ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అద్భుతాన్ని ఎలా సాధించారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అనా లూసియా గొంజాలెజ్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
ఆయనేమీ ప్రపంచాన్ని చుట్టి రాలేదు. పైగా సన్యాసి. కానీ, ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ఆ మ్యాప్ మధ్యయుగపు అద్భుతంగా గుర్తింపు పొందింది.
మామూలుగా అన్నిమ్యాప్‌లలో ఉత్తర దిక్కు పైన ఉంటుంది. వెనిస్‌లో 15వ శతాబ్దంలో రూపొందిన ఈ మ్యాప్‌లో దక్షిణ దిక్కుపైన ఉంటుంది.
ఈ మ్యాప్ రూపొందించిన వ్యక్తి భూగోళమంతా ఏమీ తిరగలేదు. తాను నివసించే మఠం నుంచి కాలు బయట పెట్టకుండానే ఈ పని చేశారు.
ఈ మ్యాప్ వెనిస్ మ్యూజియంలో దర్శనమిస్తుంటుంది. నీలం, బంగారువర్ణంలో వృత్తాకారంలో రెండుమీటర్ల వ్యాసార్థం ఉన్న ఎండిన చర్మంపై గీసిన ఈ మ్యాప్ ఓ చెక్కకు బిగించారు.
ఈ మ్యాప్ సృష్టికర్త పేరు ఫ్రా మౌరో. 15వ శతాబ్దం మధ్యలో తయారైన ఈ పటం మన విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలుపుతుంది. అలాగే ఖండాలు, సముద్రాల గురించిన వ్యాఖ్యానాలు, చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.
పోర్చుగల్ రాజు అల్ఫాన్సో ఆదేశాలతో 1459లో రూపొందిన ఈ మ్యాప్ పురాణాలు, మూఢనమ్మకాలను దాటి పరిశీలనాత్మక దృక్పథంతో గీసినదిగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, POT
తలకిందులుగా...
ఫ్రా మౌరో గీసిన ఈ మ్యాప్ ప్రపంచాన్ని తలకిందులుగా చూపుతుంది. ఆ మ్యాప్‌లో దక్షిణ దిక్కు పైన ఉంటుంది. ఉత్తరం దిక్కు నుంచి ప్రపంచాన్ని చూడటానికి అలవాటుపడిన మన కళ్ళు అంత త్వరగా ఇందులోని యూరోప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలను గుర్తించలేవు.
నిజానికి ఉత్తరం దిక్కు ఎప్పుడూ ఊర్ధ్వముఖానికి పర్యాయంగా చెప్పలేదు. అలాగే మ్యాప్‌ల చిత్రీకరణ అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చింది.
ఫ్రామౌరో కాలం నాటి ఇస్లామిక్ మ్యాప్‌లలో కూడా దక్షిణం దిక్కే ఊర్ధ్వముఖంగా ఉండేది. కాబట్టి మౌరో ఈ విధానాన్ని పాటించడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పైగా అప్పటి నౌకాన్వేషణలన్నీ దక్షిణం దిక్కుకు సాగేవి.
అప్పట్లో యూరోపియన్ మ్యాప్‌లు కూడా భిన్నమైన విధానాన్ని అనుసరించేవి. వీటికి గార్డెన్ ఆఫ్ ఈడెన్ దిక్సూచిగా ఉండేది.
నిజానికి అప్పటి మ్యాప్‌లలో భౌతిక స్వర్గానికి కూడా చోటు కల్పిస్తూ ఉండేవారు. ఇది మ్యాప్‌లలో పై భాగాన ఉండేది. కానీ ఫ్రామౌరో దానిని తొలగించాలని భావించారు.
మ్యాప్‌లు రూపొందించడంలో ఆనాటి సంప్రదాయ విధానానికి భిన్నంగా ఈ భౌతిక స్వర్గాన్ని ఆయన మ్యాప్‌లో ఓమూలన పడేశారు. అయితే తానెందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారో ఓ లాంగ్‌నోట్‌లో వివరించారు.
