించగలరు, ఎలా పని చేయగలరు? అనే విషయాలను శాస్త్రవేత్తలు మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

 స్పేష్ స్టేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 27,000 చదరపు అడుగుల సోలార్ ప్యానెళ్లు ఉన్నాయి.

స్పేస్ స్టేషన్లకు శక్తి ఎలా?

మనం మొబైల్‌ రోజూ వాడాలంటే దానికి ఛార్జింగ్ పెట్టడం తప్పనిసరి. అలాగే, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ చాలా ఏళ్లు కొనసాగాలంటే దానికీ శక్తి అవసరం. అయితే, ఈ శక్తిని సూర్యకాంతి నుంచి పొందుతుంది.

ఇస్రో ప్రకారం, పబ్లిక్ వర్క్ ఏరియా మినహా భారతీయ అంతరిక్ష కేంద్రంలోని అన్ని భాగాలలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు.

నాసా ప్రకారం, ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 27,000 చదరపు అడుగుల సోలార్ ప్యానెళ్లు ఉన్నాయి.

భూమి నీడ వాటిపై పడిన కొద్ది నిమిషాలు తప్ప, ఈ పలకలు రోజంతా సూర్యరశ్మిని అందుకోగలవు. సూర్యకాంతి తగిలినపుడు దాని అంతర్గత బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమి నీడ పడిన సమయంలో ఈ బ్యాటరీలు అంతరిక్ష కేంద్రానికి శక్తిని అందిస్తాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)