యాసిడ్ దాడులు, విద్యుత్ షాక్‌లు, లైంగిక వేధింపులు.. ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలైన వారు ఏం చెప్పారంటే

పాలస్తీనా ఖైదీలు
ఫొటో క్యాప్షన్, బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలైన కొందరు పాలస్తీనా ఖైదీలను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.
    • రచయిత, ఆలిస్ కడ్డీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే విషయాలు ఉంటాయి)

ఇజ్రాయెల్ సైనికులు, జైలు సిబ్బంది తమను దుర్భాషలాడారని, హింసించారని ఇటీవల గాజాకు తిరిగి వచ్చిన పాలస్తీనా ఖైదీలు బీబీసీతో చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలో తాము తీవ్రమైన వేధింపులకు గురయ్యామని వివరించారు. తనపై రసాయనాలు పోసి నిప్పంటించారని ఒకరు ఆరోపించారు.

"నా శరీరానికి అంటించిన మంటలను ఆర్పుకోవడానికి జంతువులా కిందపడి దొర్లాను" అని 36 ఏళ్ల మొహమ్మద్ అబు తవిలేహ్ చెప్పారు.

హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్‌లో సుమారు 1,200 మందిని చంపి.. 251 మందిని బందీలుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో గాజాలో హమాస్‌‌తో సంబంధాలున్నాయంటూ కొందరిని ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసి తీసుకెళ్లింది. ఇలా అరెస్టై, ఇటీవల తిరిగి వచ్చిన వారిలో ఐదుగురిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

వీరిని ‘ఇజ్రాయెల్ అన్‌లాఫుల్ కంబాటెంట్స్ లా’ కింద అదుపులోకి తీసుకున్నారు. భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని అనుమానం ఉన్న వ్యక్తులను నిర్బంధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

హమాస్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ తమను అదుపులోకి తీసుకున్నారని బాధితులు చెప్పారు.

గాజాలోని బందీలు, సొరంగాలు ఎక్కడున్నాయి వంటి విషయాలపై ప్రశ్నించారని తెలిపారు.

అయితే, వారు 7 అక్టోబర్ 2023 దాడుల్లో పాల్గొనలేదని తర్వాత తేలింది, ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం కింద ఎవరినైనా విడుదల చేయాలంటే వారు ఆ రోజు దాడిలో పాల్గొనకుండా ఉండాలని ఇజ్రాయెల్ షరతు విధించింది.

ఒప్పందం కింద విడుదలైన వారిలో కొంతమంది హత్య (ఇజ్రాయెలీయులను చంపడం) వంటి తీవ్రమైన నేరాలకు శిక్ష అనుభవించారు. బీబీసీ ఇంటర్వ్యూ చేసిన పురుషుల విషయంలో ఈ నేరారోపణలు లేవు. విడుదల చేసిన వ్యక్తులపై ఏవైనా నేరారోపణలు ఉన్నాయా అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) , ఇజ్రాయెల్ జైలు సర్వీస్ (ఐపీఎస్)ని బీబీసీ ప్రశ్నించింది, కానీ వారు స్పందించలేదు.

విడుదలైన పురుషుల కథనాల ప్రకారం:

  • దుస్తులు విప్పి, కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి కొట్టారు.
  • కొందరికి విద్యుత్ షాక్ ఇచ్చారు, వారిపైకి కుక్కలను వదిలారు, వైద్యం నిరాకరించారు.
  • కొంతమంది తోటి ఖైదీలు చనిపోవడం చూశారు.
  • లైంగిక వేధింపులూ జరిగాయి.
  • మరొక వ్యక్తి తన తలను రసాయనాలలో ముంచి, వీపుపై నిప్పంటించారని చెప్పారు.

జైలులో ఉన్న ఇద్దరిని కలిసిన ఒక న్యాయవాది అందించిన రిపోర్టులను బీబీసీ సమీక్షించింది, ఖైదీలు తిరిగి వచ్చిన తర్వాత వారికి చికిత్స చేసిన వైద్య సిబ్బందితోనూ మాట్లాడింది.

అంతేకాదు, ఈ ఆరోపణల గురించి ఐడీఎఫ్‌కు బీబీసీ లేఖ పంపింది. అయితే, ఖైదీలపై వేధింపులు జరిగాయనే ఆరోపణలను ఐడీఎఫ్ తోసిపుచ్చింది.

