వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువకాలం ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురారి రవికృష్ణ
- హోదా, బీబీసీ కోసం
2024 జూన్ ప్రారంభంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు సునీతావిలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి ఎప్పుడు, ఎలా వెనక్కి తీసుకురావాలనే దానిపై నాసా ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తోంది.
ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ ఇప్పుడు 8 నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చేలా కనిపిస్తోంది.
వాళ్లను బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లోనే తీసుకురావాలా? లేక వచ్చే ఏడాది వరకు వేచి ఉండి, 2025 ఫిబ్రవరిలో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో తీసుకురావాలా? అనే దానిపై నాసా త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
జూన్ 5న సునీత, విల్‌మోర్‌లు అంతరిక్షంలోకి వెళ్తున్న బోయింగ్ స్టార్‌లైనర్ గాల్లోకి లేవడానికి ముందే దాని ప్రొపల్షన్-సంబంధిత పైపులలో లీకేజీ కనిపించింది. అయితే ఈ హీలియం లీక్ చిన్నదే అంటూ బోయింగ్ సంస్థ, నాసా ప్రయోగాన్ని కొనసాగించాయి.
కానీ, మరుసటి రోజు అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే, స్టార్‌లైనర్‌లో మరో నాలుగు లీక్‌లు కనిపించాయి. అలాగే ఐదు థ్రస్టర్లు విఫలమయ్యాయని గుర్తించారు.


ఫొటో సోర్స్, EPA
అయితే, స్టార్‌లైనర్ క్యాప్సూల్ సురక్షితంగా డాక్ కాగలిగింది. చివరికి ఆ ఐదింటిలో నాలుగు థ్రస్టర్‌లు పనిచేశాయి. ఇంజినీర్లు రెండు నెలల నుంచి అంతరిక్షంలో థ్రస్టర్ టెస్ట్-ఫైరింగ్‌లు నిర్వహించినా, థ్రస్టర్ వైఫల్యానికి మూలకారణాలు తెలియలేదు. ప్రస్తుతం 28 థ్రస్టర్‌లలో ఒకటి తప్ప మిగతావన్నీ పని చేస్తున్నాయి.
ఒకవేళ, తిరిగి వచ్చే సమయంలో అవి మళ్లీ విఫలమైతే.. వ్యోమగాముల భద్రత ప్రమాదంలో పడుతుంది.
సునీతా, విల్‌మోర్ అంతరిక్షంలో ‘చిక్కుకుపోయారు’ అన్న వార్తలను నాసా కొట్టిపారేస్తోంది. స్టార్‌లైనర్‌ను ఇప్పటికీ ఒక లైఫ్‌బోట్‌గా ఉపయోగించవచ్చని తెలిపింది.
ఆగస్టు 7న జరిగిన మీడియా సమావేశంలో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోవర్‌సాక్స్ స్టార్‌లైనర్‌లో ప్రయోగానికి ముందే లోపాలు బయటపడడంపై మాట్లాడుతూ, "స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో ప్రయాణించడం కంటే స్టార్‌లైనర్‌లో ఎక్కువ రిస్క్ ఉందని మాకు తెలుసు" అన్నారు.
ఇప్పుడు సునీతా, విల్‌మోర్‌ను తిరిగి స్టార్‌లైనర్‌లోనే తీసుకురావాలా? లేక 8 నెలలు ఆగి స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో తీసుకురావాలా? అనే విషయంలో నాసాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
అయితే, దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండడం వ్యోమగాముల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. ఎక్కువ కాలం మైక్రోగ్రావిటీకి గురికావడం వల్ల వ్యోమగాముల ఎముకలు సాంద్రత కోల్పోయే (బోన్ డెన్సిటీ లాస్) ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షంలో ఉంటే ఎముకలకు ఏమవుతుంది?
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు.
గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు.
“గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలోని కణాలు, కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి. అవి 6 నెలలకు పైగా గురుత్వాకర్షణకు గురికాకపోతే, బోన్ డెన్సిటీ (ఎముకల సాంద్రత) 25-30%, కండరాల సాంద్రత 50% వరకు తగ్గుతుంది. దీని కారణంగా, అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్‌ట్రా వెహిక్యులార్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడటం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావొచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్లు నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలు, ఎముకలను బలంగా ఉంచుకుంటారు.’’ అని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి వివరించారు.
‘‘వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్‌ను ఎదుర్కొంటారు. వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి మొదలైన సమస్యలు ఎదురుకావచ్చు. దీన్ని ఎదుర్కోవడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు.’’ అని తేజస్వి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఎక్కువకాలం ఎవరున్నారు?
వ్యోమగాములు ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం అంతరిక్షంలో గడపాల్సి రావడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు రష్యాకు చెందిన వాలెరి పాలియకోవ్ పేరిట ఉంది. పాలియకోవ్ 1990లలో మిర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజులు గడిపారు. దీన్ని బట్టి చూస్తే... వ్యోమగాములు ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడం పెద్ద సమస్యేమీ కాదని అంతరిక్ష నిపుణుల అభిప్రాయం.
