'భార్య పోయింది, మర్యాదా పోయింది'

ఫొటో సోర్స్, Alok Putul
- రచయిత, అలోక్ పుతుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాయ్‌పూర్, అవధియా పారా ప్రాంతంలోని ఇరుకు వీధుల్లో ఒక పాడుబడిన ఇల్లు ఉంది. దాదాపు 84 ఏళ్ల వయసున్న జాగేశ్వర్ ప్రసాద్ అవధియా ఈ పాత ఇంట్లో ఉంటున్నారు.
శిథిలావస్థకు చేరిన ఈ ఇంటి గోడలపై ఎలాంటి పేర్లు కనిపించలేదు. విజయానికి సంబంధించిన గుర్తులూ లేవు. కానీ, ఈ గోడలు కనుక మాట్లాడగలిగితే.. ఒక వ్యక్తి 39 ఏళ్లుగా న్యాయస్థానం తలుపులు ఎలా తడుతూనే ఉన్నారో, ఎట్టకేలకు న్యాయం తలుపు తెరుచుకునేప్పటికి ఆయన జీవితంలోని ఎన్నో కిటికీలు ఎలా మూసుకుపోయాయో చెబుతాయి.
మధ్యప్రదేశ్ విభజనకు ముందు, ఉమ్మడి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుమాస్తాగా పనిచేసిన జాగేశ్వర్ ప్రసాద్ అవధియా 100 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో 1986లో అరెస్టయ్యారు.
ఇప్పుడు, దాదాపు 39 ఏళ్ల తర్వాత, కోర్టు ఆయన్ను గౌరవప్రదమైన నిర్దోషిగా విడుదల చేసింది.

వ్యవస్థ ఉదాసీనత, న్యాయంలో జాప్యంతో చిధ్రమైన ఆశలకు ప్రతీకగా మారిన జాగేశ్వర్ ప్రసాద్ అవధియా స్పందిస్తూ, "ఈ నిర్ణయానికి ఇప్పుడు అర్థం లేదు. నా ఉద్యోగం పోయింది. సమాజం ముఖం తిప్పేసింది. నా పిల్లలను చదివించుకోలేకపోయాను. వారికి పెళ్లిళ్లు చేయలేకపోయాను. బంధువులు దూరమైపోయారు. సరైన వైద్యం అందక నా భార్య కూడా చనిపోయింది. వీటన్నింటినీ ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా?" అని ఆయన ప్రశ్నించారు.
"హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది" అంటూ విచారంగా, బాధగా చెప్పారు జాగేశ్వర్ ప్రసాద్. "కానీ నేను, నా మొత్తం కుటుంబం 39 ఏళ్లుగా మోస్తున్న ఈ భారంతో పోలిస్తే, ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన సర్టిఫికెట్ సరిపోదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Alok Putul
'లంచం వద్దన్నాను, దీంతో..'
జాగేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. మధ్యలో మౌనంగా ఉండిపోతున్నారు. ఏళ్ల తరబడి అనుభవించిన దుఃఖాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన కనిపిస్తున్నారు.
పాత ఫైల్ పేజీలను చూపించారు. ఇప్పటికే పసుపు రంగులోకి మారిపోయిన ప్రతి పేజీ.. చిరిగిపోయి 39 ఏళ్ల కథను నమోదు చేసే తేదీలా కనిపిస్తోంది.
"నేనేమీ చేయలేదు. కానీ, నేను అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి, నేనేమీ చేయలేదని. వినడానికి కూడా ఎవరూ లేరు. నిర్దోషిని అని నిరూపించుకోవడానికి జీవితం మొత్తం వెచ్చించాను. ఇప్పుడు అది నిరూపితమైంది కానీ, ఏమీ మిగల్లేదు. వయస్సు కూడా లేదు" అని ఆయన బాధగా చెప్పారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బిల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జాగేశ్వర్ ప్రసాద్ అవధియా 100 రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ లోకాయుక్త బృందం సమీపంలోని కూడలిలో అరెస్టు చేసినట్లు కోర్టు పత్రాల్లో ఉంది.
