అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్ విజయవంతం

ఫొటో సోర్స్, SpaceX
- రచయిత, పల్లబ్ ఘోష్, జార్జినా రానార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కమర్షియల్ మిషన్‌లో భాగంగా ఒక బిలియనీర్, ఒక ఇంజనీర్ స్పేస్‌వాక్ చేసి, ప్రపంచంలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్-ప్రొఫెషనల్ సిబ్బందిగా రికార్డులకెక్కారు.
ప్రత్యేకంగా రూపొందించిన సూట్‌ను ధరించిన బిజినెస్‌మన్ జారెడ్ ఐజక్‌మన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 04:22 గంటలకు రెసీలియన్స్ అనే అంతరిక్ష నౌక నుంచి బయట అడుగుపెట్టారు.
మరో 15 నిమిషాల తర్వాత ఆయన టీమ్‌లోని సారా గిల్లిస్ కూడా అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చారు.
ఐజక్‌మన్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వస్తూ ‘‘మళ్లీ భూమి మీదకు వెళితే మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ, ఇక్కడ నుంచి చూస్తే భూమి ఒక పరిపూర్ణ ప్రపంచంలా కనిపిస్తోంది’’ అన్నారు.
ఐజక్‌మన్, గిల్లిస్ ఇద్దరూ భూమికి 700 కి.మీ. ఎత్తులో ఉన్న తెలుపు రంగు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి శూన్యంలో తేలుతున్నట్లు ప్రత్యక్ష ప్రసారం చేసిన చిత్రాలలో కనిపించింది.
ఇప్పటివరకు, ప్రభుత్వ నిధులతో పనిచేసే అంతరిక్ష సంస్థల వ్యోమగాములే స్పేస్‌వాక్ చేశారు.
వాస్తవానికి స్పేస్‌వాక్ భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11:53 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, అది కొన్ని గంటల పాటు వాయిదా పడింది.
ఎయిర్‌లాక్ లేని నౌక తలుపును తెరవడానికి సిబ్బంది సిద్ధమవుతున్నప్పుడు కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి దశాబ్దాలలో వ్యోమగాములు నౌకను బయట ఉన్న అంతరిక్ష శూన్యత నుంచి వేరు చేయడానికి ఎయిర్ లాక్‌ను ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ పూర్తిగా బయట అంతరిక్షానికి ఎక్స్‌పోజ్ అయింది.
మిషన్‌లోని నలుగురు వ్యక్తుల సిబ్బందిలో ఇంతకు ముందు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి ఐజక్‌మన్ ఒక్కరే.
రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన తన సన్నిహిత మిత్రుడు స్కాట్ 'కిడ్' పోటీట్, మరో ఇద్దరు స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు అయిన అన్నా మీనన్, సారా గిల్లిస్‌తో కలిసి రెసీలియన్స్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ నౌకకు కమాండర్ కూడా ఆయనే.
రెసీలియన్స్ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా భూమి నుంచి బయలుదేరింది.


ఫొటో సోర్స్, SpaceX
ఎవరీ ఐజక్‌మన్?
పేమెంట్ ప్రాసెసింగ్ బిజినెస్, షిఫ్ట్4 వ్యవస్థాపకుడే ఐజక్‌మన్. పోలారిస్ డాన్ అని పిలిచే ఈ మిషన్, ఐజక్‌మన్ నిధులు సమకూర్చిన మూడు మిషన్‌లలో మొదటిది.
ఈ స్పేస్‌వాక్‌లో వ్యోమగాములు కొత్త ఎక్స్‌ట్రావెహిక్యులర్ యాక్టివిటీ (ఈవీఏ) ఆస్ట్రోనాట్ సూట్‌లను పరీక్షిస్తారు. స్పేస్ ఎక్స్ ఇంట్రావెహిక్యులర్ యాక్టివిటీ (ఐవీఏ) సూట్‌ల నుంచి వీటిని అప్‌గ్రేడ్ చేశారు.
ఈవీఏ సూట్ హెల్మెట్‌లోని డిస్‌ప్లే, సూట్ ఉపయోగిస్తున్నప్పుడు దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈవీఏ సూట్‌లు లాంచ్, ల్యాండింగ్ సమయంలో ధరించేలా సౌకర్యవంతంగా, అనువుగా ఉంటాయి.
స్పేస్‌వాక్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రజలను ఇతర గ్రహాలకు పంపడం స్పేస్ ఎక్స్ ప్రణాళికలలో ఒక ముఖ్యమైన భాగమని గిల్లిస్ అన్నారు.