“సునీతా విలియమ్స్ ఇంతకుముందు ఒకసారి 195 రోజులు, మరోసారి 127 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. కాబట్టి మరో 6 నెలల పాటు స్పేస్‌లో ఉండటం ఆమెకు అంత ఇబ్బంది కాదు.’’ అని ప్లానెటరీ సొసైటీ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, NASA
‘‘సాధారణంగా, వ్యోమగాములు మైక్రో గ్రావిటీ కారణంగా తలెత్తే బోన్ డెన్సిటీ లాస్ మొదలైన ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కఠినమైన వ్యాయామాలు చేస్తారు. ఇక ఎక్స్‌ట్రా సప్లయల విషయానికొస్తే.. అవసరాన్ని బట్టి రీ-సప్లై కార్గో మిషన్లు కార్గో వాహనాలను ఉపయోగించి ఐఎస్‌ఎస్‌కు పంపుతారు. ఆగస్టు 4న ప్రయోగించిన సిగ్నస్ కార్గో వాహనం ఆగస్ట్ 6న ఐఎస్‌ఎస్ చేరుకుంది. అది దాదాపు 4 టన్నుల ఆహారం, నీరు, గాలి, సైంటిఫిక్ హార్డ్‌వేర్, ఇతర సామగ్రిని డెలివరీ చేసింది.’’ అని రఘునందన్ వివరించారు.
ప్రస్తుతం స్టార్‌లైనర్‌లో లోపాలు బయటపడినా, వ్యోమగాముల కోసం బోయింగ్ స్టార్‌లైనర్‌లను వాడకాన్ని కొనసాగించాలని నాసా భావిస్తోంది. స్టార్‌లైనర్‌లో సమస్యలు ఉన్నా, ఐఎస్‌ఎస్‌తో అంతరిక్ష నౌక సురక్షితంగా డాకింగ్(అనుసంధానం) అయిందని, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా అంటోంది.
2030లో ఐఎస్‌ఎస్ రిటైర్ అయ్యే వరకు, ఆరు నెలల వ్యవధిలో సిబ్బందితో కలిపి ప్రతి సంవత్సరం ఒక డ్రాగన్, ఒక స్టార్‌లైనర్‌ను పంపాలన్నది నాసా లక్ష్యం. ప్రస్తుతం నాసా, బోయింగ్ కలిసి స్టార్‌లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థను పరిశీలిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బోయింగ్ సైతం తమ క్యాప్సూల్ ఇప్పటికీ సురక్షితంగా వ్యోమగాములను భూమి మీదకు తీసుకురాగలదని చెప్పింది. అయితే నాసా నిర్ణయిస్తే, క్యాప్సూల్‌ను ఖాళీగా తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం తెలిపింది. గతవారం, లిఫ్ట్ ఆఫ్ నుంచి థ్రస్టర్‌లపై చేసిన అన్ని పరీక్షల జాబితానూ బోయింగ్ పోస్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నలుగురికి బదులు ఇద్దరినే పంపనున్న నాసా
బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వ్యోమగాములను ప్రయోగించడం ఇదే మొదటిసారి. నిజానికి మొదట్లో బోయింగ్ సాఫ్ట్‌వేర్, ఇతర సమస్యలను ఎదుర్కొంది. ఒక జత ఖాళీ స్టార్‌లైనర్‌లను ప్రయోగించాక, బోయింగ్ ఇప్పుడు వ్యోమగాములను ప్రయోగించింది.
ఒకవేళ నాసా ఇప్పుడు సునీతా, విల్‌మోర్‌ల కోసం స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే, ఐఎస్ఎస్‌లో ఉన్న రెండు పార్కింగ్ స్పాట్‌లలో ఒకదానిని ఖాళీ చేయడానికి మొదట బోయింగ్ స్టార్‌లైనర్‌ను తిరిగి భూమి మీదకు పంపుతారు.
అయితే అంతకన్నా ముందు, సునీతా, విల్‌మోర్ ప్రస్తుతం స్పేస్ స్టేషన్‌లో డాక్ చేసిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లోని సీట్లను తమకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుని, వాటికి అలవాటు పడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్‌లైనర్ డాకింగ్ పోర్ట్ ఖాళీ అయ్యాక, దాన్ని పూరించడానికి స్పేస్‌ఎక్స్ మరొక డ్రాగన్‌ను ప్రయోగిస్తుంది. సునీతా, విల్‌మోర్ దానిలోనే తిరిగివస్తారు.
సునీతా, విల్‌మోర్‌కి చోటు కల్పించడానికి, వచ్చే నెలలో స్పేస్‌ఎక్స్‌తో అంతరిక్ష కేంద్రానికి పంపించాలనుకున్న నలుగురు వ్యోమగాములలో ఇద్దరిని తగ్గించే అవవకాశం ఉందని నాసా బుధవారం తెలిపింది. ఆ రెండు ఖాళీ సీట్లలో సునీతా, విల్‌మోర్‌లు తిరిగి వస్తారు. అయితే దీని కోసం వాళ్లు ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాలి. ఎందుకంటే స్టేషన్ మిషన్లు కనీసం ఆరు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండాల్సి ఉంటుంది.
58 ఏళ్ల సునీతా, 61 ఏళ్ల విల్‌మోర్.. ఇద్దరూ రిటైర్డ్ నేవీ కెప్టెన్లు. వీరు దీర్ఘకాలంగా నాసా వ్యోమగాములుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లతో పాటు మరో నలుగురు అమెరికన్లు, ముగ్గురు రష్యన్లు ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు.
నాసా తన సిబ్బందిని స్పేస్ స్టేషన్‌కు పంపడానికి, తిరిగి వారిని భూమి మీదకు తీసుకురావడానికి ముందు జాగ్రత్త చర్యగా రెండు కంపెనీలను నియమించుకుంది. వాటిలో ఒకటి స్పేస్‌ఎక్స్ కాగా, రెండవది బోయింగ్. స్పేస్ఎక్స్ 2020 నుంచి నాసాకు తన సేవలను అందిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