ఇజ్రాయెల్ జైలు సర్వీస్ కూడా ఇదే తెలిపింది.

"మాకు తెలిసినంతవరకు, ప్రిజనరీ సర్వీస్ బాధ్యతలో ఉండగా అలాంటి సంఘటనలు జరగలేదు" అని చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అబూ తవిలేహ్
ఫొటో క్యాప్షన్, అబూ తవిలేహ్ కంటి చర్మం దెబ్బతిన్నదని గాజాలోని ఒక స్పెషలిస్ట్ కంటి వైద్యుడు తెలిపారు.

అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం

ఖైదీలతో వ్యవహరించిన విధానం అంతర్జాతీయ, ఇజ్రాయెల్ చట్టాలకు విరుద్ధమని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లారెన్స్ హిల్-కాథోర్న్ చెప్పారు. కొన్ని చర్యలను హింసగా పరిగణించవచ్చన్నారు.

అంతర్జాతీయ చట్టం ప్రకారం ఖైదీలందరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, వారి పట్ల మానవీయంగా వ్యవహరించాలని ఆయన వివరించారు.

(హెచ్చరిక: కింద కలవరపరిచే చిత్రం ఉంది)

విడుదలైన ఐదుగురు పాలస్తీనియన్ ఖైదీలు ఒకేరకమైన అనుభవాలను పంచుకున్నారు: గాజాలో అరెస్టయ్యారు, ఇజ్రాయెల్ సైనిక బ్యారక్‌లలో నిర్బంధించారు, తరువాత జైలుకు తరలించారు.

ప్రతి దశలోనూ వేధింపులు ఎదుర్కొన్నట్లు వారు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ నుంచి విడుదలై, గాజాకు వచ్చిన డజనుకు పైగా ఖైదీలు కూడా ఇలాంటివే చెప్పారు. వారిని కొట్టేవారని, ఆకలితో ఉండాల్సి వచ్చేదని, అనారోగ్యం బారిన పడేవారిమని తెలిపారు.

ఇజ్రాయెల్ మానవ హక్కుల గ్రూపు బి'ట్సెలెం, ఐక్యరాజ్యసమితికి ఇతర బాధితులు ఇచ్చినట్లుగా చెబుతున్న నివేదికలకు ఇవి సరిపోలుతున్నాయి. గత ఏడాది జూలైలో విడుదలైన ఈ రిపోర్టులలో ఖైదీల బట్టలు విప్పినట్లు, ఆహారం, నీరు సరిగా అందజేయకపోవడం, విద్యుత్ షాక్‌లు ఇవ్వడం, సిగరెట్‌తో కాల్చడం, కుక్కలతో దాడులు చేయించడం వంటివి ఉన్నాయి.

గత నెలలో విడుదలైన ఐక్యరాజ్యసమితి తదుపరి నివేదిక కూడా అత్యాచార బెదిరింపులు అక్కడ 'సాధారణంగా జరిగినట్లు' పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ ఈ వాదనలను ఖండించింది.

గాజాలోకి అంతర్జాతీయ జర్నలిస్టులకు పరిమితులున్నాయి. అందుకే, బాధితులతో ఇంటర్వ్యూలు, కాల్స్, సందేశాలు ఫ్రీలాన్సర్లతో చేశాం.

మొహమ్మద్ అబూ తవిలేహ్
ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ అబూ తవిలేహ్ వీపుపై ఎర్రటి మచ్చలు కనిపించాయి.

'నాపై యాసిడ్ పోశారు'

అరెస్టు తర్వాత దుస్తులు విప్పడం, కళ్లకు గంతలు కట్టడం, కొట్టడం వంటి చర్యలతో తమపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఐదుగురు ఖైదీలు తెలిపారు.

తనను రోజుల తరబడి హింసించినట్లు మెకానిక్ అయిన మొహమ్మద్ అబూ తవిలేహ్‌ను చెప్పారు. ఒంటరిగా గదిలో ఉంచి, మూడు రోజుల పాటు విచారించారని తెలిపారు. తలను రసాయనాల్లో ముంచి, కొట్టారని, కంటికి గాయమైందని, ఒంటికి నిప్పంటించారని అబూ తెలిపారు.

"లైటర్‌, ఎయిర్ ఫ్రెషనర్‌తో వాళ్లు నా వీపుపై నిప్పంటించారు. మంటలను ఆర్పుకొనే ప్రయత్నంలో కిందపడి కొట్టుకున్నాను. మంటలు నా మెడ నుంచి కాళ్ల వరకు వ్యాపించాయి. తరువాత, రైఫిల్స్‌లతో నన్ను పదే పదే కొట్టారు" అని అబూ చెప్పారు.