"తన బకాయి చెల్లింపు కోసం బిల్లు సిద్ధం చేయాలని ఒక ఉద్యోగి నన్ను అడిగారు. పై ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఫైల్ నా దగ్గరకు వస్తుందని, ఆ తర్వాతే నేను బిల్లు సిద్ధం చేయగలనని ఆయనతో చెప్పా. ఆయన నాకు 20 రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. నేను కోప్పడ్డాను, మళ్లీ ఆఫీసు వైపు రావొద్దని ఆయనతో గట్టిగా చెప్పా" అని అవధియా అన్నారు.
''దీంతో ఆ ఉద్యోగి మనస్థాపం చెందారు. వాళ్ల నాన్న పోలీస్. ఆయనకు ఏం చెప్పారో తెలీదు కానీ, ఆ తర్వాత మూడో రోజు నేను ఆఫీసు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఆ ఉద్యోగి నా వెనక్కు వచ్చి నా జేబులో ఏదో పెట్టాడు.
ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు నన్ను పట్టుకుని, విజిలెన్స్ నుంచి వచ్చామని, 100 రూపాయలు లంచం తీసుకున్నందుకు అరెస్టు చేస్తున్నామని చెప్పారు" అని జాగేశ్వర్ ప్రసాద్ వివరించారు.
"అది నాకు మాత్రమే కాదు, నా మొత్తం కుటుంబానికి శిక్ష మొదలైన రోజు."

ఫొటో సోర్స్, Alok Putul
‘పిల్లల చదువు ఆగిపోయింది’
ఇది జరిగిన రెండు సంవత్సరాల తరువాత, 1988లో కోర్టులో చార్జిషీట్ సమర్పించినప్పుడు జాగేశ్వర్ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు.
1988 నుంచి 1994 వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.
ఆ తర్వాత, ఆయన్ను రాయ్‌పూర్ నుంచి రీవాకు బదిలీ చేశారు. సగం జీతమే వచ్చేదని, దాదాపు రెండున్నర వేల రూపాయలతో ఇంటిని నడపడం కష్టమైందని జాగేశ్వర్ ప్రసాద్ చెప్పారు.
ఆయన భార్య, నలుగురు పిల్లలు రాయ్‌పూర్‌లో ఉండేవారు. జాగేశ్వర్ ప్రసాద్ రీవాలో ఉండేవారు. ప్రమోషన్లు నిలిపివేశారు. ఇంక్రిమెంట్లు ఆపేశారు. ఒక్కొక్కరుగా నలుగురు పిల్లల చదువుకు అంతరాయం కలిగింది.
అప్పటికి కేవలం 13 ఏళ్ల వయసున్న ఆయన చిన్న కుమారుడు నీరజ్‌కు ఇప్పుడు 52 ఏళ్లు. తన తండ్రి న్యాయ పోరాటంలో భాగంగా కోర్టు మెట్లపై తన బాల్యాన్ని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు.
"అప్పుటికి నాకు లంచం అంటే అర్థం కూడా తెలీదు, కానీ జనం నన్ను 'లంచగొండి కొడుకు' అనేవారు. పిల్లలు కూడా ఆటపట్టించేవారు. స్కూల్లో స్నేహితులు ఉండేవారుకాదు. ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు మూసేసేవాళ్లు. బంధువులతో సంబంధాలు తెగిపోయాయి. ఫీజు కట్టకపోవడంతో చాలాసార్లు స్కూల్ నుంచి పంపించేశారు'' అని కన్నీళ్లు తుడుచుకుంటూ నీరజ్ చెప్పారు.
జాగేశ్వర్ ప్రసాద్ భార్య ఈ భారాన్ని మోశారు. ఈ సామాజిక శిక్ష ఆమెను బలితీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయారు. కుటుంబం ఛిద్రమైంది.