అందులో సెయింట్ అగస్టీన్ చెప్పిన స్వర్గమంటే ఏమిటో తన ధోరణిలో వివరించారు. ‘‘అది కేవలం ఆధ్యాత్మికమైన అర్థాన్ని మాత్రమే ఇవ్వదు. భూమిపైన నిజంగానే ఆ ప్రాంతం ఉంది’’ అని చెప్పారు కానీ, ఆ ప్రాంతం మానవ ఆవాసాలకు, వారి ఎరుకకు అందనంత దూరంలో ఉందని రాశారు.
దీంతోపాటు ఫ్రామౌరో అప్పటి మ్యాప్‌లలో మధ్యభాగంలో కనిపించే జెరూసలెం ప్రాంతాన్ని కూడా కొత్తచోటుకు మార్చారు. ఆయన జెరూసలెంను ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల మధ్య భాగాన కొద్దిగా పశ్చిమం వైపుగా జెరూసలెం ప్రాంతాన్ని గీశారు.
‘‘జెరూసలెం అనేది కచ్చితంగా మానావాసాలకు కేంద్రంగా ఉన్న భూ అక్షాంశ ప్రాంతం. కానీ రేఖాంశంగా చూస్తే అది పశ్చిమానికి కొంచెం దగ్గరగా ఉంది.’’ అని ఆయన వివరించారు.
మతపరమైన దృక్పథాలను దాటి పరిశీలనా దృష్టితో శాస్త్రీయ పద్ధతిలో మ్యాప్‌లు గీయడానికి ఫ్రామౌరో నిర్ణయాలు దోహదపడ్డాయి.

ఫొటో సోర్స్, POT
కాలు బయటపెట్టకుండానే...
ఫ్రామౌరో గురించిన విషయాలు పెద్దగా తెలియవు. ఆయన సాధువుగా మారకముందు ప్రపంచమంతా తిరిగారని నమ్ముతారు. కానీ ఆయన మ్యాప్‌లు గీయడానికి ప్రయాణాలు చేయలేదు.
వెనిస్ నగరం అప్పట్లో నావికాశక్తిగా ఉండేది. అనేక సంస్కృతుల సమావేశాలకు వేదికగా ఉండేది. దీనివల్ల ఫ్రామౌరోకు తత్త్వవేత్తలు, భౌగోళిక విజ్ఞానం కలిగినవారు, మ్యాప్‌లను గీసేవారు, ముస్లింలు, ఇథోపియన్ ప్రతినిధులతో కూడిన నావికులనుంచి సమాచారాన్ని సేకరించగలిగారు.
ఆయన వద్ద పెద్ద సంఖ్యలో పుస్తకాలు, మ్యాప్‌లు ఉండేవి. ఫలితంగా ఆ సమయంలో లభించిన భౌగోళిక సమాచారం ఆధారంగా ఈ మ్యాప్‌ను రూపొందించారు. దీనిని 3వేలకు పైగా వ్యాఖ్యానాలతో తీర్చిదిద్దారు.
వాటిల్లో కొన్ని ప్రాంతాల ఆచారాలు, భౌగోళిక వివరాలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ప్రాంతాల చిత్రీకరణలో తాను ఎలాంటి స్వేచ్ఛ తీసుకున్నదీ కూడా వివరించే ప్రయత్నం చేశారు.
‘‘ఏదైనా ప్రాచీన లేదా లిఖిత జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంతో పరిశీలించాల్సిందే. టాలమీ, అరిస్టాటిల్ లాంటివారు రాసినవి కూడా విమర్శనాత్మకంగా చూడకుండా కేవలం గుడ్డిగా నమ్మలేం’’ అని అని ఏంజెలో కాటానియో చెప్పారు. ఆయన నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇటలీలో పరిశోధకునిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ప్లోరెన్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

సముద్ర సర్పాలు లేవు
ఫ్రామౌరో గీసిన మ్యాప్‌లో ఊహాజనిత గాథలకు చోటు కల్పించలేదు. ఆయన దెయ్యాలు, లేదా భారీ జంతువుల గురించిన వివరణలకు అవకాశం ఇవ్వలేదు. ఆ కాలంలో అనేక కథనాలు ప్రాచర్యంలో ఉండేవి. కానీ వాటిని ఫ్రా మౌరో అపోహలుగానే భావించినట్టున్నారు. అందుకే ఈ మ్యాప్‌లో మధ్య యుగాల నాటి సముద్ర సర్పాలు, ఇతర పురాణ ప్రాణులు కనిపించవు. అలాగే తెలియని ప్రాంతాల పరిమితులను, ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది.