"నేను కుర్చీలో ఉండగా యాసిడ్ నా తలపై పోశారు, అది నా శరీరం మీదకు కారింది" అని చెప్పారు.

చివరికి, సైనికులు తన శరీరంపై నీళ్లు పోసి ఇజ్రాయెల్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ చర్మ మార్పిడి సహా ఇతర చికిత్సలు చేయించారని అబు చెప్పారు.

చికిత్సలో ఎక్కువ భాగం దక్షిణ ఇజ్రాయెల్‌లోని బీర్షెబా సమీపంలో గల ఐడీఎఫ్ స్థావరం అయిన ఎస్డీ టీమాన్ బ్యారక్స్‌లోని ఫీల్డ్ ఆసుపత్రిలో జరిగిందని అబు చెప్పారు.

ఆసుపత్రిలో తనను నగ్నంగా పడుకోబెట్టారని, డైపర్లు ఇచ్చారని తెలిపారు. రోగులకు సంకెళ్లు వేయడం, వారిని బలవంతంగా డైపర్లు ధరించేలా చేయడం ఇక్కడ సాధారణమని ఆ ఆసుపత్రి వైద్యులు గతంలో బీబీసీకి చెప్పారు.

విడుదలైన తర్వాత, మొహమ్మద్ అబూను బీబీసీ కలిసింది, ఆయన వీపుపై ఎర్రటి మచ్చలు కనిపించాయి. అతను నిరంతర నొప్పి, దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. కంటిలో కెమికల్స్ వల్ల ఏర్పడిన మంటలతో అబూ దృష్టి దెబ్బతిన్నట్లు గాజా కంటి నిపుణులు ఒకరు నిర్ధరించారు.

అబూ తవిలేహ్ ఆరోపణలను బీబీసీ ఐడీఎఫ్‌‌‌తో షేర్ చేసింది.

ఐడీఎఫ్ దీనిపై స్పందించింది కానీ అబూ కేసును నేరుగా ప్రస్తావించలేదు కానీ, విలువలకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై చర్యలు తీసుకుంటామని, కొన్ని కేసులను పరిశీలిస్తామని చెప్పింది. ఇందులో అబూ కేసు ఉందో లేదో చెప్పలేదు.

హమద్ అల్-దహ్దౌహ్
ఫొటో క్యాప్షన్, తన పక్కటెముకలు విరిగిపోయాయని హమద్ అల్-దహ్దౌహ్ అన్నారు.

కుటుంబంతో వెళ్తుంటే అరెస్ట్ చేశారు: ముష్తాహా

అరెస్టు సమయంలో జరిగిన వేధింపులను ఇంటర్వ్యూ సమయంలో పలువురు చెప్పారు.

"వారు మమ్మల్ని బంధించి కొట్టారు. ఎవరూ నాకు చుక్క నీరు ఇవ్వలేదు" అని 33 ఏళ్ల పౌల్ట్రీ స్లాటర్‌హౌస్ వర్కర్ అబ్దుల్ కరీం ముష్తాహా అన్నారు.

తరలింపు ఆదేశాలను పాటిస్తూ కుటుంబంతో వెళుతుండగా 2023 నవంబర్‌లో తనను ఇజ్రాయెల్ చెక్ పాయింట్ వద్ద అరెస్టు చేశారని ఆయన తెలిపారు.

ముష్తాహాను సందర్శించిన ఒక న్యాయవాది దాఖలు చేసిన రిపోర్టులో "అరెస్టు సమయంలో జైలుకు బదిలీ అయ్యే వరకు ముష్తాహాను తీవ్రంగా కొట్టారు, వేధించారు, దుస్తులు విప్పారు’’ అని పేర్కొన్నారు.

తమను గంటల తరబడి చలిలో బయట ఉంచారని ఇద్దరు చెప్పగా, తమ వస్తువులను, డబ్బును ఇజ్రాయెల్ సైనికులు దొంగిలించారని మరో ఇద్దరు చెప్పారు.

ఈ ఘటనలను ఐడీఎఫ్‌ దృష్టికి తీసుకెళ్లింది బీబీసీ. ఇది చట్టం, విలువలకు విరుద్ధమని ఐడీఎఫ్ పేర్కొంది, మరిన్ని వివరాలు అందిస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.

