పాలపుంతలో వింత.. 18 నిమిషాలకు ఒకసారి రేడియో ఎనర్జీ విడుదల చేస్తున్న అంతుచిక్కని వస్తువు

పాలపుంతలో భయానకంగా గిరగిరా తిరుగుతూ కనిపించిన కొత్త ఆబ్జెక్ట్

ఫొటో సోర్స్, ICRAR/CURTIN

ఫొటో క్యాప్షన్, పాలపుంతలో స్టార్ గుర్తు ఉన్న ప్రాంతంలో అంతుచిక్కని వస్తువును గుర్తించారు.

పాలపుంతలో ఒక వింత వస్తువు (ఆబ్జెక్ట్)ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇలాంటి వస్తువును పాలపుంతలో గతంలో ఎన్నడూ చూడలేదని వెల్లడించారు.

ఈ వింత వస్తువును మొట్టమొదట ఒక యూనివర్సిటీ విద్యార్థి గమనించారు. ఇది ప్రతీ 18 నిమిషాలకొకసారి ఒక నిమిషం పాటు భారీగా రేడియో ఎనర్జీని విడుదల చేస్తోందని గుర్తించారు.

విశ్వంలో శక్తిని విడుదల చేసే పదార్ధాలు/వస్తువుల సమాచారాన్ని తరచూ నమోదు చేస్తారు.

కానీ, ఒక నిమిషం పాటు ఆగకుండా శక్తిని విడుదల చేయడం మాత్రం చాలా అసాధారణమైన విషయం.

దీన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తోంది.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

ఈ ఆబ్జెక్ట్‌ను తొలిసారి కర్టిన్ యూనివర్సిటీలో హానర్స్ విద్యార్థి టైరోన్ ఓ డోహెర్టీ చూశారు. ఆయన కనిపెట్టిన కొత్త విధానంలో టెలీస్కోప్ ద్వారా దీనిని చూశారు.

కర్టిన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రీసెర్చ్ (ఐసిఆర్ఏఆర్)లో ఆస్ట్రో ఫిజిసిస్ట్ డాక్టర్ నటాషా హర్లీ వాకర్ నేతృత్వంలో పని చేస్తున్న బృందంలో డోహెర్టీ సభ్యులు.

"మేము కొన్ని గంటల పాటు గమనించినప్పుడు అది కాసేపు కనిపించి, కాసేపు మాయమవుతోంది" అని ఐసిఆర్ఏఆర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు.

"అది పూర్తిగా ఊహించని పరిణామం. ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా అది అంతుచిక్కడం లేదు. ఎందుకంటే ఆకాశంలో అలాంటిది మరొకటి ఇప్పటి వరకు చూడలేదు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతరిక్షంలో అప్పుడప్పుడూ కనిపించి మాయమైపోయే వస్తువులు (ఆబ్జెక్ట్) చూడటం ఖగోళ శాస్త్రవేత్తలకు కొత్త విషయమేమి కాదు. వాటిని ట్రాన్సియెంట్లని అంటారు.

కానీ, ఒక నిమిషం సేపు వెలుగుతూ ఉన్న ఒక వస్తువును చూడటం మాత్రం పూర్తిగా విచిత్రం" అని ఐసిఆర్ఏఆర్ కర్టిన్ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ గెమ్మ ఆండర్సన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఎన్నడూ చూడనంత స్పష్టంగా సూర్యుడు

కొన్ని సంవత్సరాల పాటు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ భూమి నుంచి 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గుర్తించారు. ఇది చాలా కాంతివంతంగా ఉండి బలమైన అయస్కాంత శక్తితో ఉందని చెప్పారు.

ఈ ఆబ్జెక్ట్ చుట్టూ అలుముకున్న సిద్ధాంతాలు దీనిని న్యూట్రాన్ నక్షత్రం అని లేదా వైట్ డ్వార్ఫ్ (తెల్లని మరుగుజ్జు) అని అంటున్నారు. విస్ఫోటనం చెందిన నక్షత్ర ముక్కను వైట్ డ్వార్ఫ్ అని అంటారు. అయితే, నిజంగా ఈ వస్తువు ఏంటో కనిపెట్టడం ఇంకా మిస్టరీగానే ఉంది.

"ఇది అరుదుగా కనిపించిన సంఘటనా లేదా ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ మనం గతంలో గమనించలేదా" అనేది మరిన్ని వివరాలను కనిపెట్టిన తర్వాతే ఖగోళ శాస్త్రవేత్తలకు తెలుస్తుంది.

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)