తిప్పిరి తిరుపతి అలియస్ దేవ్ జీ: ఈ మావోయిస్టు నేత ఎక్కడున్నారు, బంధువుల ఆందోళన ఏంటి?

తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ
    • రచయిత, ప్రవీణ్ శుభం, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి దేవ్ జీ ఎక్కడున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది.

బుధవారం నాటి ఎదురు కాల్పుల తర్వాత ఆయనకు ఏమైందనే అంశంపై ఊహాగానాలు సాగాయి.

అయితే, తమ అదుపులో లేరని బుధవారం ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

ఇంతకీ ఎవరీ దేవ్ జీ? ఆయన విషయంలో అంత చర్చ ఎందుకు జరుగుతోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కోరుట్ల వాసి

మావోయిస్టు పార్టీ నిర్మాణం ప్రకారం, ఆ పార్టీ అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి.

అంతకు ముందు ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఈ ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన తరువాత, దేవ్ జీ ఆ స్థానంలోకి వచ్చారు.

ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 80లలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదవుతుండగానే విద్యార్థి రాజకీయాలవైపు వెళ్లారు.

కాలేజీలో చదివేటప్పుడు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

తరువాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.

దండకారణ్యంలో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దండకారణ్యంలో..

రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి.

''1981-82లలో రైతు కూలీ సంఘం ఒక భారీ సభ నిర్వహించింది. అది అప్పట్లో చరిత్రాత్మక సభ. దాన్ని ఈయనే నిర్వహించారు. తరువాత ఆయనను పార్టీ 1983-84 ప్రాంతంలో దండకారణ్యానికి పంపింది'' అంటూ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన కరీంనగర్‌వాసి ఒకరు బీబీసీకి చెప్పారు.

కరీంనగర్ టౌన్‌లోనూ, తరువాత సిరోంచ ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా ఆయన పనిచేశారు. తిరుపతి దాదాపు 15 ఏళ్ళ పాటు గడ్చిరోలిలో పనిచేశారు. అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.

తరువాత 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు.

90ల మధ్య వరకు పార్టీ నిర్మాణంలో ఉన్న దేవ్ జీ, తరువాత మిలటరీ విభాగాల వైపు మళ్ళారు. అప్పటి నుంచి పార్టీ సాయుధ విభాగాల్లోనే ఉంటూ వచ్చారాయన.

1996 ప్రాంతంలో దండకారణ్యంలో మొదటి ప్లటూన్ ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. అది ఒక మిలటరీ నిర్మాణం. దానికి మొదటి కమాండర్‌గా తిరుపతి వ్యవహరించారు.

తరువాత 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. అప్పట్లో కేంద్ర కమిటీలో చేరిన పిన్న వయస్కుల్లో ఈయన ముఖ్యుడు. సెంట్రల్ కమిటీతో పాటు, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ)లో కూడా సభ్యుడు అయ్యారు దేవ్ జీ.

మావోయిస్ట్ పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో ఆయన పనిచేశారు.

''2004లో పీపుల్స్‌వార్ కాస్తా మావోయిస్టుగా అవతరించిన తరువాత కూడా ఆయన సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్లలో కొనసాగారు. బసవరాజ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా ఉంటే అందులో తిరుపతి కీలకపాత్ర పోషించారు. 2018లో బసవరాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లిన తరువాత, దేవ్ జీ సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతి అయ్యారు'' అని మాజీ మావోయిస్టు ఒకరు బీబీసీకి చెప్పారు.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, NIA

మిలటరీ ఆపరేషన్స్

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతదళాలపై జరిగిన కీలక దాడుల్లో దేవ్ జీ పేరు ప్రధానంగా వినిపించింది.

మావోయిస్టు మిలిటరీ శిక్షణ, ఆపరేషన్లలో దేవ్ జీ కీలక భూమిక పోషించారని పార్టీని దగ్గర నుంచి పరిశీలించేవారు చెబుతారు.

పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటు వెనుక ఆయన ఉన్నారని కూడా అంటారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవ్ జీ ఉన్నారు. ఆయన పేరుపై రివార్డు కూడా ఉంది.

దేవ్ జీ తమ్ముడు తిప్పిరి గంగాధర్
ఫొటో క్యాప్షన్, దేవ్ జీ తమ్ముడు తిప్పిరి గంగాధర్

కుటుంబ సభ్యుల ఆందోళన

దేవ్ జీ ఏమయ్యారనే అంశంపై కోరుట్లలో ఉన్న ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది.

''అరెస్ట్ చేశారని, ఎన్‌కౌంటర్ అయ్యారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏది నిజమో మాకు తెలియదు. ఆయన పోలీసుల అదుపులో ఉంటే ఎలాంటి హానీ తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలి. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం'' అని దేవ్ జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ స్థానిక మీడియాతో చెప్పారు.

'పెద్దనాన్నా.. తిరిగి రండి'

దేవ్ జీ లొంగిపోవాలంటూ ఆయన తమ్ముడి కూతురు తిప్పిరి సుమ గతంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు.

'మీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాలో తెలియని గర్వం, బాధ కలుగుతాయి. మీ ధైర్యం, పట్టుదల నాలో ఎన్నో ఆలోచనలు కలిగిస్తాయి. మీరు సమసమాజ నిర్మాణం కోసం వెళ్లారు. ఇటీవలి సంఘటనలు చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని సుమ ఆ లేఖలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)