ముష్తాహాతో బీబీసీ ఇంటర్వ్యూ చేసిన మిగతా నలుగురూ ఐడీఎఫ్ ఎస్డే టీమాన్ బ్యారక్‌లో ఉన్నట్లు చెప్పారు.

ఎస్దే టీమాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐడీఎఫ్ బ్యారక్ ఎస్దే టీమాన్

'కుక్కలను ఉసిగొల్పారు'

ఇజ్రాయెల్ నుంచి విడుదలైన మరో వ్యక్తి (33) తన పేరు మీడియాలో చెప్పడానికి ఇష్టపడలేదు. ఎలక్ట్రికల్ కేబుల్ కంపెనీలో పనిచేసే అతనిని మేం ఒమర్ అని వార్తలో ప్రస్తావిస్తున్నాం.

జైలుకు తీసుకెళ్లే మార్గంలో తనపై దారుణంగా ప్రవర్తించారని ఒమర్ చెప్పారు. తనపై ఉమ్మివేస్తూ దూషించారని అన్నారు.

"మీరు మా పిల్లలకు ఏదైతే చేశారో, మీ పిల్లలకూ అదే చేస్తాం" అని చెప్పే వాయిస్ రికార్డింగ్‌ను సైనికులు వినిపించారని ఒమర్ చెప్పారు.

అక్టోబర్ 2023 దాడుల తర్వాత ఎస్డే టీమాన్‌పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో చాలామంది సైనికులు అక్కడ ఒక ఖైదీపై దాడి చేసి తీవ్రమైన గాయాలకు కారణమయ్యారని అభియోగాలు మోపారు. అంతేకాదు, పాలస్తీనియన్ ఖైదీలను వేధించినందుకు మరొక సైనికుడికి శిక్ష విధించారు.

ఎస్డే టీమాన్‌తో పాటు ఇతర ఫెసిలిటీల వద్ద ఖైదీలను బెదిరించడానికి కుక్కలను ఉపయోగించారని ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిలో ముగ్గురు ఆరోపించారు.

"మమ్మల్ని బ్యారక్‌ల నుంచి క్లినిక్ లేదా విచారణ గదికి తీసుకెళ్లినప్పుడు కొట్టారు. కుక్కలను వదిలారు, మా చేతికి సంకెళ్లు బిగించారు" అని అబూ అన్నారు.

ఖైదీలను భయపెట్టడానికి, దాడి చేయడానికి కుక్కలను ఉపయోగించారనే వాదనల గురించి ఐడీఎఫ్‌ను బీబీసీ అడిగింది.

"ఖైదీలకు హాని కలిగించడానికి కుక్కలను ఉపయోగించడానికి అనుమతిలేదు" అని ఐడీఎఫ్ బదులిచ్చింది.

"మేం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మోకాళ్లపై కూర్చునేవాళ్లం" అని అబూ అన్నారు.

మేం ఇంటర్వ్యూ చేసిన వారిలో హమద్ అల్-దహ్దౌ కూడా ఉన్నారు. 44 ఏళ్ల హమద్ ఒక రైతు. బ్యారక్‌లో తనను కొట్టేవారని, దీంతో చెవికి గాయం అయిందని, పక్కటెముక విరిగిపోయిందని హమద్ చెప్పారు. ఈ వాదనకు ఐడీఎఫ్ స్పందించలేదు. విచారణ సమయంలో విద్యుత్ షాక్ ఇచ్చేవారని హమద్ తెలిపారు.

"అణిచివేత దళాలు అక్కడికి కుక్కలు, కర్రలు, గన్‌లను తీసుకువస్తారు; వారు మమ్మల్ని కరెంట్ షాక్ పెట్టి హింసిస్తారు" అని హమద్ చెప్పారు. విచారణలు రాత్రి సమయంలో జరిగేవని ఆయన తెలిపారు.

కెట్జియోట్ జైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెట్జియోట్ జైలులో బాగా కొట్టేవారని, ఆహారం తక్కువగా పెట్టేవారని ఒమర్, అబ్దుల్ కరీం ముష్తాహాలు అన్నారు. (ఫైల్ ఫొటో)

"మూడు రాత్రులు నన్ను హింసించడం వల్ల నాకు నిద్ర పట్టలేదు. చేతులు కట్టేసేవారు. మేం బట్టలు కూడా వేసుకోలేదు. చలిగా ఉందని చెబితే బకెట్ నిండా చల్లటి నీళ్లు తెచ్చి పోసి, ఫ్యాన్ ఆన్ చేసేవారు" అని హమద్ చెప్పారు.

