భూమి వేగంగా తిరుగుతున్నా మనకు కదులుతున్నట్లు కూడా అనిపించదు, ఎందుకు?

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జువాన్ ఫ్రాన్సిస్కో అలొన్సో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనల్ని విశ్వం గుండా అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లే వాహక నౌక భూమి.

ఈ గ్రహం సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.

అంత వేగంతో తిరగుతున్నా, మనకి వేగవంతమైన కారులో ప్రయాణిస్తున్నట్లు ఎందుకు అనిపించదు?

స్థిరత్వం, నిశ్చేష్టత

ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చిలీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ (ఖగోళ భౌతిక శాస్త్రవేత్త) జేవియెరా రే ఒక ఉదాహరణను వివరించారు.

''మీరు విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి విమానం టేకాఫ్ అయినప్పుడు సీటులో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, నిశ్చేష్టంగా ఉండడం మనల్ని విశ్రాంత స్థితిలో ఉండేలా చేస్తుంది.'' అని ఆయన అన్నారు.

లాటిన్ అమెరికాలో శాస్త్రీయ జ్ఞానంపై అవగాహన కల్పించే సంస్థ 'స్టార్ ట్రెస్'కు జేవియెరా సహ వ్యవస్థాపకులు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

"విమానం నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత మనం కదులుతున్నట్లు అనిపించదు. ఆ సమయంలో అటూ ఇటూ నడవొచ్చు కూడా."

అంటే, విమానం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు అది దాదాపు నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

భూమి విషయంలో కూడా అదే జరుగుతుంది. స్థిరమైన వేగంతో తిరుగుతుండడం వల్ల కదులుతున్నట్లు అనిపించదు.

మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతిదీ ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది, భూమితో పాటే తిరుగుతుంటాం. అందుకే కదులుతున్నట్లు మనకు అనిపించదు.

కానీ, ఇతర కీలక అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.

భూమి

ఫొటో సోర్స్, Getty Images

మరో శక్తి ప్రభావం

భూమి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించదో అర్థం చేసుకోవడానికి గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) కూడా ఉపయోగపడుతుంది.

వెనెజ్వేలా సెంట్రల్ యూనివర్సిటీలో థియరిటికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ కమ్యూనికేటర్ సొల్మార్ వరెలా ఈ అంశం గురించి వివరించారు.

‘‘ ఫార్ములా వన్ కారులో, ఒకే లైనులో నిర్దిష్ట వేగంతో స్థిరంగా వెళ్తున్నారని అనుకోండి. అప్పుడు కారు కదులుతున్నట్లు మీకు అనిపించదు. కానీ, కారు మలుపు తిప్పినప్పుడు మిమ్మల్ని కారులో నుంచి బయటకు నెట్టివేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కారు మలుపు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ఇది ఉంటుంది'' అని వరెలా వివరించారు.

''అలాంటప్పుడు మీరు కారులో నుంచి బయట పడకపోవడానికి మీ సీటు బెల్ట్ కారణం'' అని ఆయన చెప్పారు.

భూమి విషయంలోనూ అదే మాదిరిగా జరుగుతుంది. భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది, అది మనల్ని అంతరిక్షంలోకి విసిరేసేలా పనిచేస్తుంది.

కానీ, భూమి గురుత్వాకరణ శక్తి ఆ సెంట్రిఫుగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది. అందువల్ల మనం గ్రహానికి అతుక్కుని ఉంటాం.

''గురుత్వాకర్షణ శక్తి కారు సీటు బెల్టు మాదిరిగా పనిచేస్తుంది'' అని వరెలా చెప్పారు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

భూమి కదలదనే భావన

విశ్వానికి భూ గ్రహమే కేంద్రమని, దాని చుట్టూనే మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనుషులు కొన్ని శతాబ్దాల పాటు విశ్వసించారు. దీని వల్లనే భూమి కదలదు అనే భావన ఏర్పడింది.

‘‘ ఈ విశ్వానికి భూమి కేంద్రమని ఎంతోకాలం విశ్వసించారు. ఎందుకంటే, ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు కదిలిపోవడం కనిపించేది'' అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్‌కి చెందిన వెనెజ్వేలా జాతీయుడు మిరియం రెంజెల్ వివరించారు.

''కానీ, నికోలస్ కోపర్నికస్, జోహన్నెస్ కెప్లర్ సూర్యకేంద్రక నమూనా అభివృద్ధి చేసిన తర్వాత, గురుడి చుట్టూ నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయని గెలీలియో కనుగొన్న తర్వాత, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని తెలిసిన తర్వాత ఇది మారిపోయింది'' అని రెంజెల్ చెప్పారు.

అయితే, భూ గ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని, ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినవారు వాదించేవారు.

కానీ, దానిని ఖండించేందుకు గెలీలియో ఒక విధానం కనుగొన్నారు.

ప్రశాంతంగా ఉన్న సముద్రంలో, ఒక స్థిరమైన వేగంతో ఓడ ప్రయాణిస్తున్నప్పుడు ఒక పాత్రలో నీటి చుక్కలు వేస్తూ ప్రయోగం చేశారు.

అప్పుడు ఆయన ఒక విషయం గమనించారు. ''ఓడ ముందుకు కదులుతున్నప్పటికీ నీటిచుక్కలు అటూఇటూ పోకుండా పాత్రలోనే పడతాయి.''

''దీని ద్వారా, ప్రతి ఒక్కటీ మనం ఎక్కడ ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన నిరూపించారు'' అని రెంజెల్ చెప్పారు.

ఈ విధంగా రిలేటివిటీ (సాపేక్షతా సూత్రాన్ని) రూపొందించిన వ్యక్తి గెలీలియో.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

అలవాటుపడడం..

భూమి కదులుతున్నట్టు గ్రహించలేకపోవడానికి మరో కారణం ఏంటంటే, దానికి మనం అలవాటుపడడం.

''మనం ఈ కదలికకు పుట్టినప్పటి నుంచి అలవాటుపడ్డాం'' అని మాడ్రిడ్‌లోని కంప్లూటెన్స్ యూనివర్సిటీలో ఎర్త్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మార్టా అబాలోస్ చెప్పారు.

భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందని రే అభిప్రాయపడ్డారు.

అలాగే, వాతావరణం కూడా భూమితో పాటు దాదాపుగా అదే వేగంతో కదలడం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.

''భూమి చుట్టూ ఉన్న గాలి పొర కూడా అదే వేగంతో తిరుగుతుండడం వల్ల, భూమి తిరుగుతున్నప్పుడు మనకు గాలి కూడా తిరుగుతున్నట్లు అనిపించదు'' అని అబాలోస్ వివరించారు.

''భూమి కదలిక విశ్వంలో గాలిని సృష్టించదు. ఎందుకంటే, విశ్వం అంతా శూన్యంగా ఉంటుంది'' అని రే చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)