"బాధతోనే నా భార్య చనిపోయింది. లంచం ఆరోపణలు, సస్పెన్షన్ కారణంగా ఆమె చాలా కాలం నిరాశలోనే ఉంది. ఈ దుఃఖం ఆమె భరించలేకపోయింది. ఆమెకు సరైన చికిత్స అందించేందుకు నా దగ్గర సరిపడినంత డబ్బు లేదు. ఆమె చనిపోయిన రోజు నాకింకా గుర్తుంది, అంత్యక్రియలకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. స్నేహితుడొకరు మూడు వేల రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాతే అంత్యక్రియలు, ఇతర ఆచారాలు పూర్తి చేయగలిగాను'' అని జాగేశ్వర్ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Alok Putul
'ఏమీ మిగల్లేదు'
2004లో, ట్రయల్ కోర్టు జాగేశ్వర్ ప్రసాద్‌ను దోషిగా నిర్ధరించింది. సాక్షులందరూ తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకున్నప్పటికీ, కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధించింది.
కానీ, జాగేశ్వర్ ప్రసాద్ వెనక్కితగ్గలేదు. హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 20 సంవత్సరాలకు పైగా కొనసాగింది.
కుటుంబాన్ని పోషించేందుకు ఆయన అనేక ఉద్యోగాలు చేశారు. కొన్నిసార్లు ట్రావెల్ ఏజెంట్‌గా, కొన్నిసార్లు బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. వృద్ధాప్యంలో కూడా, ఆయన రోజుకు 8 నుంచి 10 గంటలు పని చేయాల్సి వచ్చింది. 100 రూపాయలు ఆయన్ను దాదాపు 14,000 రోజులు కనిపించని జైల్లోకి నెట్టేశాయి.
2025లో ఆ రోజు వచ్చింది, ఆయన నిర్దోషి అని హైకోర్టు తీర్పు చెప్పింది.
"న్యాయం జరిగింది, కానీ కాలం తిరిగి రాదు. భార్య తిరిగి రాదు, పిల్లల బాల్యం తిరిగి రాదు" అని జాగేశ్వర్ ప్రసాద్ అంటున్నారు.
"ఇక గౌరవమా? బహుశా అది కూడా తిరిగి రాకపోవచ్చు" అని అన్నారు.
తన బాధలను, వేదనను కూడా చిరునవ్వుతో చెప్పగలిగే జాగేశ్వర్ ప్రసాద్‌కు జీవితంలో మిగిలింది అలసట, దుఃఖంతో నిండిన జ్ఞాపకాలు మాత్రమే. ఆయన చేతుల్లో రెపరెపలాడుతున్న కోర్టు తీర్పు పత్రాలు.. ఇప్పుడు కేవలం పేపర్లు మాత్రమే. ఎందుకంటే, ఒక మనిషి తన భవిష్యత్తును రాయాలనుకున్నా జీవితమనే పుస్తకం చాలా ఏళ్ల కిందటే మూతపడింది.

ఫొటో సోర్స్, Getty Images
దశాబ్దాల తరబడి విచారణకు నోచుకోని కేసులు
"ఈ కేసులో జాగేశ్వర్ ప్రసాద్ పరిహారం కోరవచ్చు. కానీ, కోల్పోయిన జీవితాన్ని డబ్బు తిరిగి ఇవ్వగలదా? అనే ప్రశ్న వస్తుంది. ఏదైనా పరిహారం గతాన్ని తిరిగి తీసుకురాగలదా? జగేశ్వర్ ప్రసాద్ కథ కేవలం ఒక వ్యక్తి విషాదం కాదు. ఇది మన న్యాయ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తోంది" అని హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్లా అన్నారు.
పాత కేసులను కోర్టుల్లో ప్రాధాన్యతా క్రమంలో విచారించి, న్యాయం జరిగేలా చూడాలని, అప్పుడు జాగేశ్వర్ ప్రసాద్ అవధియాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఉండవని ప్రియాంక అంటున్నారు.
జాగేశ్వర్ ప్రసాద్ అవధియా కేసులో 39 ఏళ్ల తర్వాత నిర్ణయం వచ్చింది, కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి వేల కేసులు సంవత్సరాలుగా విచారణకు నోచుకోలేదు.
గత 30ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ కోర్టుల్లో ఇలాంటి వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసులు దాదాపు 50 ఏళ్లుగా కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఎలాంటి తీర్పులూ వెలువడలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