న్యాయవాదిని కలవడానికి కూడా తనకు అనుమతి ఇవ్వలేదని హమద్ అన్నారు.

అయితే, "ఇజ్రాయెల్ చట్టం నిందితులు కోర్టుకు వెళ్లడానికి, న్యాయవాదిని ఏర్పాటుచేసుకోవడానికి, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి హక్కును ఇస్తుంది" అని బీబీసీకి తెలిపింది ఐడీఎఫ్.

తనను ఎస్డే టీమాన్‌లో మూడు రోజులు విచారించారని ఒమర్ చెప్పారు. "ఏది పగలో ఏది రాత్రో కూడా తెలిసేది కాదు" అని అతను చెప్పారు.

అబ్దుల్ కరీం ముష్తాహా
ఫొటో క్యాప్షన్, అబ్దుల్ కరీం ముష్తాహా

'లైంగిక వేధింపులు'

కెట్జియోట్‌లో లైంగిక వేధింపులను చూశానని ఒమర్ చెప్పారు. అక్కడ ఖైదీలను ఒకరిపై ఒకరు లైంగిక చర్యలు చేసుకునేలా బలవంతం చేసేవారని తెలిపారు.

''నా కళ్లతో చూశాను, ఒకరికొకరు చూషణ చేసుకోమని చెప్పేవారు. అక్కడ అది తప్పనిసరి'' అని ఒమర్ చెప్పారు.

కెట్జియోట్‌లో అత్యాచారం, వేధింపులు, జననేంద్రియాలపై దెబ్బలు వంటివి సర్వసాధారణమని పాలస్తీనియన్ ఖైదీల సంఘం తెలిపింది.

కెట్జియోట్, ఇతర జైళ్లలో లైంగిక వేధింపులు, కొట్టడం తదితర ఆరోపణలపై స్పందించాలని ఇజ్రాయెల్ జైలు సర్వీసును బీబీసీ అడిగింది. వాటి గురించి తమకు "తెలియదు" అని ఆ సర్వీస్ బదులిచ్చింది.

ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ చట్టం ప్రకారం నడుచుకుంటుందని, స్టేట్ కంప్ట్రోలర్, ఇతర అధికారిక సంస్థల పర్యవేక్షణలో పనిచేస్తుందని పేర్కొంది. ఖైదీలందరినీ చట్టపరమైన ప్రమాణాల ప్రకారం నిర్బంధిస్తున్నారని, వారి ప్రాథమిక హక్కులను శిక్షణ పొందిన గార్డులు పూర్తిగా కాపాడుతున్నారని తెలిపింది. విడుదలైన ఖైదీలు చేసిన ఆరోపణలు తమ దృష్టికి రాలేదని, అలాంటి ఘటనలు జరగలేదని పేర్కొంది.

కెట్జియోట్ జైలులో ఒమర్, ముష్తాహాలను కలిసిన ఒక లాయర్ సెప్టెంబరులో విడుదల చేసిన ఒక రిపోర్టు ప్రకారం.. ఇతర ఖైదీల మాదిరిగానే ముష్తాహాకు కూడా వైద్య సంరక్షణ లేకపోవడం వల్ల చేతులు, కాళ్లు, పిరుదులపై కురుపులు ఉన్నాయని గుర్తించారు. ముష్తాహా విడుదలైన రోజున అతను గజ్జితో బాధపడుతున్నారని గాజాలోని ఒక వైద్యుడు నిర్ధరించారు.

నిర్బంధంలో ఉన్న సమయంలో ఆహారం, నీరు పరిమితంగా అందించారని, దీనివల్ల బరువు తగ్గామని ఖైదీలందరూ నివేదించారు. ఒమర్ 30 కిలోల వరకు తగ్గినట్లు చెప్పారు.

ఇక మరొక ఖైదీ అహ్మద్ అబూ సీఫ్. తన 17వ పుట్టినరోజున అరెస్టు చేసి, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ సమీపంలోని మెగిద్దో జైలుకు తరలించినట్లు ఆయన చెప్పారు.

