SpaceX: సౌర తుపానులో చిక్కుకున్న రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు

ఫిబ్రవరి 3న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 49 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో చాలా ఉపగ్రహాలు తుపాను బారినపడ్డాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 3న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 49 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో చాలా ఉపగ్రహాలు తుపాను బారినపడ్డాయి

స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ, డజన్ల సంఖ్యలో ఉపగ్రహాలను కోల్పోయింది. రాకెట్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించిన మరుసటి రోజే 'జియోమాగ్నటిక్ తుపాను' ప్రభావం కారణంగా ఈ ఉపగ్రహాలు కక్ష్యనుంచి పడిపోయి గాలిలోనే మండిపోయాయి.

సూర్యుని ఉపరితలంలో శక్తిమంతమైన పేలుళ్ల కారణంగా ఇలాంటి సౌర తుపానులు ఏర్పడతాయి. ఈ తుపానులు, భూమిని తాకగల సామర్థ్యమున్న ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలను వెదజల్లుతాయి.

గత వారం ప్రయోగించిన 49 ఉపగ్రహాల్లో 40 వరకు ఈ తుపాను బారినపడ్డాయని బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తెలిపింది.

ఈ ఉపగ్రహాలన్నీ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో చేరాల్సి ఉంది.

'స్టార్ లింక్' కంపెనీ ద్వారా వేలాది ఉపగ్రహాలను ఉపయోగించి హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలని మస్క్ భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్ స్కూల్‌లో సీటు సాధించిన వరంగల్ బాలుడు

ఈ వ్యవస్థ ఖరీదైనదే, కానీ తీగల ద్వారా కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈ సేవలను పొందవచ్చు .

స్పేస్ ఎక్స్ తాజాగా పంపించిన ఈ 49 ఉపగ్రహాలను భూమికి 210 కి.మీ ఎత్తులో మోహరించాలని భావించారు. ''ఫిబ్రవరి 3న ప్రయోగించిన ప్రతీ ఉపగ్రహం, నియంత్రిత స్థితిలోనే కక్ష్యలోకి చేరింది'' అని స్పేస్ ఎక్స్ చెప్పింది.

కానీ ఈ ప్రయోగం జరిగిన మరుసటి రోజే జియోమాగ్నటిక్ తుపాను భూమిని తాకింది. 'నార్తర్న్ లైట్స్' తరహాలోనే ఈ తుపాను కూడా అదే రకమైన మెకానిజాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇది ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతుంది.

ఈ తుపాను వాతావరణాన్ని వేడెక్కించడంతో పాటు, ఊహించిన దానికంటే ఎక్కువగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.

వీడియో క్యాప్షన్, సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

''తుపాను తీవ్రత, వేగం కారణంగా గత ప్రయోగాల కంటే అట్మాస్మిరిక్ డ్రాగ్‌లో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలిసింది'' అని స్పేస్ ఎక్స్ పేర్కొంది.

శాటిలైట్లను ''సేఫ్ మోడ్''‌లో ఉంచడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నించింది.

''శాటిలైట్లకు చెందిన ఏ భాగం కూడా భూమి వరకు వస్తుందని నాకు అనిపించడం లేదు'' అని యూకే స్పేస్ ఏజెన్సీ స్పేస్ సర్వియలెన్స్ హెడ్ జాకబ్ జీర్ అన్నారు.

''ఇలాంటి సంఘటనలు, అంతరిక్షంలోని సవాళ్లను గుర్తు చేస్తున్నాయి. కక్ష్యలోకి ఉపగ్రహాలు లేదా వ్యోమగాములను చేర్చడం అంత సులభం కాదు అని తెలియజేస్తున్నాయి'' అని ఆయన చెప్పారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)