అధ్యయనం: 1,330 కోట్ల ఏళ్ల క్రితం ఆక్సిజన్ ఆనవాళ్లు

టెలిస్కోప్

ఫొటో సోర్స్, ALMA (ESO/NAOJ/NRAO

ఫొటో క్యాప్షన్, విశ్వం ఆవిర్భావం తర్వాత తొలినాళ్లలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు చిలీలో ఏర్పాటు చేసిన 'ఆల్మా' టెలిస్కోప్‌.

ఆక్సిజన్ ఆనవాళ్లకు సంబంధించి అత్యంత పురాతన ఆధారాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

బిగ్‌‌బ్యాంగ్(మహా విస్ఫోటం) అనంతరం 50 కోట్ల సంవత్సరాల తర్వాత మనుగడలో ఉన్న నక్షత్ర మండలంలో ఆక్సిజన్ వాయువు ఉన్నట్టు వారు గుర్తించారు.

అంతకు ముందున్న నక్షత్ర మండలంలోనే ఆ వాయువు ఉత్పత్తి అయ్యుంటుందని, నక్షత్రాలు నశించినప్పుడు అది విడుదలై ఉంటుందని భావిస్తున్నారు.

బిగ్‌ బ్యాంగ్ సంఘటన దాదాపు 1,380 కోట్ల(13.8 బిలియన్) సంవత్సరాల క్రితం సంభవించిందని శాస్త్రవేత్తల అంచనా.

అంటే తాజా పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తే.. 1,330 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న విషయాలను కూడా ప్రస్తుత శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతున్నారన్నమాట.

విశ్వం

ఫొటో సోర్స్, Eso

"బిగ్‌ బ్యాంగ్‌‌కి దాదాపు 97 శాతం దగ్గరి వరకూ వెళ్లి అప్పటి పరిణామాలను ఇప్పుడు పరిశీలించగలుగుతున్నాం. తాజా అధ్యయనం మనల్ని నక్షత్రాల పుట్టుక, కాంతి ఆవిర్భావం దాకా తీసుకెళ్తోంది. ఈ అధ్యయనం ద్వారా ఆక్సిజన్ ఆనవాళ్లు బయటపడిన నక్షత్ర సముదాయంలోని నక్షత్రాల వయసును కూడా అంచనా వేయగలిగాం. విశ్వం ఆవిర్భావం తర్వాత 250 మిలియన్ సంవత్సరాలకు ఆ నక్షత్రాలు ఏర్పడినట్టు గుర్తించాం" అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌‌లో పనిచేస్తున్న ఖగోళ భౌతిక శాస్త్రం ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్లిస్ వివరించారు.

MACS1149-JD1 అనే నక్షత్ర మండలం(గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లు కనిపించాయి.

అందులో హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల వల్ల ఏర్పడిన వర్ణ రేఖలను చీలీలోని ఆల్మా టెలిస్కోప్‌, యూరప్‌లోని వీఎల్‌టీ టెలిస్కోప్‌లు విశ్లేషించాయి.

విశ్వం విస్తరించడంతో ఆ వాయువులు కూడా తరంగాల మాదిరిగా వ్యాప్తి చెందాయని ఈ టెలిస్కోప్‌లు గుర్తించాయి.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Image copyrightELLIS ET AL

ఫొటో క్యాప్షన్, MACS1149-JD1 నక్షత్ర మండలంలోని పరిస్థితులను తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

MACS1149-JD1 నక్షత్ర మండలాన్ని 1990లో అంతరిక్షంలోకి నాసా పంపిన హబుల్‌ స్పేస్ టెలిస్కోప్ తొలుత గుర్తించింది. అందులోని పరిస్థితులను వీఎల్‌టీ, ఆల్మా టెలిస్కోప్‌లు అధ్యయనం చేశాయి.

2016 మార్చి నుంచి 2017 ఏప్రిల్ వరకు ఈ టెలిస్కోప్‌ల ద్వారా ఆ నక్షత్ర మండలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించారు.

ఆ వివరాలను 'నేచర్' అనే జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)