ఎర్రచందనం చెట్టుకి కోటి రూపాయలు డిపాజిట్, రైల్వే శాఖపై కేసు గెలిచిన రైతు, చెట్టు అసలు విలువ ఎంతంటే..

ఎర్రచందనం, మహారాష్ట్ర, రైతు

ఫొటో సోర్స్, Bhagyashree Raut

    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

100 ఏళ్ల నాటి ఎర్రచందనం చెట్టు కోసం బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేయాల్సి వచ్చింది.

హైకోర్టు ఆదేశాల మేరకు, రైల్వే శాఖ ఈ డబ్బును హైకోర్టులో డిపాజిట్ చేసింది. ఈ డబ్బు నుంచి రూ.50 లక్షలు సంబంధిత రైతు విత్ డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 9న హైకోర్టు అనుమతులు ఇచ్చింది.

అసలు, ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోసం వేసిన ఈ కేసులో రైతు ఎలా గెలిచారు? అసలు సమస్య ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు ఏం జరిగిందంటే..

తమ పొలంలోని ఎర్రచందనం చెట్టుకు పరిహారం కోరుతూ యవత్మాల్ జిల్లాలోని ఖర్షీకి చెందిన రైతు కేశవ్ శిందే, ఆయన ఐదుగురు కుమారులు 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పుసద్ తాలూకాలోని ఖర్షీ గ్రామంలో కేశవ్ శిందేకు 2.29 హెక్టార్ల భూమి ఉంది. వార్దా - యవత్మాల్ - పుసద్ - నాందేడ్ రైల్వే లైన్ ఆయన పొలంలో నుంచి వెళ్తుండడంతో, భూ సేకరణలో భాగంగా సెంట్రల్ రైల్వేఆయన భూమిని సేకరించింది.

సెంట్రల్ రైల్వే స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి శిందే పరిహారం అందుకున్నారు. అలాగే, పొలంలో ఉన్న ఎర్రచందనం చెట్టు సహా ఇతర పది రకాల చెట్లకు, భూగర్భ పైప్‌లైన్‌కు కూడా అధికారులు పరిహారం చెల్లించాలని శిందే డిమాండ్ చేశారు.

అయితే, ముందుగా ఎర్రచందనం చెట్టు ఎంత ధర పలుకుతుందో లెక్కించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దాని ధర తేల్చేందుకు అటవీ శాఖకు లేఖ కూడా రాశారు.

కేశవ్ శిందే కుమారుడు, పిటిషనర్ పంజాబ్ శిందే ఇచ్చిన సమాచారం ప్రకారం, వారి వ్యవసాయ భూమిలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి, వాటికి కూడా పరిహారం వచ్చింది.

అలాగే, పొలంలోని బావికి రూ.8 లక్షల రూపాయల పరిహారం లభించింది. కానీ, పైప్‌లైన్, ఎర్రచందనం చెట్టుతో సహా ఇతర చెట్లకు పరిహారం అందలేదు. వాటికి పరిహారం కోరుతూ, 2014 నుంచి జిల్లా కలెక్టర్, అటవీ శాఖ, రైల్వే శాఖ, నీటిపారుదల శాఖలకు లేఖలు రాశారు. కానీ, ఎలాంటి పరిహారం అందకపోవడంతో ఎనిమిదేళ్ల తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఎర్రచందనం, రైల్వే లైన్, బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, Bhagyashree Raut

ఎర్రచందనం చెట్టు ధర లెక్కకడితే..

కేవలం ఒక్క ఏడాదిలోనే శిందే కుటుంబం ఈ కేసు గెలిచి పరిహారం పొందింది. అయితే, ఈ ఎర్రచందనం చెట్టు ధర మాత్రం ఇంకా నిర్ధరణ కాలేదు. ఆ చెట్టు ధర నిర్ణయించడానికి ముందే కోటి రూపాయల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది.

దీంతో రైల్వే శాఖ కోటి రూపాయలను హైకోర్టులో డిపాజిట్ చేసింది. అయితే, ఈ ఎర్రచందనం చెట్టు ధర దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది అంజనా రౌత్ నర్వాడే బీబీసీతో చెప్పారు.

ఎర్రచందనం చెట్టు ధరను నిర్ణయించేందుకు అటవీ శాఖ అధికారులతో పాటు ఇతరులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ చెట్టు ధరను నిర్ణయించిన తర్వాత, ఆ మొత్తాన్ని పిటిషనర్లకు పరిహారంగా చెల్లించనున్నారు.