“ఇప్పటి వరకు దేశాల తరపున మాత్రమే స్పేస్‌వాక్ జరిగింది. స్పేస్ ఎక్స్‌కు అంగారక గ్రహాన్ని చేరుకోవాలని, అనేక గ్రహాలలో జీవితాన్ని గడిపేలా చేయాలనే ఆశయాలున్నాయి. దీనికి ఎక్కడో ఒకచోట ఆరంభం ఉండాలి. దీనిలో మొదటి దశ, కొత్తగా తయారు చేసిన ఈవీఏ స్పేస్‌సూట్‌ను పరీక్షించడం. దీని వల్ల మేము భవిష్యత్‌లో చేసే స్పేస్‌వాక్‌లను, స్పేస్ సూట్ డిజైన్‌లను మరింత మెరుగు పరిచే అవకాశం ఉంది.’’ అన్నారు గిల్లిస్.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎయిర్‌లాక్’ లేని స్పేస్‌క్రాఫ్ట్
రెసీలియన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లో మరో ప్రత్యేక అంశం- ఇందులో ఎయిర్ లాక్ ఉండదు. ఈ ఎయిర్ లాక్ అనేది బయట ఉన్న శూన్యానికి, మిగిలిన అంతరిక్షనౌకకు మధ్య ఉండే ఒక గది.
సాధారణంగా వ్యోమగాములు లోపలికి, బయటికి వెళ్లే ముందు ఎయిర్‌లాక్‌ను డీప్రెజరైజ్ చేస్తారు. కానీ రెసీలియన్స్ విషయంలో, మొత్తం క్రాఫ్ట్‌ను డీప్రెజరైజ్ చేయాలి. స్పేస్‌వాక్ చేయని వ్యోమగాములు కూడా సూట్లు ధరించాలి.
శూన్యాన్ని తట్టుకునేలా ఈ వ్యోమనౌకను తయారు చేశారు. దీనిలో అదనపు నైట్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ టీమ్, ‘బెండ్స్’ అనే డికంప్రెషన్ సిక్‌నెస్ ప్రభావంపైనా పరీక్షలు చేస్తుంది.
ఈ ప్రభావం వల్ల కొన్నిసార్లు వ్యోమగాములకు అంతరిక్షంలో కళ్లు సరిగా కనిపించవు. దీనిని స్పేస్‌ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ అని అంటారు.
ఈ మిషన్ విజయవంతమైతే, భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థల మిషన్‌లు ప్రభుత్వ అంతరిక్ష ఏజెన్సీల కంటే ఎక్కువ మందిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి నాంది అవుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రైవేట్ రంగం తమ వ్యోమగాములను అంతరిక్ష మిషన్లపై పంపాలని, అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించాలని నాసా వంటి ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు కోరుతున్నాయి.
దానికి తగినట్లు ఐజక్‌మన్, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్లు ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణంపై దృష్టి పెడితే, ఎక్కువమంది నాన్-ప్రొఫెషనల్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు.
బిలియనీర్లు అంతరిక్షంలోకి వెళ్లడానికి భారీగా చేస్తున్న ఖర్చుపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆ ట్రిప్పుకు అయ్యే ఖర్చును చెల్లించే వ్యక్తే కమాండర్ అనిపించుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
అయితే, దీనిని ఏదో సరదా కోసం చేస్తున్న ప్రాజెక్ట్‌గా భావించరాదని ఓపెన్ యూనివర్శిటీలో అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ సిమియన్ బార్బర్ అన్నారు.
“అంతరిక్షంలోకి వెళ్లడానికి విక్రయించే టిక్కెట్‌ల ద్వారా వచ్చే ఆదాయం భూమిపైనే ఉంటుంది. ఆ డబ్బుతో వస్తువులను, సేవలను కొనుగోలు చేయవచ్చు. దానితో అనేక మంది జీతాలు చెల్లించవచ్చు. అది పన్నులను కూడా సృష్టిస్తుంది. మిషన్‌కు వచ్చే స్వచ్ఛంద నిధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అన్నారు.
అంతరిక్ష రంగంలోకి చాలామంది ధనవంతులు ప్రవేశించడం మంచి విషయమని ఆయన అన్నారు.
‘‘వాళ్లు ఈ భూగ్రహం నుంచి చంద్రునికో లేదా అంగారక గ్రహానికో వెళ్లాలనుకుంటే, దాని వల్ల సైన్స్ అభివృద్ధి చెందుతుంది. అంతరిక్షాన్ని అన్వేషించడానికి ఎన్ని వైవిధ్యమైన కారణాలు ఉంటే, ఆ కార్యక్రమాలు అంత సుస్థిరంగా ఉంటాయి’’ అన్నారాయన.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