తనతో మాట్లాడిన ప్రయాణికులెవరూ రాక్షసుల గురించిన కథనాలు చెప్పలేదని, అందుకే ఈ పరిశోధనను ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునేవారి ఆసక్తికే వదిలివేస్తున్నట్టు సెలవిచ్చి మ్యాప్ గురించిన వివాదాన్ని ఆయన పరిష్కరించారు.
ఇక మ్యాప్‌లో సముద్ర మధ్యభాగంలో తీవ్రమైన అలలు, సుడిగుండాలు కనిపిస్తాయి.
మ్యాప్‌లో ఫ్రా మౌరో తన వివరణలకు, వివరణలకు మధ్యన ఊహాజనిత మార్గాలను కనిపెట్టి, వాటితో ప్రపంచాన్ని అనుసంధానించడం ద్వారా తన దూరదృష్టిని బయటపెట్టారు.
వరల్డ్ మ్యాప్‌లను ఏళ్ళ తరబడి అధ్యయనం చేస్తున్న ఏంజెలియో కాటానియో ప్రకారం, ‘‘ఈ మ్యాప్ ఆ సమయంలో ప్రాంతాల అనుసంధానానికి సంబంధించిన ఓ ఊహాజనిత ప్రాజెక్ట్’’ అని వివరించారు.
ఫ్రా మౌరో కాలంలో వరుసగా జరిగిన చారిత్రక ఘటనల వల్ల, చైనాలో మంగోలియా రాజ్యవంశ పతనం, మధ్యధరా సముద్రాన్ని తుర్కులు దిగ్బంధించడం, యూరప్‌లోబ్లాక్ డెత్ (ప్లేగు మహమ్మారి కారణంగా మరణాలు) భూమార్గాలకు అంతరాయం కలిగినట్టు కనిపిస్తుంది.

ప్రత్యామ్నాయ మార్గం
ఈ మ్యాప్ ఒక ప్రత్యామ్నాయ సముద్ర మార్గాన్ని కూడా ప్రతిపాదించింది. క్లిష్టమైన వెనిస్ లాంటి నదీ తీర ప్రాంతాలలో నివసించేవారికీ ఇలాంటి ఆలోచన రావడం అసాధ్యమైన విషయమేమీ కాదు.
ఈ ప్రతిపాదన తొలి భౌగోళిక శాస్త్రవేత్తగా పరిగణించిన టాలెమీ భావనలకు విరుద్ధంగా ప్రారంభమవుతుంది. టాలెమీ వాదనకు భిన్నంగా ఫ్రామౌరో హిందూ మహా సముద్రం భూ పరివేష్టితం కాదని, అది ఓపెన్ సీ అని వాదించారు. అలాగే ఆఫ్రికా అగ్నేయం వైపు అనంతంగా విస్తరిస్తున్న ఖండం కాదని వాదించారు.
ఫ్రా మౌరో తన వాదనలకు నావికుల కథనాలను ఆధారంగా చేసుకున్నారు. దాంతోపాటు ఆ సమయంలో మ్యాప్‌లు ఏం చెబుతున్నాయి, అనుభవపూర్వక పరిశీలనలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునేవారు.
పోర్చుగీసు అన్వేషకులు ఆఫ్రికా తీరం వెంబడి చేసిన తొలినాటి ప్రయాణాలను ఈ మ్యాప్ సూచిస్తుంది. వారు 2వేల నాటికల్ మైళ్ళకుపైగా ప్రయాణించారని ఇది తెలుపుతుంది. ఇందుకు నాటికల్ పటాలలో వర్ణించిన, ఉత్తర ధృవాన్నీ చూడగలిగిన కాబోరోస్సో అనే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని చిత్రించారు.
ఇక పటంలోని రెండో మార్గం తూర్పు నుంచి 2వేల మైళ్ళు ప్రయాణించి ఇథియోపియాలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్న చైనా నౌకల కథల ఆధారం చేసుకుని రూపొందించినది.