విచారణ సమయంలో తన కాలి గోళ్లను బయటకు తీశారని అహ్మద్ అబూ సీఫ్ ఆరోపించారు. విడుదలైన మరుసటి రోజు తన చేతులకు సంకెళ్లు గీతలు, కుక్క దాడి ఆనవాళ్లు కనిపించాయి. ఈ విషయంపై ఐడీఎఫ్ స్పందించడానికి నిరాకరించింది.

ఎస్డే టీమాన్, కెట్జియోట్‌లలో తోటి ఖైదీలు చనిపోవడాన్ని చూశామని ఇద్దరు వ్యక్తులు చెప్పారు. అందులో ఒకరు కుక్కల దాడిలో, మరొకరు వైద్య సంరక్షణ లేకపోవడంతో చనిపోయారని అన్నారు. వారు చెప్పిన వివరాలు మీడియా నివేదికలు, మానవ హక్కుల సంఘం రిపోర్టులతో సరిపోలుతున్నాయి.

అహ్మద్ అబూ సీఫ్
ఫొటో క్యాప్షన్, అహ్మద్ అబూ సీఫ్

20263 అక్టోబర్ 7 నుంచి, కనీసం 63 మంది పాలస్తీనియన్ ఖైదీలు ఇజ్రాయెల్ కస్టడీలో మరణించారని పాలస్తీనియన్ ఖైదీల సంఘం తెలిపింది. గాయాలు, వ్యాధుల కారణాలు చూపుతూ ఖైదీల మరణాలను ఐడీఎఫ్ అంగీకరించింది. జైలు సర్వీస్ మాత్రం ప్రశ్నకు స్పందించలేదు.

"ప్రతి ఖైదీ మరణంపై మిలిటరీ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ దర్యాప్తు ప్రారంభిస్తుంది" అని ఐడీఎఫ్ తెలిపింది.

జనవరి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని 17 ఏళ్ల అహ్మద్ అన్నారు.

"మేం విడుదల కాబోతున్నామని తెలిసి సైనికులు మరింత దూకుడుగా వ్యవహరించారు." అని చెప్పారు.

తిరిగి వచ్చిన చాలామంది ఖైదీలకు గజ్జి, బరువు తగ్గడం, పోషకాహార లోపం, చర్మ సమస్యలు వంటివి ఉన్నాయని గాజాలోని యూరోపియన్ హాస్పిటల్ వైద్యుడు ఒకరు తెలిపారు.

 డాక్టర్ లారెన్స్ హిల్-కాథోర్న్
ఫొటో క్యాప్షన్, న్యాయ నిపుణులు డాక్టర్ లారెన్స్ హిల్-కాథోర్న్

శరీరం కాలడానికి రసాయనాలు వాడటం, విద్యుత్ షాక్‌లు, గోళ్ల తొలగింపు, తీవ్రంగా కొట్టడం వంటి చర్యలు అంతర్జాతీయ చట్టం ప్రకారం హింసేనని న్యాయ నిపుణుడు డాక్టర్ లారెన్స్ హిల్-కాథోర్న్ పేర్కొన్నారు.

విడుదలైన ఖైదీలతో ఇంటర్వ్యూలు నిర్వహించే అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసీఆర్ఎస్), గోప్యతా సమస్యల కారణంగా వ్యక్తుల పరిస్థితులపై వ్యాఖ్యానించలేమని తెలిపింది.

అక్టోబర్ 7 దాడుల తర్వాత నుంచి ఇప్పటికీ కస్టడీలో ఉన్న ఖైదీలను సంప్రదించడానికి అనుమతి లేదని, దాని కోసం ప్రయత్నిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఖైదీలతో మానవీయంగా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం నడుచుకుంటున్నారా లేదా అనేది నిర్ధరించడంలో వారి సందర్శన కీలకమని ఐసీఆర్ఎస్ భావిస్తోంది.

గాజాలో ఇప్పటికీ 59 మంది బందీలున్నారు, వారిలో 24 మంది మాత్రం బతికి ఉన్నారని భావిస్తున్నారు. రెడ్ క్రాస్ వారిని సందర్శించడానికి గత 18 నెలలుగా అనుమతి దక్కడం లేదు. బందీల కుటుంబాలు చాలా ఆందోళన చెందుతున్నాయి.

టీనేజర్ అహ్మద్ ఇప్పుడు గాజా వదిలి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు.

"మాపై బాంబులు పడతాయనే భయం, దానితో కలిగే మానసిక హింస భరించలేక వలస వెళ్లాలనుకుంటున్నాను." అని చెప్పారు అహ్మద్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)