పాలపుంత బయట తొలిసారి ఓ గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

బైనరీ ఆర్ట్

ఫొటో సోర్స్, ESO / L. Calçada

    • రచయిత, పాల్ రింకన్
    • హోదా, సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్

సూర్యుడికి ఆవల ఉన్న నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న దాదాపు 5 వేల "బాహ్య గ్రహాల (ఎక్సోప్లానెట్స్)"ను ఇప్పటివరకు గుర్తించారు. అయితే, ఇవన్నీ పాలపుంత (మిల్కీ వే గెలాక్సీ) లోపలే ఉన్నాయి.

మెస్సియర్ 51 గెలాక్సీలో శని గ్రహం పరిమాణంలో ఉన్న గ్రహాన్ని నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)కు చెందిన చంద్ర ఎక్స్ రే టెలిస్కోప్ కనుగొంది. ఇది మిల్కీ వే గెలాక్సీకి దాదాపు 2.8 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

ఒక నక్షత్రం ముందు నుంచి గ్రహం కదిలినప్పుడు, నక్షత్ర కాంతిలో కొంత భాగాన్ని గ్రహం అడ్డుకుంటుంది. టెలిస్కోప్‌లు ఈ తేడాలను తక్షణమే గుర్తిస్తాయి. బాహ్య గ్రహాలను కనుగొనడానికి ఈ సాంకేతికత(ట్రాన్సిట్)నే ఉపయోగిస్తున్నారు. తాజా గ్రహాన్ని కూడా ఇలానే గుర్తించారు.

ఎక్స్-రే బ్రైట్‌ బైనరీగా పిలిచే ఒక రకమైన వస్తువు నుంచి వచ్చే ఎక్స్-కిరణాల కాంతిలో తేడాను అమెరికాలో కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్-స్మిత్​సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన డాక్టర్ డై స్టెఫానో, ఆమె సహచరులు శోధించారు.

ఈ వస్తువులు సాధారణంగా న్యూట్రాన్ స్టార్‌ లేదా బ్లాక్‌హోల్స్(కృష్ణబిలం)లను కలిగివుంటాయి. ఇవి తమకు దగ్గరలో ఉన్న నక్షత్రం నుంచి వాయువులను వాటి వైపు లాక్కుంటాయి. దీంతో న్యూట్రాన్ స్టార్‌ లేదా బ్లాక్‌హోల్‌కు చుట్టుపక్కల ఉన్న మెటీరియల్ బాగా వేడెక్కుతుంది.

ఫలితంగా ఎక్స్ రే వేవ్‌లెంత్‌లో ప్రకాశిస్తుంది.

ప్రకాశవంతమైన ఎక్స్-కిరణాలను ఉత్పత్తి చేస్తున్న ప్రస్తుత ఖగోళ వస్తువు చిన్నది కావడంతో, దాని ముందు నుంచి వెళ్తున్న గ్రహం దాదాపు అన్ని కిరణాలను అడ్డుకుంటుంది. దీంతో ట్రాన్సిట్‌ను సులభంగా గుర్తించవచ్చు.

ఎమ్51-యూఎల్​ఎస్​-1 అనే బైనరీ వ్యవస్థలోనున్న తాజా గ్రహాన్ని గుర్తించడానికి పరిశోధకులు ఈ సాంకేతికతను ఉపయోగించారు.

"ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఎక్స్-రే బైనరీల చుట్టూ ఉన్న గ్రహాలను ఏ దూరంలో ఉన్నా కనుగొనేందుకు, ఇది ఉపయోగపడుతుంది" అని డాక్టర్ డై స్టెఫానో బీబీసీతో చెప్పారు.

చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ

భవిష్యత్తులో గ్రహాల వేట

ఈ బైనరీలో న్యూట్రాన్‌ స్టార్‌ లేదా బ్లాక్‌ హోల్‌.. సూర్యుడి కంటే 20 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో సహచర నక్షత్రం చుట్టూ తిరుగుతుంది.

న్యూట్రాన్‌ స్టార్‌ లేదా బ్లాక్‌ హోల్‌ అనేది ఓ భారీ నక్షత్రం నుంచి విడిపోయిన కోర్. తాజా అధ్యయనంలో ట్రాన్సిట్‌ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమయంలో ఎక్స్-రే ఉద్గారాలు సున్నాకి తగ్గాయి. దీనితోపాటు, ఇతర సమాచారం ఆధారంగా ఖగోళ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న గ్రహం, శని గ్రహం పరిమాణంలో ఉంటుందని అంచనా వేశారు.

మిల్కీ వే గెలాక్సీలోని బాహ్యగ్రహాలను కనుగొనడంలో సఫలమైన పద్ధతులు, ఇతర గెలాక్సీల విషయంలో మాత్రం పనికి రావని డాక్టర్ డి స్టెఫానో చెప్పారు.

దీనికి కారణం ఏమిటంటే, దూరం పెరిగేకొద్ది టెలిస్కోప్‌ పనిచేయడానికి కావాల్సిన కాంతి తగ్గుతుంది. అనేక వస్తువులు ఒక చిన్న ప్రదేశంలో (భూమి నుండి చూసిప్పుడు)గుమికూడినట్టు ఉండటంతో, నిర్దిష్టమైన నక్షత్రాల సమాచారాన్ని తెలుసుకోవడం కష్టతరమవుతుంది.

మెస్సియర్ 51

ఫొటో సోర్స్, NASA / ESA / S. Beckwith / HHT

ఫొటో క్యాప్షన్, మెస్సియర్ 51

"మొత్తం గెలాక్సీలో డజన్లకొద్ది ప్రాంతాలను ఎక్స్‌-రేలతో పరిశోధించడం సాధ్యం అవుతుంది. వీటిలో నక్షత్రాల ముందు నుంచి గ్రహాలు వెళ్లినప్పుడు ఎక్స్‌- కిరణాలలో తేడా కనుగొనవచ్చు" అని ఆమె అన్నారు.

"ఒక చిన్న ప్రాంతం నుంచి వెలువడే ఎక్స్-కిరణాల భారీ ఉద్గారాలను, దాని ముందు నుంచి వెళ్తున్న గ్రహం పూర్తిగా లేదా గణనీయంగా అడ్డుకుంటుంది."

పరిశోధకులు తమ వివరణను ధ్రువీకరించడానికి మరింత సమాచారం అవసరమని చెబుతున్నారు.

ఇక్కడ సవాల్ ఏమిటంటే, కొత్త గ్రహం పెద్ద కక్ష్యలో తిరుగుతోంది. అంటే అది దాదాపు 70 సంవత్సరాల తర్వాతే దాని బైనరీ భాగస్వామిని మళ్లీ దాటుతుంది. దీంతో సమీప కాలంలో తదుపరి పరిశీలన చేయడానికి ఇది ఆటంకంగా మారింది.

మరొకవైపు ఎక్స్-రేలకు మూలమైన నక్షత్రం.. వాయువు, ధూళి మేఘాలతో మసకబారినట్లు ఖగోళనిపుణులు గుర్తించారు.

"మా పరిశోధనలు చాలా ఆసక్తికరమైన, కొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని చాలా జాగ్రత్తగా గమనిస్తారు" అని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన సహ రచయిత జూలియా బెర్న్డ్‌సన్ అన్నారు.

ఈ అధ్యయనం నేచర్ ఆస్ట్రానమీ పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)