ఈ కేసులో రైల్వే తరఫు న్యాయవాది నీరజా చౌబే మాట్లాడుతూ, రైల్వే కూడా ఆ చెట్టు విలువ ఆధారంగా డబ్బు చెల్లించలేదని అన్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''ఆ చెట్టు ఎంత రేటు పలుకుతుందో తెలీకుండా పరిహారం ఎలా చెల్లించాలి. అలాగే, నిల్చుని ఉన్న స్థితిలో చెట్టును ఎలా అంచనా వేయాలి. అందువల్ల రైల్వే పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం, హైకోర్టు ఆదేశానుసారం రైల్వే శాఖ హైకోర్టులో కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. ఈ కోటి రూపాయల పరిహారం ఎర్రచందనం చెట్టు కోసం మాత్రమే.''

ఎర్రచందనం రేటుపై ఆంధ్రప్రదేశ్‌లో శిందే వాకబు చేశారు. ఒక ప్రైవేట్ ఇంజినీర్‌తో ఎర్రచందనం చెట్టు రేటు అంచనాలు వేయించారు. దాని ప్రకారం, ఆ చెట్టు ధర 4 కోట్ల 94 లక్షల రూపాయలుగా లెక్కించారు. అలాగే, భూమికి పరిహారం ఇచ్చినప్పటి నుంచి ఈ మొత్తానికి వడ్డీ కూడా పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు.

భూగర్భ పైప్‌లైన్, మిగిలిన చెట్లకు పరిహారం కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. వాటికి కూడా పరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

ఎర్రచందనం

ఫొటో సోర్స్, Getty Images

పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని ఎలా తెలిసింది?

కేశవ్ శిందే వయసు 94 ఏళ్లు. ఆయన పిల్లల వయసు కూడా 50 ఏళ్ల పైనే. ఆయన తన పిల్లలతో కలిసి ఈ కేసు వేశారు. శిందే పొలంలో రైల్వే స్టేషన్ రానుండడంతో, ఆయన భూమిలో ఎక్కువ భాగాన్ని రైల్వే శాఖ సేకరించింది.

శిందే పొలంలో మామిడి తోటలు, ఇతర తోటలు ఉండేవి. కానీ, వాళ్ల పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని వారికి తెలీదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్న సమయంలోనే అది ఎర్రచందనం అని వారికి తెలిసింది.

పంజాబ్ శిందే చెప్పిన దాని ప్రకారం, భూసేకరణకు ముందు కొంతమంది రైల్వే ఉద్యోగులు భూసర్వే కోసం వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అది ఎర్రచందనం చెట్టని ఆయన చెప్పారు.

చెట్లన్నీ నరికివేస్తే కానీ పని ముందుకు కదలదు. కానీ, ఎర్రచందనం చెట్టు చాలా ఖరీదైనది.

తమ పొలంలో ఎర్రచందనం చెట్టు ఉందని తెలిసి శిందే కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. దీంతో భూసేకరణ సమయంలో ఎర్రచందనం చెట్టుకి కూడా పరిహారం చెల్లించాలని భూసేకరణ అధికారులను కోరారు. కానీ, వారు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం, హైకోర్టు ఆదేశాల మేరకు వారికి కోటి రూపాయల పరిహారం లభించింది. అయితే, వాటిలో రూ.50 లక్షలు మాత్రమే తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే, ఈ చెట్టు విలువ ఎంతో నిర్ధరించాలని కూడా ఆదేశించింది. చెట్టు ధరను నిర్ధరించిన తర్వాత, దాని ప్రకారం వారికి పరిహారం లభించనుంది.

ఎర్రచందనం
ఫొటో క్యాప్షన్, కేశవ్ శిందే, పంజాబ్ శిందే

కోటి పరిహారం తర్వాత పిటిషనర్ ఏమన్నారు?

హైకోర్టు ఉత్తర్వుల అనంతరం పిటిషనర్ పంజాబ్ శిందే బీబీసీతో మాట్లాడుతూ, 'మేం కోరుకున్న పరిహారం లభించలేదు. కానీ, కోర్టు ఆదేశాల మేరకు, దాని విలువ నిర్ధరించిన తర్వాత తగిన పరిహారం లభిస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

పంజాబ్ శిందే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. తన పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్ము ఈ కేసుకే ఖర్చయిందని ఆయన అంటున్నారు.

ప్రస్తుతం శిందే పొలంలో ఎర్రచందనం చెట్టుంది. మరోవైపు రైల్వేలైన్ పనులు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కేసు కారణంగా, శిందే పొలంలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)