ఈ రెండు మార్గాలను కలపడం ద్వారా ఆఫ్రికాను చుట్టిరావడం సాధ్యమేనని చెప్పారు. ఈ ప్రతిపాదన చేసిన అర్థశతాబ్దం తరువాత పోర్చుగీసు నావికుడు బార్టోలో మ్యూ డయాస్, కేప్ ఆప్ న్యూ హోప్‌కు 1488లో చేరడం ద్వారా దీనిని ధృవీకరించారు.
ఈ ప్రపంచ పటంలో హిందూ మహాసముద్రంలో భారీగా సాగిన నౌకాయానం గురించి కూడా వివరించింది. చైనా, అరబ్ నౌకలు ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ మధ్యన విలాసవస్తువుల రవాణా చేస్తుండేవి.
మార్క్ పోలో వర్ణించిన చైనా నౌకలను ఈ మ్యాప్‌లో మొదటిసారి చిత్రాల రూపంలో చూపించారు.
‘‘ఈ నౌకలను జోంచి అని పిలిచేవారు. వీటిపైన పొడవాటి నాలుగు స్తంభాల్లాంటివి ఉండేవి. ఇవి కొన్ని మరీ పొడవుగా, మరికొన్ని పొట్టిగా ఉండేవి. వీటిల్లో వ్యాపారుల కోసం 40 నుంచి 60 గదులు ఉండేవి. ఒక చుక్కాని ఉండేది. అవి దిక్సూచి లేకుండానే ప్రయాణించేవి. వారికి ఓ జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆయన డెక్ పైన నిలబడేవాడు. ఆయన తన చేతిలోని దిక్సూచి లాంటి పరికరాన్ని అనుకరిస్తూ నావికుడికి ఏ మార్గంలోకి వెళ్ళాలో చెప్పేవారు.’’ ఆయన తన మ్యాప్‌లో రాశారు.
హిందూ మహాసముద్రం, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా చుట్టూ తిరిగే ఊహాజనిత మార్గంతో ఆసియాలో చాలా చురుకుగా ఉన్న వాణిజ్య మార్గాలను ప్రపంచ పటంలో ఏకం చేయడమనే ఫ్రామౌరో మనోభిలాష ఈ ప్రపంచ పటంలో ఆవిష్కృతమవుతుంది.
ఈ మార్గాన్ని అనుసరించి జపాన్, జావా, చైనాలోని క్వాన్జాహూ నుంచి మధ్యధారా నగరాలైన ఏథెన్, మక్కా, హర్మౌజ్ తో పాటు లిస్బన్, వెనీస్ లాంటి యురోపియన్ నగరాలకు కూడా ప్రయాణించవచ్చు.
ప్రపంచ పటంలో వివరంగా గీసిన నదీ,భూమార్గాలను ఈ పటానికి జోడిస్తే ఇది ప్రపంచాన్ని అనుసంధానించే స్కెచ్‌గా అర్థమవుతుంది.
ఫ్రా మౌరో అప్పటి ప్రపంచం ఎలా ఉందో చూపడానికి మాత్రమే పరిమితం కాలేదు. వెనీస్ నుంచి కదలకుండానే ఆయన భవిష్యత్‌లో ప్రపంచం ఎలా ఉండాలనే దార్శనికతను కూడా ఆవిష్కరించారు.
‘‘కాస్మోగ్రాఫర్ సమాచారాన్ని సేకరించేవారు. కానీ అది విరుద్ధంగా ఉండేది. తన దృక్పథానికి సరిపడా స్పష్టమైన సమాచారాన్ని ఎంచుకునేవారు. ఇది ఆదర్శవాదం. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం. ఫ్రా మౌరో తన ప్రపంచ పటంలో రాసింది అదే’’ అంటారు కాటానియో.
ఇవి కూడా చదవండి:
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి
- బియ్యం, గోధుమలు? ఏవి తింటే శరీరానికి మంచిది
- పిల్లలు, పెద్దలు అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన వ్యాక్సీన్ లు ఇవే...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














